నవముస్లిం మార్గదర్శిని ()

 

ఈ పుస్తకంలో క్లుప్తంగా ఇస్లాం పరిచయం ఉన్నది. ముఖ్యంగా ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే నవముస్లింలను ఉద్ధేశించి ఈ పుస్తకం తయారు చేయబడింది. దీని ద్వారా అనేక ఇస్లామీయ విషయాలను మనం తెలుసుకోవచ్చును. అనేక భాషలతో పాటు తెలుగులో కూడా దీనిని దారుస్సలాం పబ్లిషర్స్ ప్రచురించినారు. దీనిని కొనుక్కోవాలనుకుంటే, దారుస్సలాంను సంప్రదించవలెను.

|

منـهج المســلم الجــديد

 నవముస్లిం మార్గదర్శిని

 ఇస్లాం అంటే ...

అరబీ భాషలో ఇస్లాం అంటే సమర్పించుకోవడం, ఆజ్ఞాపాలన చేయడం. భాషాపరంగా ఇస్లాం పదం యొక్క అర్థం ఇదే. కాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ సందేశహరుడిగా ప్రకటింప బడిన నాటినుండి, ఇస్లాం అంటే తన ప్రభువు నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన ధర్మం అని ప్రసిద్ధి చెందినది. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు.

 …اليَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَ رَضِيتُ لَكُمُ الإِسْلَامَ دِينًا

(ఓ ముహమ్మద్!) మేము మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసినాము మరియు మీపై నా అనుగ్రహాలనూ పూర్తి చేసాను. ఇంకా మీకోసం ఇస్లాం నే ధర్మంగా అంగీకరించాను.”(మాయిదహ్ 5:3)

కాబట్టి, ఇస్లాం యే అంతిమ ధర్మము, దీని తర్వాత మరే ధర్మమూ లేదు. ఎవరైనా సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత తను దైవప్రవక్తనని లేదా దైవసందేశహరుడినని ప్రకటిస్తే, నూటికినూరు పాళ్ళు అది అసత్యమే మరియు అతను అసత్యపరుడే.  

 ఇతర ధర్మాలతో ఇస్లాం ధర్మం యొక్క సంబంధం:

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వం అల్లాహ్ అనేక ప్రవక్తలను పంపినాడు. వారిలో కొందరి గురించి ఖుర్ఆన్ లో పేర్కొనబడెను మరియు మరికొందరి గురించి పేర్కొనబడలేదు. ఒకవేళ ముస్లింలలో ఎవరైనా అల్లాహ్ పంపిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని తిరస్కరించినా గాని అతడు అవిశ్వాసి, సత్యతిరస్కారుడై పోవును.  పూర్వపు ప్రవక్తలు ఎవరైనా దుష్ట పాలకులకు సత్యమార్గం చూపటం కోసం లేదా ఏదో ఒక ప్రాంత, పట్టణ, పల్లె, తెగ లేక సమాజం ప్రజల మార్గదర్శకత్వం కోసం పంపబడేవారు. కాని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తూర్పు-పడమరల, ఉత్తర-దక్షిణాల మధ్య నివసించే మొత్తం మానవజాతి కొరకు అంతిమప్రవక్తగా అల్లాహ్ పంపినాడు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు.

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ (28)

“మేము నిన్ను సమస్త ప్రజానీకానికి శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరించే వానిగా చేసి పంపాము” (ఖుర్ఆన్ 34:28)

సత్యధర్మంలో కేవలం అల్లాహ్ ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే ఆరాధ్యుడు, ఆయనకెవ్వరూ సాటిలేరు, అన్నిరకాల ఆరాధనలు కేవలం ఆయనకే చెందుతాయి. ఇతర ఏకదైవ (యూద, క్రైస్తవ, …) ధర్మాలలో ఆయా ప్రవక్తలు బోధించిన అసలు మూలవిషయం కూడా ఇదే. అయితే కాలక్రమంలో అనేకసార్లు కలుషితమై పోయిన ఈ ఏకదైవారాధన సందేశాన్ని చివరిసారి మరల స్వచ్ఛమైన రీతిలో బోధించడానికే ఇస్లాం ధర్మం వచ్చినది.

®      ®      ®


 విశ్వాసం (ఈమాన్) యొక్క మూలస్థంభాలు

(The Pillars of Faith - అర్కాన్ అల్ ఈమాన్)

భాషాపరంగా ఈమాన్ అంటే సత్యమని నమ్మటం, పూర్తిగా విశ్వసించటం. ఇస్లామీయ పరిభాషలో ఈమాన్ అంటే అల్లాహ్ సందేశాల్ని, ఆయన ఆదేశించిన ఆరాధనలను మనస్ఫూర్తిగా సత్యమని నమ్మటం, నాలుక ద్వారా వాటిని ధృవీకరించటం మరియు అవయవాల ద్వారా వాటిని ఆచరించటం.

ఖుర్ఆన్ మరియు హదీథులలో తెలుపబడిన ఇస్లామీయ మూలాధారాల్ని (అఖీదహ్ ను) అనుసరించి ఈమాన్ మూలస్థంభాలు (pillars) ఆరు. ఈ మొత్తం ఆరింటినీ విశ్వసించటం తప్పని సరి. వీటిలో ఏ ఒక్క దానిని విశ్వసించక పోయినా, ఈమాన్ అంతమై పోయినట్లే. ‘విశ్వాసం యొక్క ఈ ఆరు మూలస్థంభాలు’ ఏవిటంటే -

1. అల్లాహ్ పై విశ్వాసం

2. మలాయికలపై (దైవదూతలపై) విశ్వాసం

3. దివ్యగ్రంథాలపై విశ్వాసం

4. సందేశహరులపై విశ్వాసం

5. అంతిమదినం పై విశ్వాసం

6. అల్ ఖదర్ (పూర్వనిర్దిష్ట విధివ్రాత)పై విశ్వాసం.

1. అల్లాహ్ పై విశ్వాసం:

అంటే వాస్తవానికి ‘కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధ్యుడు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆ యోగ్యత లేదు’ అని మనస్పూర్తిగా నమ్మటం. ఎందుకంటే మానవులను సృష్టించేదీ, వారిని పోషించేదీ, వారిపై దయ చూపేదీ, ప్రతి విషయంలో వారికి మార్గదర్శకత్వం వహించేదీ ఆయనే. ఇంకా వారి ఆంతరంగిక మరియు బహిర్గత విషయాలు ఎరిగినవాడూ, వారి ఆచరణల లెక్కలు తీసుకునేవాడూ ఆయనే. పాపాత్ములను వారి చెడు పనుల కారణంగా శిక్షిస్తాడు మరియు పుణ్యాత్ములను వారి మంచి పనుల కారణంగా సత్కరిస్తాడు. సృష్టించగలిగే సామర్ధ్యం ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. అంతేకాక ఆయన తప్ప ఇంకో యజమాని లేడు. మానవులు ఇహపరలోకాలలో సాఫల్యం పొందటం కొరకు అవసరమైన మార్గదర్శకత్వం చేసినాడు. దీని కొరకు అనేక మంది ప్రవక్తలను మరియు అనేక దివ్యగ్రంథాలను వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాలలో పంపినాడు.

అంతేకాక ఇస్లాం ధర్మం యొక్క ఏ మూలస్థంభాలనైతే ఆయన తన దాసులకు తెలిపినాడో, వాటిని తప్పనిసరిగా వారు విశ్వసించ వలెను. ఉదాహరణకు నమాజు, ఉపవాసం, హజ్ మరియు జకాత్ విధిదానం. అంతేకాక ఇస్లామీయ ధర్మశాసనం (షరిఅహ్) లోని ఇతర విషయాలను కూడా విశ్వసించవలెను. ప్రార్థనలు, దుఆలు, ఆశించటం, ఖుర్బానీ మరియు మన్నతులు/మొక్కుబడులు కోరటం వంటి అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించ వలసియున్నది. ఆరాధనల అసలు వాస్తవికత ఇదే.

ఇంకా అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఖుర్ఆన్ మరియు హదీథులలో తెలుపబడిన అల్లాహ్ శుభనామాలు, దివ్యగుణాలను విశ్వసించటం కూడా ఉన్నది. దానితో పాటు వాటి యోగ్యతలకు అనుగుణంగా వాటి ఔన్నత్యాన్ని స్వీకరించవలసి యున్నది మరియు వాటికి ప్రత్యేకస్థానం ఇవ్వవలసియున్నది. అంతేకాక ఆ శుభనామాలు మరియు దివ్యగుణాలను సృష్టితాలకు అస్సలు ఆపాదించకూడదు.

అల్లాహ్ యొక్క నిదర్శనాలు స్వయంగా మనలో మరియు ఈ సమస్త సృష్టి యొక్క ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాయి. ఆయన యొక్క మహోన్నత్వాన్ని మరియు అత్యున్నతమైన వివేకాన్ని గుర్తించటం కొరకు తమ జ్ఞానాన్నీ మరియు తెలివితేటలనూ వినియోగించమని ఖుర్ఆన్ లో అనేక చోట్ల అల్లాహ్ ఆదేశించినాడు.

తౌహీద్ భాగాలు:

తౌహీద్ అంటే ఏకత్వం. ఇది మూడు భాగాలుగా విభజింపబడినది:

1. తౌహీదె రుబూబియత్ (అల్లాహ్ యే ఏకైక సార్వభౌముడు)

2. తౌహీదె ఉలూహియత్ (అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యుడు)

3. తౌహీదె అస్మావస్సిఫాత్ (శుభనామాలు-దివ్యగుణాలన్నీ కేవలం అల్లాహ్ కే చెందును)

1. తౌహీదె రుబూబియత్ (అల్లాహ్ యే ఏకైకసార్వభౌముడు ప్రభువు): అల్లాహ్ యే సృష్టిలోని ప్రతి దానినీ సృష్టించేవాడూ, పోషించే వాడూ, పరిపాలించేవాడూ, ప్రాణం పోసేవాడూ, ప్రాణం తీసేవాడూ ఆయనే. ఆయన సార్వభౌమత్వానికి సంబంధించి విశ్వసించ వలసిన విషయాలన్నీ ఈ భాగంలోనికి వస్తాయి.

2. తౌహీదె ఉలూహియత్ (అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యుడు): ‘సకల ఆరాధనలకు కేవలం అల్లాహ్ మాత్రమే అర్హుడు’ అని విశ్వసించి, ఆచరించ వలసిన విషయాలు ఈ భాగంలోనికి వస్తాయి. కాబట్టి అన్నిరకాల ఆరాధనలను అల్లాహ్ కు మాత్రమే సమర్పించు కోవలెను. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఇక్కడ ఆరాధనలంటే - ప్రార్థించటం, భయపడటం, నమ్మటం ... మొదలైనవన్నీ. కాబట్టి మనం కేవలం ఆయన్నే ప్రార్థించవలెను, భయపడవలెను, నమ్మవలెను, సహాయం అర్థించవలెను, శరణు వేడుకోవలెను. దీనిని బోధించటానికే ప్రవక్తలు, సందేశహరులు వచ్చారు.   దీని గురించి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు –

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ  … (36)        

 “మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను ‘మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు మిథ్యాదైవాల (తాగూతుల) ఆరాధనలను త్యజించండి’ అనే సందేశంతో పంపాము.” (ఖుర్ఆన్ 16:36)       

తాగూతులంటే అల్లాహ్ కాకుండా, ఆరాధింపబడే మిగిలినవన్నీ. అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యుడనే తౌహీద్ యొక్క ఈ భాగాన్నే నూతన మరియు ప్రాచీన అవిశ్వాసులు అంటే సత్యతిరస్కారులందరూ తిరస్కరించారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు –

أَجَعَلَ الآَلِهَةَ إِلَهًا وَاحِدًا إِنَّ هَذَا لَشَيْءٌ عُجَابٌ (5)

 “ఏమిటీ! ఇతను (ప్రవక్త) దైవాలందరినీ ఒకే దైవంగా చేసాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!” (ఖుర్ఆన్ 38:5)

3. తౌహీదె అస్మావస్సిఫాత్: అల్లాహ్ యొక్క శుభనామాలన్నింటినీ మరియు దివ్యగుణాలన్నింటినీ ఖుర్ఆన్ మరియు హదీథులలో ఉన్నట్లుగా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా విశ్వసించటం. ఉదాహరణకు అల్లాహ్ యొక్క పేర్లు అల్ హయ్య్ మరియు అల్ ఖయ్యూమ్ – మన బాధ్యత ఏమిటంటే అల్లాహ్ శుభనామాలలో హయ్యు అనేది కూడా ఒకటని నమ్మవలెను. అంతేకాక ఆ శుభనామం యొక్క విశిష్ఠతను కూడా మనం తప్పకుండా నమ్మవలెను. అంటే అల్లాహ్ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు మరియు ఆయనకు మరణం అస్సలు లేదు.

2. మలాయికలపై (దైవదూతలపై) విశ్వాసం:

‘మలాయికలపై విశ్వాసం’ అంటే ‘దైవదూతల ఉనికిని మనస్పూర్తిగా విశ్వసించటం’అని అర్థం. అల్లాహ్ సృష్టించిన ప్రాణులలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే, ఎల్లప్పుడూ ఆయననే కొనియాడుతూ ఉండే మరియు ‘అల్లాహ్ ఆజ్ఞాపించే ఏ పనినీ అస్సలు తిరస్కరించని, అల్లాహ్ యొక్క ప్రతి ఆదేశాన్ని తూ.చ. తప్పక పాటించే’ ప్రత్యేక సృష్టియే మలాయికలు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ యే దైవదూతల పేర్లు మనకు తెలిపారో, వారందరినీ మనం తప్పక విశ్వసించవలసి ఉన్నది. ఉదాహరణకు జిబ్రయీలు మరియు మీకాయీలు మొదలైన దైవదూతల పేర్లు. ఇదేవిధంగా వారి ప్రాకృతిక విశేషణాలను కూడా విశ్వసించటం అనివార్యమై ఉన్నది. అల్లాహ్ వాటిని కాంతితో సృష్టించాడని, వాటికి అనేక రెక్కలుంటాయని, ఆ రెక్కల సంఖ్య వేర్వేరుగా ఉంటుందని తెలియ జేయబడిన వాస్తవాల విషయాలను మనం విశ్వసించవలెను. ఇదే విధంగా ఖుర్ఆన్ మరియు హదీథులలో వారి ఏయే పనుల గురించి చర్చించబడినదో, దానిని విశ్వసించవలెను. ఉదాహరణకు – అలసట ఎరుగకుండా, రాత్రీపగలు వారు అల్లాహ్ నే ఆరాధిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ ఉండటం మొదలైనవి. అలాగే వేర్వేరు దైవదూతలు వేర్వేరు పనులలో నిమగ్నమై ఉన్నారని విశ్వసించవలెను. ఉదాహరణకు - 

Ø అర్ష్(అల్లాహ్ సింహాసనం) పైకెత్తి పట్టుకునుండే దైవదూతల పని.

Ø వహీ (దైవవాణి – అల్లాహ్ యొక్క దివ్యసందేశాం) అందజేసే పని కేటాయించబడిన జిబ్రయీలు దైవదూత.

Ø వర్షం కురిపించే పని కేటాయించబడిన మీకాయీలు దైవదూత.

Ø ప్రళయదినాన శంఖం ఊదే పని కేటాయించబడిన దైవదూతలు.

Ø నరకపు ద్వారపాలకుల పని కేటాయించబడిన దైవదూతలు.

Ø స్వర్గపు ద్వారపాలకుల పని కేటాయించబడిన దైవదూతలు. 

 3. దివ్యగ్రంథాలపై విశ్వాసం:

‘దివ్యగ్రంథాలపై విశ్వాసం’ అంటే ‘అల్లాహ్ తన ప్రవక్తలు మరియు రసూల్ ల (సందేశహరుల) పై వహీ (దైవవాణి) రూపంలో జిబ్రయీలు అలైహిస్సలాం ద్వారా తన దివ్యసందేశాలను అవతరింప జేసేవాడ’ని మనస్పూర్తిగా విశ్వసించటం. వారు ఆ దివ్యసందేశాలను ప్రజలకు అందజేసేవారు. అవి ఒక్కోసారి ఒకే శాసనం గానూ, ఒక్కోసారి అనేక శాసనాలుగానూ జమ చేయబడేవి. వాటికి అల్ కితాబ్ లేదా సుహూఫ్ అనే పేరు ఇవ్వటం జరిగేది. అల్లాహ్ యొక్క దివ్యగ్రంథాలు వివిధ ప్రాంతాలలో మరియు విభిన్న భాషలలో అవతరించినవి. ప్రతి సమాజం పై వారి వారి దివ్యగ్రంథాల్ని వారి వారి భాషలలోనే అవతరింపజేయటం జరిగినది. వాటిలో ఆ సమాజ ప్రజల కొరకు హితబోధలూ మరియు సాఫల్యవంతమైన, తేజోవంతమైన జీవితం గడపడానికి దారిచూపే మార్గదర్శకత్వాలూ ఉండేవి. అల్లాహ్ యొక్క ఏకత్వం (తౌహీద్) వైపు ఆహ్వానించటానికే మరియు ఏకదైవారాధనా సందేశాన్ని అంటే కేవలం అల్లాహ్ నే ఆరాధించ మనే సందేశాన్ని అందజేయడానికే ఈ దివ్యగ్రంథాలన్నీ అవతరించినవి. పుణ్యకార్యాలు చేయమని మరియు పాపకార్యాల నుండి దూరంగా ఉండమని కూడా ఆజ్ఞాపించేవి. అయితే అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ తప్ప మిగిలిన దివ్యగ్రంథాన్నీ కాలక్రమంలో కలుషితం చేయబడినాయి. దీనికి కారణం ఖుర్ఆన్ యొక్క సంరక్షణ బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకోవటం మరియు ఇది కాలానికతీతంగా, ప్రాంతాలకతీతంగా అంతిమదినం వరకు జన్మించే ప్రతి మానవుడి కొరకు పంపబడిన అంతిమసందేశం కావటం. దీని వలన చివరి వరకు ఎలాంటి కలుషితానికీ, కల్పితాలకూ గురికాకుండా ఇది స్వచ్ఛమైన రూపంలో ఉండి, మానవులందరికీ సరైన మార్గం చూపుతూ ఉంటుంది. ఈ క్రింది వాటి ఆచరణల ద్వారా దివ్యగ్రంథాలపై మన విశ్వాసం బహిర్గతమవుతుంది%

1.      అల్లాహ్ తన ప్రవక్తలపై దివ్యగ్రంథాలను అవతరించాడనే విషయాన్ని, వారిపై అల్లాహ్ తరఫు నుండి దివ్యగ్రంథాల అవతరణ ముమ్మాటికీ సత్యమనీ మరియు న్యాయబద్ధమనీ సామూహికంగా నమ్మటం.

2.      ఏ దివ్యగ్రంథాల పేర్లయితే అల్లాహ్ తెలిపినాడో, వాటిని విశ్వసించటం. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడిన ఖుర్ఆన్ గ్రంథంపై, ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరించబడిన తౌరాత్ గ్రంథం పై, ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథంపై, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం పై అవతరించబడిన జబూర్ గ్రంథంపై, అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై అవతరించబడిన సహీఫాలపై. అంతేకాక వీటన్నింటిలోనూ ఖుర్ఆన్ గ్రంథం ఎంతో ఉత్తమమైన గ్రంథమనీ మరియు పూర్వ గ్రంథాలన్నింటిపై సాక్ష్యంగా అల్లాహ్ పంపిన అంతిమ గ్రంథమనీ నమ్మటం. ఇంకా దీని ఆదేశాలను పాటించటం మరియు దీనిని ఒక సత్యమైన గ్రంథంగా స్వీకరించటం అనేది మానవులందరిపై అనివార్యమై ఉన్నది. ఖుర్ఆన్ తెలిపినట్లుగా తౌరాత్ మరియు ఇంజీలు మొదలైన దివ్యగ్రంథాలు కాలక్రమంలో అనేక మార్పులు - చేర్పులకు గురైనవనే సత్యాన్ని గుర్తించటం.

