خلق الإنسان
అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు, కృతజ్ఞతలూ అల్లాహ్ కే.
అల్లాహ్ తన చేతులతో ఆదంను సృష్టించినాడు. తనచే సృష్టించబడిన అతని ఆత్మను అతనిలో ఊదినాడు మరియు అతనికి సజ్దా (సాష్టాంగం) చేయమని తన మలాయికలను (దైవదూతలను) ఆదేశించినాడు.
అల్లాహ్ ఆదంను మట్టితో సృష్టించినాడు. ఖుర్ఆన్ లో దీని గురించి ఆయన ఇలా తెలుపుతున్నాడు:
“నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఈసా యొక్క ఉదాహరణ ఆదము వంటిదే. అతనిని (ఆదమ్ ను) అల్లాహ్ మట్టితో చేసాడు. తరువాత అతనితో "అయిపో!" అనగానే, అతను ఉనికిలోనికి వచ్చాడు.”
[ఆలే ఇమ్రాన్ 3:59 - ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఆదంను సృష్టించిన తరువాత, అతనికి సాష్టాంగం చేయమని అల్లాహ్ మలాయికలను ఆదేశించగా, వారందరూ సాష్టాంగం చేసినారు. కానీ, ఆ సమయంలో అక్కడే నున్న ఇబ్లీసు సాష్టాంగం చేయక, అల్లాహ్ ఆజ్ఞలను తిరస్కరించినాడు. ఆదంకు సాష్టాంగపడటంలో అతని గర్వమూ, అహంకారమూ అతడికి అడ్డుపడినాయి:
“నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): ‘నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను.
ఇక ఎప్పుడైతే నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, మీరు అతని ముందు సజ్దా (సాష్టాంగం)లో పడి పొండి.’
కాబట్టి దైవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు,
ఒక్క ఇబ్లీసు తప్ప. అతడు గర్వితుడయ్యాడు మరియు సత్యతిరస్కారులలోకలసిపోయాడు.”
[సూరహ్ సాద్ 38:71-74 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అప్పుడు అల్లాహ్ మలాయికలతో ‘ఆదంను భూమిపైకి పంపబోతున్నానని మరియు అతని సంతానం నుండి తరతరాలను సృష్టించబోతున్నానని’ పలికినాడు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా తెలుపబడింది:
“నీ ప్రభువు తన మలాయికలతో (దైవదూతలతో) “నిశ్చయంగా నేను భూలోకంలో ఖలీఫాను (ప్రతినిధిని) సృష్ఠించబోతున్నాను” అని అన్నాడు,’”
[సూరహ్ అల్ బఖరహ్ 2:30 - ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
సమస్త నామములను అల్లాహ్ ఆదమునకు నేర్పినాడు:
“ఆ తరువాత ఆయన సమస్త (వస్తువుల) పేర్లు ఆదము నేర్పినాడు”
[సూరహ్ అల్ బఖరహ్ 2:31 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఇబ్లీసు ఆదమునకు సాష్టాంగం చేయటాన్ని తిరస్కరించగానే, అల్లాహ్ అతడిని అక్కడి నుండి వెళ్ళగొట్టినాడు మరియు అతడిని శపించినాడు:
“(అల్లాహ్) అన్నాడు: ‘ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో; నిశ్చయంగా, నీవు బహిష్కరింపబడినావు. మరియు నిశ్చయంగా తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది.’”
[సూరహ్ సాద్ 38:77-78 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఇబ్లీసు తనకు పట్టబోయే దుర్గతిని పసిగట్టగానే, పునరుత్థాన దినం వరకు తనకు గడువునివ్వమని అల్లాహ్ ను ఇలా వేడుకున్నాడు:
“[అప్పుడు ఇబ్లీస్] ఇలా మనవి చేసుకున్నాడు: ‘ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు.’
(అల్లాహ్) సెలవిచ్చాడు: ‘సరే, నీకు వ్యవధి ఇవ్వబడుతున్నది. ఆ నియమిత గడువు వచ్చే వరకు.”
