ఖుర్ఆన్ - మానవజాతి కొరకు పంపబడిన అంతిమ దివ్యసందేశం ()

ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

  |

  ఖుర్ఆన్ – మానవుల మార్గదర్శకత్వం కొరకు అంతిమ దివ్యవాణి

  ఖుర్ఆన్ అంటే ఏమిటి ?

  అల్లాహ్ వాక్కు

  ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు. అల్లాహ్ దీనిని దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసినాడు.

  “ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరుఫున జరిగింది.” ఖుర్ఆన్ 39:1

  మానవజాతి కొరకు మార్గదర్శకత్వం

  “మానవాళి కొరకు ఒక మార్గదర్శకత్వం … తప్పు ఒప్పులను, మంచి చెడులను ఖచ్ఛితంగా వేరు చేసే అద్భుత గీటురాయి.” ఖుర్ఆన్ 2:185. ఒకవేళ ఇదే లేకపోతే మానవుడు పూర్తిగా నష్టపోయి ఉండేవాడు.

  అంతిమ దివ్యసందేశం

  ఇప్పటి వరకు పంపబడిన దివ్యసందేశాలలో ఇంకా అసలు రూపంలో మిగిలి ఉండి, నేటి ప్రాచీన గ్రంథాల ఆధునిక ప్రతులలో పేర్కొనబడుతున్న కొన్ని వాస్తవ అంశాలను ధృవీకరిస్తూ, వాటిలోని కల్పితాలను మరియు మార్పులు చేర్పులను ఖండిస్తూ మరియు సరిదిద్దుతూ, మహోన్నతుడైన అల్లాహ్ పంపిన అంతిమ దివ్యసందేశమే ఖుర్ఆన్.

  “ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద నున్న దానిని ధృవీకరిస్తుంది.…” ఖుర్ఆన్ 4:47

  ఖుర్ఆన్ ఎలా అవతరించింది ?

  ఖుర్ఆన్ దివ్యగ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. నేటికీ స్వచ్ఛంగా, ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా అవతరించబడిన అరబీభాషలో సురక్షితంగా ఉన్నది. అయితే, ప్రపంచంలోని అనేక ముఖ్య భాషలలో ఖుర్ఆన్ భావానువాదాలు లభిస్తున్నాయి.

  ఖుర్ఆన్ ఒకేసారి ఒక పూర్తి గ్రంథం రూపంలో అవతరించలేదు. అది 23 సంవత్సరాల కాలంలో అంచెలంచెలుగా అవతరించింది.

  ఈ కారణం వలన, ఖుర్ఆన్ ను సరిగ్గా అర్థం చేసుకునేందుకు దాని దివ్యవచనాలు ఏ యే సందర్భాలలో అవతరించాయో తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ అలా తెలుసుకోకపోతే, వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది.

  అది మహోన్నతుడైన అల్లాహ్ తరుఫు నుండే అవతరించిందని నేనెలా తెలుసుకోగలను?

  సంరక్షణ

  ఖుర్ఆన్ మాత్రమే శతాబ్దాలకు తరబడి వాడుకలో ఉన్నది. అయినా అది ఒక్క అక్షరం మార్పు లేకుండా అవతరించిన అరబీ భాషలో దాని అసలు రూపంలోనే సురక్షితంగా ఉన్నది. 1400 సంవత్సరాలకు పూర్వం అవతరించబడినప్పటి నుండి దానిలో ఏమీ కలుపబడలేదు, తొలగించబడలేదు లేదా మార్చబడలేదు.

  “మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేసాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.” ఖుర్ఆన్ 15:09

  అక్షరం మార్పు లేకుండా వ్రాతపూర్వకంగా భద్రపరచబడటమే గాక, స్త్రీపురుషుల మరియు పిల్లల హృదయాలలో కూడా ఖుర్ఆన్ గ్రంథం పదిలంగా భద్రపరచబడింది. ఈనాడు ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసిన ప్రజలు మిలియన్ల కొద్దీ ఉన్నారు.

