వుదూ చేసే పద్ధతి
﴿ صفة الوضوء ﴾
] తెలుగు – Telugu – التلغو [
الشيخ محمد صالح المنجد
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్
2009 - 1430
﴿ صفة الوضوء ﴾
« باللغة التلغو »
الشيخ محمد صالح المنجد
ترجمة: محمد كريم الله
مراجعة: شيخ نزير أحمد
2009 - 1430
వుదూ చేసే పద్ధతి
ప్రశ్న: దయచేసి స్త్రీల వుదూ (ఇస్లామీయ పద్ధతిలో కాలకృత్యాలు తీర్చుకునే) విధానాన్ని నా భార్య కోసం వివరించండి.
అల్హందులిల్లాహ్ – సమస్త స్తోత్రములు అల్లాహ్ కే.
మీకు సన్మార్గం చూపినందుకు మరియు మీ హృదయాన్ని తెరచినందుకు మనం ముందుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుందాము. మనల్ని సరైన మార్గంలో నిలకడగా జీవించేటట్లు చేయమని అల్లాహ్ ను వేడుకుందాము. ఇస్లాం గురించి నేర్చుకోవాలనే మీ తాపత్రయాన్ని అభినందిస్తున్నాము. మా సహా ఏమిటంటే - మీరు ఇస్లామీయ జ్ఞానాన్ని మరింత ఎక్కువగా నేర్చుకోవలెను. తద్వారా ఇస్లామీయ ఆరాధనలు సరిగ్గా ఆచరించటానికి వీలవుతుంది. అరబీ నేర్చుకోవటం ద్వారా మీరు ఖుర్ఆన్ పఠించటానికి మరియు అర్థం చేసుకోవటానికి అవకాశం ఉన్నది. ఇహపరలోకాలలో లాభం చేకూర్చే జ్ఞానాన్ని మీకు ప్రసాదించమని అల్లాహ్ ను మేము వేడుకుంటున్నాము.
ఇక సరైన వుదూ విధానం గురించి చర్చించుదాము. ముఖ్యంగా దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది వాజిబ్ అంటే తప్పనిసరిగా చేయవలసినవి. వీటిని ఏ కారణం వలనైనా వదిలితే వుదూ పూర్తి కాదు. రెండోది – ముస్తహబ్ అంటే ప్రోత్సహించబడినవి.
1 – వాజిబ్ (తప్పనిసరి) భాగాలు – వీటిని క్రింద వివరిస్తున్నాను:
(i) నోట్లో నీరు పట్టి పుక్కిలించటం మరియు ముక్కు లోపల నీటితో శుభ్రం చేసుకోవటంతో పాటు ముఖం పూర్తిగా ఒకసారి కడగటం.
(ii) రెండు చేతులనూ మోచేతుల వరకు ఒకసారి కడగటం.
(iii) చెవులతో సహా తలపై మసా చేయటం అంటే తడిచేత్తో ఒకసారి తుడవటం.
(iv) చీలమండలంతో సహా పాదాలను ఒకసారి కడగటం.
పై అన్నింటిలో ‘ఒకసారి’ అనటం అంటే అక్కడ తెలిపిన శరీర భాగం పరిశుభ్రమయ్యేంత వరకు కనీసం ఒకసారైనా మంచిగా కడగటం అని అర్థం చేసుకోవలెను.
(v) పైన తెలిపిన వరుస క్రమంలో మాత్రమే వుదూ చేయవలెను. అంటే ముందుగా ముఖం తర్వాత చేతులు కడుక్కొని, ఆ తర్వాత తలపై తుడిచి, చివరకి పాదాలు కడుక్కోవటం అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధంగా వుదూ చేసి చూపటం వలన, మనం కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో వుదూ చేయవలసి వున్నది.
(vi) పైన తెలిపిన వాటిని మధ్యలో ఆగకుండా, గ్యాప్ ఇవ్వకుండా, నిరంతరాయంగా చేయవలెను. అంటే ఒక భాగం తర్వాత మరొక భాగాన్ని మధ్య మధ్యలో ఎక్కువసేపు ఆగకుండా త్వరత్వరగా పరిశుభ్రం చేసుకోవలెను.
