సఫర్ నెల
] తెలుగు – Telugu – تلغو [
షేఖ్ సాలిబ్ అల్ మునజ్జిద్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్
2012 - 1433
﴿ نبذة عن شهر صـفـر ﴾
« باللغة التلغو »
الشيخ محمد صالح المنجد
ترجمة: محمد كريم الله
مراجعة: شيخ نذير أحمد
2012 - 1433
సఫర్ మాసం - شهر صـفـر
సఫర్ (صفر) మాసం - ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.
ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463)
సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:
మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.
రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.
సఫర్ మాసంలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిన్న కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా వివాహం 2వ హిజ్రీ సంవత్సరంలోని సఫర్ నెలలో అలీ రదియల్లాహు అన్హుతో జరిగినది. ఆవిడకు హసన్, హుసైన్, ఉమ్మె కుల్థుమ్, జైనబ్ అనే నలుగురు సంతానం కలిగినారు.
11వ హిజ్రీ సంవత్సరపు సఫర్ నెలలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యానికి గురైనారు. కొన్ని రోజులలో ఆయన ఇదే నెలలో మరణించినారు.
ఈ నెల గురించిన ముఖ్యవిషయాలు:
1) అజ్ఞాన కాలపు అరబ్బులలో ఈ నెల గురించి ఉండిన అభిప్రాయాలు.
2) ఈనెల గురించి, అజ్ఞాన కాలపు అరబ్బుల అభిప్రాయాలకు భిన్నమైన వాస్తవ ఇస్లాం ధర్మపు అభిప్రాయాలు.
3) కొందరు ముస్లింలలో ఈ నెల గురించి ఉన్న నూతన కల్పిత మరియు కలుషిత అభిప్రాయాలు.
4) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలంలో జరిగిన సైనిక చర్యలు మరియు ముఖ్య సంఘటనలు.
5) ఈ నెల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అసత్య హదీథ్ లు.
6) అద్వా లేదు తియారహ్ లేదు అనే పదాలకు అసలు అర్థం.
7) హామహ్ లేదు, సఫర్ లేదు, నౌఅ లేదు, ఘౌల్ లేదు అనే వాటికి అర్థం.
(1) అజ్ఞాన కాలపు అరబ్బులలో ఈ నెల గురించి ఉండిన అభిప్రాయాలు:
అజ్ఞానకాలపు అరబ్బులు ఈ నెలలో రెండు తీవ్రమైన తప్పులు చేసేవారు. మొదటిది, ముందుకు జరుపుతూ లేక వెనుకకు నెట్టుతూ దీనితో ఆడుకునేవారు. రెండవది దీని గురించి వారు శకునాలు అంటే మూఢనమ్మకాలు కలిగిఉండేవారు.
(a) దీనితో ఆడుకోవటం – ముందుకు జరపటం లేదా వెనుకకు నెట్టడం:
కాలాన్ని అల్లాహ్ సృష్టించాడు. సంవత్సరంలో పన్నెండు నెలలు సృష్టంచి, వాటిలో నాలుగు నెలలను పవిత్రమైనవిగా ప్రకటించాడు. వాటి గౌరవార్థం, ఆ నాలుగు నెలలలో యుద్ధాలు నిషేధింపబడినవి. ఆ నాలుగు నెలలు: దుల్ ఖైదా (11వ నెల), దుల్ హజ్ (12వ నెల) ముహర్రం (1వ నెల) మరియు రజబ్ (7వ నెల). ఈ విషయం అల్లాహ్ యొక్క దివ్యగ్రంథంలో ఇలా ధృవీకరింపబడినది (భావానువాదం): దివ్యఖుర్ఆన్ లోని 9వ అధ్యాయం 36వ ఆయత్ (9:36)లో అల్లాహ్ ఇలా ప్రకటించెను “నిశ్చయంగా, అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు, భూమ్యాకాశాలు సృష్టించినప్పుడే అల్లాహ్ దీనిని నిర్దేశించెను; వాటిలో నాలుగు పవిత్రమైనవి (i.e. ఇస్లామీయ క్యాలెండరులోని మొదటిది, ఏడవది, పదకొండవది మరియు పన్నెండవది. అదియే సరైన ధర్మం, కాబట్టి దీనిలో మీరే స్వయంగా తప్పు చేయవద్దు …” [అత్తౌబా 9:36]
మక్కా బహుదైవారాధకులకు ఈ విషయం తెలుసున్నా కూడా వారు తమ కోరికలకు, చాపల్యానికి అనుగుణంగా దానిని వెనుకకు నెట్టేవారు లేక ముందుకు జరిపేవారు అంటే ముహర్రం నెల స్థానంలో సఫర్ నెలను ఉంచేవారు! హజ్ నెలలో ఉమ్రా చేయటమనేది నీచాతినీచమైన చెడుపనిగా వారు విశ్వసించేవారు. దానిని కొందరు పండితులు ఇలా వివరించినారు.