3.      ఖుర్ఆన్ లో ధ్రవీకరింపబడిన ఆ ప్రాచీన దివ్యగ్రంథాలలోని ప్రతి విషయాన్నీ సత్యంగా నమ్మటం.  

4. సందేశహరులపై విశ్వాసం:

అల్లాహ్ యొక్క సందేశహరులందరినీ సామూహికంగా విశ్వసించటం తప్పని సరి. నరకం గురించి హెచ్చరించడానికి మరియు స్వర్గం గురించి సంతోషవార్తలు తెలియజేయడానికి అల్లాహ్ తన దాసుల వద్దకు నిస్సందేహంగా తన సందేశహరులను పంపాడని మనం నమ్మవలెను. ఎలాంటి సాటీ లేని ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని వారు ప్రజలను పిలిచేవారని నమ్మవలెను. ఇంకా ఆ సందేశహరులందరి లోనూ చిట్టచివరిగా పంపబడిన అత్యుత్తమ సందేశహరుడే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని కూడా విశ్వసించవలెను. ఎలాగైతే సందేశహరులందరినీ అంటే ముహమ్మద్, నూహ్, ఇబ్రాహీం, మూసా మరియు ఈసా అలైహిస్సలాం మొదలైన వారిని విశ్వసించటం అనివార్యమో, అలాగే అల్లాహ్ పంపిన ప్రవక్తలందరినీ సామూహికంగా విశ్వసించటం కూడా అనివార్యమే. అంతేకాక ప్రవక్తలందరూ అల్లాహ్ తరఫు నుండే పంపబడినారనేది కూడా నూటికి నూరుపాళ్ళు సత్యమని విశ్వసించవలసియున్నది. కాబట్టి అల్లాహ్ పంపిన ఏ ఒక్క సందేశహరుడిని గాని లేదా ఏ ఒక్క ప్రవక్తను గాని ఎవరైనా తిరస్కరిస్తే, వారు మొత్తం సందేశహరులందరినీ మరియు ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే.

5. అంతిమదినం పై విశ్వాసం:

అంతిమదినంపై విశ్వాసం అంటే మరణించిన తరువాత మరల లేపబడతారని మరియు ప్రతి ఒక్కరి పాపపుణ్యాల లెక్క తీసుకోబడుతుందని విశ్వసించటం. ఆ తరువాత పాపులు కఠినంగా శిక్షించబడుదురు మరియు పుణ్యమానవులు సత్కరించబడుదురు. ‘అంతిమదినంపై విశ్వాసం చూపటంలో’ అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన మరణానంతర సంఘటనలన్నింటినీ విశ్వసించటం కూడా ఉన్నది. ఉదాహరణకు - సమాధి పరీక్షలు, దానిలోని శిక్షలు - పురస్కారాలు మొదలైనవి. వాటితో పాటు అంతిమదినపు కఠిన స్థితిగతులన్నింటినీ మరియు ప్రతి స్వర్గవాసీ తమ తమ కర్మల ఆధారంగా దాటవలసి యున్న పుల్ సిరాత్ అనే వంతెన గురించిన విషయాలన్నింటినీ విశ్వసించటం. ఇంకా పాపపుణ్యాలను కొలిచే తూకాన్నీ మరియు దాని కొలతలనూ తప్పనిసరిగా విశ్వసించ వలసియున్నది. దానితో పాటు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రజల గురించి సిఫారసు చేస్తారని, ఇక ఎప్పుడూ దప్పిక కలగని విధంగా దాహాన్ని తీర్చే పవిత్ర నీరు గల హౌజె కౌసర్ అనే సరస్సు వద్దకు ఆయన వస్తారని, పవిత్రులైన విశ్వాసులకు అల్లాహ్ యొక్క దర్శనం కలుగుతుందని, స్వర్గం మరియు దాని శుభాలను, అలాగే నరకం మరియు దాని కఠిన శిక్షలనూ నమ్మటం.

6. అల్ ఖదర్ (పూర్వనిర్దిష్ట విధివ్రాత) పై విశ్వాసం:

తక్దీర్ మరియు విధివ్రాత పై విశ్వాసం అంటే మనకు జరిగే మంచి-చెడులు, లాభనష్టాలు, సుఖదు:ఖాలు మొదలైనవన్నీ అల్లాహ్ ఇష్టానుసారమే జరుగును మరియు అల్లాహ్ యొక్క అనుజ్ఞ లేకుండా ఏదీ జరుగదు అని విశ్వసించటం. ఈ భూలోకం యొక్క, అందులోని ప్రతి విషయం యొక్క మరియు మున్ముందు జన్మించబోయే ప్రతీదాని యొక్క భాగ్యాన్ని వాటి సృష్టికి పూర్వమే అల్లాహ్ వ్రాసేసినాడు. అయినప్పటికీ, అల్లాహ్ తన దాసులను కొన్నింటిని చేయమని, మరికొన్నింటికి దూరంగా ఉండమని ఆదేశించినాడు. ఇంకా వారికి తమ తమ పనులను తమ ఇష్టానుసారం చేసుకునే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఇచ్చినప్పటికీ, వారి కర్మల లెక్క త్వరలోనే తీసుకోబోతున్నానని అల్లాహ్ ప్రకటించినాడు. (మరియు ఇస్లాంలో ఆరాధనకు అర్థం ఇదే) మరియు అల్లాహ్ యే తన దాసుల కార్యాలను సృష్టించువాడు మరియు దాసులు ఆ కార్యాలను ఆచరించువారు. మరియు తన దాసుల మంచి చెడ్డల గురించి వారి పుట్టుకకు ముందే అల్లాహ్ కు తెలుసును. అలాగే స్వర్గనరకాలలో ఎవరెవరు చేరబోతున్నారనే విషయం కూడా అల్లాహ్ ఎరుగును. ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మల ననుసరించి కఠినశిక్షలు లేదా స్వర్గసుఖాలు ప్రసాదించబడును. ఈ విషయాలన్నీ అల్లాహ్ యొక్క గ్రంథంలో భద్రంగా నమోదు చేయబడి ఉన్నాయి.

విధివ్రాతను విశ్వసించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తమకు శుభమైన దానినే అల్లాహ్ తమ భాగ్యంలో వ్రాసిఉంటాడనే నమ్మకం వలన విశ్వాసి సదా ప్రశన్నంగా ఉంటాడు. అలాగే భాగ్యాన్ని విశ్వసించటం ద్వారా విశ్వాసిలో ధైర్యసాహసాలు కలుగుతాయి. ఫలితంగా అతనిలోని మృత్యుభయం తొలిగిపోతుంది. ఎందుకంటే నిర్ణీత సమయం కంటే ముందు తనకు చావు రాదనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. తనకు జరిగిన మంచి – చెడులు ఎలాగూ జరగవలసి ఉన్నవేనని, అలాగే తనకు లభించని విషయాలు తన భాగ్యంలో లేకపోవటం వలననే లభించలేదని తనకు తానుగా సమాధాన పరచుకుంటాడు. ప్రపంచ ప్రజలందరూ ఏకమై తనకు ఏదైనా లాభం కలిగించాలని ప్రయత్నించినా లేక ఏదైనా నష్టం కలిగించాలని ప్రయత్నించినా, వారు తనకు ఏ విధమైన లాభాన్నీ లేదా నష్టాన్నీ కలిగించలేరనే విశ్వాసం అతనిలో బలపడుతుంది. ‘అవును, ఏదైతే అల్లాహ్ తన భాగ్యంలో వ్రాసిపెట్టినాడో, అంతకు మించి ఎవరేమీ చేయలేరు’ అని అతను దృఢంగా నమ్ముతాడు.

®      ®      ®


 ఇస్లాం యొక్క మూలస్థంభాలు (Pillars of Islam)

అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు%

“ఇస్లాం ఐదు విషయాలపై ఆధారపడి ఉన్నది% వాస్తవానికి అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఇంకెవ్వరూ లేరని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యం పలకటం, నమాజు స్థాపించటం, జకాత్ (విధిదానం) చెల్లించటం, హజ్ చేయటం మరియు రమదాన్ నెల ఉపవాసాలు ఉండటం” కాబట్టి, ఇస్లాం యొక్క మూలస్థంభాలు ఐదు. అవి%

1. వాస్తవానికి ‘అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఇంకెవ్వరూ లేరని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు’ అని సాక్ష్యం పలకటం.

2.  ఐదుపూటల తప్పనిసరి నమాజులు స్థాపించటం.

3. జకాత్ (విధిదానం) ఇవ్వటం.

4. హజ్ చేయటం.

5. రమదాన్ నెల ఉపవాసాలు పాటించడం.

మొదటి మూలస్థంభం (1st Pillar) : సాక్ష్యప్రకటన

అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధ్యులు (ఆరాధింపబడే అర్హతలు గలవారు) లేరనీ మరియు నిస్సందేహంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడనీ సాక్ష్యమివ్వటం.

ఇస్లాం ధర్మం యొక్క మూలాధారం - లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇస్లాం ధర్మం మూలస్థంభాలలోని మొట్టమొదటి మూలస్థంభమిది. ఇది విశ్వాసపు (ఈమాన్) శాఖలన్నింటిలో అత్యుత్తమమైన శాఖ. అల్లాహ్ తన సందేశహరులందరికీ ఈ పవిత్ర వచనాన్నే బోధించమని పంపినాడు. వారందరిలో అంతిమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడినారు. లా ఇలాహ్ ఇల్లల్లాహ్ యొక్క సరైన అర్థము ఏమిటంటే ‘వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవ్వరూ లేరు’. దీనిలో రెండు భాగాలున్నాయి:

1. నిరాకరణం: ‘లా ఇలాహ’ – ఈ పదం ఇతర దేవుళ్ళందరినీ, ఆరాధ్యులనందరినీ తిరస్కరించమని ప్రకటిస్తున్నది.

2. స్వీకరణం: ‘ఇల్లల్లాహ్’ – ఈ పదం ‘ఎటువంటి సాటీ లేని మరియు భాగస్వామ్యమూ లేని అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకూ అర్హుడు మరియు యోగ్యుడు’ అని ప్రకటిస్తున్నది. కాబట్టి కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక ఆరాధ్యుడు. ఇంకా ప్రతి ఆరాధనా కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకింపబడినది గాని వేరొకరికి కాదు. కాబట్టి సజ్దా, ప్రార్థన, పశుబలి మరియు మొక్కుబడులు మొదలైనవన్నీ అల్లాహ్ కు కాకుండా ఇంకొకరికి అర్పించడమనేది అనుమతింపబడలేదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే ఈ పవిత్ర వచనం ప్రకారం మూడు రకాల ప్రజలు ఉన్నారు.

3. సాక్ష్యప్రకటనను పూర్తిగా అర్థం చేసుకుని, దాని షరతులను అనుసరించే జీవితం గడపటాన్ని మనస్పూర్తిగా స్వీకరించి, సంపూర్ణ విశ్వాసంతో ఈ పవిత్ర వచనాల్ని పలికేవారు – వీరే నిజమైన ముస్లింలు.

4. దీనిని సంపూర్ణంగా విశ్వసించక జీవితం గడిపేవారు – వీరే కపట ముస్లింలు.

5. దీనిని తిరస్కరించి, దీనికి వ్యతిరేకంగా మరియు విరుద్ధంగా జీవితం గడిపేవారు – వీరే సత్యతిరస్కారులు (కాఫిర్లు) మరియు బహుదైవారాధకులు (ముష్రికులు).

సాక్ష్యప్రకటన రెండవ భాగం ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్, అల్లాహ్ యొక్క దాసుడని, అంతిమ సందేశహరుడని, ఆయన ప్రపంచ ప్రజలందరి వైపునకు మరియు విశ్వాసులందరి వైపునకు సత్యసందేశంతో పంపబడినారని’ మనస్పూర్తిగా విశ్వసించమని ప్రకటిస్తున్నది. ఆయన ఆదేశాలను అనుసరించటం మనకు అనివార్యమై ఉన్నది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

وَمَا آَتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا (7)  …

 “ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి.” (సూరతుల్ హష్ర్ 59:7)

రెండవ మూలస్థంభం (2nd Pillar) : నమాజ్

ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలలో రెండవ మూలస్థంభం ‘నమాజ్’. స్పృహలో ఉన్న, యోగ్యుడైన ప్రతి ముస్లిం దీనిని తప్పని సరిగా చేయవలసి ఉన్నది. దీనిని వదిలి వేసిన వారు ఇస్లామీయ పండితుల ఏకాభిప్రాయం ప్రకారం సత్యతిరస్కారులుగా (కాఫిర్లుగా) పరిగణింపబడుదురు. తీర్పుదినాన మొట్టమొదట  నమాజు గురించే ప్రశ్నింప బడును.

కాబట్టి ప్రతి ముస్లిం ఐదు పూటల నమాజులను తప్పనిసరిగా పూర్తిచేయవలెను - పురుషులు మస్జిదులలో సామూహికంగా, మహిళలు తమ తమ ఇళ్ళలో.

ఐదు పూటలా తప్పనిసరిగా చేయవలసిన ఫర్జ్ నమాజుల రకాతులు:

ఉదయం (ఫజ్ర్): రెండు రకాతులు

దొహర్: నాలుగు రకాతులు

అసర్: నాలుగు రకాతులు

మగ్రిబ్ : మూడు రకాతులు

ఇషా: నాలుగు రకాతులు.

నమాజు పద్ధతి, దానికి ముందు పాటిచవలసిన శుచీశుభ్రతల గురించి రాబోయే అధ్యాయంలో వివరించ బోతున్నాము.

మూడవ మూలస్థంభం (3rd Pillar) : జకాత్ దానం

జకాత్ (విధిదానం) - ఇస్లాం ధర్మం యొక్క మూడవ మూలస్థంభం. ఎవరైనా ముస్లిం ఆర్థికంగా నిర్ణీత స్థాయికి చేరుకుని ఒక సంవత్సర కాలం పూర్తి చేసినట్లయితే, అతనిపై జకాత్ దానం అనివార్యమై పోతుంది. అర్హతకు చేరుకున్న ముస్లింలు జకాత్ దానం తప్పనిసరిగా ఇవ్వవలసి ఉందనే అల్లాహ్ ఆదేశాన్ని నిరాకరించితే, వారు సత్యతిరస్కారులు (కాఫిర్లు) అయిపోతారు మరియు ఇస్లాం నుండి బహిష్కరింపబడిన వారైపోతారు. 

జకాత్ దానం తప్పని సరిగా చెల్లించవలసిన సంపద:

బంగారం, వెండి, వ్యాపార సామగ్రి, పశుసంపద, భూమిలో పండే ధాన్యం, గోధుమలు, పళ్ళుఫలాలు మొదలైన పంటలు, భూమిలో లభించే గనులు, నిధినిక్షేపాలపై జకాత్ పన్ను అనివార్యమై ఉన్నది. బంగారం మరియు వెండి ఒక నిర్ణీత తూకానికి (నిసాబ్ కు) చేరుకున్న తరువాతనే వాటిపై జకాత్ తప్పనిసరి అవుతుంది. అంటే బంగారం కనీస బరువు 85 గ్రాములు మరియు వెండి కనీస బరువు 595 గ్రాములు. ఎవరి వద్దనైనా ఈ కనీస బరువున్న బంగారం గానీ లేదా వెండి గానీ లేదా ఇతర సంపదలు గానీ ఒక పూర్తి సంవత్సర కాలం పాటు నిలువ ఉన్నట్లయితే, వారు నిర్ణీత జకాత్ ధనం దానం చేయవలసి ఉంటుంది. 

అలాగే అతని వద్ద నిర్ణీత నిసాబ్ స్థాయిని దాటి, సంవత్సర కాలం పాటు క్యాష్ రూపంలో (85 గ్రాముల బంగారపు విలువ కంటే ఎక్కువ) ధనం నిలువ ఉంటే, దానిపై కూడా అతను జకాత్ తప్పనిసరిగా చెల్లించవలసి ఉన్నది. ప్రతిముస్లిం తన వద్ద నిర్ణీత మోతాదుకు చేరి, పూర్తి సంవత్సరకాలం పాటు నిలవున్న బంగారం, వెండి మరియు ధనంపై 2.5% జకాత్ చెల్లించటం తప్పని సరి.

నాలుగవ మూలస్థంభం (4th Pillar): రమదాన్ ఉపవాసాలు

ఫజర్ వేళ ప్రారంభం కాక మునుపు నుండి సూర్యాస్తమయం అయ్యే వరకు, ఆహారపానీయాల నుండి, దంపతుల రతిసంభోగం నుండి మరియు ఉపవాసాన్ని భంగపరచే ప్రతి ఒక్క చర్య నుండి దూరంగా ఉండటాన్నే ఉపవాసం అంటారు. రమదాన్ ఉపవాసాలు తప్పని సరిగా పాటించవలసియున్నది. క్రింది మూడు షరతులు వర్తించే ప్రతి ముస్లిం రమదాన్ నెల ఉపవాసాలు తప్పనిసరిగా ఉండవలసియున్నది.

రమదాన్ మాసపు ఉపవాసాలు తప్పనిసరి చేసే షరతులు:  

1. ముస్లిం అయి ఉండాలి.

2. బుద్ధిగలవాడై ఉండవలెను – మతిస్థిమితం తప్పినవాడు కాకూడదు.

3. ఆరోగ్యవంతుడై ఉండవలెను - వ్యాధిగ్రస్థుడు కాకూడదు.

4. స్థిరనివాసితుడై ఉండవలెను - ప్రయాణికుడు కారాదు.

5. ఉపవాసం ఉండగలిగే శక్తిసామర్ధ్యాలు కలిగిన వాడై ఉండవలెను.

6. ఋతుస్రావం మరియు పురుటిస్రావములలో లేని పరిశుద్ధ స్త్రీలు.

ఐదవ మూలస్థంభం (5th Pillar) : హజ్ యాత్ర.

హజ్ ఆదేశం మరియు దాని ఔన్నత్యం.

తగిన ఆర్థిక స్తోమత మరియు శక్తిసామర్థ్యాలు కలిగిన ప్రతి ముస్లిం స్త్రీపురుషులు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పని సరిగా హజ్ చేయవలెను. ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలో ఇది చివరిది. హజ్ యాత్ర అల్లాహ్ కు అతిదగ్గరగా చేర్చే ఆచరణలలోని ఒక ప్రత్యేక ఆచరణ. అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:

“ఎవరైతే హజ్ దినాలలో ఎలాంటి చెడు పనీ చేయకుండా, భార్యతో కలవకుండా హజ్ పూర్తిచేసారో, అటువంటి వారు అప్పుడే తన తల్లి నుండి జన్మించిన శిశువు మాదిరి (పాపరహితంగా) స్వచ్ఛంగా మరలుతారు.” బుఖారీ హదీథు గ్రంథం.

హజ్ షరతులు: 

క్రింది షరతుల కారణంగా మానవుడిపై హజ్ తప్పనిసరి అవుతుంది.

1. ఇస్లాం

2. యుక్తవయస్సు

3. మతిస్థిమితం కలిగి ఉండవలెను.

