ఖులఫాయె రాషిదీన్ ()

సన్మార్గంపై జీవిస్తూ ప్రఖ్యాతి చెందిన ముందుతరం నలుగురు ముస్లిం పరిపాలకుల గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది.

  |

  ఖులఫాయె రాషిదీన్

  సన్మార్గంలో నడిచిన ఉత్తమ పరిపాలకులు

  الخلفاء الراشدين

  ] తెలుగు – Telugu – تلغو [

  అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్

  ترجمة: محمد كريم الله

  రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

  مراجعة: شيخ نذير أحمد


  http://islamtees.wordpress.com

  2012 - 1434

  అబూ బకర్ సిద్ధీఖ్ رضي الله عنه

  ఆయన పురుషులలో మొట్టమొదట ఇస్లాం స్వీకరించారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్నేహితులు, ముస్లింల మొట్టమొదటి ఖలీఫా. ఆయన పూర్తి పేరు అబ్దుల్లాహ్ బిన్ అబీ ఖుహాఫా ఉథ్మాన్ బిన్ ఆమిర్ అల్ ఖురషీ అత్తైమీ రదియల్లాహు అన్హు (అల్లాహ్ ఆయనను ఇష్టపడుగాక)

  ఆయన అందమైన ముఖం కలిగి ఉంటం వలన ప్రజలు ఆయనను ‘అతీఖ్’ అని కూడా పిలిచేవారు. ఒకసారి అమర్ బిన్ అల్ఆస్ రదియల్లాహు అన్హు, ‘ఓ రసూలుల్లాహ్! పురుషులలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?’ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించగా, ఆయన ‘అబూ బకర్’ అని జవాబిచ్చారు. [బుఖారీ & ముస్లిం హదీథు గ్రంథాలు]

  ముహమ్మద్ బిన్ జుబైర్ బిన్ ముతిమ్ ఇలా పలికారు: నా తండ్రి నాకు ఇలా తెలిపినారు – ఒకసారి ఒక మహిళ రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఏదో విషయం గురించి అడిగినది, దానికి ఆయన జవాబిచ్చినారు. తర్వాత, ఆమె ఇలా పలికింది, ‘ఓ రసూలుల్లాహ్! ఒకవేళ నేను మిమ్మల్ని కనుగొనలేకపోతే (ఎవరిని అడగాలి)?’ దానికి ఆయనిలా జవాబిచ్చారు: ‘ఒకవేళ నీవు నన్ను కనుగొనలేకపోతే, అబూ బకర్ వద్దకు వెళ్ళు (అడుగు)’. [బుఖారీ & ముస్లిం హదీథు గ్రంథాలు]

  అలీ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ సమాజంలో ఉత్తములు అబూ బకర్ & ఉమర్ (రదియల్లాహు అన్హుమా).

  అద్దహాబీ ఇలా పలికారు: నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, ‘అలీ ఇలా పనికినట్లు అందరికీ తెలుసు. ఇది ముతవాతిర్ అంటే దీనిని అనేక మంది ఉల్లేఖించారు. ఎందుకంటే దీనిని ఆయన కూఫా మస్జిదులోని మెంబరు పై నుండి పలికారు. కాబట్టి (తప్పుడు అభిప్రాయాలతో ఉన్న) రవాఫిదహ్ లను అల్లాహ్ శపించుగాక, ఎంత అజ్ఞానులు వారు !!

  అజ్జుహ్రీ ఇలా పలికారు: అబూ బకర్ రదియల్లాహు అన్హు ‘తన మృతదేహాన్ని అస్మా బిన్తె ఉమైస్ రదియల్లాహు అన్హా గుసుల్ ఇవ్వాలని ఒకవేళ ఆమె ఒంటరిగా ఆ పని చేయలేక పోతే, తన కుమారుడు అబ్దుర్రహ్మాన్ సహాయం తీసుకోవాలని’ తన వీలునామాలోవ్రాసారు.

  ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కన ఖననం చేయబడినారు. ఆయన తల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం భుజాల దగ్గర ఉంచబడింది.

  [సియార్ అన్నుబలా (ఇబ్నె హజర్) మరియు థహ్దీబ్ అత్తహ్దీబ్ (అద్దహాబీ), దీనిని అబ్బాస్ అబూ యహ్యా సంకలనం చేసారు & అనువదించారు]  ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ رضي الله عنه

  ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రెండో గొప్ప ఖలీఫా, అబూ హఫ్సా, ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ బిన్ నుఫైల్ రదియల్లాహు అన్హు. ఆయన హిజ్రీ 23వ సంవత్సరంలో చనిపోయారు. ఫజ్ర్ నమాజు చదివిస్తున్నపుడు, హంతకుడు ఆయనను పిడికత్తితో పొడిచినాడు. అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు పరిపాలనా కాలం తర్వాత ఆయన 10 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఎల్లప్పుడూ రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం వెంట అబూ బకర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమాలు కనబడేవారు.

  రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ‘నిజంగా, అల్లాహ్ ఉమర్ యొక్క నాలుకపై మరియు హృదయంపై సత్యాన్ని ఉంచాడు.’

  [దీనిని ఇబ్నె ఉమర్ & అబూ ధర్ రదియల్లాహు అన్హుమాలు ఉల్లేఖించారు, అహ్మద్, తిర్మిథీ, అబూ దాఊద్ గ్రంథాలలో సంకలనం చేయబడింది, తన సహీహ్ అల్ జామయీలో అల్బానీ రహిమహుల్లాహ్ దీని ప్రామాణికతను నిర్ధారించారు]

  తల్హా బిన్ ఉబైదుల్లాహ్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు: ఇస్లాం స్వీకరించడంలో లేదా హిజ్రత్ చేయడంలో ఉమర్ రదియల్లాహు అన్హు మొట్టమొదటి వాడు కాదు. కానీ పరలోక సాఫల్యం కోసం శాయశక్తులా శ్రమించే మరియు ఆశించే వారిలో ఆయన మా అందరి కంటే ముందుండేవారు.

  సహీహ్ బుఖారీ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనలో రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు :

  ‘నేను స్వర్గంలో ప్రవేశిస్తున్నట్లు స్వయంగా చూసాను. ఆగండి! అక్కడ నేను అబూ తల్హా యొక్క భార్య అర్రుమైసా ను చూసాను. మరియు నేను అడుగుల శబ్దాన్ని విని, ‘అతనెవరు?’ అని ప్రశ్నించగా, ‘బిలాల్’ అని నాకు జవాబివ్వబడింది. తర్వాత ఆవరణలో ఒక మహిళ కూర్చుని ఉన్న రాజభవనాన్ని నేను చూసాను. ‘ఇదెవరిది’ అని అడుగగా, వారు ‘ఉమర్ ది’ అని జవాబిచ్చారు. నేను దానిలో ప్రవేశించి లోపల ఎలా ఉందో చూడాలని తలచాను. కానీ ఉమర్ యొక్క ఘీరా (ఆత్మగౌరవం) గుర్తుకు వచ్చింది (గుర్తుకు వచ్చి ఆగిపోయాను). అది విని ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: నా తల్లిదండ్రులను మీ కోసం త్యాగం చేయుగాక, ఓ రసూలుల్లాహ్. ఏ ధైర్యంతో నా ఆత్మగౌరవం మీకు కోపం కలిగించించడాన్ని ఆలోచించగలను?’

  మరో సందర్భంలో రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ‘ఒకవేళ నా తర్వాత ఎవరైనా ప్రవక్త వచ్చే అవకాశం ఉంటే, ఆ ప్రవక్త ఉమర్ అయ్యేవాడు.’

  [ఉఖబహ్ బిన్ ఆమిర్ చే ఉల్లేఖించబడింది & అహ్మద్, తిర్మిథీ & హాకిమ్ చేయ సేకరించబడింది, & అల్బానీ తన సహీహహ్ (327) లో దీనిని హసన్ తరగతికి చెందినదిగా వర్గీకరించారు.]

  [సియార్ అన్నుబలా (ఇబ్నె హజర్) మరియు థహ్దీబ్ అత్తహ్దీబ్ (అద్దహాబీ), దీనిని అబ్బాస్ అబూ యహ్యా సంకలనం చేసారు & అనువదించారు]

  ‘ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ رضي الله عنه

  ఎనుగుల సంఘటన జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు జన్మించారు. ఖురైషీయులలో అజ్ఞానకాలంలో గౌరవనీయమైనదిగా ప్రసిద్ధి చెందిన బనూ ఉమయ్యహ్ వంశానికి చెందినవారు. ఐదవ తరంలో ఆయన వంశం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశంతో కలుస్తుంది. ఆయన పూర్తి పేరు ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ అబీ అల్ ఆస్ ఇబ్నె ఉమయ్యహ్ ఇబ్నె అబ్దుష్షమ్స్ ఇబ్నె అబ్ద మనాఫ్. ఆయన తల్లి పేరు అర్వా బిన్తె కురైజ్.