  వైజ్ఞానిక అద్భుతాలు

  ఖుర్ఆన్ గ్రంథ ఆధునిక వైజ్ఞానిక శాస్త్రంతో ఎంత మాత్రమూ విభేదించడం లేదు. దానిని సమర్ధిస్తున్నది. ఖుర్ఆన్ గ్రంథం యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే అందులో ప్రకృతి సహజ ప్రక్రియలను స్పష్టంగా విశదీకరించే అనేక వచనాలు ఉన్నాయి, ఉదాహరణకు – పిండోత్పత్తి, అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, సాగరశాస్త్రం మొదలైనవి. ఖుర్ఆన్ లో 7వ శతాబ్దంలో పేర్కొనబడిన వైజ్ఞానిక అంశాలు అసాధారణమైన నిర్దిష్టత్వంతో ఖచ్ఛితంగా ఉండటాన్ని నేటి శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

  “త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారిలోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది.” ఖుర్ఆన్ 41:53

  వాస్తవానికి, ఖుర్ఆన్ లో పేర్కొనబడిన అనేక వైజ్ఞానిక అద్భుతాలను శాస్త్రజ్ఞులు ఆధునికి టెక్నలాజికల్ పరికరాల సహాయంతో ఈ మధ్యనే కనుగొన్నారు. ఉదాహరణకు:

  · ఖుర్ఆన్ లో పిండోత్పత్తి గురించి స్పష్టంగా, విపులంగా విశదీకరించబడింది. వీటి గురించి ఈ మధ్య కాలం వరకు శాస్త్రజ్ఞులకు తెలియదు.

  · ఖగోళ వస్తువులన్నీ (నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు ... మొదలైనవి) దుమ్ము, దూళితో నిండి మబ్బుల నుండి ఏర్పడినాయని ఖుర్ఆన్ లో పేర్కొనబడింది. ఈ వాస్తవం గురించి గతంలో ప్రజలకు తెలియదు. కానీ, ఈనాడు ఇది ఆధునిక విశ్వసృష్టిశాస్త్రంలోని ఒక నిర్వివాద నియమం.

  · రెండు సముద్రాల నీళ్ళు కలిసినప్పుడు తమ స్వంత ఉష్ణోగ్రత, సాంద్రత మరియు లవణీయతలలో ఎలాంటి మార్పు లేకుండా యదాతథంగా కొనసాగేలా వాటి మధ్య అడ్డుపొరలు ఉంటాయని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కనుగొన్నది.

  సృష్టికర్త యొక్క ఈ అద్భుత చిహ్నాలు 1400 సంవత్సరాలకు పూర్వమే ఖుర్ఆన్ లో స్పష్టంగా పేర్కొనబడినాయి.

  అద్వితీయత, అపూర్వత, ఏకైకత

  ఖుర్ఆన్ అవతరించినప్పటి నుండి నేటి వరకు, దానిలోని ఏదైనా ఒక అధ్యాయం వంటి అధ్యాయాన్ని దాని సాహిత్య సౌందర్యం, వాగ్ధాటి, వివేకం, శోభ, భవిష్యవాణులు మరియు ఇతర పరిపూర్ణ లక్షణాలతో ఎవ్వరూ రచించలేకపోయారు.

  “మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానం ఉంటే, అటువంటిదే ఒక్క సూరానైనా తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి.” ఖుర్ఆన్ 2:23

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించిన మక్కా ప్రజలు అరబీ భాషలో ఎంతో గొప్ప పాండిత్యం కలిగి ఉన్నా ఈ సవాలును ఎదుర్కొనలేక పోయారు. ఈ సవాలు నేటికీ అలాగే తిరుగులేని సవాలుగా నిలబడి ఉన్నది.

  ఖుర్ఆన్ లో పరస్పర విరుద్ధ వాదనలు లేవు

  ప్రజలు వ్రాస్తున్నప్పుడు స్పెల్లింగ్ తప్పులు మరియు గ్రామర్ లో తప్పులు, వచనాలను పరస్పర విరుద్ధ అర్ధాలు వచ్చేట్లు వ్రాయడం, వాస్తవ ఘటనలను తప్పుగా నమోదు చేయడం, కొంత సమాచారాన్ని వదిలి వేయడం మొదలైన అనేక రకాల తప్పులు చేసే ఆస్కారం ఉన్నది.