ఇవే వుదూ సరిగ్గా పూర్తికావటానికి తప్పనిసరి అయిన ఈ వాజిబ్ భాగాలు.
దీనికి ఆధారం ఖుర్ఆన్ లో అల్లాహ్ తెలిపిన ఈ ఆయతు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం): “ఓ విశ్వాసులారా! సలాహ్ (నమాజు) చేయాలని సంకల్పించుకున్నప్పుడు, మీ ముఖం మరియు మీ మోచేతుల వరకు (చేతులు) కడుక్కోండి, తలపై తుడవండి మరియు మీ పాదాలను చీలమండలం వరకు కడుక్కోండి. ఒకవేల జనాబా స్థితిలో (భార్యాభర్తల సంభోగం తర్వాతి అపవిత్ర స్థితిలో), మీరు స్వయంగా పరిశుభ్రమవండి (శరీరం మొత్తం శుభ్రపరచుకోండి – తలారా స్నానం చేయండి). కాని ఒవేళ మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే లేదా ప్రయాణం చేస్తున్నట్లయితే, మలమూత్రవిసర్జన తర్వాత లేక తమ స్త్రీలతో సంపర్కం చేసిన తర్వాత మరియు ఒకవేళ మీకు నీరు కనబడక పోతే, అప్పుడు పరిశుభ్రమైన నేలతో మీ ముఖాలను మరియు మీ చేతులను తయమ్ముమ్ ద్వారా పవిత్రం చేసుకోండి. మిమ్మల్ని కష్టపరిస్థితిలో వదలివేయటమనేది అల్లాహ్ కోరిక కాదు, కాని మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి మిమ్మల్ని పవిత్రం చేయలనేదే ఆయన కోరిక.” [అల్ మాయిదాహ్ 5:6]
2 – వుదూలోని ముస్తహబ్ భాగాలు. వీటిని ఆచరించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించినారు. అవి:
(i) మలినాలను తొలగించుకుని, స్వయంగా పరిశుద్ధి చేసుకోవాలనే సంకల్పాన్ని మీరు తప్పనిసరిగా చేసుకోవలెను. దీని స్థానం హృదయంలో ఉండటం వలన దీనిని పైకి పలక వలసిన అవసరం లేదు. ఈ వుదూ అన్నిరకాల ఆరాధనలకూ వర్తిస్తుంది.
(ii) ముందుగా బిస్మిల్లాహ్ అని పలక వలెను.
(iii) మూడు సార్లు తమ చేతులను ముందు, వెనుక, వేళ్ళ మధ్య - మణికట్టు జాయింటు వరకు మూడు సార్లు మంచిగా కడుగవలెను.
(iv) నోటిలో నీటిని పట్టించి, మూడూ సార్లు బాగా పుక్కిలించవలెను మరియు మూడు సార్లు ముక్కులో నీటిని పంపి, ఎడమ చేతి వ్రేళ్ళతో ముక్కులోపల శుభ్రపరచుకుంటూ, చీదటం ద్వారా ఆ నీటిని బయటికి తీయవలెను.
(v) తల వెంట్రుకల అంచులను, రెండు చెవులను తాకుతూ నుదురు పైభాగం నుండి గడ్డం క్రింది భాగం వరకు ఉన్న ముఖభాగాన్ని పూర్తిగా మూడు సార్లు కడుగవలెను. గడ్డం కూడా ముఖానికి చెందిన భాగమే కావటం వలన పురుషులు తమ గడ్డపు వెంట్రుకలను కూడా కడుగవలసి ఉన్నది. అతని గడ్డం పలుచగా ఉంటే, దాని లోపలా బయటా కడుగ వలెను. ఒకవేళ గడ్డం దట్టంగా ఉంటే, దాని ఉపరితలాన్ని అంటే పై భాగాన్ని మాత్రమే కడిగి, గడ్డంలోపల తడి వ్రేళ్ళు చొప్పిస్తే చాలు.