4. తగిన శక్తిసామర్థ్యాలు మరియు హజ్ ప్రయాణ ఖర్చులు భరించే శక్తి కలిగి ఉండవలెను. అంతేకాక తనపై ఆధారపడిన వారి ఖర్చులు హజ్ ప్రయాణానికి ముందుగానే వారికి ఇవ్వగలిగే స్థితిలో ఉండవలెను. శక్తిసామర్థ్యాల విషయంలో ప్రయాణమార్గం శాంతియుతంగా ఉండటం మరియు ఆరోగ్యం కూడా ఉన్నాయి. కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి హజ్ యాత్ర చేయకూడదు. అలాగే తనతో మహ్రమ్ (భర్త లేదా పెళ్ళికి శాశ్వతంగా నిషేధింపబడిన వ్యక్తి) తోడుగా లేని స్త్రీ కూడా హజ్ యాత్రలో పాల్గొనకూడదు.

®      ®      ®



నమాజ్

నమాజు ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలోని ఒక మూలస్థంభం. ప్రతిరోజూ ఐదు పూటలా తప్పనిసరిగా నమాజు చేయాలని అల్లాహ్ ఆదేశించినాడు. శుచీశుభ్రతలు అంటే తహారత్ లేకుండా అపరిశుద్ధస్థితిలో చేసే నమాజు స్వీకరించబడదు. కాబట్టి పరిశుద్ధమయ్యే పద్ధతిని ముందుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం.

తహారత్ (శుచీశుభ్రత, కాలకృత్యాల)  యొక్క నిర్వచనం:

అన్నిరకాల మలినాల నుండి, అపవిత్రమైన మరియు అపరిశుద్ధమైన విషయాల నుండి పవిత్రత, పరిశుద్ధత పొందటాన్నే తహారత్ అంటారు. ఇది ముస్లింలకు అనివార్యమై ఉన్నది.

మలినాల మరియు అపరిశుద్ధమైన వాటి రకాలు:

నజాసాత్ అనేది నజాసత్ (మలినం) యొక్క బహువచనం. మానవుడి మర్మాంగాల నుండి బయటకు వచ్చే ప్రతిదీ ‘మలినం’ అనబడును. మలవిసర్జన, మూత్రం, వీర్యస్ఖలనం, భావోద్రేక ద్రవం మొదలైనవి. అలాగే కొన్ని పశువుల మూత్రం, పేడ, పెంట, డెక్క మొదలైనవి వేటి మాంసమైతే తినరాదని నిషేదింపబడినదో. అధిక మోతాదులో రక్తం, చీము, రంగు మారిన వాంతి, మృతకళేబరాలు మరియు వాటి మొత్తం అంగాలు అపరిశుద్ధమైనవే. అయితే ఉప్పు మరియు నీటితో శుభ్రపరచి, ఉడకబెట్టిన పశుచర్మం పరిశుద్ధమైనది.    

పవిత్రత, పరిశుద్ధత పొందే విధానం:

రెండింటి ద్వారా పవిత్రత పొందగలము.

1. నీటి ద్వారా – ఉదాహరణకు వర్షపు నీరు, సముద్రపు నీరు. అలాగే ఈ క్రింది వాటితో కూడా పవిత్రత పొందగలము

a) వాడబడిన నీరు – ఉదాహరణకు స్నానం లేదా వుదూ చేసేటప్పుడు శరీరం నుండి జారి పడిన నీరు.

b) ఏదైనా పరిశుద్ధ పదార్థం/ద్రవం కలిసినా గానీ యధాస్థితిలోనే మిగిలి ఉన్న నీరు.

c) మలినాలు కలిసినా గాని, తన మూడు విశేషగుణాలైన రంగు, రుచి మరియు వాసనలలో ఏదీ మార్పుచెందని నీరు. ఒకవేళ దాని ఏ ఒక్క గుణం మార్పుచెందినా, ఆ నీటి ద్వారా శుభ్రపరచుకోవటం అనుమతింపబడలేదు.

2.      పరిశుభ్రమైన మట్టి ద్వారా – ఇది పవిత్రమైన భూమి పైభాగపు మట్టి, ధూళి, ఇసుక, రాయి లేదా బురద. నీరు లభించని పక్షంలో లేదా అనారోగ్యం కారణంగా నీరు వాడలేని పక్షంలో మాత్రమే పరిశుద్ధమైన మట్టితో పవిత్రత పొందవలెను. 

మలమూత్ర విసర్జనా విధానం:

మలమూత్ర విసర్జనలో పాటించవలసిన కొన్ని నియమాలు:

1. బాత్రూమ్ (మరుగుదొడ్డి)లో ప్రవేశించక ముందు ఈ ప్రార్థన (దుఆ) చేయవలెను:

“బిస్మిల్లాహి, అల్హాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ ఖుబుతి వల్ ఖబాయితి.”

“అల్లాహ్ పేరుతో....... ఓ అల్లాహ్! దుష్టులైన మగజిన్నుల మరియు ఆడజిన్నాతుల నుండి నీ శరణు వేడుకుంటున్నాను”

బాత్రూమ్ లో ముందుగా ఎడమకాలు లోపలకు పెట్టి ప్రవేశించాలి.

2. బాత్రూమ్ (మరుగుదొడ్డి) లో నుండి బయటకు వచ్చిన తరువాత ఈ ప్రార్థన (దుఆ) పఠించవలెను:

“గుఫ్రానక్” - “ఓ అల్లాహ్!  నీ క్షమాపణ వేడుకుంటున్నాను”

బాత్రూమ్ లో నుండి ముందుగా కుడికాలు బయటకు పెట్టి రావాలి.

3. అల్లాహ్ పేరు వ్రాసి ఉన్న వస్తువులను తమ వెంట బాత్రూమ్ లోనికి తీసుకువెళ్ళకూడదు. కానీ, వాటిని బయట పెట్టటం వలన కోల్పోయే ప్రమాదం ఉంటే, వాటిని వెంట తీసుకుపోవచ్చును. 

4. బాత్రూమ్ లో ఖిబ్లాకు అభిముఖంగా లేదా వ్యతిరేక దిశలో కూర్చుని మలమూత్ర విసర్జన చేయకూడదు.

5. ఇతరులకు కనబడకుండా మర్మాంగాలను దాచి ఉంచవలెను. దీనిలో ఎలాంటి అశ్రద్ధా చేయకూడదు. పురుషులు దాచవలసిన కనీస శరీరభాగం - బొడ్డు క్రింది నుండి మోకళ్ళ క్రింద వరకు. అయితే స్త్రీలు తమ మొత్తం శరీరభాగాన్నే దాచవలసి ఉన్నది.

6. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు, తమ బట్టలపై పడకుండా జాగ్రత్త వహించవలెను.

7. మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవలెను. ఒకవేళ నీరు లభించకపోతే, టిష్యూ పేపరుతో గానీ లేదా శుభ్రమైన మట్టితో గానీ మలినాల ప్రభావం పూర్తిగా తొలిగిపోయేటట్లు బాగా శుభ్రపరచుకోవలెను.

8. ఒకవేళ ఎవరైనా టిష్యూ పేపరు మరియు నీటినీ వాడదలిచితే, ముందుగా టిష్యూ పేపరుతో శుభ్రపరచుకుని, తరువాత నీటిని వాడవలెను. ఇది అన్నింటి కన్నా ఉత్తమమైన పద్ధతి.

9. శుభ్రపరచుకోవటానికి ఎడమ చేతినే ఉపయోగించవలెను మరియు మర్మాంగాలు రెండింటినీ శుభ్రపరచుకోవలెను.

వుదూ లేకుండా ఈ క్రింద తెలుపబడిన ఆరాధనలలో పాల్గొనరాదు.

1. ఫర్జ్ (తప్పని సరి) మరియు నఫిల్ (ఐచ్ఛిక) నమాజులు.

2. ఖుర్ఆన్ ను ముట్టుకోవటం.

3. కాబా గృహం యొక్క తవాఫ్ (ప్రదక్షిణ).

రంగు, రుచి మరియు వాసన మార్పు చెందని ఏ నీటినైనా సరే వుదూ చేయటానికి ఉపయోగించ వచ్చును.

వుదూ చేసే పద్ధతి:

·    మనస్సులో సంకల్పం చేసుకుని, బిస్మిల్లాహ్ అని మనస్సులోనే పలుక వలెను.

·    రెండు చేతులు మణికట్టు వరకూ మూడు సార్లు కడుగవలెను.

·    మూడు సార్లు పుక్కిలించవలెను.

·    మూడు సార్లు ముక్కులో నీరు పట్టి శుభ్రపరచుకోవలెను.

·    మూడు సార్లు ముఖం కడుక్కోవలెను.

·    కుడి చేతిని మోచేతి వరకు మూడు సార్లు కడుగవలెను.

·    ఎడమ చేతిని మోచేతి వరకు మూడు సార్లు కడుగవలెను.

·    మొత్తం తలపై - ముందు నుండి వెనుక వరకు మరియు వెనుక నుండి ముందు వరకు తడిచేతులతో తుడుచుకోవలెను (మసహ్).

·    రెండు చేతుల వ్రేళ్ళను రెండు చెవుల లోపలా మరియు బయటా త్రిప్పి శుభ్రపరచుకోవలెను. అలా చేసేటప్పుడు రెండు చేతులు మరల తడి చేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే రెండు చెవులూ తలకు చెందిన భాగాలే గనుక!

·     కుడికాలును చీలమండ వరకు మూడుసార్లు కడుగవలెను. కాలివ్రేళ్ళ మధ్యలో ఎడమ చేతి వ్రేళ్ళు జొప్పించి బాగా శుభ్రపరచు కోవలెను.

·    అలాగే ఎడమకాలును కూడా చీలమండ వరకు మూడుసార్లు కడుగవలెను. కాలివ్రేళ్ళ మధ్యలో ఎడమచేతి వ్రేళ్ళు జొప్పించి బాగా శుభ్రపరచుకోవలెను.

వుదూ పవిత్ర స్థితి భంగమయ్యే విషయాలు:

ఈ క్రింది విషయాల వలన వుదూ పవిత్ర స్థితి రద్దు అయిపోతుంది.

1. ముందు - వెనుక మర్మాంగాల నుండి బయటకు వచ్చేవి.

2. గాఢనిద్ర.

3. మతిస్థిమితం తప్పటం వలన లేదా మత్తుపదార్థాలు సేవించటం వలన స్పృహ కోల్పోవటం.

4. వస్త్రం పై నుండి కాక, చేతితో తిన్నగా ఎలాంటి ఆచ్ఛాదనా అడ్డు లేకుండా మర్మాంగాలను టచ్ చేయటం - స్పర్శించటం.

తయమ్ముమ్ (మట్టి ద్వారా పరిశుభ్రమయ్యే విధానం):

నీరు లభించని కారణంగా లేదా అనారోగ్యం కారణంగా నీరు వాడలేక వుదూ చేయలేని పరిస్థితులలో తయమ్ముమ్ అనే పద్ధతి ద్వారా పరిశుద్ధులు కావటానికి అల్లాహ్ అనుమతించినాడు. కాబట్టి ఇది వుదూకు బదులు వంటిది. అలాగే ఎవరైనా వ్యక్తి భార్యతో దాంపత్యసుఖం అనుభవించిన కారణంగా అపవిత్రుడైతే, అతను తప్పకుండా గుసుల్ అంటే పూర్తి స్నానం చేయవలెను. ఇంకా బహిష్టు (హైజ్) లేదా పురుటి (నిఫాస్) రక్తస్రావం ఆగిపోయిన స్త్రీలు కూడా తప్పనిసరిగా గుసుల్ అంటే పూర్తిస్నానం చేయవలెను. అలాంటి అపరిశుద్ధులు పైన తెలిపిన కారణాల వలన తయమ్ముమ్ ద్వారా కూడా పరిశుద్ధులు కావచ్చు.

తయమ్ముమ్ చేసే విధానం:

·      పైకి ఉచ్ఛరించకుండా, మనసులోనే తయమ్ముమ్ కొరకు సంకల్పం చేసుకోవలెను.

·      తరువాత బిస్మిల్లాహ్ అని మనస్సులోనే పలుకవలెను.

·      రెండు హస్తాలనూ పరిశుద్ధమైన మట్టిపై కొట్టవలెను. ఆ రెండు హస్తాలపై నోటితో ఊదవలెను.

·      ఆ రెండు హస్తాలతో తమ ముఖాన్ని ఒకసారి తుడవ వలెను.

·      తమ రెండు చేతులను మణికట్టు వరకు ఒకసారి తుడవ వలెను.

ఏ యే పరిస్థితులలో తయమ్మమ్ చేయటానికి అనుమతి ఉన్నది:

1. నీరు లభించని పక్షంలో

2. గాయమైనప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు – ఒకవేళ నీరు తగలటం వలన రోగం ముదిరి పోతుందని లేదా రోగం తగ్గటంలో ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఎదురైతే.  

3. నీరు మరీ చల్లగా ఉంటే, దానిని వేడి చేయటానికి ఎలాంటి సౌకర్యం లేక, దానిని వాడటం వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటే.

4. అతి తక్కువ మోతాదులో అంటే కేవలం వంటచేయటానికి మరియు త్రాగటానికి మాత్రమే సరిపోయేటంతటి నీరు ఉన్నప్పుడు.

ఐదు పూటల నమాజులు మరియు వాటి రకాతుల సంఖ్య:

ముస్లింలు ప్రతిరోజు నిర్ణీత కాలంలో, వాటి సమయం దాటక ముందే, ఐదు పూటలా తప్పని సరిగా నమాజు చేయవలెను. ఐదు పూటల తప్పనిసరి నమాజులలోని రకాతుల సంఖ్య ఇలా ఉన్నది:

ఫజ్ర్ – రెండు రకాతులు          దొహర్ – నాలుగు రకాతులు

అస్ర్ – నాలుగు రకాతులు       మగ్రిబ్ – మూడు రకాతులు

ఇషా – నాలుగు రకాతులు

నమాజు విధానం:

—  నేను నమాజు కొరకు మనస్సులోనే సంకల్పం చేసుకుంటాను.

— నేను నా దేహాన్ని అంటే ముఖాన్నీ మరియు రెండు కాళ్ళనూ ఖిబ్లాదిశ వైపునకు మరల్చుతాను.

— నేను నా రెండు చేతులను రెండు చెవులకు సమానంగా పైకెత్తి, “అల్లాహ్ అక్బర్” అంటాను. 

—  నా కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచి ఛాతీ పైన కట్టుకుంటాను.

— సూరహ్ ఫాతిహా పఠిస్తాను మరియు ఖుర్ఆన్ లో సరళమైన కొన్ని ఆయతులను లేదా ఒక అధ్యాయాన్ని అరబీ భాషలో పఠిస్తాను.

—  తరువాత రుకూలోనికి పోతూ ‘అల్లాహు అక్బర్’ అంటాను. రుకూలో మూడుసార్లు ‘సుబహాన రబ్బియల్ అజీమ్’ అని అంటాను. రుకూ అంటే నా తల మరియు నా వీపు సరిసమానంగా ఉండేటట్లు, రెండు మోకాళ్ళ చిప్పలను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ముందుకు వంగటం.

—  ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అని అంటూ, రెండు చేతులను రెండు చెవుల వరకూ లేపి, రుకూ నుండి పైకి లేస్తాను. నిటారుగా నిలుచున్న తరువాత, ‘రబ్బనావలకల్ హమ్ద్’ అని పలుకుతాను.

— సజ్దాలోనికి వెళుతూ ‘అల్లాహు అక్బర్’ అని అంటాను. సజ్దా అంటే శరీరాన్ని ఏడు అవయవాలపై ఉంచటం అన్నమాట. ఆ ఏడు అవయవాలు – ముక్కుతో పాటు నుదురు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు పాదాల వ్రేళ్ళు. సజ్దాలో మూడు సార్లు లేక అంతకంటే ఎక్కువ సార్లు ‘సుబహాన రబ్బియల్ ఆలా’ అని పలికి, ఇహపరలోకాల శుభాల కొరకు దుఆ చేసుకుంటాను.

— తరువాత ‘అల్లాహు అక్బర్’ అని పలుకుతూ, నా ఎడమ పాదాన్ని వాల్చి, దానిపై కూర్చుంటాను. కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, దాని వ్రేళ్ళను ఖిబ్లావైపు ఉండేటట్లుగా వంచుతాను. అయితే ఇక్కడ ‘అల్లాహ్ అక్బర్’ అనే ‘తక్బీర్’ పలికేటప్పుడు రెండు చేతులను రెండు చెవుల వరకు కూడదు. 

— తరువాత ‘అల్లాహు అక్బర్’ అని పలుకుతూ రెండవ సారి సజ్దాలోనికి వెళతాను మరియు సజ్దాలో ‘సుబహాన రబ్బియల్ ఆలా’ అని పలుకుతాను.

— 2వ రకాతు కొరకు ‘అల్లాహు అక్బర్’ అని పలుకుతూ లేచి నిలుచుంటాను. ముందు రకాతులో చదివినట్లుగానే ఈ రెండో రకాతులో కూడా చదువుతాను.

— 2వ రకాతు పూర్తి చేసిన తరువాత తషహ్హుద్ (2వ లేక 4వ రకాతు చివరిలో కూర్చోవటం) కొరకు కూర్చుంటాను. ఫజ్ర్ లో చేసే రెండు రకాతుల వంటి నమాజు చేస్తున్నట్లయితే, ఇదే అంతిమ తషహ్హుద్ అవుతుంది. అయితే మగ్రిబ్ లో చేసే మూడు రకాతుల నమాజులో నేను తషహ్హుద్ నుండి లేచి మరల ఇంకో రకాతును పూర్తి చేసి, చివరిగా అంతిమ తషహ్హుద్ కొరకు కూర్చుంటాను. ఇలా మూడు రకాతుల నమాజులో రెండు సార్లు (2వ మరియు చివరి మూడో రకాతులలో) తషహ్హుద్ కొరకు కూర్చుంటాను.

— తషహ్హుద్ దుఆలు పూర్తైన తర్వాత, కుడివైపు తిరిగి ‘అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్’ అని పలుకుతూ సలాం చేయవలెను.

— మరల ఎడమవైపు తిరిగి ‘అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్’ అని పలుకుతూ సలాం చేయవలెను.

తషహ్హుద్ లో పఠించే ప్రార్థన (దుఆ):

అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు, వరహ్మతుల్లాహి వబరకాతహూ, అస్సలాము అలైనా, వఆలాఇబాదిల్లాహిశ్శాలిహీన్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ (ప్రార్థనలు) పంపటం:

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ ఆలా ఆలి ముహమ్మద్, కమా సల్లైతా అలా ఇబ్రాహీమ వ ఆలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ ఆలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ ఆలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.  

 జుమా నమాజు

జుమా నమాజు యొక్క ఆదేశం:

పురుషులు జుమాలో పాల్గొనటం తప్పనిసరి. ఇది 2 రకాతుల నమాజు.

జుమా నమాజులో పాల్గొనటాన్ని అనివార్యం చేసే షరతులు:

జుమా నమాజు రెండు రకాతులు, శుక్రవారం రోజున దొహర్ నమాజు స్థానంలో చేయాలి. పురుషుడు, యుక్తవయస్కుడు, ఆరోగ్యవంతుడు మరియు ప్రయాణంలో లేని ముస్లింలపై ఇది అనివార్యమై ఉన్నది. స్త్రీలకు, పిల్లలకు, రోగస్థులకు మరియు ప్రయాణికులకు జుమా నమాజు తప్పనిసరి కాదు. ఇది మస్జిదులోనే జరుగును. దీనిలో జుమా నమాజు కంటే ముందు రెండు ప్రసంగాలు ఉండును. రెండింటి మధ్య ఉపన్యాసకుడు కొంచెం సేపు కూర్చోవలెను.