(a) ముందుకు జరపటం: ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “‘హజ్ నెలలో ఉమ్రా చేయటమనేది భూమిపై జరిగే నీచాతి నీచమైన చెడు పనిగా వారు భావించేవారు. ముహర్రం నెలను సఫర్ నెలగా మార్చి, ఇలా ప్రకటించేవారు, ‘ఒంటెల నడుములు గాయాల నుండి నయమైనప్పుడు (అంటే హజ్జ్ ప్రయాణపు బడలిక, అలసట తీరిపోయినప్పుడు) మరియు ఒంటె పాదాల గుర్తులు చెదిరిపోయినప్పుడు మరియు సఫర్ నెల దాటి పోయినప్పుడు ‘ఉమ్రా చేయాలనుకున్న వారి కోసం అది అనుమతింప బడినది.” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)
(b) వెనుకకు నెట్టడం: ఇబ్నె అల్ అరబీ పలుకులు: “రెండవ విషయం అంటే సఫర్ నెలను వెనుకకు నెట్టడం గురించి: దానిని ఎలా వాయిదా వేసేవారు (అన్నాసియ్): ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు – జునాదహ్ ఇబ్నె ఔఫ్ ఇబ్నె ఉమయ్యహ్ అల్ కినాని ప్రతి సంవత్సరం ఈ సందర్భంలో వచ్చి, ‘అబూ థమామహ్ ప్రకటించే విషయాన్ని ఎవ్వరూ విమర్శించటం గాని లేక తిరస్కరించటం గాని చేయకూడదు’ అంటూ ఇలా ప్రకటించేవాడు “రాబోయే మొదటి సంవత్సరంలోని సఫర్ పవిత్రమైనది కాదు, ఆ తర్వాత మేము దానిని ఒక సంవత్సరం పవిత్రమైనదిగా చేస్తాము మరియు అది వచ్చే సంవత్సరంలో కాదు” హవాజిన్, గత్ఫాన్ మరియు బని సులైమ్ వంటి బలమైన తెగలు వారిని సమర్థించేవి. ఇంకో చోట అతను ఇలా పలికేవాడని నమోదు చేయబడినది, “మేము ముహర్రం నెలను ముందుకు జరిపాము మరియు సఫర్ ను వాయిదా వేశాము.” తర్వాత సంవత్సరంలో అతను ఇలా ప్రకటించేవాడు, “మేము సఫర్ ను పవిత్రమైనదిగా చేస్తున్నాం మరియు ముహర్రంను ఆలస్యం చేస్తున్నాము.” ఆ విధంగా వారు సఫర్ నెలను వాయిదా వేసేవారు.