(vi) ఆ తర్వాత మోచేతుల వరకు తమ చేతులను మూడు సార్లు మంచిగా కడుగవలెను. ఇక్కడ కడగ వలసిన చేతి భాగం - గోళ్ళతో సహా చేతివ్రేళ్ళ కొనల నుండి మోచేతి పై భాగం వరకు. నీటిని చేతి చర్మానికి చేరకుండా ఆపే పిండి, బురద, రంగు వంటిది ఏదైనా చేతులకు అంటుకుని ఉంటే ముందుగా దానిని శుభ్రపరచుకోవలెను. చేతిగడియారం పట్ట బిగువుగా ఉంటే, దానిని తొలగించవలెను.
(vii) ఆ తర్వాత చేతులు కడిగినప్పుటి తడితో కాకుండా శుభ్రమైన నీటితో తల పై భాగన్ని, మరియు చెవులను ఒకసారి తుడవ వలెను. తమ రెండు చేతుల వ్రేళ్ళ కొనలను ఆన్చి, అరచేతులను నుదురు పై భాగం నుండి మొదలి పెట్టి, తల వెంట్రుకలను స్పర్శిస్తూ, తల వెనుక వరకు తుడవ వలెను. మరలన అక్కడి నుండి వెనుకకు తీసుకువస్తూ, ఎక్కడి నుండైతే మొదలు పెట్టారో అంటే నుదుటి పైభాగం వరకు తీసుకు రాలెను. ఆ తర్వాత తమ చూపుడు వేళ్ళను చెవులలో దూర్చి తిప్పుతూ, బొటన వ్రేలితో చెవి వెనుక భాగాన్ని శుబ్రపరచవలెను. స్త్రీల విషయంలో, విడి విడిగా ఉన్నా లేక జుట్టువేసుకుని ఉన్నా, తడిచేత్తో వారు తలవెంట్రుకల కొనల వరకు ఆసాంతం తుడవ వలసిన అవసరం లేదు, కేవలం తలపై భాగాన్ని తుడిస్తే చాలు.
(viii) కాలి క్రింది భాగం తో పాటు చీలమండలాల పై వరకు తమ పాదాలను మూడు సార్లు కడుగవలెను.
ఈ వుదూ విధానానికి ఆధారం ఉథ్మాన్ రదియల్లాహు అన్హు స్వేచ్ఛను ప్రసాదించిన హుమ్రాన్ అనే ఆయన దాసుడు తెలిపిన ఈ సంఘటన - ఉథ్మాన్ బిన్ అప్పాన్ రదియల్లాహు అన్హు వుదూ చేయటం కోసం నీళ్ళు తీసుకురమ్మని నాకు చెప్పారు. “ఆయన తమ చేతులను మూడు సార్లు కడిగారు. తర్వాత నోటిలోపల(పుక్కిలిస్తూ) మరియు ముక్కు లోపల శుభ్రపరుచుకున్నారు. ఆ తర్వాత తన ముఖాన్ని మూడు సార్లు కడిగారు. తర్వాత కుడి చేతిని మోజేతి వరకు మూడు సార్లు, అలాగే తమ ఎడమ చేతినీ మూడు సార్లు కడిగారు. ఆ తర్వాత తడిచేతితో తలపై భాగాన్ని తుడిచారు.. ఆ తర్వాత కుడిపాదాన్ని, అలాగే ఎడమ పాదాన్నీ కడిగారు. అప్పుడు ఇలా పలికారు, “నేను వుదూ చేసిన విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుదూ చేయటం నేను చూసాను. వుదూ పూర్తి చేసి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు -, ‘ఎవరైతే నేను చేసిన విధంగా వుదూ చేసి, ఆ తర్వాత ఏకాగ్రతతో రెండు రకాతుల నమాజు పూర్తి చేస్తారో, వారి పూర్వపు పాపాలన్నీ క్షమించివేయబడును.’” (ముస్లిం హదీథ్ గ్రంథం)
వుదూ యొక్క షరతులు: ముస్లిం అయి ఉండవలెను, స్పృహలో ఉండవలెను, మంచి చెడ్డలు గ్రహించే వయస్సుకు చేరుకుని ఉండవలెను మరియు వుదూ సంకల్పంతో ఉండవలెను. సత్యతిరస్కారులైన ముస్లిమేతరుల, మతిస్థిమితం లేని వారి, వివేచనాన్ని గుర్తించలేని వయస్సులో ఉన్న చిన్న పిల్లల, వుదూ సమ్మతింపబడదు. అంతేకాక స్వయంగా వుదూ చేసే సంకల్పం లేని వారి వుదూ కూడా స్వీకరింపబడదు. ఎందుకంటే వారి ఉద్ధేశ్యం కేవలం తమ దేహాన్ని చల్లబరచుకోవటమే అయి వుండవచ్చును. వుదూ కోసం వాడే నీరు కూడా తాహిర్ అంటే పరిశుభ్రమైనదై ఉండవలెను. అపరిశుభ్రమైన నీరు వుదూ కోసం యోగ్యమైనది కాదు. వుదూ చేసే నీటిని తమ శరీరభాగపు చర్మాన్ని చేరటంలో ఆటంకం కలిగించే గోళ్ల పాలిష్ వంటి వాటిని తప్పకుండా తొలగించవలసియున్నది.