ఉభయ పండుగల నమాజు (ఈదుల్ ఫితర్ & ఈదుల్ అద్హా):

ఇక్కడ ఉభయ పండుగలంటే ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా పండుగలు. రమదాన్ నెల తరువాత వచ్చే షవ్వాల్ నెల మొదటి తేదీన ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుగును. ఇది ఉల్లాసంగా గడుపవలసిన రోజు.ఎందుకంటే పవిత్ర రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండటానికి, రాత్రి వేళల్లో మేల్కొని ప్రత్యేక నమాజులు చేయటానికి అవసరమైన దృఢసంకల్పాన్నీ, తగిన శక్తిసామర్థ్యాలనూ ప్రసాదించి, అల్లాహ్ తన దాసులపై విశేషానుగ్రహాలు చూపినాడు. ఈదుల్ అద్హా అరబీ క్యాలెండరులోని చివరి నెలైన ‘దిల్ హజ్’ 10వ తేదీన జరుగును. ఆనాడు ముస్లింలు అల్లాహ్ కు ఖుర్బానీ పశువుల బలిదానం  సమర్పించుకుంటారు.

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చినపుడు, అక్కడి ప్రజలు సంవత్సరంలో రెండు దినాలను ఆటపాటలతో గడిపే పండుగ దినాలుగా జరుపునే వారు. అది చూసి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఈ రెండు దినాల కంటే శ్రేష్ఠమైన దినాలను (ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా) అల్లాహ్ ప్రసాదించినాడు.

ఉభయ పండుగల నమాజు ఆదేశం మరియు వాటి విధానం:

ఉభయ పండుగల నమాజు సున్నతె మొఅక్కదహ్ (అంటే తప్పక ఆచరించటానికి ప్రయత్నించవలసిన సున్నత్) స్థాయికి చెందినది. వీటిని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ ఆచరించేవారు. స్త్రీలను మరియు పిల్లలను కూడా వెంట తీసుకు వెళ్ళేవారు. సూర్యుడు ఉదయించి ఒక జానెడు పైకి వచ్చిన సమయం నుండి మిట్టమధ్యాహ్నం వరకు పండుగ నమాజు చేయవచ్చును. ఇందులో రెండు రకాతులు ఉంటాయి. అజాన్ మరియు అఖామత్ ఉండదు. తక్బీరె ఇహ్రామ్ (మొదటిసారి అల్లాహ్ అక్బర్ పలకటం) తరువాత మరియు ముందు ఇమాం ఏడు సార్లు తక్బీర్ (అల్లాహ్ అక్బర్) పలికి, ఆ తరువాత సూరతుల్ ఫాతిహా పఠించటం ప్రారంభించ వలెను. వెనుక నమాజు చదివే వారూ ఇమాంను అనుసరిస్తూ, తక్బీర్ లు పలుకవలెను. రెండవ రకాతు కొరకు నిలబిన తరువాత, సూరతుల్ ఫాతిహా పఠించటం ప్రారంభించక ముందు ఐదు సార్లు తక్బీర్ పలుకవలెను. నమాజు చదివించిన తరువాత ఇమాం ప్రజల ముందు నిలబడి, మొదటి ఖుత్బా ఇవ్వవలెను. మధ్యలో కొన్ని క్షణాల పాటు కూర్చొని, రెండవ ఖుత్బా ఇవ్వవలెను. ఆ తరువాత ఇంటికి మరలి పోవలెను. ప్రజలు కూడా తమ తమ ఇళ్ళకు మరలిపోవలెను. పండుగ నమాజులు మైదానంలో జరుగును. వర్షం ఉన్నప్పుడు మస్జిదులో చదువుకోవటానికి అనుమతి ఉన్నది. ఎవరైనా పండుగ నమాజు జమాతులో కలవలేకపోతే, వేరుగా చదువు కోవలెను.

®      ®      ®

مختصر سيرة الرسول (ص)

 రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం  జీవిత పరిచయం - సంక్షిప్తంగా



లుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం

జీవిత పరిచయం - సంక్షిప్తంగా

ఇస్లాం ధర్మానికి పూర్వం అరబ్ దేశ ప్రజలు విగ్రహాలను పూజించేవారు. వాటిలో ప్రఖ్యాతి చెందినవి – లాత్, ఉజ్జా, హుబల్ మరియు మనాత్ విగ్రహాలు. అరబ్ ప్రజలలో కొందరు యూదులు మరియు కొందరు క్రైస్తవులు కూడా ఉండేవారు. మరికొందరు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరించేవారూ ఉండేవారు. ఇస్లాం ధర్మానికి పూర్వం అరబ్ ప్రజలు అజ్ఞానంలో, దౌర్జన్యంలో మరియు గాఢాంధకారంలో మునిగి ఉండటమే వారి ఈ మార్గభ్రష్టత్వానికి ముఖ్యకారణం. అక్కడ బలవంతుడు బలహీనుడిపై అత్యాచారం జరిపేవాడు, ధనవంతుడు పేదల మరియు అన్నార్తుల హక్కులను బలవంతంగా గుంజుకునేవాడు, మహిళలను వారు దాసీలను చూసినట్లు చూచేవారు. అలాంటి క్లిష్టసమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ జన్మించినారు.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశం మరియు జననం:

ఆయన పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. ఆయన తల్లి పేరు ఆమినా బిన్తె వహబ్ బిన్ అబ్ద్ మనాఫ్. ఆయన వంశం సుప్రసిద్ధ ఖురైష్ తెగకు చెందిన బను హాషిం వంశం. ఆయన రబ్బీఉల్ అవ్వల్ 9వ తేదీ, సోమవారం నాడు జన్మించినారు. అది క్రీ.శ. 571 వ సంత్సరం. ఆయన అనాధగా జన్మించినారు, ఎందుకంటే తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయినారు.

ఆయనకు పాలు త్రాపించిన స్త్రీలు:

మొట్టమొదట ఆయనకు పాలు త్రాపించినది ఆయన స్వంత తల్లి అయిన ఆమినాయే. తరువాత అబూ లహబ్ దాసి సువైబా పాలు త్రాపించినది. ఆయన పుట్టిన సంతోషంలో అబూ లహబ్ ఆవిడను దాస్యం నుండి విముక్తి చేసి, స్వేచ్ఛను ప్రసాదించినాడు. ఆ తరువాత ఆయనకు పాలు త్రాపించిన మూడో స్త్రీ హలీమా సాదియా. అరబ్బుల ఆచారాన్ని అనుసరించి, పల్లెల్లో పెంచటం కొరకు ఆవిడ తనతోపాటు ఆయనను తీసుకుని వెళ్ళినది. ఆయన వలన వారి ఇంట్లో అనేక శుభాలు కలిగినవి. ఆయన వయస్సు రెండేళ్ళకు చేరగానే, హలీమా ఆయన తన పాలు త్రాగటాన్ని మాన్పించినది. అయినా ఆయన తల్లి ఆమినా అనుమతితో మక్కా నగరంలోని వ్యాధుల నుండి కాపాడే సాకుతో ఆయనను తన వద్దనే ఉంచుకున్నది. కానీ, అలా ఉంచు కోవటానికి అసలు కారణం ఏమిటంటే ఆయన వలన తమ ఇంట్లో శుభాలు కలగుతున్నందుకు గాను, ఆయనను వీలయినన్ని ఎక్కువ దినాలు తమతోనే ఉంచుకోవాలని నిశ్చయించుకోవటం. తల్లి ఆమినా కూడా అంగీకరించటంతో, నాలుగు సంవత్సరాల వయస్సు వరకు ఆయన హలీమా వద్దనే ఉండిపోయినారు.

ఆయన తల్లి మరణం: ఒకసారి తన బంధువులను చూసి రావాలనే కోరిక ఆయన తల్లికి కలుగగా, తన కుమారుడిని తీసుకుని ఆవిడ మదీనా పట్టణానికి బయలు దేరినది. అక్కడ కొన్నాళ్ళు ఉండి మక్కాకు తిరుగు ప్రయాణం కట్టినది. అయితే దారిలో ఆవిడ అనారోగ్యం పాలైనది. అది మరింత ఎక్కువై, మక్కా చేరకుండానే ఆవిడ ప్రాణాన్ని కబళించి వేసినది. మక్కా మరియు మదీనాకు మధ్యనున్న ‘అబవా’ అనే ప్రాంతంలో ఆవిడ సమాధి చేయబడినది. అప్పుడు ఆయన వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే.

ప్రవక్త గా ఎన్నుకోబడిన శుభసందేశం:

అల్లాహ్ తన ప్రవక్తను విగ్రహారాధన నుండి సురక్షితంగా ఉంచటం వలన ఆయన ఖురైషుల పూజా, ప్రార్థనలలో ఏనాడూ పాల్గొనలేదు. అంతేకాక అక్కడి యువకుల ఆటపాటలలో, చెడు పనులలో కూడా ఏనాడూ పాలుపంచుకోలేదు. అక్కడి యువకులు మద్యం సేవించడంలో మరియు దౌర్జన్యంలో ఒకరికొకరు పోటీ పడేవారు. ఆ సమాజం తప్పు దారి పట్టడం మరియు దురలవాట్లకు లోనవడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్తిగా తెలిసి ఉండటం వలన ఆయన ఖురైషులకు దూరంగా ఉండేవారు. తరచుగా హిరా కొండపై ఉన్న ఒక గుహలో ఏకాంతవాసంలో గడుపుతూ, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పద్ధతిలో ఏకదైవారాధనలు చేసేవారు. 40 సంవత్సరాల వయస్సుకు చేరుకోగానే, తను ప్రవక్త పదవి కొరకు ఎన్నుకోబడిన చిహ్నాలు మరియు శుభసందేశాలు ఆయనకు స్పష్టం కాసాగాయి. ఉదాహరణకు ఆయనకు ఏదైనా కల వస్తే అది పూర్తిగా నిజమయ్యేది. అలాగే ఆయన ఏదైనా అవసరం నిమిత్తం ఎక్కడికైనా బయలు దేరితే, దారిలోని రాళ్ళు, చెట్లు ‘అస్సలాము అలైకుమ్ యా రసూలుల్లాహ్’ అని ఆయనను సంబోధించేవి. తనను సంబోధించిన వారెవరా అని కుడిఎడమల వైపు దృష్టిసారిస్తే, అక్కడ కేవలం రాళ్ళు మరియు చెట్లు తప్ప ఆయనకు ఇంకెవ్వరూ కనబడే వారు కాదు.

వహీ (అల్లాహ్ సందేశం) అవతరణ:

హీరా గుహలో, రమదాన్ మాసంలో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏకాగ్రతగా ధ్యానం చేస్తుండగా, అల్లాహ్ యొక్క దైవదూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయన వద్దకు వహీ (అల్లాహ్ సందేశాన్ని) తీసుకు వచ్చినారు. అప్పుడు ఆయన పై అవతరించిన మొట్టమొదటి ఖుర్ఆన్ ఆయతు (వచనం) ఇదే:

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ (1) خَلَقَ الإِنْسَانَ مِنْ عَلَقٍ (2) اقْرَأْ وَرَبُّكَ الأَكْرَمُ (3) الَّذِي عَلَّمَ بِالقَلَمِ (4) عَلَّمَ الإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ (5)

“పఠించు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు. ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో సృష్టించాడు. పఠించు! నీ ప్రభువు పరమదాత” ఖుర్ఆన్ 96:1-5

ఆ తరువాత కొంత కాలం వరకు వహీ ఆగిపోయినది. కొన్నాళ్ళకు మరల జిబ్రాయీల్ అలైహిస్సలాం సూరహ్ ముదస్సిర్ (ఖుర్ఆన్ లోని 74వ అధ్యాయం) తీసుకుని వచ్చినారు. దానిలో ప్రజలను భయపెట్టమని మరియు తన సందేశాన్ని వారికి అందజేయమని అల్లాహ్ ఆయనను ఆదేశించినాడు. (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం)

يَاأَيُّهَا المُدَّثِّرُ (1) قُمْ فَأَنْذِرْ (2) وَرَبَّكَ فَكَبِّرْ (3)

 “ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా! లే, ఇక హెచ్చరించు! నీ ప్రభువు ఘనతను కొనియాడు.” (ముదిస్సర్ 74 : 1-3)

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఖురైష్ వంశం మరియు అక్కడి ప్రజలు విగ్రహారాధనను దృఢంగా విశ్వసించేవారు. విగ్రహారాధన వదిలివేయమని చెప్పే వారితో ఆ ప్రజలు భయంకరంగా పోరాడేవారు మరియు దాని కారణంగా వారు హత్య చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అందువలననే ధర్మ ప్రచార ఆరంభంలో రహస్యంగా ప్రజలకు తన సందేశాన్ని అందజేయమని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదేశించినాడు. తన వారిలో ఎవరిపైనయితే తనకు నమ్మకం ఉన్నదో, వారినే ఆయన ఇస్లాం వైపునకు ఆహ్వానించినారు. తన మిత్రులు మరియు పరిచయస్థులలో ఉత్తమ స్వభావం గలవారి ముందు ఆయన అల్లాహ్ యొక్క సందేశాన్ని ఉంచినారు. దీని ఫలితంగా కొందరు ప్రజలు ఆయనను ప్రవక్తగా విశ్వసించినారు. మహిళలలో మొట్టమొదటిగా ఆయన భార్య ఖతీజా రదియల్లాహు అన్హా ఆయన సందేశంపై విశ్వాసాన్ని ప్రకటించగా, స్వతంత్ర పురుషులలో మొట్టమొదటిగా ఆయనపై విశ్వాసాన్ని ప్రకటించినది - అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు. యువకులలో మొట్టమొదటిగా అలీ రదియల్లాహు అన్హు మరియు దాసులలో మొట్టమొదటిగా జైద్ బిన్ హారిస్ రదియల్లాహు అన్హు ఆయన సందేశం పై విశ్వాసం ప్రకటించినారు. దాదాపు మూడు సంవత్సరాల వరకు ఇస్లామీయ ధర్మప్రచారం ఇలా రహస్యంగానే సాగినది.

బహిరంగంగా ఇస్లామీయ ధర్మప్రచారం:

ఇస్లామీయ ధర్మప్రచారం గుప్తంగా మరియు చాలా స్పష్టంగా సత్యధర్మం వైపు పిలవమని అల్లాహ్ ఆయనను ఆదేశించినాడు. దాని ఆరంభం ఆయన దగ్గరి  బంధువులతో ప్రారంభమైనది. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు  -

 وَأَنْذِرْ عَشِيرَتَكَ الأَقْرَبِينَ (214)

 “మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు” ఖుర్ఆన్ 26:214

అప్పుడు ఆయన తన దగ్గరి బంధువులైన బనీ హాషిమ్ మరియు బనీ ముత్తలిబ్ తెగల ప్రజల ముందు ఇస్లాం సందేశాన్ని ఉంచినారు. కొన్నాళ్ళ తరువాత ఇస్లాం సందేశాన్ని ప్రజలందరికీ బహిరంగంగా అందజేయమని మరియు వారిని తన వైపు ఆహ్వానించమని అల్లాహ్ ఆయనను ఆదేశించినాడు. దీని గురించి ఈ క్రింది ఖుర్ఆన్ వచనం అవతరించినది –

فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ المُشْرِكِينَ (94)

 “కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా ప్రకటించు మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారిని ఖాతరు చేయకు” ఖుర్ఆన్ 15:94

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు ఆజ్ఞను యథాతథంగా శిరసావహించి, ప్రజల మధ్య వెళ్ళి మరియు వారి సభలలో వెళ్ళి సత్యతిరస్కారులను స్పష్టంగా ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించేవారు. వారి ముందు ఖుర్ఆన్ వచనాలు పఠించేవారు. వారి ఎదురుగా అల్లాహ్ ను ఆరాధించేవారు. దీని ఫలితంగా ప్రజలు ఒకరి తరువాత ఒకరుగా అల్లాహ్ యొక్క ధర్మంలో ప్రవేశించటం మొదలు పెట్టినారు.

సత్యతిరస్కారులు ఇస్లాం ధర్మాన్ని విరోధించటం:

ఆయన బహిరంగంగా తమను ఇస్లాం ధర్మం వైపు పిలవటం చూసి, ఖురైషులు ఆయనకు బద్ధవిరోధులుగా మారిపోయినారు. దీని కారణంగా వారు ఆయనను ఎగతాళి చేయడం, ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపటం మొదలు పెట్టినారు. దీని ద్వారా నవముస్లింలు ఆయనను వదిలి, తమ వద్దకు తిరిగి వచ్చేస్తారని వారు భావించారు. ఆయన మంత్రగాడని, మతిస్థిమితం తప్పిన వాడని వారు పుకార్లు లేపినారు. ఇంకా నిస్సందేహంగా షైతానులే ఖుర్ఆన్ ఆయతులను ఆయనకు తెలియజేస్తున్నారని అనేవారు.  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా ఇస్లాం గురించి ఉపదేశిస్తుంటే, ఆయన బోధనలు ప్రజల చెవిన పడకుండా నిరోధించటానికి తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. అందుకు గాను వారు ఆయన దగ్గరకు వచ్చి, బిగ్గరగా అరిచేవారు మరియు గందరగోళం చేసేవారు.

తమ ప్రయత్నాలకు ఎలాంటి ఫలితమూ లభించకపోవటం మరియు ముస్లింల సంఖ్య రోజురోజుకూ పెరగటం గమనించిన, సత్యతిరస్కారులు అబలలు మరియు బలహీనులపై అత్యాచారం చేయటం మొదలు పెట్టినారు. మానవమాత్రులెవరూ సహించలేనంత తీవ్రంగా నవముస్లింలను బాధించేవారు. వెంట్రుకలు నిక్క పొడిచి నిలుచునేటంత మరియు మనస్సు కంపించేటంత తీవ్రంగా వారిని హింసించేవారు. దానికి ఒక ఉదాహరణ –బిలాల్ రదియల్లాహు అన్హు. ఆయన ఉమయ్యా బిన్ ఖలఫ్ యొక్క బానిస మరియు ఆరంభంలోనే ఇస్లాం స్వీకరించినారు. అది తెలియగానే ఆయన యజమాని ఆయనను అత్యంత కఠినంగా శిక్షించటం మొదలు పెట్టినాడు. ఆయన మెడలో త్రాడు కట్టి, ఆయనను చిన్న పిల్లలకు అప్పజెప్పేవాడు. ఆ అల్లరి మూకలు ఆయనతో ఇష్టమొచ్చినట్లు ఆడుకునేవి. అయినా బిలాల్ రదియల్లాహు అన్హు ‘అహద్, అహద్’ అని పలుకుతూనే ఉండేవారు. మిట్టమధ్యానం ఆయనను బాగా వేడెక్కిన రాళ్ళపై వెల్లకిలా పరుండబెట్టి, ఆయన రొమ్ములపై పెద్ద బండరాయిని ఉంచేవారు. అంతటితో ఆగక ఆయనతో ఇలా అనేవారు – ‘నీవు ముహమ్మద్ ను తిరస్కరించే వరకు లేదా నీకు చావు దాపురించే వరకు నీతో ఇలాంటి వ్యవహారమే జరుపబడును’. అయినా ఆయన బిలాల్ రదియల్లాహు అన్హు నోటి నుండి ‘అహద్, అహద్, .... .....’ అనే పలుకులను ఆపలేక పోయినాడు.