ఖతాదా ఇలా తెలిపినారు: మార్గభ్రష్టులైన కొందరు ప్రజలు సఫర్ నెలను కూడా పవిత్రమైన నెలలలో చేర్చివేసేవారు. వారి ప్రతినిధి ఈ సందర్భంలో నిలబడి ఇలా ప్రకటించేవాడు, “ఈ సంవత్సరం మీ దైవాలు ముహర్రం నెలను పవిత్రమైనదిగా చేసినాయి,” మరియు వారు ఆ సంవత్సరం దానిని పవిత్రమైనదిగా పరిగణించేవారు. తర్వాత సంవత్సరం అతను లేచి నిలబడి ఇలా ప్రకటించేవాడు, “మీ దైవాలు సఫర్ నెలను పవిత్రమైనదిగా చేసినాయి,” కాబట్టి వారు ఆ సంవత్సరం దానిని పవిత్రమైనదిగా పరిగణించేవారు. మరియు ఒక్కోసారి వారు ఒకే సంవత్సరంలో రెండు సఫర్ నెలలు ఉన్నాయని ప్రకటించేవారు. మలిక్ నుండి ఇబ్నె వహబ్ మరియు ఇబ్నె అల్ ఖాశిం ఇలా ఉల్లేఖించినారు: అజ్ఞాన కాలపు ప్రజలు ఒకే సంవత్సరంలో రెండు సఫర్ నెలలను కలిగి ఉండేవారు, అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, “సఫర్ లేదు.” అషహాబ్ కూడా ఇలాగే పలికినారు.
హజ్ కాలాన్ని మార్చటం: ముజాహిద్ ఉల్లేఖకుల వేరే పరంపరతో ఇలా తెలిపినారు : “ ‘(ఒక పవిత్రమైన నెలను) వాయిదా వేయడమనేది అవిశ్వాసానికి అదనపు చర్య అవుతుంది.’ [9:37–ఖుర్ఆన్ ఆయతు భావార్థం] – వారు హజ్ ను దిల్ హజ్ నెలలె రెండు సంవత్సరములు, ఆ తర్వాత ముహర్రం నెలలో రెండు సంవత్సరములు, ఆ తర్వాత సఫర్ నెలలో రెండు సంవత్సరములు జరుపుకునేవారు. అలా వారు హజ్ ను ప్రతినెలలో రెండు సంవత్సరముల పాటు జరుపుకునేవారు. అబూబక్ర్ రదియల్లాహు అన్హు జరిపిన హజ్, దిల్ ఖాయిదాహ్ మాసంలో వచ్చింది. అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిపిన హజ్, దిల్ హజ్ మాసంలోనే వచ్చినది.
అందువలన తన అంతిమ హజ్ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించినారని సహీహ్ హదీథ్ లో నమోదు చేయబడినది: “సమయం తన కాలచక్రాన్ని పూర్తి చేసుకుని, అల్లాహ్ భూమ్యాకాశాలు సృష్టించినప్పటి దినరూపాన్ని పొందింది.” ఇబ్నె అబ్బాస్ మరియు ఇతర సహాబీల ఉల్లేఖన.
ఇంకో హదీథ్ లో ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారని నమోదు చేయబడినది: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించినారు: “ఓ ప్రజలారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఈ దినం తర్వాత ఇదే స్థలంలో నేను మరల మిమ్ములను కలవగలనో, లేదో నాకు తెలియదు. ఓ ప్రజలారా, ఎలాగైతే మీ యొక్క ఈ దినం ఈ మాసంలో ఈ స్థలంలో పునీతం చేయబడినదో, అలాగే మీరు మీ రబ్ ను (ప్రభువును) కలుసుకునే దినం వరకు మీ రక్తం మరియు మీ సంపద పునీతం (పవిత్రం) చేయబడినది. మీరు మీ రబ్ ను (ప్రభువును) కలుసుకోబోతున్నారు మరియు ఆయన మీ ఆచరణల గురించి మిమ్ములను ప్రశ్నించబోతున్నాడు. నేను మీకు (సందేశాన్ని) అందజేసినాను. ఎవరైనా సరే, తనపై ఉంచబడిన నమ్మకాన్ని పూర్తి చేయవలెను.