[సూరహ్ సాద్ 38:79-81 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అల్లాహ్ ఆ గడువును ప్రసాదించగానే, ఆదం మరియు ఆదం సంతానంపై అతడు యుద్ధాన్ని ప్రకటించినాడు. వారికి అవిధేయత ఆకర్షణీయంగా కనబడేటట్లు చేసినాడు మరియు సత్యధర్మాన్ని వదిలి, వారు అధర్మమైన పనులు చేసేటట్లుగా ప్రేరేపించటానికి పూనుకున్నాడు:
“[ఇబ్లీస్] అన్నాడు: ‘నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను – వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప.’”
[సూరహ్ సాద్ 38:82-83 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అల్లాహ్ ఆదంను సృష్టించినాడు, అతని నుండి అతని భార్యను సృష్టించినాడు మరియు వారి సంతానం నుండి పురుషులనూ మరియు స్త్రీలనూ అల్లాహ్ సృష్టించినాడు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించానాడు (ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం):
“ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి – ఎవరైతే ఒకే ఆత్మ నుండి మిమ్మల్ని సృష్టించినాడో. దాని నుండే ఆయన దాని జతను సృష్టించినాడు. ఆ ఇద్దరి నుండి అనేక మంది పురుషులను మరియు స్త్రీలను విస్తరింపజేసినాడు.”
[సూరహ్ అన్నిసా 4:1 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అప్పుడు అల్లాహ్ ఆదం మరియు అతని భార్యకు స్వర్గవనాలలో, వారిద్దరినీ పరీక్షించటం కొరకు నివాసం కల్పించినాడు. స్వర్గవనాలలోని పళ్ళుఫలాలను తినమని అల్లాహ్ వారిని ఆదేశించినాడు. అయితే ఒక చెట్టు పళ్ళు మాత్రం తినకూడదని ఆయన నిషేధించినాడు:
“మేము ఇలా పలికాము “ఓ ఆదము! నీవూ, నీ భార్య స్వర్గంలో నివసించండి; అందునుండి మీకు ఇష్టమైనవి యధేచ్ఛగా తినండి; కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా వెళ్ళకండి. అలా వెళ్ళినట్లయితే, మీరు దుర్మార్గులలో చేరిపోతారు.” ”
[సూరహ్ అల్ బఖరహ్ 2:35 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ముందు జాగ్రత్తగా అల్లాహ్ ఆదం మరియు అతని భార్యను షైతాను గురించి ఇలా హెచ్చరించినాడు. (ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం):
అప్పుడు అన్నాము: “ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీరిద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి, అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు.”
[సూరహ్ తాహా 20:117 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అయితే షైతాను ఆదం మరియు అతని భార్యతో గుసగుసలాడి, ఆ నిషేధింపబడిన చెట్టు ఫలాలు తినేటట్లు వారిని ప్రేరేపించినాడు. అల్లాహ్ యొక్క హెచ్చరికను మరచి, ఆ ప్రేరణను ప్రతిఘటించలేక, తన ప్రభువుకు అవిధేయత చూపి, ఆదం ఆ చెట్టు ఫలాలు తిన్నాడు:
“అప్పుడు షైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు : ‘ఓ ఆదమ్! శాశ్వత జీవితాన్ని మరియు అంతం కాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా?’
ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పు కోసాగారు. (ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పిపోయాడు.”
[సూరహ్ తాహా 20:120-121 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
వారి ప్రభువు వారిని పిలిచి, వారితో ఇలా పలికినాడు (ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం):
“ఏమి, నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా?”
[సూరహ్ అల్ అరాఫ్ 7:22 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఆ చెట్టు ఫలాలు తిన్న వెంటనే వారు తాము చేసిన దానికి పశ్చాత్తాప పడి, ఇలా వేడుకున్నారు:
“మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే, మమ్మల్ని క్షమించకపోతే, నిశ్చయంగా మేము నాశనమైపోయే వారమవుతాము.”