  మక్కాలో చిన్నతనంలోనే చదవటం మరియు వ్రాయడం నేర్చుకున్న అతి కొద్ది మందిలో ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఒకరు. యవ్వనంలో మంచి వ్యాపారవేత్తగా అభివృద్ధి చెందారు. తోటివారిలో కెల్లా ఆయన అందరిచే గౌరవించబడే వారు మరియు ఆదరించబడేవారు. అసమానమైన శుభ లక్షణాలు, గుణగణాలు కలిగి ఉండేవారు. ఆయన గొప్ప ధనవంతులలో ఒకడిగా మరియు ఉన్నతుడిగా పరిగణింపబడినా, ఆయన బిడియంతో మరియు అణుకువతో హుందాగా జీవించేవారు. ఇస్లాంలో ప్రవేశించక ముందు కూడా ఆయన మృదువుగా వ్యవహరించేవారు మరియు మంచి దయ గల మనస్సుతో ప్రవర్తించేవారు. ఆయన అక్కరగలవారిని మరియు నిరుపేదలను ఆదుకునేవారు. ఇబ్బందులలో ఇరుక్కుని ఉన్న వ్యక్తి కష్టాలు దూరం చేయడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడేవారు. అతని ఉత్తమ స్వభావం మరియు సత్ ప్రవర్త వలన మక్కా ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు. ఆయన ఎవరితో ఏనాడూ తప్పుగా వ్యవహరించలేదని, ఎలాంటి చెడు పనీ చేయలేదని మరియు అజ్ఞాన కాలంలో ప్రజలు సాష్టాంగపడుతున్న విగ్రహాలకు ఏనాడూ సాష్టాంగ పడలేదని తెలుపబడింది.

  ముందుగా ఇస్లాం స్వీకరించిన వారలో ఉథ్మాన్ రదియల్లాహు అన్హు కూడా ఒకరు. ఆయన మరియు అబూ బకర్ రదియల్లాహు అన్హులు చాలా దగ్గరి స్నేహితులు. అబూ బకర్ రదియల్లాహు అన్హు ఇస్లాం గురించి ఆయనకు వివరించిన వెంటనే 34 సంవత్సరాల వయస్సులో ఇస్లాం స్వీకరించారు.

  ఆయనను హత్య చేయాలని ఖారిజీ ఉగ్రవాదులు కుతంత్రాలు పన్నినారు. ఆ సంవత్సరం హజ్ యాత్ర పూర్తయిన తర్వాత, మదీనా నుండి అదనపు సహాయం రావటం వలన వారి పని కష్టమైంది. అపుడు వారు పరిస్థితి విషమించి, ఖలీపా వర్గం మరింతగా బలపడక ముందే తమ పన్నాగాన్ని త్వరగా అమలు చేయాలని నిశ్చయించుకున్నారు. వారు ఖలీపా ఇంటిలో జొరబడాలని ప్రయత్నించి, అన్సారుల మరియు ముహాజిరీనుల తీవ్ర ప్రతిఘటన వలన విఫలమయ్యారు. తర్వాత వారు ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించారు. అర్థరాత్రి గోడ దూకి, ఇంటిలో ప్రవేశించి, నిశ్శబ్దంగా ఖుర్ఆన్ పఠిస్తున్న ఆయనపై దాడి చేసారు. ముహమ్మద్ బిన్ అబూ బకర్ ఆయనకు ఏమీ హాని చేయలేదు. కానీ అల్ గఫిఖి ఇబ్నె హర్బ్ తన చేతిలోని గొడ్డలితో ఆయనపై దాడి చేసినాడు. తర్వాత తన కత్తితో పొడిచాడు. ఈ వికృత దృశ్యాన్ని చూసిన ఆయన భార్య నాయిలాహ్, ఆయనను రక్షించడానికి ప్రయత్నించింది, కానీ హంతకుడి కత్తి ఆమె చేతి వ్రేళ్ళను నరికివేసింది. ఆ ఉగ్రవాదులలోని ఒకడు చివరికి ఆయనను హత్య చేసాడు. ఉగ్రవాదులు ఆయన ఇంటిని మరియు అక్కడి బైతుల్ మాల్ ను దోచుకున్నారు. ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్.

  ఇది శుక్రవారం, హిజ్రీ 35వ సంవత్సరం (క్రీ. శ. 656), దుల్ హజ్ నెల 18వ తేదీన జరిగింది.