మొత్తం వడ్డీ రద్దు చేయబడింది. మీరు మీ అసలు మొత్తాన్నే తీసుకోవాలి. అన్యాయంగా ప్రవర్తించవద్దు (వ్యవహరించవద్దు). వడ్డీ ఉండకూడదని అల్లాహ్ ఆదేశించెను. అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడైన అబ్బాస్ కు చెందిన వడ్డీ రద్దు చేయబడినది. అజ్ఞాన కాలపు అన్ని రకాల రక్తప్రతీకార పద్ధతులు రద్దుచేయబడినవి. మనలో అందరికంటే ముందు బను లైథ్ తెగ మధ్యకు ఈడ్చుకుపోయి, హుదైల్ హత్య చేసిన ఇబ్నె రబీయహ్ ఇబ్నె అల్ హరిథ్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ రక్తప్రతీకారాన్ని నేను రద్దుచేస్తున్నాను.” అజ్ఞానకాలపు రక్తప్రతీకారం రద్దు చేయబడటమనే ధర్మశాసనం యొక్క ఆచరణ ఆయనతోనే ప్రారంభమైనది.
ఓ ప్రజలారా, ‘ఇక మీ భూమిలో తన ఆరాధన ఏనాటికీ జరగదు’ అనే వాస్తవం షైతాన్ కు నిరాశ కలిగించెను. కాని దానిని వదిలి, మీరు అంత ముఖ్యమైనవి కావని భావించే ఇతర షైతాను పనులలో వేటికి విధేయత చూపినా, అతను సంతోషపడతాడు. కాబట్టి మీ ధర్మవిషయంలో అతని గురించి జాగ్రత్త వహించవలెను. (పవిత్రమైన నెలను) వాయిదా వేయటమనేది అవిశ్వాసంతోపాటు చేసే అదనపు చర్యలాంటిది. అది అవిశ్వాసులను సన్మార్గం నుండి దూరం చేస్తుంది. సమయం తన కాలచక్రాన్ని పూర్తి చేసుకుని, అల్లాహ్ భూమ్యాకాశాలు సృష్టించినప్పటి దినరూపాన్ని పొందెను. అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు, వాటిలో నాలుగు పవిత్రమైనవి, మూడు వరుస క్రమంలో వచ్చేవి మరియు రజబ్ ముదార్ నెల ఏదైతే జుమాదా మరియు షాబాన్ నెలల మధ్యన వస్తుందో.…” మరియు ఆయన హదీథ్ లోని మిగిలిన భాగాన్ని పూర్తి చేసారు. (అహ్కామ్ అల్ ఖుర్ఆన్,2/503-504)
(b) ఈ నెల గురించి అపశకునాలు, మూఢవిశ్వాసాలు కలిగి ఉండటం:
ఈ నెల గురించిన శకునాలు, మూఢవిశ్వాసాలు అజ్ఞాన కాలపు ప్రజలలో బాగా ప్రఖ్యాతి చెందాయి. కొందరు ముస్లింలలో అవి నేటికీ మిగిలి ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విషయాన్ని, అబూ హురైరా రదియల్లాహు అన్హు ఒక హదీథ్ లో ఇలా ఉల్లేఖించారు: “అద్వా లేదు (అల్లాహ్ అనుమతి లేకుండా ఏ అంటువ్యాధీ సోకదు), (పక్షుల నుండి) ఎలాంటి అపశకునం లేదు, ఎలాంటి హమామహ్ లేదు, సఫర్ ఏమీ లేదు (ఎలాంటి అపశకునం లేదు), ఎవరైనా ఒక పులి నుండి ఎలా దూరంగా పారిపోతారో, తప్పకుండా ఒక కుష్ఠురోగి నుండి కూడా అలాగే దూరంగా పరుగెత్తాలి.” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)
పై హదీథులోని సఫర్ అనే పదం గురించి షేక్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: “ ‘సఫర్’ అనే పదానికి అనేక అనువాదాలు ఉన్నాయి:
(i) సఫర్ అనే పదం, అందరికీ తెలిసిన సఫర్ నెలను సూచిస్తుంది. ఈ నెల గురించి అరబ్బులు కొన్ని మూఢవిశ్వాసాలు కలిగిఉండేవారు.