[సూరహ్ అల్ అరాఫ్ 7:23 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఆదం చేసిన తప్పుకు కారణం కోరికే గాని అహంకారం కాదు. కాబట్టి, ప్రాయశ్చితం చేసుకునే మరియు క్షమాభిక్ష వేడుకునే మార్గాన్ని అల్లాహ్ అతనికి చూపి, అతని నుండి ఆయన దానిని స్వీకరించినాడు:
“అప్పుడు ఆదము తన ప్రభువు నుండి కొన్ని వచనాలు నేర్చుకొనగా, ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించెను. నిశ్చయంగా ఆయనే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడు.”
[సూరహ్ అల్ బఖరహ్ 2:37 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఈ మార్గమే ఆదం మరియు అతని సంతతికి చెందిన మార్గం: అంటే తప్పు చేసినవారెవరైనా సరే, చిత్తశుద్ధితో వెంటనే పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను క్షమాభిక్ష వేడుకుంటే, అల్లాహ్ దానిని స్వీకరిస్తాడు:
“ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు.”
[సూరహ్ అష్ షూరా 42:25 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అప్పుడు అల్లాహ్ ఆదం మరియు అతని భార్యను, ఇబ్లీసును భూమిపైకి పంపినాడు. మరియు వారి కొరకు దివ్యవాణిని అవతరింపజేసినాడు మరియు వారి కొరకు తన సందేశహరులను పంపినాడు. కాబట్టి, ఎవరైతే విశ్వాసం చూపుతారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు ఎవరైతే అవిశ్వాసం చూపుతారో, వారు నరకంలో ప్రవేశిస్తారు:
“మేము ఇలా అన్నాము “ఇందునుండి మీరందరూ దిగిపొండి, నా వద్ద నుండి మీ కొరకు ఉపదేశం వచ్చినప్పుడు, ఎవరైతే దానిని అనుసరిస్తారో, వారికి ఎలాంటి భయమూ లేదు మరియు వారు ఏ విధంగానూ దు:ఖపడరు.
కాని ఎవరైతే తిరస్కరించి, మా ఆయతులను (వచనాలు, సూచనలు) అసత్యాలని నిరాకరిస్తారో, వారే నరకవాసులు - అందులో వారు శాశ్వతంగా ఉంటారు.’”
[సూరహ్ అల్ బఖరహ్ 2:38-39 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఎప్పుడైతే అల్లాహ్ వారందరినీ భూమిపైకి పంపివేసినాడో, విశ్వాసానికీ మరియు అవిశ్వాసానికీ మధ్య, విధేయతకూ మరియు అవిధేయతకూ మధ్య, సత్యానికీ మరియు అసత్యానికీ మధ్య, మంచికీ మరియు చెడుకూ మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. అంతిమంగా ఈ భూమి అల్లాహ్ వైపు మరలేంత వరకూ మరియు ఈ భూమిపై ప్రజలు నివసిస్తున్నంత వరకూ ఇది కొనసాగుతుంది:
“(అల్లాహ్) అన్నాడు: ‘మీరందరూ దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి.’
[సూరహ్ అల్ అరాఫ్ 7:24 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఏ పనైనా చేయగల సామర్ధ్యం అల్లాహ్ కలిగియున్నాడు. ఆయన ఆదంను తల్లీ – తండ్రీ లేకుండానే సృష్టించినాడు. అతని భార్య హవ్వాను తల్లి లేకుండానే ఆయన ఆదం నుండి సృష్టించినాడు. ఇంకా ఆయన ఈసా అలైహిస్సలాంను తండ్రి అవసరం లేకుండానే కేవలం తల్లి నుండి సృష్టించినాడు. మరియు ఆయన మనల్ని తల్లీ మరియు తండ్రి నుండి సృష్టించినాడు.
అల్లాహ్ ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరియు ఆయన అతని సంతానాన్ని వీర్యబిందువుల నుండి సృష్టించాడు. దీని గురించి అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తరమరీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు.
తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారం (వీర్యం)తో చేశాడు.
ఆ తరువాత అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు. మరియు మీకు వినే శక్తిని మరియు హృదయాలను (అర్థం చేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువ!”