  చుట్టుముట్టి ఉన్న ఆ ఉగ్రవాదులు ఖలీఫా మృతదేహాన్ని ఎవరి కంటా పడకుండా ఖననం చేసేందుకు అనుమతించారు. చివరికి ఆయన స్వచ్ఛమైన మరియు పవిత్రమైన మృతదేహం రాత్రి సమయంలో ఖననం చేయబడింది. అందులో కొందరు ప్రజలు పాల్గొన్నారు.

  ఈ దురదృష్ట మరియు బాధాకర సంఘటన మూడవ ఖలీఫా ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ జీవితాన్ని, ఆయన 80వ ఏట అంతం చేసింది. నిస్సదేహంగా ఇది ఒక ఉత్తమ సహాబీ యొక్క ఉత్తమ జీవితం. ఆయన అల్లాహ్ మార్గంలో తన ఆత్మను, సంపదను సమర్పించుకుని, చివరికి స్వయంగా బలి అయ్యారు. దీనిపై ముస్లింలు తమ బాధను వ్యక్తం చేయడం మరే దారి మిగల లేదు. ఈనాటికి కూడా దీని ప్రభావాన్ని ముస్లిం ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుంది.

  [ఇబ్నె కథీర్, అత్తబారీ, అస్సుయూతీ మరియు ఇతర చరిత్రకారుల రచనల నుండి తయారు చేయబడిన ఖుల్పాయే రాషిదీన్ జీవిత చరిత్ర , దారల్ మనారహ్]  అలీ ఇబ్నె అబీ తాలిబ్ رضي الله عنه

  ఆయన పూర్తి పేరు అలీ ఇబ్నె అబీ తాలిబ్ (అబ్దు మనాఫ్) ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ (షైబా) ఇబ్నె హాషిమ్ (అల్ ముగీరహ్) ఇబ్నె ఖుసై (జైద్) ఇబ్నె కిలాబ్ ఇబ్నె ముర్రహ్ ఇబ్నె లుయై ఇబ్నె గాలిబ్ ఇబ్నె ఫిహ్ర్ ఇబ్నె మాలిక్ ఇబ్నె నద్ర్ ఇబ్నె కినానహ్.

  అలీ రదియల్లాహు అన్హు తల్లి పేరు ఫాతిమా బిన్తె అసద్ ఇబ్నె హిషామ్ ఇబ్నె అబ్దు మునాఫ్ ఇబ్నె ఖుసై. ఆమె హాషిమీయ వంశంలో జన్మించిన మొదటి బిడ్డ అని అంటారు. ఆమె ఇస్లాం స్వీకరించింది మరియు హజ్రత్ చేసి మదీనాకు చేరుకుంది.

  స్వర్గంలో ప్రవేశిస్తారనే శుభవార్తను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పేర్లలో ఒకరు పేరు కూడా ఉంది. సమాలోచనలు జరిపే ఆరుగురు సభ్యుల కమిటీలో ఆయన కూడా ఒకరు.

  ఆయన నలుపు రంగు, పెద్ద కళ్ళ, పెద్ద పొట్ట, బట్టతల, సాధారణ ఎత్తు కంటే కొంచెం ఎక్కువ ఎత్తు, ఛాతీ వరకు ఉండిన దట్టమైన గడ్డం కలిగి ఉండేవారు. ఛాతీపై మరియు భుజాలపై ఉన్న వెంట్రుకు బాగా దట్టంగా ఉండేవి.

  ఇస్లాం స్వీకరించిన మొదటి వారిలో అలీ రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు. దాదాపు ఏడు ఏళ్ళ వయస్సులో ఆయన ఇస్లాం స్వీకరించారు. మరికొన్ని ఉల్లేఖనలలో ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పధ్నాలుగు, పదిహేను లేక పదహారు ఏళ్ళ పేర్కొనబడింది. మహ్మర్, ఖతాదా మరియు అల్ హసన్ ల ఆధారంగా ఆయన పదహారు సంవత్సరాల వయస్సులో ఇస్లాం స్వీకరించారని అబ్దుల్ రజాక్ తెలిపారు.

  అలీ రదియల్లాహు అన్హు ఇంత చిన్న వయస్సులో స్వీకరించడానికి ఒక కారణం ఏమిటంటే అప్పటి కరువు కాలం వలన ఆయన రసూలులల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షణలో ఉండినారు. రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సంరక్షణ బాధ్యతను ఆయన తండ్రి అంటే తన బాబాయి నుండి తీసుకున్నారు. ఎపుడైతే వహీ (దివ్యవాణి) అవతరించిందో, అపుడు ఆయన భార్య ఖతీజా రదియల్లాహు అన్హా మరియు అలీ రదియల్లాహు అన్హు తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఇస్లాం స్వీకరించారు.