ఆయన యజమాని ఆయనను కఠినంగా  దండిస్తున్నప్పుడు, అబూ బక్ర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు అక్కడికి రావటం జరిగినది. ఆ దౌర్జన్యం నుండి తప్పించటానికి గాను, ఉమయ్యా నుండి ఆయనను కొని, స్వంత్రుడిని చేసి, బానిసత్వం నుండి విముక్తి చేసినారు.

హబష (ఇథియోపియా) వైపు ముస్లింల వలస:

వారిపై జరుగుతున్న దౌర్జన్యం హద్దు మీరి పోతుండటం చూసి, హబష వైపు వలస వెళ్ళవలసినదిగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు సూచించినారు. అంతేగాక ఎవ్వరిపైనా అత్యాచారాలు జరగకుండా చూసే రాజు హబషను పరిపాలిస్తున్నట్లు ఆయన వారికి తెలిపినారు. అది విని కొందరు ముస్లింలు హబష వైపు వలస వెళ్ళినారు. వారు మొత్తం 12మంది పురుషులు మరియు 4గురు మహిళలు. వారిలో ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె మరియు ఆయన భార్య అయిన రుఖయ్యా బిన్తె ముహమ్మద్ రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత, 5వ సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి వలసయాత్ర (హిజ్రత్) ఇది. ఆ ముస్లింలు చాలా కాలం వరకు అక్కడే ఉన్నారు. అయితే ఖురైషు బహుదైవారాధకులు కూడా ఇస్లాం స్వీకరించారనే వార్త విని, సంతోషంతో వారు మక్కా నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. కానీ, మక్కా దగ్గరకు రాగానే, ఖురైషులు ఇస్లాం స్వీకరించారనే వార్త అసత్యమైనదనీ, అది ఒక పుకారు మాత్రమేనని వారికి తెలిసినది. అప్పుడు వారిలో నుండి కొందరు తిరిగి హబషకు వెళ్ళిపోయారు. కొందరు రహస్యంగా మరియు మరికొందరు ఇతరుల శరణులో మక్కా చేరుకున్నారు.

హబషలో ప్రశాంతంగా జీవించేటట్లు ముస్లింలకు లభించిన శరణు ఖురైషుల అహంభావానికి సవాలుగా నిలిచినది. తమ అందుబాటులో ఉన్న ముస్లింలపై వారు ఇంకా తీవ్రంగా అత్యాచారం చేయసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనలను అనుసరించి హబష నుండి తిరిగి వచ్చినవారు, మరల అక్కడికే వలస పోయారు. అయితే ఈసారి వారితో పాటు మరికొందరు కూడా వలస వెళ్ళినారు. అలా రెండోసారి హబషకు వలస పోయినవారిలో మొత్తం 83 మంది పురుషులు మరియు 18 మంది మహిళలు ఉన్నారు.

ఇస్రా మరియు మేరాజ్:

ప్రవక్త పదవి లభించిన 10వ సంవత్సరం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అత్యంత కఠినమైన సంవత్సరమైనది. సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ ఆయనను సమర్ధించే ఆయన పినతండ్రి అబూ తాలిబ్ ఆ సంవత్సరంలో మరణించారు. ఎల్లప్పుడూ ధైర్యాన్నిస్తూ, సత్యతిరస్కారుల కష్టాలను సులభతరం చేస్తుండిన ఆయన భార్య ఖతీజా రదియల్లాహు అన్హా కూడా అదే సంవత్సరం మరణించారు. ఆయన తన పినతండ్రి మృత్యువు తరువాత తాయిఫ్ పట్టణానికి వెళ్ళినారు. అక్కడ ఆయన ఖురైష్ దుష్టులకు వ్యతిరేకంగా ముస్లింలకు సహాయం చేయమని సకీఫ్ తెగ వాసులను కోరినారు. తాయిఫ్ పట్టణ ప్రజలు ఇస్లాం స్వీకరించాలని తను ఆశిస్తున్నట్లు వారికి స్పష్టం చేసినారు. అయితే తాయిఫ్ పట్టణ ప్రజలు ఆయనను నిరాకరించినారు. అక్కడి మూర్ఖులు, పిల్లలు మరియు బానిసలు దుర్భాషలాడినారు. అవమాన పరుస్తూ, ఆయనపై రాళ్ళురువ్వారు. ఆయన శరీరం రక్తసిక్తమైనది. ఆయన పాదరక్షలు రక్తంతో నిండిపోయాయి. ఈ విపత్తులు మరియు ఆపదలు ఆయనపై వచ్చి పడిన సంవత్సరమే ఇస్రా - మేరాజ్ మహాద్భుతం కూడా జరిగినది. దీని ద్వారా ఒకదాని తరువాత ఒకటిగా వెంటవెంటనే వచ్చిపడిన తీవ్రకష్టాలను తన ప్రవక్త మరచిపోవాలని అల్లాహ్ తలచినాడేమో. మేరాజ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన సమాజంపై నమాజు అనివార్యం చేయబడినది. ఇస్రా అంటే నడవటమని మరియు మేరాజ్ అంటే అధిరోహించటమని అర్థం. మహాద్భుతంగా రాత్రికి రాత్రి ఆయనను మక్కా నుండి ఫలస్తీన్ లోని మస్జిదె అఖ్సాకు చేర్చటం మరియు అక్కడి నుండి సప్తాకాశాలలో విహరింపజేస్తూ, అల్లాహ్ యొక్క మహోన్నత సింహాసనం వరకు చేర్చటం, తిరిగి మక్కా చేర్చటం అనేదే ఇస్రా మరియు మేరాజ్.

మదీనా వైపు ముస్లింల హిజ్రత్ (వలస):

మక్కాలో ప్రతి సంవత్సరం హజ్ యాత్ర జరిగేది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హజ్ కాలాన్ని చాలా విలువైనదిగా భావించి, నలువైపుల నుండి హజ్ యాత్ర కొరకు మక్కా చేరిన ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించేవారు. ఆయన ప్రవక్తగా నియమింపబడిన తరువాత, 11వ సంవత్సరంలో జరిగిన హజ్ యాత్రలో పాల్గొనటానికి మదీనా పట్టణం నుండి కొందరు ప్రజలు మక్కా వచ్చినారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించగా, వారిలో కొందరు ఇస్లాం స్వీకరించినారు. ఆ తరువాతి హజ్ సంవత్సరంలో అంటే ప్రవక్తగా నియమింపబడిన 12వ సంవత్సరంలో మదీనా నుండి పన్నెండు మంది వచ్చినారు. ‘తాము ఎవరినీ అల్లాహ్ కు సాటి కల్పించము, దొంగతనం చేయము, వ్యభిచారం చేయము మరియు మంచిపనులలో అవిధేయత చూపము’ అని వారు అకబా అనే చోట రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు దృఢంగా వాగ్దానం చేసినారు.

అలా వాగ్దానం చేసి, నవముస్లింలు మదీనాకు మరలినారు. వారికి ఇస్లాం ధర్మాన్ని బోధించటం కొరకు మరియు అక్కడి ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించటం కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ముస్ఆబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హును పంపించినారు.  అల్లాహ్ అక్కడ ముస్ఆబ్ రదియల్లాహుఅన్హుకు చాలా సహాయపడినాడు. ఉసైద్ బిన్ హుజైర్ మరియు సఅద్ బిన్ ముఆజ్ అనే ఇద్దరు మదీనా పట్టణపు గొప్ప నాయకులు ఆయన చేతులపై ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినారు. వీరిద్దరి ఇస్లాం స్వీకరణ కారణంగా అధిక సంఖ్యలో మదీనా వాసులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినారు.

ప్రవక్తగా నియమింపబడిన 13వ సంవత్సరంలో, హజ్ కొరకు చాలామంది నవముస్లింలు మదీనా నుండి మక్కా వచ్చినారు. వారు రహస్యంగా ఒకచోట సమావేశమై, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను అక్కడి నిస్సహాయ మరియు భయభీత స్థితిలో వదలి వెళ్ళలేమని వారు ప్రతినబూనారు. ‘రెండో అకబా ప్రతిజ్ఞ’ అనే పేరుతో ఇది ప్రసిద్ధి చెందినది. దీనిలోని ముఖ్యాంశం ఏమిటంటే -  ‘ఒకవేళ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు (మదీనాకు) వలస వచ్చినట్లయితే, తమ భార్యాబిడ్డలను కాపాడుకుంటున్నంత భద్రంగా, వారు ఆయనకు కూడా రక్షణ కల్పిస్తారు.’ దీనితో సురక్షితమైన, శాంతియుత శరణు తమకు మదీనాలో లభించగలదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులైన ముస్లింలు ఆశించినారు. అంతేకాక ఈ పటిష్టమైన సమర్ధన ఆధారంగా త్వరలోనే ఇస్లాం శక్తివంతంగా ఎదిగి, నలువైపులా వ్యాపించే సదవకాశం కూడా వారికి కనబడినది. ముస్లింలు మక్కా వదిలి, మదీనాకు వలస పోవలసిన సమయం ఆసన్నమైందనే సంకేతం కూడా ఈ ప్రతిజ్ఞలో ఇవ్వబడింది.

రెండో అకబా ప్రతిజ్ఞ తరువాత, మదీనాకు వలస పోవటానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వటం వలన, ముస్లింలు మదీనాకు వలస వెళ్ళటం మొదలు పెట్టినారు. అక్కడే ఉండేందుకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి పొందిన కొందరు ముస్లింలు, అబలలు మరియు వలస పోయే శక్తిసామర్ధ్యం లేని నిస్సహాయులు మాత్రమే మక్కాలో మిగిలిపోయారు. 

మదీనా వైపు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వలస:

వలస పోయే సమయం వచ్చిందని వహీ ద్వారా అల్లాహ్ తెలుపగానే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళినారు. ఆయనకు విషయాన్ని తెలిపి, ప్రయాణ పథకాన్ని మరియు దారిలో తీసుకోవలసిన ముందుజాగ్రత్తల గురించి చర్చించినారు. దారి చూపటానికి ఒక వ్యక్తిని తీసుకున్నారు. పథకం ప్రకారం రాత్రి సమయంలో వారిద్దరూ కలిసి, థూర్ పర్వతంపై నున్న గుహ వద్దకు చేరుకున్నారు. అక్కడ వారు మూడురాత్రులు గడిపారు. ఇక తమను ఎవరూ వెంటాడరనే నమ్మకం కుదిరాక, గుహ నుండి బయటకు వచ్చి, మదీనా వైపు ప్రయాణించసాగారు.

4వ రోజున ప్రయాణం మొదలుపెట్టి, 1వ హిజ్రీ సంవత్సరం, రబ్బిల్ అల్ అవ్వల్ నెల 12వ తేదీన (క్రీ.శ. 622) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా పట్టణ సరిహద్దులలోని ‘ఖుబా’ అనే ప్రాంతానికి చేరుకుని, అక్కడ వారు ‘మస్జిదె ఖుబా’ నిర్మించినారు. ఇది ఇస్లాం యొక్క మొట్టమొదటి మస్జిద్ అయినది. కొన్నాళ్ళు ఖుబాలో ఉన్న తరువాత ఆయన మదీనా చేరుకున్నారు. ఉజ్వల భవిష్యత్తు అక్కడ ఆయనకు స్వాగతం పలికినది. నేటి మస్జిదె నబవీ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న ఒంటె కూర్చుండి పోయినది. అప్పుడు ఆయన ఒంటె పై నుండి క్రిందకు దిగినారు. దాని ప్రక్కనే నివసించే అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు తమ ఇంటికి తీసుకు వెళ్ళగా, కొన్నాళ్ళపాటు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఇంటిలోనే అతిథిగా గడిపినారు.

మదీనాలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం:

మదీనాలో ఆయన చేసిన మొట్టమొదటి పని - తన ఒంటె కూర్చుండి పోయిన చోట మస్జిదె నబవీ నిర్మించడం. ఆ స్థలం ఇద్దరు అనాథ బాలురకు చెందినది. ఆయన స్వయంగా దానిని వారి నుండి కొనుగోలు చేసినారు. అంతేకాక మస్జిద్ నిర్మాణంలోనూ ఆయన స్వయంగా పాల్గొని, సహచరులతో పాటు రాళ్ళు మోసినారు.    

ఆ తరువాత ఆయన చేసిన రెండో పని – అన్సారుల మరియు ముహాజిరుల మధ్య పటిష్టమైన సోదరబంధాన్ని స్థాపించటం. అన్సారులు అంటే మదీనా ముస్లింలు. ముహాజిరులు అంటే మక్కా నుండి వలస వచ్చిన ముస్లింలు. దీని ఫలితంగా అన్సారులు, ముహాజిరులను సోదరులుగా చేసుకోవటానికి తమలో తాము పోటీ పడసాగారు. ఒకే ఇంటిలో ఉంటున్న అన్సారీ మరియు ముహాజిర్ ముస్లింల మధ్య, తమ మరణానంతరం ఒకరికొకరు వారసులుగా ప్రకటించుకనేంతగా, ప్రేమాభిమానాలతో కూడిన గట్టి సోదరబంధం ఏర్పడినది. కొన్నాళ్ళ తరువాత ఈ వారసత్వపు ఆజ్ఞలు రద్దుచేయబడినాయి. కానీ సోదరబంధానికి సంబంధించిన ఆజ్ఞలు కొనసాగినవి.

బద్ర్ యుద్ధం:

ఇది అల్లాహ్ కు సమర్పించుకున్నవారి మరియు తిరస్కరించినవారి మధ్య అంటే ముస్లింల మరియు కాఫిర్ల మధ్య జరిగిన మొట్టమొదటి పోరాటం. అబూ సుఫ్యాన్ బిన్ హరబ్ నాయకత్వంలో మక్కాకు తరలి వస్తున్న ఒక వాణిజ్య సమూహం గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అందగానే, దానిని వెంబడించాలనే అభిప్రాయాన్ని కొందరు సహచరులు వెల్లడించినారు. కొందరు ముందుకు సాగినారు, అది చివరికి ఒక సాయుధ పోరాటంగా మారబోతుందనే విషయం తెలియక మరికొందరు వెనుకనే ఉండిపోయినారు. అప్పుడు వారు గ్రహించలేదు. ముస్లిముల పోకడలు పసిగట్టగానే అబూ సుఫ్యాన్ ఈ వార్తను మక్కావాసులకు చేరవేయటానికి మరియు తమ రక్షణ కొరకు వెంటనే బయలుదేరి రమ్మని చెప్పటానికి ఒక వ్యక్తిని త్వరగా మక్కా పంపించినాడు. ఇంకేముంది. సత్యతిరస్కారులు వెంటనే వెయ్యి మందితో కూడిన ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసినారు. దానిలో వారి నాయకులు మరియు ప్రధాన వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇటువైపు అబూ సుఫ్యాన్ దారి మళ్ళించడం ద్వారా తన బృందాన్ని కాపాడుకోవటంలో సఫలీకృతులైనారు. తాము క్షేమంగా ఉన్నామని, ఖురైషులను మక్కాకు వెనుదిరిగి వెళ్ళిపొమని ఆయన సూచించారు. కానీ సైన్యం బద్ర్ వద్దకు చేరాలనే అబూ జహల్ తీర్మానించినాడు. మూడు వందల పదమూడు మంది సైన్యంతో ముస్లింలు బద్ర్ లోని ఒక నీటి బావి వద్ద దిగినారు. ఆరోజు శుక్రవారం 2వ హిజ్రీ సంవత్సరం, రమదాన్ నెల 17వ తేదీ. ఇరువైపు సైన్యాలు ఎదురు బదురైనాయి, భీకర యుద్ధం ప్రారంభమైనది. ఆనాటి యుద్ధరీతి ప్రకారం, ముందుగా జరిగిన ముష్టియుద్ధంలో ముగ్గురు ముస్లిం వీరులు సత్యతిరస్కారుల ముగ్గురు యోద్ధులను మట్టి కరిపించినారు. ఆ తరువాత ఇరుసైన్యాలు పరస్పరం తలపడ్డాయి. తమ కంటే మూడు రెట్లు అధికంగా ఉన్న శక్తివంతమైన ఖురైషుల సైన్యంతో ముస్లింలు చాలా వీరోచితంగా పోరాడినారు. చివరికి సత్యతిరస్కారులు చిత్తుగా పరాజితులైనారు. వారి నాయకుడైన అబూ జహల్ తో సహా, డెబ్బై మంది హతులయ్యారు, డెబ్బై మంది బందీలుగా పట్టుబడ్డారు. అటు ముస్లింలలో 14 మంది షహీద్ అయ్యారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యతిరస్కారుల శవాలను ఎండిపోయిన కులైబ్ బావిలో విసిరి వేయించినారు.

ఉహద్ యుద్ధం:

బద్ర్ యుద్ధంలో పరాజయమవటం అనేది ఖురైషులు సహించలేని అత్యంత బాధాకరమైన విషయం. వారు తమ ప్రతిష్ఠ నిలబెట్టుకోవటానికి గాను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతినబూని, యుద్ధాగ్ని రగిల్చినారు. మూడు వేల యోద్ధులతో కూడిన ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశారు. ఖురైషుల తయారీ గురించి తెలియగానే,  ఇటు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సైన్యాన్ని మూడు జట్లుగా తయారు చేసి, మదీనాకు ఉత్తర దిక్కున మస్జిదె నబవీ నుండి దాదాపు 5 ½ కి.మీ. దూరంలో  ఉన్న ఉహద్ కొండ వద్దకు తన సైన్యంతో చేరుకున్నారు. అక్కడ ఆయన తన సైనిక పంక్తులను సరిదిద్దినారు. ముస్లింల మరియు సత్యతిరస్కారుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైనది. కొందరు విలుకాండ్ర తప్పిదం వలన ముస్లింలకు భారీ నష్టం కలిగినది. తన సహచరులతో సహా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ కొండ శిఖరానికి చేరటంలో  సఫలీకృతులై, తమను చుట్టుముట్టిన శత్రుసైన్యం నుండి రక్షించు కోగలిగినారు. సత్యతిరస్కారులు వారితో యుద్ధం ఇంకా కొనసాగించే సాహసం చేయలేక పోయారు. ఈ యుద్ధంలో 70 మంది  ముస్లింలు షహీద్ అయ్యారు. వారిలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి హమ్జా రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు. అయితే ఆ యుద్ధంలో 22 మంది సత్యతిరస్కారులు హతులయ్యారు.

బను నదీర్ యుద్ధం:

బను నదీర్ తెగకు చెందిన యూదులు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయడానికి కుట్రపన్నారు. అందు వలన ఆయన వారిని మదీనా విడిచి వెళ్ళిపొమ్మని ఆదేశించగా, బను నదీర్ తెగవారు ఈ ఆదేశాన్ని నిరాకరించినారు. అప్పుడు ముస్లింలు వారిని చుట్టుముట్టగా, వారు ముస్లింలకు లొంగిపోయారు. చివరికి వారు మదీనా నుండి బహిష్కరించబడినారు.

అహ్జాబ్ (కందకం) యుద్ధం:

ఏ యూదులనైతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుండి వెళ్ళగొట్టినారో, వారు మదీనా పై దాడి చేయమని ఖురైషులను పురిగొల్పిటం వలన ఖురైషులు భారీ సైన్యాన్ని తయారు చేసినారు. ఇటు ముస్లింలు తమ రక్షణ కొరకు మదీనా చుట్టూ కందకం త్రవ్వుకున్నారు. ఖురైషులు మదీనా పై దాడి చేయటానికి ఎంతగా ప్రయత్నించినా, వారు లోపలికే ప్రవేశించలేకపోయారు. అల్లాహ్ వారిపై భయంకరమైన పెనుగాలులు మరియు తూఫాను పంపటం వలన వారు తమ ప్రయత్నంలో సఫలీకృతులు కాలేక, వెనుదిరిగి పోయారు.