[సూరహ్ అస్సజ్దా 32:7-9 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
మనిషి ఏ విధంగా తల్లి గర్భంలో సృష్టించబడతాడు మరియు పిండాభివృద్ధి చెందే వివిధ దశలు నిజంగా ఒక మహాద్భుతమైన విషయం. ఈ క్రింది వచనంలో అల్లాహ్ దీనిని ఇలా వివరించినాడు:
“మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.
తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.
ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆపైన ఆ రక్తపు ముద్ద (జలగ)ను మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము. ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.”
[సూరహ్ అల్ మూమినూన్ 23:12-14 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
కేవలం అల్లాహ్ మాత్రమే తను తలచిన ప్రతిదీ సృష్టించగలడు. గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. ఆయనే (తన సృష్టితాల) ఆహారాన్నీ మరియు జీవిత కాలాన్నీ జారీ చేస్తాడు.:
“భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే, ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తాడు.
లేదా, వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు. మరియు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్థుడు.”
[సూరహ్ అష్ షూరా 42:49-50 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “గర్భంపై ఒక దైవదూతను అల్లాహ్ నియమిస్తాడు. ఆ దైవదూత అల్లాహ్ తో ఇలా పలుకుతాడు, ‘ఓ ప్రభూ! ఒక వీర్యబిందువు (నుత్ఫా), ఓ ప్రభూ! ఒక రక్తం గడ్డ (అలఖ్), ఓ ప్రభూ! ఒక మాంసపు ముద్ద (ముద్గాహ్).’ అప్పుడు అల్లాహ్ దాని సృష్టిని పూర్తి చేయదలిస్తే, ఆయనను ఆ దైవదూత ఇలా ప్రశ్నిస్తుంది - ‘(ఓ ప్రభూ!) మగ లేక ఆడా, చెడ్డదా
(నరకానికి పోయేదా) లేక మంచిదా (స్వర్గానికి పోయేదా)? దాని జీవితకాలం ఎంత?’ కాబట్టి, అది (శిశువు) ఇంకా తల్లిగర్భంలో ఉన్నప్పుడే, ఇదంతా లిఖించివేయబడుతుంది.”
(సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం, 318)
ఆదం సంతానానికి అల్లాహ్ గౌరవమర్యాదలు ప్రసాదించినాడు మరియు వారు లాభం పొందుట కొరకు భూమ్యాకాశాలలో ఉన్న వాటిని వారికి వశపరచినాడు:
“ఏమీ, ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ మరియు ఆయన బహిరంగం గానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా?
[సూరహ్ లుఖ్మాన్ 31:20 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అతడు తన ప్రభువు, సృష్టికర్త, పోషకుడైన అల్లాహ్ ను గుర్తించి, తద్వారా ఏది మంచి – ఏది చెడు, ఏది ప్రయోజనకరమైనది - ఏది హానికరమైనది, ఏది ధర్మమైనది (హలాల్) – ఏది అధర్మమైనది (హరామ్) అనే విషయాలు గ్రహించే విధంగా చేసినాడు. దాని కొరకు అవసరమైన బుద్దినీ, వివేకాన్నీ అల్లాహ్ మానవుడికి ప్రసాదించినాడు. తద్వారా ఇతర సృష్టితాలపై అతనికి విశిష్టత్వాన్నీ మరియు ఔన్నత్యాన్ని ప్రసాదించినాడు.
అల్లాహ్ మానవుడిని సృష్టించి, ఆ తరువాత అతను అనుసరించటానికి ఏ మార్గమూ చూపకుండా అలా నిరాధారంగా వదిలివేయకుండా, మానవులకు ఋజుమార్గాన్ని చూపటం కొరకు దివ్యగ్రంథాలను అవతరింపజేసినాడు మరియు దైవప్రవక్తలను పంపినాడు.