  ఖలీఫాగా ఆయన ఎంచుకోబడినపుడు అప్పటి పరిస్థితులను స్పష్టంగా వివరిస్తూ ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. ముస్లింలకు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తర్వాత మంచి పనులు చేయమని మరియు చెడు నుండి దూరంగా ఉండమని పిలిచారు. పరిస్థితుల తీవ్రతను గమనించి, ఆయన ఖలీఫా పదవిని స్వీకరించడంలో ఆలస్యం చేయలేదు.

  ఆ సమయంలో ఆయన రెండు అతి ముఖ్యమైన విషయాలను పరిష్కరించవలసి ఉండింది. మొదటిది విచ్చలవిడిగా తిరుగుతూ, అక్కడ సైనికపరంగా తమను మించిన బలవంతులు లేకపోవడం వలన కొత్త ఖలీఫా వారి పై ఎలాంటి చర్యా తీసుకోడనే దృఢమైన విశ్వాసంతో ఉన్న ఉథ్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు హంతకులను శిక్షించడం. ఉథ్మాన్ రదియల్లాహు అన్హు పై తిరుగుబాటులో పాల్గొనని ప్రతి వ్యక్తీ, వెంటనే కొత్త ఖలీఫా ఆ పాపాత్ములైన హంతకులకు వ్యతిరేకంగా కఠినమైన చర్య తీసుకోవాలని ఒత్తిడి చేయసాగారు.

  అలీ రదియల్లాహు అన్హు మరియు ఖారిజీయుల మధ్య చర్చ జరిగింది. ఫలితంగా దాదాపు 8,000 మంది అలీ రదియల్లాహు అన్హు వైపు వచ్చేసారు మరియు 4,000 తమ వాదన పైనే ఉండిపోయి, ఆయనతో యుద్ధం చేసారు. అందులో ఆయన వారిని చిత్తుగా ఓడించారు. కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో తప్పించుకోగలిగారు. మరోవైపు అలీ రదియల్లాహు అన్హు వైపు కేవలం 7 లేక 8 మంది మాత్రమే చనిపోయారు. ఈ నహర్వాన్ యుద్ధం హిజ్రీ 38వ సంవత్సరం, బాగ్దాదుకు ఆగ్నేయ దిశలో జరిగింది. అయితే దీనిలో ప్రాణాలతో మిగిలిన ఆ కొద్ది మంది వేర్వేరు ప్రాంతాలలో వ్యాపించి, తన విషభావాలను ప్రజలలో విస్తరింపజేసారు. అలా వారు ఒక దీర్ఘకాలం వరకు తమ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ, కొందరు ప్రజలను ప్రభావితం చేయగలిగారు.

  మావియా రదియల్లాహు అన్హుతో అలీ రదియల్లాహు అన్హు శాంతి ఒప్పందం చేసుకున్న (హిజ్రీ 40వ సంత్సరం) వెంటనే, అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ముల్జమ్, అల్ బరాక్ ఇబ్నె అబ్దుల్లాహ్ మరియు అమర్ ఇబ్నె బక్ర్ అనే ముగ్గురు ఖారిజీయులు ఒక చోట సమావేశమైనారు. వారు ప్రజల విషయాలు చర్చించుకున్నారు, పరిపాలకుల విధానాన్ని విమర్శించుకున్నారు, నహర్వాన్ లో చనిపోయిన తమ వర్గ ప్రజల గురించి బాధ పడినారు. వారందరూ క్షమించబడాలని ప్రార్థించారు. తర్వాత అల్ జామియ మస్జిద్ లో ఫజ్ర్ నమాజు చేయడానికి ఇంటి నుండి బయలు దేరిన అలీ రదియల్లాహు అన్హును కత్తితో పొడిచి హత్య చేయడంలో ఇబ్నె ముల్జమ్ సఫలీకృతుడయ్యాడు. చనిపోయేనాటికి అలీ రదియల్లాహు అన్హు వయస్సు 63 సంవత్సరాలు.

  [ఇబ్నె కథీర్, అత్తబారీ, అస్సుయూతీ మరియు ఇతర చరిత్రకారుల రచనల నుండి తయారు చేయబడిన ఖుల్పాయే రాషిదీన్ జీవిత చరిత్ర , దారల్ మనారహ్]

  http://islamtees.wordpress.com/biographies/1-rightly-guided-caliphs/