అధికశాతం పండితులు బిస్మిల్లాహ్ పలకమని తెలిపారు. కాని అది వాజిబ్ అంటే తప్పనిసరైనదా లేక సున్నత్ అంటే అభిలషణీయమైనదా అనే విషయంలో వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. వుదు మధ్యలో లేదా వుదూ ప్రారంభంలో గుర్తుకు వస్తే బిస్మిల్లాహ్ అని పలకవలెను.
స్త్రీపురుషుల వుదూ విధానంలో ఎటువంటి భేదమూ లేదు.
వుదూ పూర్తి చేసిన తర్వాత ఇలా పలకటం ముస్తహబ్ అంటే ఉత్తమం: “అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు వ లాషరీకలహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హులైన వారెవ్వరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు రసూల్ అని నేను సాక్ష్యమిస్తున్నాను.” దీనికి కారణం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఉపదేశం: “మీలో ఎవరైనా వుదూ చేసి మరియు వుదూ సరిగ్గా చేసి మరియు వుదూ ఉత్తమంగా చేసి, ఆ తర్వాత “అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు వ లాషరీకలహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” అని పలికితే, అతని కొరకు స్వర్గద్వారాలన్నీ తెరవ బడును. అతను తనకిష్టమైన ద్వారం నుండి స్వర్గంలో ప్రవేశించవచ్చు.” (ముస్లిం హదీథ్ గ్రంథం).
అత్తిర్మథీ హదీథ్ లో అదనంగా ఈ దుఆ కూడా పలకమని ఉన్నది: “అల్లాహుమ్మజ్అల్నీ మినత్తవ్వవాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన (ఓ అల్లాహ్, నన్ను పశ్చాత్తాప పడే వానిగా మరియు స్వయంగా పరిశుద్ధులై ఉండేవారిలో ఒకనిగా చేయుము).” (అత్తర్మిథీ, సహీహ్ సునన్ అబి దావూద్ లో సహీహ్ హదీథ్ గా అల్బానీ చే వర్గీకరింపబడెను.)
అల్ ఫౌజాన్ రచించిన అల్ ములఖ్ఖాస్ అల్ పిఖ్ హి కూడా చూడండి.
“ప్రవక్త పై దయ జూపుగాక” అని పలకటం గురించి, క్రింద అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ (దీవెనలు) పంపమని ఇస్లాంలో తెలియ జేయబడినది. అల్లాహ ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం):
“అల్లాహ్ తన సలాహ్ ను (దీవెనలు, శుభాస్సీలు, దయాదాక్షిణ్యాలు, అనుగ్రహాలు) ప్రవక్త పై పంపుతున్నాడు మరియు అతని మలాయికలు (దైవదూతలు) కూడా. ఓ విశ్వాసులారా! మీ సలాహ్ (అల్లాహ్ ఆయనపై కరుణించమనే ప్రార్థనలను) ఆయన (ముహమ్మద్) పై పంపండి మరియు ఆయనపై ఇస్లామీయ పద్ధతిలో సలాములు పంపండి” [అల్ అహ్జాబ్ 33:56]
అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు.
షేఖ్ సాహెహ్ అల్ మునజ్జిద్.