ఏకదైవత్వం (తౌహీద్ – అల్లాహ్ యొక్క ఏకత్వంలో విశ్వాసం) వైపు మరలే సహజ గుణాలతో అల్లాహ్ మానవుడిని సృష్టించినాడు. దాని నుండి దారి తప్పిన ప్రతిసారీ, అల్లాహ్ వారిని మరల ఋజుమార్గం వైపు తీసుకురావటానికి తన ప్రవక్తను పంపినాడు. అలాంటి ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం మరియు చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం:
“మానవులంతా ఒకే సమాజంగా ఉండినారు. (వారిలో నుండి) అల్లాహ్ ప్రవక్తలను శుభవార్త నిచ్చేవారిగానూ మరియు హెచ్చరించేవారిగానూ ప్రభవింపజేసినాడు. మరియు వారితో పాటు, ప్రజలు (ధర్మం విషయంలో) విభేదిస్తున్న వాటి గురించి వారి మధ్య తీర్పు చెప్పటానికి, సత్యంతో కూడిన దివ్యగ్రంథాన్ని అవతరింపజేసినాడు.
[సూరహ్ అల్ బఖరహ్ 2:213 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ప్రవక్తలందరూ అదే సత్యం వైపునకు ప్రజలను పిలిచినారు. ఆ సత్యం ఏమిటంటే – కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటం మరియు అల్లాహ్ కు సాటి కల్పించబడుతున్న ఇతర దైవాలన్నింటినీ తిరస్కరించటం:
“మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి.”
[సూరహ్ అన్నహల్ 16:36 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
తన ప్రవక్తలతో మరియు సందేశహరులతో అల్లాహ్ పంపిన ధర్మం ఒక్కటే – అదియే ఇస్లాం:
“నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం ఇస్లాం (అల్లాహ్ కు విధేయులవటం) మాత్రమే”
[ఆలే ఇమ్రాన్ 3:19 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అల్లాహ్ అవతరింపజేసిన దివ్యవాణులలో చిట్టచివరిది దివ్యఖుర్ఆన్. అది తనకంటే ముందు అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలను ధృవీకరిస్తుంది మరియు అది సమస్త మానవజాతికి మార్గదర్శకత్వం వహిస్తుంది:
“(ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో – అంధకారాలనుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకురావటానికి, (ఓ ముహమ్మద్) నీపై అవతరింపజేశాము.
[సూరహ్ ఇబ్రాహీమ్ 14:1 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
అల్లాహ్ పంపిన ప్రవక్తలలో మరియు సందేశహరులలో చిట్టచివరి అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం:
“ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.”
[సూరహ్ అల్ అహ్ జాబ్ 33:40 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
సమస్త మానవాళి కొరకు అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపినాడు:
“(ఓ ముహమ్మద్) ఇలా అను: ‘మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను’”
[సూరహ్ అల్ అరాఫ్ 7:158 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ఖుర్ఆన్ - దివ్యవాణులలో చిట్టచివరిది మరియు మహోన్నతమైనది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రవక్తలు మరియు సందేశహరులలో చిట్టచివరివారు మరియు అత్యుత్తమమైనవారు.
ఖుర్ఆన్ అవతరణ ద్వారా అల్లాహ్ దివ్యవాణులన్నింటినీ రద్దు పరచినాడు. కాబట్టి ఎవరైతే ఖుర్ఆన్ ను అనుసరించకుండా, ఇస్లాంలో ప్రవేశించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి మరియు వారిని అనుసరించి జీవితం గడుపుతున్నట్లయితే, అతని ఆచరణలు స్వీకరించబడవు:
“మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరతాడు”
[సూరహ్ ఆలే ఇమ్రాన్ 3:85 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చే తీసుకురాబడిన అంతిమ ధర్మం, ఆయన కంటే ముందు పంపబడిన ప్రవక్తల దివ్యసందేశంలోని ప్రాథమిక నియమాలను, మౌలికాంశాలను మరియు ఉత్తమ లక్షణాలవైపు పిలిచే బోధనలను ధృవీకరిస్తుంది. దీని గురించి అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం):
“ఆయన నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు మరియు దానినే (ఓ ముహమ్మద్) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురికాకుండా ఉండాలని. ”
[సూరహ్ అష్ షూరా 42:13 – ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం]
మూలం:ఉసూల్ అద్దీన్ అల్ ఇస్లామీ, షేఖ్ ముహమ్మద్ ఇబ్నె ఇబ్రాహీమ్ అల్ తువైజ్రి.