బనూ ఖురైజా యుద్ధం:

కందక యుద్ధం నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వాపసు అవుతుండగా, జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయన వద్దకు వచ్చి, బనూ ఖురైజా యూదులపై యుద్ధానికి వెళ్ళవలసినదిగా ఆదేశమిచ్చినారు. వారు అక్కడికి వెళ్ళి, వాళ్ళను చుట్టుముట్టగా, వారు తమ పరాజయాన్ని ఒప్పుకున్నారు. వారే ఎన్నుకున్న వ్యక్తిచే ఇవ్వబడిన తీర్పును అనుసరించి – వారి పురుషులు చంపబడినారు, వారి స్త్రీలు మరియు పిల్లలు ఖైదు చేయబడినారు మరియు వారి సంపద విభజింపబడినది. ఆ వ్యవహారం ఇలా సమాప్తమైనది. 

మక్కా విజయం:

హిజ్రీ 8వ సంవత్సరంలో అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంచే మక్కా నగరాన్ని జయింపజేసినాడు. ఇది అన్నింటికంటే మహా గొప్ప విజయం. దీని ద్వారా అల్లాహ్ తన ధర్మానికి మరియు తన ప్రవక్తకు గౌరవాన్ని ప్రసాదించినాడు. తన గృహాన్ని మరియు ఆదరణీయమైన ఆ నగరాన్ని కాపాడుకున్నాడు. ఇక ప్రజలు తండోపతండాలుగా అల్లాహ్ యొక్క ధర్మంలో ప్రవేశించసాగారు.

హునైన్ యుద్ధం:

సునాయాసంగా మక్కా జయించిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తమపై కూడా యుద్ధం ప్రకటిస్తారేమోనని హవాజిన్ మరియు సఖీఫ్ తెగల నాయకులు భయపడినారు. అందుకని వారు ముస్లింలపై దాడి చేయాలని నిర్ణయించుకుని, హునైన్ అనే చోట తమ సైన్యాన్ని సమీకరించారు. ఇరుపక్షాలు ముఖాముఖీగా తలబడినాయి. యుద్ధారంభంలో ముస్లింలు ఇబ్బంది పడినా, అంతిమ విజయం ముస్లింలకే లభించినది.   

తబూక్ యుద్ధం:

తమపై దాడి చేయడానికి రోమన్లు అతి పెద్ద సైన్యాన్ని తయారు చేసినారనే సమాచారం రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం కు అందినది. వెంటనే ఆయన కూడా ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసి, వారిని ఎదుర్కొనేందుకు బయలుదేరి, రోమన్ల సరిహద్దులోని తబూక్ పట్టణానికి చేరుకున్నారు. కానీ, ఆయనకు అక్కడ రోమన్ల సైన్యం కానరాలేదు. దీనికి కారణం - ముస్లిం సైన్యంతో యుద్ధం చేయటానికి రోమన్లు భయపడిపోవటమే. 

హజ్జతుల్ విదా (వీడ్కోలు హజ్)

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అంతిమ హజ్ యాత్ర:

హిజ్రీ 10వ సంవత్సరంలో జరిగినది. అక్కడ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రసంగంలో ప్రజలను సంబోధించి ‘బహుశా ఈ సంవత్సరం తరువాత నేను ఇక మీతో కలవక పోవచ్చు’ అని ప్రకటించటం వలననే దీనికి ఆ పేరు ఇవ్వబడినది. ఎందుకంటే తన సమయం పూర్తి కావస్తున్నదనే విషయాన్ని ఆయన గ్రహించినారు. వాస్తవంగా, ఈ హజ్ యాత్ర తరువాత ఆయన కేవలం కొన్ని మాసాలే జీవించారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేయాలని సంకల్పించినట్లు తెలియగానే, ఆయనతో పాటు హజ్ చేయాలని కోరుకున్న ప్రజలందరూ ఆయన వద్దకు చేరుకున్నారు. దిల్ ఖాయిదా నెల చివరిలో ఆయన మదీనా పట్టణాన్ని వదిలినారు. అక్కడ తన ప్రతినిధిగా అబూ దుజానా రదియల్లాహు అన్హును నియమించినారు. వేల సంఖ్యలో ప్రజలు రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు తల్బియా పఠిస్తూ మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటించి హజ్ పూర్తి చేయడానికి బయలుదేరినారు. ఈ హజ్ యాత్రను ‘హజ్జతుల్ బయాన్ అంటే ఉపన్యాస హజ్’ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ హజ్ లో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా గంభీరంగా ఉపన్యసించినారు. అందులో ఆయన ఇస్లామీయ షరిఅత్ (చట్టం) యొక్క అనేక నియమాల మరియు ఆదేశాల గురించిన అనేక విషయాలను స్పష్టంగా వివరించినారు.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం:

రబ్బీఉల్ అవ్వల్ నెల ఆరంభంలో ఆయనకు నొప్పి కలిగినది, ఆ తరువాత జ్వరం వచ్చినది. వ్యాధి అధికమవటం వలన, ప్రజలను నమాజు చదివించమని ఆయన అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హుకు ఆదేశమిచ్చినారు. ఇలా ఆయన అమానతును నిజాయితీగా వాపసు చేసి, అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేసి మరియు ప్రపంచ పట రూపురేఖల్ని మార్చివేసి, హిజ్రీ 11వ సంవత్సరం రబ్బీఉల్ అవ్వల్ నెల పన్నెండవ తేదీన మరణించినారు.

ఆయన మరణవార్త వినగానే ప్రజలు నిశ్చేష్టులై, ఆశ్చర్యంలో మునిగిపోయారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించ లేదని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రజల మధ్య బిగ్గరగా ప్రకటించారు. అప్పుడు అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు అక్కడికి వచ్చి“ఎవరైతే ముహమ్మద్ ను ఆరాధిస్తున్నారో, వారు ‘ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినారని’ తెలుసుకోండి మరియు ‘ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో, వారు అల్లాహ్ జీవించే ఉన్నాడు, అల్లాహ్ అమరుడు - ఎన్నటికీ మరణించడని’ తెలుసుకోండి” అని ప్రకటించినారు.

ఆ తరువాత ఆయన ధరించి ఉన్న బట్టల పైనే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు గుసుల్ (స్నానం) చేయించటం మరియు కఫన్ బట్టలు కప్పటం జరిగినది. ఆయెషా రదియల్లాహు అన్హా ఇంటిలో ఆయన సమాధి చేయబడినారు. అప్పుడు ఆయన వయస్సు 63 సంవత్సరాలు. తన వెనుక వదలటం కొరకు ప్రాపంచిక సంపదలలో నుండి ఒక్క పైసా కూడా ఆయన వద్ద మిగలలేదు.

®      ®      ®


قصــار السـوروالأدعــية

 చిన్న సూరాలు & దుఆలు


సూరతుల్ ఫాతిహా – 1

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో 7 ఆయతులు ఉన్నాయి.  

1. అనంత రుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ....

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

2. సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్

الحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ

3. అనంత రుణామయుడూ, అపార కృపాశీలుడూను.

అర్రహ్మా నిర్రహీమ్

الرَّحْمَنِ الرَّحِيمِ

4. ప్రతిఫల దినానికి యజమాని.

మాలికి యోమిద్దీన్

مَالِكِ يَوْمِ الدِّينِ

5. మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం మేము కేవలం నిన్నే అర్థిస్తాము.

ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

6. మాకు ఋజుమార్గం చూపించు.

ఇహ్..దినశ్శిరాతల్ ముస్తఖీం 

إِهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ

7.అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము. నీ ఆగ్రహానికి గురికాని వారూ మరియు మార్గభ్రష్టులు కాని వారూ అనుసరించిన మార్గము. 

శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్ , గైరిల్ మగ్దూబి అలైహిమ్  వలద్దాల్లీన్ !

صِرَاطَ الَّذِينَ أَنْـعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

సూరతుల్ ఫీల్ – 105

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయతులు ఉన్నాయి.

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ....

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. ఏమిటీ, ఏనుగుల వారితో నీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో నీకు తెలియదా?

అలమ్ తర కైఫ ఫఅఁల రబ్బుక బిఅశ్ హాబిల్ ఫీల్

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الفِيلِ

2. ఏమిటీ, ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?

అలమ్ యజ్అఁల్ కైదహుమ్ ఫీ తద్లీల్

أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ

3. మరియు వారి పైకి పక్షుల గుంపులను పంపాడు.

వ అర్సల అఁలైహిమ్ తైరన్ అబాబీల్.

وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ

4. అవి వారి మీద బాగా కాల్చిన మట్టి గడ్డల వర్షం కురిపించాయి.

తర్మీహింమ్ బిహిజారతిమ్మిం మిన్ సిజ్జీల్

تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ

5.ఆ విధంగా ఆయన వారిని (పక్షులు) తిని వదిలి వేసిన పొట్టుగా మార్చివేశాడు.

ఫజఅఁలహుమ్ కఅఁశ్ఫిమ్మఁకూల్

فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ

సూరతు ఖురైష్ – 106

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో నాలుగు ఆయతులున్నాయి.

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ....

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. (చూడండి) ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో!

లి ఈలాఫి ఖురైష్

لِإِيلَافِ قُرَيْشٍ

2. చలికాలంలోనూ, ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో!

ఈలాఫి హిమ్ రిహ్లతష్షితాఇ వశ్శైఫ్

إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِوَالصَّيْفِ

3. కనుక వారు ఈ గృహపు ప్రభువును ఆరాధించాలి.

ఫల్ యఅఁబుదూ రబ్బహాదల్ బైత్

فَلْيَعْبُدُوا رَبَّ هَذَا البَيْتِ

4. ఆయనే వారికి ఆహారమిచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు,శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు.

అల్లదీ అత్అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్

الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ

وَآَمَنَهُمْ مِنْ خَوْفٍ

సూరతుల్ మాఊన్ – 107

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఏడు ఆయతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ... 

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా?

అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ

2.వారే అనాథులను కసరి కొట్టేవారు.

ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీం

فَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ

3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారు

వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్

وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ

4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు.

ఫవైలుల్ లిల్ ముశల్లీన్

فَوَيْلٌ لِلْمُصَلِّينَ

5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారో

అల్లదీన హుమ్ అన్ శలాహితిం సాహూన్

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ  سَاهُونَ

6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో,

అల్లదీన హుమ్ యరాఊన్

الَّذِينَ هُمْ  يُرَاءُونَ

7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో. 

వయం నఊనల్ మాఊన్

وَيَمْنَعُونَ المَاعُونَ

సూరతుల్ కౌథర్ – 108

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. (ప్రవక్తా) మేము నీకు కౌథర్ (సరస్సు) ను ప్రసాదించాము.

ఇన్నా  అఅతైనా కల్ కౌథర్

إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ

2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.

ఫశల్లి లి రబ్బిక వన్ హర్

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.

ఇన్న షానిఅక హువల్ అబ్తర్

إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ

సూరతుల్ కాఫిరూన్ – 109

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఆరు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. (ప్రవక్తా) ప్రకటించు!  ఓ అవిశ్వాసులారా

ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్

قُلْ يَا أَيُّهَا الكَافِرُونَ

2. నేను ఆరాధించను మీరు ఆరాధించే వాటిని

లా... అఅబుదు మా తఅబుదూన్

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ

3. మరియు మీరు ఆరాధించరు నేను ఆరాధించేవాడిని

వలా..అన్..న్ తుం ఆబిదూన మా...అఅబుద్

وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ

4. మరియు నేను ఆరాధించను మీరు ఆరాధిస్తున్న వాటిని

వలా..అన ఆబిదుమ్మా అబత్తుం

وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ

5. మరియు మీరు ఆరాధించరు నేను ఆరాధించేవాడిని

వలా అన్..న్ తుం ఆబిదూన మా అఅబుద్

وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ

6. మీ ధర్మం మీదే మరియు నా ధర్మం నాదే.

లకుం దీనుకుమ్ వ లి యదీన్

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ

సూరతున్నస్ర్ - 110

ఇది మక్కాలోనే అవతరించినా మదీనా సూరహ్ అనబడుతుంది. దీనిలో మూడు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వచ్చినదో మరియు విజయం లభించినదో

ఇదా జాఅ నశ్రుల్లాహి వల్ ఫత్ హ్

إِذَا جَاءَ نَصْرُ اللهِ وَالفَتْحُ

2. మరియు ప్రజలు తండోపతండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు

వ రఅయ్ తన్నాస యద్ ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్ వాజా

وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللهِ أَفْوَاجًا

3. నీ ప్రభువు స్తోత్రంతో పాటు (ఆయన) పవిత్రనామాల్ని స్మరించు మరియు అతడి మన్నింపును అర్థించు, నిస్సందేహంగా అతడు పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు.

ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్ తగ్ఫిర్ హు, ఇన్నహూ కాన తవ్వాబా

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا

సూరతు లహబ్ (సూరతుల్ మసద్) - 111

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. అబీ లహబ్ చేతులు విరిగి పోయాయి! అతడు సర్వనాశనం అయిపోయాడు

తబ్బత్ యదా అబీ లహబింవ్ వతబ్బ్

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ

2. అతడి మొత్తం ఆస్తిపాస్తులు, సంపాదనా దేనికీ పనికి రాకుండా పోయింది.

మాఅగ్ నా అన్హు మాలుహూ వమా కసబ్బ్

مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ

3. అతడు అతి త్వరలో భగభగ మండే అగ్నిలో చేరతాడు.

సయశ్లానారన్ దాత లహబ్బ్

سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ

4. అంతే కాదు (అతడితోపాటు) అతడి భార్యా అందులో చేరు తుంది. (ఆమె చాడిలుచెబుతూ కలహాలురేపే స్త్రీ)

వమ్రఅతుహూ హమ్మా లతల్ హతబ్బ్

وَامْرَأَتُهُ حَمَّالَةَ الحَطَبِ

5. ఆమె మెడలో దృఢంగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.

ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్మసద్ద్

فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ

సూరతుల్ ఇఖ్లాస్ - 112

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో నాలుగు ఆయాతులున్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. (ఓ ప్రవక్తా!) ప్రకటించు! అల్లాహ్ ఏకైక అద్వితీయుడు.

ఖుల్ హువల్లాహు అహద్ద్

قُلْ هُوَ اللهُ أَحَدٌ

2. అల్లాహ్ ఎలాంటి అక్కరా లేనివాడు (సమర్ధుడు).

అల్లాహు శ్శమద్ద్

اللهُ الصَّمَدُ

3. ఆయనకు సంతానం లేదు  ఆయనెవరి సంతానం కాదు

లమ్ యలిద్ద్ వ లమ్ యూలద్ద్

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ

4. ఆయనకు సరిసమానులు ఎవ్వరూ లేరు.

వ లమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ద్

وَلَمْ يَكُنْ لَهُ كُفُوًاأَحَدٌ

సూరతుల్ ఫలఖ్ – 113

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఐదు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. (ప్రవక్తా!) ప్రకటించు! నేను ఉదయం యొక్క ప్రభువును శరణు కోరుతున్నాను.

ఖుల్ అ, ఊదు బిరబ్బిల్ ఫలఖ్ఖ్

قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ

2. ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి.

మిన్ షర్రి మా ఖలఖ్ఖ్

مِنْ شَرِّ مَا خَلَقَ

3. కమ్ముకునే చీకటి రేయి కీడు నుండి.

వ మిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్బ్.

وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

4. ముడులపై మంత్రించే వారి కీడు నుండి.

వ మిన్ షర్రిన్ నఫ్పాసఆతి ఫిల్ ఉఖద్ద్.

وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ

5. మరియు ఈర్ష్యాపరుడు, ఈర్ష్య చెందేటప్పటి కీడు నుండి

వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్ద్

وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

సూరతున్నాస్ - 114

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో ఆరు ఆయాతులు ఉన్నాయి.

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ...

బిస్మిల్లా హిర్రహ్మా

నిర్రహీమ్

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

1. అను: నేను మానవుల ప్రభువు యొక్క శరణు వేడుకుంటున్నాను,

ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్.

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ

2. మానవుల పరిపాలకుడి (శరణు వేడు కుంటున్నాను),

మలికిన్నాస్

مَلِكِ النَّاسِ

3. మానవుల ఆరాధ్యుడి (శరణు వేడు కుంటున్నాను),

ఇలాహిన్నాస్

إِلَهِ النَّاسِ

4. మాటిమాటికీ మరలివస్తూ దుష్టభావాలు రేకేత్తించేవాడి కీడు నుండి,

మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్

مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ

5. వాడు ప్రజల మనస్సుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు,

అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ

6. వాడు జిన్నాతుల జాతిలోని వాడు లేదా మానవజాతిలోని వాడు.

మినల్ జిన్నతి వన్నాస్

مِنَ الجِنَّةِ وَالنَّاسِ

కొన్ని మహత్వపూర్ణ ప్రార్థనలు (దుఆలు)

నిద్ర నుండి మేల్కొన్నప్పుడు చేసే దుఆ:

^^అల్హందులిల్లాహిల్లదీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహి న్నుషూర్.**

^^మనల్ని మృత్యువు (నిద్ర) నుండి లేపి తిరిగి బ్రతికించిన అల్లాహ్ కు సమస్త స్తోత్రములు, మనమంతా ఆయన వద్దకే పోవలసి ఉన్నది.**

— మీరు ఉదయమే నిద్ర నుండి మేల్కొనండి.

— మిస్వాక్ తో పళ్ళు తోముకోండి.

— పరిశుద్ధులై, నమాజు కొరకు తయారవండి.

బాత్రూమ్ లో ప్రవేశించే ముందు చేసే దుఆ

^^అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మినల్ ఖుబ్ థి వల్ ఖబాఇథ్**

^^ఓ అల్లాహ్ నేను మగ, ఆడ చెడు జిన్నుల నుండి

నీ శరణు కోరుచున్నాను.**

—  ముందుగా ఎడమకాలు లోపల పెట్టి బాత్రూమ్ లోనికి ప్రవేశించవలెను.

— బాత్రూమ్ లోనికి ప్రవేశించే ముందు దుఆ పఠించండి.

— బాత్రూమ్ లో ఉన్నప్పుడు మాట్లాడకండి.

— ఖిబ్లాకు ఎదురుగా లేదా ఖిబ్లాకు వీపుచూపి కూర్చోవద్దు.

— మలమూత్ర విసర్జన తరువాత మూడుసార్లు శుభ్రపరచుకోండి.

బాత్రూమ్ బయటకు వచ్చిన తరువాత చేసే దుఆ

^^గుఫ్రానక**

^^ఓ అల్లాహ్ నన్ను క్షమించుము!**

^^అల్హందులిల్లాహిల్లదీ అద్హబ్ అన్నీ అల్అదా, వ ఆఫానీ**

^^సకల ప్రశంసలు అల్లాహ్ కే ఎవరైతే నాలోనుండి మలినాలను దూరం చేసినాడో మరియు నాకు ప్రశాంతతను ప్రసాదించి నాడో**

·      బాత్రూమ్ లో నుండి బయటకు వచ్చేపటప్పుడు కుడికాలు ముందుగా బయటకు పెట్టి రావలెను. బయటకు వచ్చిన తరువాత పై దుఆ పఠించవలెను.

మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు చేసే దుఆ

“బిస్మిల్లాహి వశ్శలాతు వస్సలాము అలా రసూలుల్లాహి, అల్లాహుమ్మ ఇఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక”

“అల్లాహ్ పేరుతో...

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి కురుయుగాక!

ఓ అల్లాహ్! నా కోసం నీ కారుణ్య ద్వారములు తెరువు.”

— మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ముందుగా కుడికాలు లోపల పెట్టండి.

— తహియ్యతుల్ మస్జిద్ యొక్క రెండు రకాతుల నమాజు పూర్తి చేయండి.

— పూర్తి ఏకాగ్రతతో సామూహిక నమాజు కొరకు నిరీక్షించండి.

— అల్లాహ్ ధ్యానంలో మరియు ఖుర్ఆన్ పఠించడంలో నిరీక్షణ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

మస్జిద్ నుండి బయటకు వచ్చేటప్పుడు చేసే దుఆ

^^బిస్మిల్లాహి వశ్శలాతు వస్సలాము అలా రసూలుల్లాహ్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక**

^^అల్లాహ్ పేరుతో...

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి కురుయుగాక!

ఓ అల్లాహ్ నేను నీ దయను కోరుచున్నాను.**

—   ముందుగా ఎడమకాలు బయటకు పెట్టి మస్జిదు నుండి బయటకు రావలెను.

—   అన్ని రకాల చెడు పనుల నుండి దూరంగా ఉండవలెను.

—   తరువాత నమాజు కొరకు ఎప్పుడెప్పుడు మస్జిద్ కు మరలా వెళ్దామా అని ఎదురుచూస్తుండండి.

భోజనం ప్రారంభించే ముందు చేసే దుఆ%

^^బిస్మిల్లాహ్**

^^అల్లాహ్ పేరుతో ...**

భోజనం పూర్తయిన తరువాత చేసే దుఆ:

^^అల్హమ్దులిల్లాహిల్లదీ అత్ అమనీ హాదా, వ రజఖనీహి మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వతిన్**

^^సకల ప్రశంసలు నాకు భోజనం ప్రసాదించిన ఆ అల్లాహ్ కే చెందును. నా ఏ విధమైన కృషి, ఎలాంటి శక్తి లేకుండానే ఈ భోజనాన్ని ఆయన ప్రసాదించాడు.**

—   భోజనానికి ముందు మరియు భోజనం చేసిన తరువాత తమ రెండు చేతులూ శుభ్రంగా కడుక్కోండి.

—   ప్రశాంతంగా భోజనానికి కూర్చోండి.

—   తమ కుడిచేతితో తినండి.

—   కంచంలో తమకు దగ్గరగా ఉన్నచోటు నుంచి తినండి.

—   తమ పొట్టలో మూడింట ఒక వంతు భోజనం కొరకు, రెండో వంతు నీటి కొరకు మరియు మూడో వంతు శ్వాస కొరకు వదలండి.

—   భోజనం మంచిగా లేదనే చెడు పలుకులు పలుకవద్దు.

ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చేసే దుఆ

^^బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి వలా హౌల, వలా ఖువ్వత,          ఇల్లా బిల్లాహ్**

^^అల్లాహ్ పేరుతో... నేను అల్లాహ్ పైనే ఆధారపడినాను.

అల్లాహ్ ప్రసాదించిన శక్తిసామర్థ్యాలు తప్ప, నా వద్ద ఇంకే శక్తిసామర్ధ్యాలూ లేవు.**

— మీరు ఎవరిని కలిసినా సలాం చేసి కలవండి.

— చూపులు క్రిందికి ఉంచండి

— దారిలోని హానికరమైన వస్తువులను తొలగించండి.

తుమ్మినప్పుడు చేసే దుఆ

^^అల్హందులిల్లాహ్**

^^సకల స్తోత్రములు అల్లాహ్ కే**

మీ ఈ పలుకులు వినగానే ఇతరులు ఇలా దుఆ చేయవలెను:

^^ యర్హముకల్లాహ్**

^^అల్లాహ్ మీపై దయజూపుగాకs**

వారి పలుకులకు జవాబుగా మరల మీరిలా దుఆ చేయవలెను%

^^యహ్దీకుముల్లాహ్ వ యుస్లిహు బాలకుమ్**

^^అల్లాహ్ మీకు ఋజుమార్గాన్ని ప్రసాదించి, మీ పరిస్థితిని చక్కదిద్దుగాక**

ఇతరులకు తెలిపే ధన్యవాదాలు

ఎవరైనా మీకు మంచి చేసినప్పుడు లేదా మీతో మంచిగా వ్యవహరించి నప్పుడు, మీరు వారితో ఇలా పలకండి%

^^జజాకల్లాహు ఖైరా**

^^అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక**

రోగులను పరామర్శించటానికి వెళ్ళినప్పుడు చేసే దుఆ

మీరు ఎవరైనా రోగిని పరామర్శించటానికి వెళ్ళినప్పుడు, అతనితో ఇలా పలకండి

^^లా బస తహూరున్ ఇన్షా అల్లాహ్**

^^బాధ పడవలసిన అవసరంలేదు, అల్లాహ్ తలుచుకుంటే, త్వరలోనే నయమైపోతావు**

— రోగి వద్ద ఎక్కువసేపు కూర్చోవద్దు, అశుభంగా మాట్లాడ వద్దు.

— రోగి సంతోష పడే విధంగా సంభాషించండి.

— రోగి తల వద్ద ఇలా (ఏడు సార్లు) దుఆ చేయండి

^^అస్ అలుల్లాహల్ అజీమి,రబ్బల్ అర్షిల్ అజీమి అయ్యష్ఫియక**

^^నీకు స్వస్థత చేకూర్చమని మహోన్నత సింహాసనానికి అధిపతి, సర్వోన్నతుడైన అల్లాహ్ ను నేను అర్థిస్తున్నాను**

ఇస్లామీయ అభివాదం

మీరు ఎవరి సమీపంలో నుండైనా వెళ్ళుచున్నప్పుడు లేదా ఎవరికైనా ఎదురైనప్పుడు, వారితో ఇలా పలకండి.

^^అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు**

^^మీపై అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు దీవెనలు అవతరించుగాక**

నిద్రకు ఉపక్రమించేటప్పుడు చేసే దుఆ

^^బిస్మిక అల్లాహుమ్మ అమూతు వ అహ్యా**

^^ఓ అల్లాహ్ నేను నీ పేరున మరణిస్తున్నాను, నీ పేరున జీవిస్తున్నాను**

—   వేకువఝామునే మేల్కొనడానికి వీలుగా, రాత్రుల్లో మీరు త్వరగా పడుకోండి.

—   నిద్రకుపక్రమించక ముందు వుదూ చేయండి.

—   కుడివైపు తిరిగి పడుకోండి.

—   ఆయతుల్ కుర్సీ, సూరతుల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్ మరియు అన్నాస్ పఠించండి.

వాహనం పై ఎక్కేటప్పడు చేసే దుఆ

ప్రయాణించటం కొరకు, మీరు ఏదేని వాహనం పైకి ఎక్కేటప్పుడు ఇలా దుఆ చేయండి.

^^బిస్మిల్లాహి, అల్హందులిల్లాహి, సుబ్హానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్. వ ఇన్నా, ఇలా రబ్బినా లముంఖలిబూన్**

^^అల్లాహ్ పేరుతో ఈ వాహనాన్ని అధీస్టిస్తున్నాను. సమస్త స్తోత్రములు అల్లాహ్ కే చెందును, పరమ పరిశుద్ధుడగు అల్లాహ్ ఈ వాహనాన్ని మాకు ప్రసాదించినాడు. (అల్లాహ్ సహాయం లేకుండా) మేము దీనిని సమకూర్చుకోలేము. నిశ్చయంగా, మనమంతా మన ప్రభువు వైపునకే మరలిపోవలసియున్నది.**

వుదూ తరువాత చేసే దుఆ%

“అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వహదహు, లా షరీకలహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు. అల్లాహుమ్మజ్అల్నీ మినత్తవాబీన, వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్”

“అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవడూ లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సాటి ఎవ్వరూ లేరని, మరియు ముహమ్మద్ ఆయన యొక్క ‘దాసుడు మరియు సందేశహరుడు’ అని నేను సాక్ష్యమిస్తున్నాను.

ఓ అల్లాహ్ నన్ను పశ్చాత్తాప పడే వారిలోను, పరిశుభ్రత పాటించేవారిలోనూ చేర్చు.”

— అవసరానికి మించి నీరు వాడకూడదు.

— వుదూ భంగమైనప్పుడు, మరల వుదూ చేయండి.

®      ®      ®


الآداب الاسـلامــية

 ఇస్లామీయ సంస్కారాలు


ఇస్లామీయ సంస్కారాలు

సలాంను వ్యాపించటం:

సామాన్య ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, సోదరభావం, శాంతీ-సామరస్యాలు నెలకొలిపే ప్రతి పనీ చేయమని ఇస్లాం నిర్దేశిస్తుంది. దీని కొరకు మొదటి మెట్టుగా సలాం చేయమని ఆహ్వానిస్తున్నది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు.

^^మీరు మోమినులు (విశ్వాసులు) కాకుండా స్వర్గంలో ప్రవేశించ జాలరు. మరియు మీరు పరస్పరం ప్రేమాభిమానాలతో మెలగనంత వరకు పరిపూర్ణ విశ్వాసులు కాజాలరు. కాబట్టి, మీరు పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించుకోగలిగే మాట మీకు తెలుపనా? (అది ఏమిటంటే) సలాంను వ్యాపింపజేయటం.** ¼ముస్లిం హదీథు గ్రంథం½

ఇస్లాం ధర్మాన్ని అనుసరించి సలాం చేసే పద్ధతి ఇలా ఉన్నది:

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు” మరియు దానికి పలక వలసిన జవాబు: “

వ అలైకుముస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు:

మరియు సలాం చేయటం సున్నత్(ఐచ్ఛికం), కానీ దానికి జవాబు ఇవ్వటమనేది అనివార్యం. సలాము చేసే నియమాలు - వాహనం పై ప్రయాణించే వ్యక్తులే ముందుగా నడుస్తున్న వారికి సలాం చేయవలెను, నడుస్తున్న వ్యక్తి కూర్చున్న వ్యక్తికి సలాము చేయవలెను మరియు కొద్దిమందితో కూడిన గుంపు, అధికమందితో కూడిన సమూహానికి ముందుగా సలాం చేయవలెను.

సత్యం పలకటం:

ఇస్లాం పవిత్రమైన మరియు పరిశుద్ధమైన ధర్మం. ఇది ప్రతి మంచి మాట వైపు పిలుపునిస్తుంది మరియు ప్రతి చెడు మాట నుండి నిరోధిస్తుంది. అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا اتَّقُوا اللهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ

“ఓ విశ్వాసులారా, భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి” (అత్తౌబా:119)

మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో అబద్ధం చెప్పటమనేది నీచాతినీచమైన మరియు మహా ఘోరమైన పాపాలలోని ఒక పాపం. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో అబద్ధం కంటే నీచమైనది ఏదీ లేదు.” (ఇబ్నె హిబ్బాన్)

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:

“కపటుడి చిహ్నాలు మూడు – ఎప్పుడు పలికినా అబద్ధం పలుకుతాడు, ఎప్పుడు వాగ్దానం చేసినా దానిని పూర్తి చేయడు మరియు ఒకవేళ అతనిని నమ్మి అతని వద్ద ఏదైనా ఉంచితే, అతడు దానిని నిజాయితీగా తిరిగి ఇవ్వడు.” (బుఖారీ హదీథు గ్రంథం)

కాబట్టి ముస్లింల కర్తవ్యం ఏమిటంటే వారు సత్యాన్ని మాత్రమే అలవర్చుకోవలెను. ఎందుకంటే అది స్వర్గానికి చేర్చుతుంది గనుక. అంతేకాక అబద్ధం నుండి కాపాడుకోవలెను. ఎందుకంటే అది నరకంలోనికి తీసుకొని పోతుంది గనుక.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:“సత్యం మంచి వైపు దారి చూపుతుంది. మంచితనం స్వర్గానికి చేరుస్తుంది. నిస్సందేహంగా ఎల్లప్పుడూ సత్యమే పలుకుతున్నప్పుడు, అల్లాహ్ వద్ద అతని పేరు సత్యవంతులలో వ్రాయబడును. మరియు అసత్యం చెడు వైపునకు దారి చూపుతుంది. చెడుతనం నరకానికి చేరుస్తుంది. నిస్సందేహంగా ఎల్లప్పుడూ అసత్యం పలికేవాని పేరు అల్లాహ్ వద్ద అసత్యవంతుడిగా వ్రాయబడును.” (బుఖారీ-ముస్లిం హదీథ్ గ్రంథాలు).

బంధుత్వాలు కలిపి ఉంచటం:

బంధువులతో కలిసి మెలిసి ఉండమని ఇస్లాం సందేశమిస్తున్నది. బంధుత్వాలు త్రెంచటం నుండి తీవ్రంగా నివారిస్తున్నది. ఇంకా బంధుత్వాలు త్రెంచేవారు స్వర్గంలో ప్రవేశించలేరని హెచ్చరిస్తున్నది.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:

“బంధుత్వాలను త్రెంచేవాడు స్వర్గంలోనికి ప్రవేశించడు.” (బుఖారి)

బంధువులతో కలిసి మెలిసి ఉండటం ద్వారా జీవితంలో అభివృద్ధి సాధించవచ్చును. అంతేకాక జీవిత కాలం పెరుగుతుంది కూడా. దీనికి ఆధారం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఈ హదీథు: “ఎవరికైతే తన జీవనభృతి ఎక్కువ అవటం మరియు తన వయస్సు అధికమవటం అనే మాట మంచిగా అనిపిస్తుందో, వారు తమ బంధుత్వాలను గట్టి పరుచు కోవలెను.” (సహీహ్ బుఖారీ)

బంధువులతో కలిసి మెలిసి జీవించటం ద్వారా బంధువుల మధ్య పరస్పరం ప్రేమాభిమానాలు, ఐకమత్యం మరియు శాంతీ సుహృద్భావాలు వృద్ధి చెందుతాయి.

తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించడం:

తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఇస్లాం ఆజ్ఞాపిస్తున్నది. అంతేకాక వారికి అవిధేయత చూపవద్దని తీవ్రంగా నిరోధిస్తున్నది.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు:

وَوَصَّيْنَا الإِنْسَانَ بِوَالِدَيْهِ حُسْنًا   …(8)

“మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించినాము” (అంకబూత్ 29:8)

మంచిగా వ్యవహరించటం అంటే వారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించండి, వినమ్రత చూపండి, వారికి అణుకువ చూపండి, వారి ఆలనాపాలనా చూడండి మరియు వారితో ఎలాంటి చెడు వ్యవహారాన్నీ చేయవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించటం అనేది మహా పుణ్యకార్యాల కోవకు చెందినది. దీని కారణంగానే అల్లాహ్ తన ఆరాధనల ప్రక్కనే తల్లిదండ్రుల విధేయతను ఉంచుతూ, ఖుర్ఆన్ లో ఇలా ఆదేశిస్తున్నాడు:

وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا (23)

“మరియు నీ ప్రభువు ‘తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించాలనీ’ ఆజ్ఞాపించి ఉన్నాడు” (ఇస్రా17:23)

దీనితో పాటు వారిపై కోపం వ్యక్తం చేస్తూ ‘ఉఫ్’ అనడం వంటి అతి అల్పమైన చెడు వ్యవహారం కూడా చేయకూడదని తీవ్రంగా హెచ్చరించినాడు. వారిని ఉత్తమరీతిలో పలకరించండి అని ఆదేశించినాడు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:

...فَلَا تَقُلْ لَهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا(23)

“మరియు వారిని విసుక్కుంటూ, ‘ఛీ! (ఉఫ్)’ అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.” (ఇస్రా 17:23)

తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించడం అనేది మహోన్నతమైన పుణ్యకార్యాలలోనిది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహ వసల్లం దానికి జిహాద్ కంటే ఉన్నత స్థానాన్నిచ్చినారు. అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు – నేను ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ‘అల్లాహ్ అన్నింటి కంటే ఎక్కువగా ఇష్టపడే పని ఏది?’ అని ప్రశ్నించగా వారు ‘సమయం కాగానే నమాజు చేయటం’ అని సమాధానమిచ్చినారు. ‘ఆ తరువాత ఏది’ అని ప్రశ్నించగా, ‘తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించండి’ అని సమాధానమిచ్చినారు. ‘ఆ తరువాత ఏది’ అని ప్రశ్నించగా, ‘అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయండి.’ (బుఖారి హదీథు గ్రంథం)

ఒక వ్యక్తి జిహాద్ లో పాల్గొనటానికి అనుమతించమని కోరటానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రాగా, ఆయన అతనితో ‘నీ తల్లిదండ్రులు జీవించియున్నారా?’ అని ప్రశ్నించినారు. అతను ‘అవును’ అని సమాధానమిఇవ్వగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ‘వారిద్దరిలోనే (సేవలోనే) జిహాద్ చేయి’ అని పలికినారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడమనేది మహా ఘోరమైన పాపము. అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ బకరహ్ రదియల్లాహు అన్హు తన తండ్రి ద్వారా విన్న రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాన్ని ఇలా ఉల్లేఖించినారు.

“మహా ఘోరమైన పాపము గురించి నేను మీకు తెలుపనా? ఆయనిలా మూడు సార్లు ప్రశ్నించినారు. “తెలుపండి, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం” అని ప్రజలు బదులు పలికినారు. అప్పుడు ఆయన ఇలా తెలిపినారు “అల్లాహ్ తోపాటు ఎవరినైనా, దేనినైనా సాటి కల్పించటం మరియు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం” (బుఖారి హదీథు గ్రంథం)

తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించడం అనేది కూడా ఆరాధనలలో ఒక ఉన్నతమైన ఆరాధన. ఇది ముస్లింలను స్వర్గంలో చేర్చగలదు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు.

“స్వర్గపు ద్వారాలలోని మధ్య ద్వారమే తండ్రి. మీరు కావాలనుకుంటే ఆ ద్వారాన్ని ధ్వంసం చేసుకోండి లేదా దానిని రక్షించుకోండి.” (తిర్మిథీ)

నాలుకను రక్షించుకోవడం:

ఇస్లాం సుగుణాలతో కూడిన స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ధర్మం. అందువలననే అది ఎల్లప్పుడూ మంచి కార్యాల వైపు మరియు మంచి పలుకుల వైపు ఆహ్వానిస్తూ ఉంటుంది. ఒక ముస్లిం సంభాషణ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఇస్లాం చాలా గంభీరమైన విషయంగా తీసుకున్నది. కాబట్టి ఒక ముస్లిం యొక్క ప్రతి మాట మరియు ప్రతి పలుకు మంచిగా ఉండాలని, ఎప్పుడు పలికినా మంచి పలుకులే పలకమని ఇస్లాం ఆజ్ఞాపించినది. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు.

وَقُلْ لِعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ

“ఓ ప్రవక్తా! నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు.” (ఇస్రా 17:53)

తమ పలుకులు ఉత్తమమైనవిగా మరియు ధర్మాజ్ఞలకు లోబడి ఉంచాలనేది ముస్లింల కొరకు అనివార్యమై ఉన్నది. అంతేకాక ముస్లింల మాటలు ఇతరులకు కష్టం కలిగించకుండా ముఖ్యంగా తమ తోటిముస్లిం సోదరులకు కష్టం కలిగించకుండా ఉండాలి. పలికితే మంచి మాటలే పలకవలెను లేదా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

 لَا خَيْرَ فِي كَثِيرٍ مِنْ نَجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ  …(114)

“వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచనలు) చేస్తే తప్ప” (అన్నిసా 4:114)

మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు.

“ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారో, అలాంటి వారు పలికితే మంచి పలుకులే పలకాలి లేదా నిశ్శబ్దంగా ఉండాలి.” (హదీథు)

పొరుగువారి హక్కులు:

ప్రజలు తమ మధ్య పరస్పరం మంచి సంబంధాలు నెలకొల్పుకునే విధంగా ఇస్లాం ప్రోత్సహిస్తున్నది. నిస్సందేహంగా ఇరుగు పొరుగు వారు దీని కొరకు ప్రజలందరిలోనూ ఎక్కువ అర్హులు. అందుకనే ఖుర్ఆన్ మరియు హదీథులలో వీరి గురించి ఎక్కువ ఆదేశాలు వెలువడినవి.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “పొరుగువారి గురించి జిబ్రయీలు అలైహిస్సలాం ఎంత ఎక్కువగా తాకీదు చేసే వారంటే, ఎక్కడ ‘పొరుగువారిని కూడా వారసులుగా చేయమని అంటారో’ అని నాకు అనిపించేది.”

ముస్లింలు తోటిముస్లింలతో వ్యవహరించవలసిన పద్ధతి:

ముస్లింల మధ్య దగ్గరి బంధాన్ని ఇస్లాం నెలకొల్పుతుంది. ఎందుకంటే ఒకరినొకరు పరస్పరం ఇష్టపడే విధంగా మరియు తమపై ఇతరులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా అల్లాహ్ వారిలో సోదరభావాలు, ఆత్మీయత కలిగించినాడు. మరియు దేనివలనైనా ఒకరికి బాధ లేక సంతోషం కలిగితే, దానికి ఇతరులు కూడా ప్రభావితులయ్యేట్లు చేసినాడు. దీని కారణంగా ఒకవేళ తోటి ముస్లిం - నిస్సహాయ స్థితిలో ఉంటే అతను సహాయపడతాడు. ఆదుకోమని కోరితే అతనిని ఆదుకంటాడు. అతనితో మొరపెట్టుకుంటే, దానిని ఆలకిస్తాడు. అతనికి అన్యాయం చేయకుండా నిజాయితీతో వ్యవహరిస్తాడు. ఇంకా అతనిని చులకన చేయడు. తక్కువ చేసి చూడడు. అతని కష్టాన్ని దూరం చేసి, అతని అవసరాన్ని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాడు. దీని గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “ఒక ముస్లిం, మరో ముస్లిం యొక్క సోదరుడు – అతనిపై ఎలాంటి అత్యాచారం చేయడు, అతనిని అసహాయ స్థితిలో వదిలిపెట్టడు. ఎవరైతే తన సోదరుడి అవసరాలను పూర్తి చేయటంలో నిమగ్నమై ఉంటాడో, అల్లాహ్ అతని అవసరాలను పూర్తి చేస్తాడు. మరియు ఏ వ్యక్తి అయితే మరో ముస్లిం యొక్క దు:ఖాన్ని దూరం చేస్తాడో, ప్రళయ దినమున అల్లాహ్ అతని దు:ఖాన్ని దూరం చేస్తాడు. మరియు ఎవరైతే ఒక ముస్లిం యొక్క స్వంత విషయాలను దాచి ఉంచుతాడో, ప్రళయదినమున అల్లాహ్ అతని విషయాలను దాచి పెడతాడు.” (హదీథు)

ముస్లిమేతరులతో ఒక ముస్లిం యొక్క ప్రవర్తన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “ప్రవర్తన యొక్క నామమే దీన్ (ధర్మం)

కేవలం ఎవరో ఒకరితో మాత్రమే మంచిగా ప్రవర్తించమని మరియు లావాదేవీలు – వ్యవహారాలు జరపమని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హద్దులు విధించలేదు. కానీ చాలా సామాన్యమైన కలుపుగోలు మాట పలికినారు దేనిలోనైతే మొత్తం అరబ్బులు, పాశ్చాత్యులు, దగ్గరివారూ – దూరం వారూ, ముస్లింలు – ముస్లిమేతరులు కూడా ఏకమై పోతారో. ఇస్లాం ధర్మం మానవులతో మాత్రమే కాకుండా పశుపక్ష్యాదులతో కూడా మంచిగా ప్రవర్తించే మరియు వినమ్రంగా వ్యవహరించే విధంగా ప్రోత్సహిస్తుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: మరణించే వరకు ఒక పిల్లిని బంధించి ఉంచిన కారణంగా ఒక మహిళకు అతి కఠినమైన శిక్ష విధించ బడినది. దానికి అన్నపానీయలు ఇవ్వకుండా మరియు కనీసం భూమిపై ఉన్న గడ్డిపరకలు తినటానికి కూడా వదలకుండా బంధించిన కారణంగా ఆవిడ నరకంలోనికి పోయినది.” (బుఖారి మరియు ముస్లిం హదీథు గ్రంథాలు).

సహనంz, ఓర్పు%

ఇస్లాంలో సహనానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అల్లాహ్ వద్ద సహనానికి ఉన్న మహోన్నత స్థానం ఎటువంటిది అంటే ఖుర్ఆన్ లో 70 కంటే ఎక్కువ చోట్ల దీని గురించి పేర్కొనబడినది. కాబట్టి ముస్లింలు తప్పక సహనం, ఓర్పు వహించవలెను. అల్లాహ్ నుండి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయనే ఆశతో, మనం కష్టాలను సహనంతో ఎదుర్కొనవలెను. సహనం విశ్వాసులందరిలో ఉండే విశేషగుణం. ఎందుకంటే అల్లాహ్ ఆదేశించిన దానిని పాటించడంలో మరియు అల్లాహ్ నిరోధించిన దాని నుండి దూరంగా ఉండటంలో సహనం, ఓర్పుల యొక్క ఆవశ్యత చాలా ఉన్నది. ఒక విశ్వాసి తనపై, తన సంపదపై లేదా తన సంతానంపై ఏదైనా ఆపద వచ్చిపడినప్పుడు, అల్లాహ్ వ్రాసిన తన విధివ్రాతపై ఎలాంటి అయిష్టాన్నీ చూపక, దానిని ప్రశాంతంగా సహనంతో, ఓర్పుతో ఎదుర్కొవటాన్ని అల్లాహ్ ఎంతో ఇష్టపడతాడు. అలా చేయకపోతే అల్లాహ్ ఆగ్రహం అతనిపై వచ్చిపడుతుంది.

ఓ నా నవముస్లిం సోదరుడా! మీకు ఇతరుల కంటే అధికంగా సహనం, ఓర్పు యొక్క ఆవశ్యత ఉన్నది. ఎందుకంటే సాధారణంగా నవముస్లింలకు తమ కుటుంబం నుండి, బంధువుల నుండి, కులం నుండి మరియు సమాజం నుండి చాలా కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. తను స్వీకరించిన ఈ సత్యధర్మాన్ని వదిలి పెట్టి, తిరిగి తమ ధర్మంలోనికే మరలి రమ్మని వారు పెట్టే తీవ్ర ఒత్తిడి నుండి బయట  పడటానికి అతను చాలా కష్టపడవలసి వస్తుంది. కాబట్టి మీపై సహనం మరియు ఓర్పు అనివార్యమై ఉన్నది. సహనం ద్వారా మీరు తన సహాయాన్ని అర్థించాలని అల్లాహ్ అభిలషిస్తున్నాడు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ  …(45)

“సహనం మరియు నమాజుల ద్వారా (నా) సహాయాన్ని అర్థించండి.” (బఖరహ్ 2:45)

ఇస్లాం ధర్మం సమానత్వానికి కట్టుబడిన ధర్మము:

ఇస్లాం ధర్మం తన అనుచరుల మధ్య సమానత్వానికి కట్టుబడి ఉన్న ధర్మం. అరబ్బులకు అరబ్బేతరులపై లేదా అరబ్బేతరులకు అరబ్బులపై ఎలాంటి ఆధిక్యతా లేదు. కేవలం తమలోని అల్లాహ్ యొక్క భయభక్తుల (తఖ్వా) ద్వారా మాత్రమే విశిష్ఠత పొందగలరు. అంతేగాని, మరే ఇతర విషయం ద్వారానో కాదు. ఇస్లాం ధర్మంలోని అన్ని ఆరాధనలలోనూ మరియు ఇస్లామీయ జీవన విధానంలోని అన్ని కోణాలలోనూ సమానత్వ దృశ్యమే కనబడుతుంది. నమాజులో అందరు ముస్లింలు ఒకే పంక్తిలో నిలబడతారు. యజమాని మరియు నౌకరు, ధనవంతుడు మరియు బీదవాడు, తెల్లవాడు మరియు నల్లవాడు – ఎలాంటి భేదభావం, హెచ్చుతగ్గులు లేకుండా భుజానికి భుజం ఆనించి అందరూ ఒకే వరుసలో నిలబడతారు, ఒకేసారి రుకూ చేస్తారు (ముందుకు వంగుతారు), ఒకేసారి సజ్దా చేస్తారు (సాష్టాంగ పడతారు). అంతేగాక వారందరూ ఒకే కప్పు క్రింద నిలబడతారు. అలాగే ఒకేసారి ఒకే సమయంలో అందరు ముస్లింలు ఉపవాసం ప్రారంభించి, అన్నపానీయాలు సేవించడం మరియు దాంపత్యసుఖం అనుభవించడం నుండి ఆగిపోతారు. అదేవిధంగా అందరు ముస్లింలు ఒకే సమయంలో ఒకేసారి తమ ఉపవాసాన్ని వదులుతారు. అలాగే హజ్ లో కూడా హజ్ యాత్రికులందరూ హజ్ ఆరాధనలను ఒకరిలానే మరొకరు ఆచరిస్తారు. మనం హజ్ యాత్రికుల వైపు చూసినట్లయితే, ప్రాంత - దేశ - అంతస్తులను అనుసరించి వారిని ఒకరి నుండి ఇంకొకరిని వేరు చేయలేము. మనం ఎల్లప్పుడూ న్యాయం చేయాలని మరియు సమానత్వం పాటించాలని ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు.

 وَيْلٌ لِلْمُطَفِّفِينَ

“కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశనముంది” (ముతఫ్ఫిఫీన్ 83:1)

ఇదే విధంగా ఖుర్ఆన్ లో మరోచోట అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:

 …إِنَّ اللهَ يُحِبُّ المُقْسِطِينَ

“నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు” (హజురాత్49:9)

న్యాయం మరియు సమానత్వాలను పూర్తిగా సమర్ధించే ఇస్లాం ధర్మానికి సరిసమానమైన వ్యవస్థ నేటి ప్రపంచంలో మరొకటేదైనా ఉన్నదా? మానవుల కొరకు మానవుల సృష్టికర్త మరియు యజమాని పంపినదే ఈ వ్యవస్థ. దీని కంటే గొప్పదని కొందరు ప్రజలు భావించే నేటి ప్రజాస్వామ్యం దీనికి సాటి రాగలదా? ఓ వివేకవంతులారా! హితబోధను గ్రహించండి.

ఇస్లాం మరియు తీవ్రవాదం:

మన ప్రస్తుత కాలంలో ప్రతిదానికీ ఇస్లాంను తీవ్రవాదంతో ముడిపెట్టే ఆలోచన సామాన్యమై పోయినది. ఇస్లాం ధర్మపు శత్రువులు, ఇస్లాం ధర్మాన్ని అస్సలు అర్థం చేసుకోనివారు మరియు కొందరు స్వార్థపరులు చేస్తున్న దుష్ప్రచార కోణంలో ఇస్లాంను అర్థం చేసుకున్న కొందరు అమాయకులు ఉత్పత్తి చేసిన ఆలోచనే ఇది.   ధర్మం మరియు మానవుడి మధ్య గల సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోని వారే దీనిని నమ్ముతారు. ధర్మం మరియు మానవుడు రెండూ వేర్వేరు అంశాలనేది వారు మరచిపోతున్నారు.

కాబట్టి ఇస్లాం యొక్క మహోన్నత రూపానికీ మరియు కొందరు దుష్ప్రచారం చేస్తున్న దానికీ మధ్య ఎలాంటి సంబంధమూ ఉండజాలదు.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని మంచి మాటలు:

1.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎక్కడున్నా సరే, అల్లాహ్ కు భయపడుతూ ఉండుము మరియు చెడు తరువాత మంచి చేయుము, ఎందుకంటే అది (మంచి) దానిని (చెడును) తుడిచివేస్తుంది మరియు ప్రజలతో ఉత్తమంగా వ్యవహరించుము.”

2.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“నిస్సందేహంగా ఆచరణల యొక్క ప్రతిఫలం సంకల్పాల పైనే ఆధారపడి ఉంటుంది.”

3.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ముస్లిం అంటే అతనే, ఎవరి నాలుక మరియు చేతుల నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో.”

4.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎవరైతే మోసం చేస్తారో, అతను మాలోని వాడు కాదు.”

5.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎవరైతే అల్లాహ్ పై మరియు అంతిమ దినం పై విశ్వాసం కలిగి ఉంటారో, అతను తన పొరుగువారిని కష్ట పెట్టకూడదు.”

6.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎవరైతే అల్లాహ్ పై మరియు అంతిమ దినం పై విశ్వాసం కలిగి ఉంటారో, అతను తన అతిథిని గౌరవించ వలసియున్నది.”

7.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎవరైతే అల్లాహ్ పై మరియు అంతిమ దినం పై విశ్వాసం కలిగి ఉంటారో, అతను పలికితే మంచి పలుకులనే పలకవలెను లేదా నిశ్శబ్దంగా ఉండవలెను.”

8.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఇస్లాం సుగుణాలలోని ఒక సుగుణం ఏమిటంటే మానవుడు ఏ ప్రయోజనమూ లేని విషయాలను వదిలివేయవలెను.”

9.    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఒక ముస్లిం తోటి ముస్లిమునకు సోదరుడు. అతను అతనిపై అత్యాచారం చేయడు మరియు అతనిని శత్రువులకూ అప్పగించడు. ఎవరైతే తన సోదరుడి అవసరంలో (పూర్తిచేయటంలో) నిమగ్నమై ఉంటాడో, అల్లాహ్ అతని (అవసరాన్ని) పూర్తిచేస్తాడు.

10. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“సత్యాన్ని గట్టిగా పట్టుకోండి – సత్యం మంచితనం వైపు దారి చూపుతుంది మరియు మంచితనం స్వర్గం వైపునకు తీసుకు పోతుంది. మరియు అసత్యం నుండి కాపాడుకోండి – అసత్యం దుష్టత్వం వైపు దారి చూపుతుంది మరియు దుష్టత్వం నరకం వైపునకు తీసుకుపోతుంది.”

11. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“నిశ్చయంగా, మంచివైపు పిలిచేవారు, దానిని ఆచరించు వారితో సమానం (మంచి పని చేసినవారూ, దాని వైపు పిలిచినవారూ – ఇద్దరూ సరిసమానంగా ప్రతిఫలం పొందుతారు).”

12. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“అత్యాచారానికి, దౌర్జన్యానికి గురి అవుతున్నవారి శాపం నుండి కాపాడుకోండి, ఎందుకంటే దానికీ (శాపానికి) మరియు అల్లాహ్ కూ మధ్య ఏ ఆటంకమూ లేదు.”(నిస్సహాయుల ప్రార్థన అల్లాహ్ కు చేరకుండా ఏదీ అడ్డగించలేదు)

13. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎత్తిపడవేసేవాడు బలవంతుడు కాదు, కోపంలో తనను తాను అదుపులో ఉంచుకోగలిగేవాడే బలవంతుడు.”

14. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“తోటి సోదరుడితో మూడు రాత్రుల కంటే ఎక్కువ, దూరంగా ఉండటమనేది ఏ ముస్లిం కొరకూ ధర్మసమ్మతం కాదు.”

15. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“దానం చేయటం వలన సంపద తరిగిపోదు.”

16. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎవరైతే అల్లాహ్ కోసం వంగుతారో, అల్లాహ్ అతని స్థానాన్ని ఇంకా ఉన్నత పరుస్తాడు.”

17. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“అత్యాచారం నుండి కాపాడుకోండి, నిశ్చయంగా అత్యాచారం అంతిమ దినమున అంధకారంగా మారిపోతుంది.”

18. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎవరైతే మన చిన్నారులపై దయ చూపరో మరియు పెద్దలను గౌరవించరో, అలాంటి వారు మాలోని వారు కారు.”

19. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“మానసిక ఐశ్వర్యమే (నిరాపేక్షతయే) అసలు ఐశ్వర్యము.”

20. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఒక హదీథును అబ్దుల్లాహ్ బిన్ సలామ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు:

“ఓ ప్రజలారా! సలాంను వ్యాపింపజేయండి. అన్నం పెట్టండి మరియు రాత్రులలో నమాజు చేయాలంటే, అందరూ నిద్రలో ఉన్నప్పుడు చేయండి, అలా చేస్తే, మీరు స్వర్గంలో   ప్రశాంతంగా ప్రవేశిస్తారు.”

21. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఎడమ చేతితో తినకండి ఎందుకంటే షైతాను ఎడమచేతితోనే తింటాడు మరియు తాగుతాడు.”

22. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“చనిపోయినవారిని దూషించకండి.”

23. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“అప్పటివరకు మీలో ఎవరూ విశ్వాసులు కాజాలరు ఎప్పటి వరకైతే అతను తన కోసం దేనినైతే ఇష్టపడతాడో దానినే తన సోదరుడి కోసం కూడా ఇష్టపడనంత వరకు.”

24. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన హదీథును ఆబూ అమ్ర్ మరియు అబూ అమరహ్ సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు:

నేను ఇలా అన్నాను “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఇస్లాం గురించి ఇంకెవరినీ అడగవలసిన అవసరం కలగని మాటను నాకు తెలుపండి.” అప్పుడు ఆయన ఇలా తెలిపినారు

పలుకు “నేను అల్లాహ్ ను విశ్వసించినాను.” ఆ తరువాత దానిపై స్థిరపడిపో.

25. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“పుణ్యం అనేది మంచి వ్యవహారం యొక్క పేరు. మరియు మీ మనస్సులో గుచ్చుకునే మరియు దాని గురించి ప్రజలు తెలుసుకోవటం మీకు ఇష్టం లేనిదే పాపం అనబడును.”

26. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“మీలో ఎవరైనా ఏదైనా చెడును చూస్తే, దానిని చేతితో తప్పక ఆపవలెను. ఒకవేళ అతనికి అలా ఆపగలిగే శక్తి లేకపోతే నాలుకతో ఆపవలెను. ఒకవేళ అతనికి అంతటి శక్తి కూడా లేకపోతే మనస్సులోనే ఆ పనిని చెడుపనిగా భావించవలెను మరియు ఇలా భావించటం అన్నింటి కంటే బలహీనమైన ఈమాన్ (విశ్వాసం).”

27. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“నిస్సందేహంగా ఎవరైతే ఇతరులతో మంచిగా వ్యవహరిస్తాడో, అతనే మీలో అందరి కంటే ఉత్తముడు.”

28. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినారు:

“ఖుర్ఆన్ నేర్చుకునే మరియు నేర్పేవాడే మీలో అందరి కంటే ఉత్తముడు.”

®      ®      ®