  “ఒకవేళ ఇది గనుక అల్లాహ్ తరుఫు నుండి గాక ఇంకొకరి తరుఫు నుంచి వచ్చి ఉంటే, అందులో వారికి ఎంతో వైరుధ్యం కనబడేది.” ఖుర్ఆన్ 4:82

  కానీ ఖుర్ఆన్ గ్రంథంలో అలాంటి తప్పులేమీ లేవు. అంతేగాక ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన వాటిలో ఏదీ వర్ష జలము, పిండోత్పత్తి, భూగర్భశాస్త్రం, విశ్వనిర్మాణశాస్త్రం, చారిత్రక వాస్తవాలు మరియు ఘటనలు, భవిష్యవాణులు మొదలైన వైజ్ఞానిక వివరణలకు విరుద్ధంగా లేదు.

  దానిని రచించడం ముహమ్మద్ కు అసాధ్యం?

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్రలో నిరక్షరాస్యులుగా పేర్కొనబడినారు; ఆయనకు చదవడం మరియు వ్రాయడం రాదు. వైజ్ఞానిక మరియు చారిత్రక అంశాలు లేదా అరబీ సాహిత్యంలో సాటిలేని అద్భుత గ్రంథంగా దీనిని రచించే స్థాయికి చేర్చే విధంగా ఏ అంశాలలోనూ ఆయన విద్యాభ్యాసం చేయలేదు. ఇంకా, ఖుర్ఆన్ లో పేర్కొనబడిన చారిత్రక సంఘటనలు మరియు నాగరికతలు ఏ మానవుడూ రచించలేనంత ఖచ్ఛితంగా ఉన్నాయి.

  “ఈ ఖుర్ఆన్ ను అల్లాహ్ కాకుండా ఇతరులెవ్వరూ ఎన్నటికీ తయారు చేయలేరు.” ఖుర్ఆన్ 10:37

  దివ్యసందేశం యొక్క అసలు ఉద్దేశ్యం మరియు లక్ష్యం

  ఏకైక నిజఆరాధ్యుడిని విశ్వసించడం

  “మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.” ఖుర్ఆన్ 2:163

  మొత్తం ఖుర్ఆన్ లో మాటిమాటికీ ప్రస్తావించబడిన ముఖ్య విషయం ఏమిటంటే ఏకైకుడు, అద్వితీయుడు, సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించమనే దివ్యసందేశం. తనకు ఎవ్వరూ భాగస్వాములు మరియు సంతానం లేరని, ఎవ్వరూ సాటి లేరని, తాను తప్ప ఆరాధింపబడే అర్హత, యోగ్యత గలవారెవ్వరూ లేరని ఆయన మనకు తెలిపినాడు. సర్వలోక సృష్టికర్తతో పోల్చదగినదేదీ లేదు మరియు ఆయన సృష్టిలోనిదేదీ ఆయనను పోలి లేదు. మానవ లక్షణాలు మరియు ప్రతిబంధకాలను అల్లాహ్ కు అంటగట్టే భావనను ఖుర్ఆన్ పూర్తిగా తిరస్కరిస్తున్నది.

  అసత్యదైవాలన్నింటినీ తిరస్కరించుట

  “అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి.” ఖుర్ఆన్ 4:36

  కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు కావటం వలన, అసత్య దేవతలు మరియు దేవుళ్ళు తప్పనిసరిగా తిరస్కరించబడాలి. దివ్యలక్షణాలను ఎవరికైనా లేక దేనికైనా అంటగట్టే తలంపును ఖుర్ఆన్ కూడా పూర్తిగా తిరస్కరిస్తున్నది.

  పూర్వకాలపు వృత్తాంతాల ప్రస్తావన

  ప్రయోజనకరమైన గుణపాఠాలు, ఉపదేశాలతో ప్రవక్త ఆదము, నూహ్, అబ్రహాము, జీసస్ మరియు మోసెస్ (అందరికీ అల్లాహ్ మరింత శాంతిని ప్రసాదించుగాక) మొదలైన పూర్వప్రవక్తల గాథలతో పాటు అనేక వాస్తవ వృత్తాంతాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఈ వృత్తాంతాల గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి,

  “నిశ్చయంగా వీరి గాథలలో వివేకవంతుల కొరకు గుణపాఠం ఉంది.” ఖుర్ఆన్ 12:111

  అంతిమ తీర్పుదినం గురించి జ్ఞాపకం చేస్తున్నది

  ప్రతి ఒక్కరూ చావు రుచి చూడవలసిందేనని మరియు వారు మాట్లాడే మాటలకు మరియు చేసే పనులకు వారే బాధ్యత వహించవలసి ఉందని ఈ పవిత్ర గ్రంథం మనకు గుర్తు చేస్తున్నది:

  “మేము తీర్పుదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవ్వంత అన్యాయం కూడా జరుగదు. …” ఖుర్ఆన్ 21:47

  మానవ జీవిత లక్ష్యాన్ని సాధించడం :

  ముఖ్యంగా, మానవ జీవిత అసలు ఉద్దేశ్యం కేవలం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడమని మరియు ఆయన నిర్దేశించినట్లుగా జీవించడమని ఖుర్ఆన్ గ్రంథం బోధిస్తున్నది. ఇస్లాం ధర్మంలో, ఆరాధన అనేది ఒక సమగ్రహమైన పదం – దీనిలో అల్లాహ్ ఇష్టపడే, మెచ్చుకునే (రహస్యమైన మరియు బహిరంగమైన) అన్ని ఆలోచనలు, పలుకులు మరియు ఆచరణలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి, అల్లాహ్ ఆజ్ఞలు ఆచరించడం ద్వారా ఒక ముస్లిం అల్లాహ్ ను ఆరాధిస్తున్నాడు మరియు తన జీవిత ఉద్దేశ్యాన్ని పూర్తి చేస్తున్నాడు. ఖుర్ఆన్ లో ఆరాధనల గురించి పేర్కొనబడిన కొన్ని ఉదాహరణలు:

  నమాజు (సలాహ్):

  “ఓ విశ్వాసులారా ! రుకూ, సజ్దాలు చేస్తూ ఉండండి. మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి. తద్వారా మీరు సఫలీకృతులవుతారు.” ఖుర్ఆన్ 22:77

  దానధర్మాలు :

  “… (దైవమార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో, వారే సాఫల్య భాగ్యం పొందినవారు.” ఖుర్ఆన్ 64:16

  నిజాయితీ:

  “సత్యాన్ని అసత్యంతో కలిపి కలగా పులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పి పుచ్చకండి.” ఖుర్ఆన్ 2:42

  నిరాడంబరం, నమ్రత, సచ్ఛీలత:

  “విశ్వాస పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. విశ్వాస మహిళలు కూడా తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉన్నది తప్ప, తమ అలంకరణలను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై పరదా వేసుకోవాలని తమ భర్త లేక తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేదా తమ అక్కచెల్లెళ్ళ కుమారులు లేక తమతో కలిసి మెలిసి ఉండే మహిళలు లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను కనబడనివ్వకూడదనీ, దాగి వున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసి పోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు.” ఖుర్ఆన 24:30-31

  కృతజ్ఞతా భావం:

  “అల్లాహ్ మిమ్ముల్ని మీ మాతృగర్భాల నుండి మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారు చేసింది ఆయనే – మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని.” ఖుర్ఆన్ 16:78

  న్యాయం:

  “ఓ విశ్వసించిన వారలారా! మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం సాక్ష్యులుగా ఉండండి – అది మీ స్వయానికి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే. ధనికుడయినా, పేదవాడయినా సరే.…” ఖర్ఆన్ 4:135

  సహనం, ఓర్పు:

  “నీవు సహనంతో మసలుకో. నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృథా కానివ్వడు.” ఖుర్ఆన్ 11:115

  మంచితనం :

  “విశ్వసించి, మంచి పనులు చేసిన వారికి గొప్ప మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేశాడు.” ఖుర్ఆన్ 5:9

  ముగింపు

  చివరి మాటగా, ఎలా ఏకైక నిజదైవాన్ని ఆరాధించాలో ఖుర్ఆన్ మానవజాతికి బోధిస్తున్నది. తద్వారా వారు తమ జీవిత అసలు ఉద్దేశ్యాన్ని గుర్తించి, దానిని మంచిగా పూర్తి చేయగలరు మరియు ఇహపర లోకాలలో సాఫల్యం పొందవచ్చు.

  (ఓ ముహమ్మద్) జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి, ఎవరైనా దారికి వస్తే, అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు. మరెవరైనా దారి తప్పితే, ఆ పెడదారి అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడు కావు.” Qur’an 39:41

  ఈ దివ్య ఖుర్ఆన్ ను కనీసం ఒక్కసారైనా చదవాలని మీకు అనిపించడం లేదా ?

  http://islamicpamphlets.com/the-quran-the-final-revelation-to-mankind/