(ii) సఫర్ అనే పదం ఒంటెల కడుపుకు సంబంధించిన ఒక అంటువ్యాధిని సూచిస్తుంది. అక్కడ సామాన్య వ్యాధులలో నుండి ఒక ప్రత్యేక విషయాన్ని సూచించటానికి వాడబడటం వలన ‘అద్వా అనగా అంటురోగం’ అనే పదంతో పాటు ఇది పేర్కొనబడింది.
(iii) ‘సఫర్’ అనే పదం సఫర్ నెలను, ప్రత్యేకంగా ఇక్కడది పవిత్ర నెలలను వాయిదా వేయటాన్ని సూచిస్తుంది. సఫర్ నెలను ఒక సంవత్సరం పవిత్రమైన నెలగా ప్రకటించటం, మరో సంవత్సరం అలా చేయక పోవటం మరియు ఒక్కోసారి పవిత్ర మాసాలను వెనుకకు జరపటం మొదలైన వాటి ద్వారా అవిశ్వాసులు దారి తప్పిపోయారు.
వీటన్నింటిలో సరైన అభిప్రాయం - సఫర్ అనే పదం సఫర్ నెలను సూచిస్తుంది మరియు అరబ్బుల అజ్ఞానకాలంలో దీని గురించి అనేక మూఢవిశ్వాసాలు ఉండేవి.
(ప్రజల జీవితాలపై) ప్రభావం చూపే శక్తి కాలానికి లేదు మరియు ఎలాంటి ప్రభావాన్నైనా చూపమని అల్లాహ్ కాలానికి ఆజ్ఞాపించలేదు. మిగిలిన నెలల వలే ఈ నెలలో కూడా మంచి మరియు చెడు ఆదేశించబడ వచ్చును. ఒకవేళ ఏదైనా పని సఫర్ నెల, 25వ తేదీన విజయవంతంగా పూర్తయితే, ఉదాహరణకు కొందరు ప్రజలు ఆ తేదీని గుర్తుంచుకుని, “ఈ మంచి సఫర్ నెల, 25వ తేదీన ఒక పని పూర్తయిందని” ప్రకటించినట్లయితే, వారు ఒక బిదాఅను (నూతన కల్పితాన్ని) మరో బిదాఅతో ఖండిస్తున్న వారవుతారు. ఎందుకంటే, మంచి నెలలు మరియు చెడు నెలలు అనేవేమీ లేవు. కనుక గుడ్లగూబ కూత విన్నపుడు ఎవరైనా “ఇన్షా అల్లాహ్ మంచే జరుగుతుందని” అనటాన్ని వింటే, కొందరు సలఫ్ లు (ముందుతరం సజ్జనులు) అలా అనటాన్ని నిరసించేవారు. ఆ కూతలో ఏదైనా మంచి ఉందనో లేదా చెడు ఉందనో అనకూడదు. ఎందుకంటే ఇతర పక్షి కూతల మాదిరిగా అది కూడా కేవలం ఒక పక్షి కూతయే.
పై హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించిన నాలుగు విషయాలు ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే, మనం కేవలం అల్లాహ్ పైనే నమ్మకం ఉంచవలెను. మన నమ్మకం నిష్కపటంగా మరియు దృఢంగా ఉండవలెను; ఇటువంటివి ఎదురైనపుడు, ముస్లింలు నిస్సహాయులుగా ఢీలా పడిపోరాదు.
ఒకవేళ ఒక ముస్లిం అలాంటి మూఢనమ్మకాలను పట్టించుకుంటు న్నట్లయితే, అతను క్రింది రెండింటిలో ఒక దానిని అనుసరిస్తున్నట్లు అవుతుంది: ముందుకు సాగాలా లేక ఆగిపోవాలా అనే నిర్ణయాన్ని ఒకవేళ అతను ఆ మూఢనమ్మకాలపై ఆధార పడి చేస్తుంటే, అతను తన ఆచరణలను కల్పితమైన, కృత్రిమమైన, అసత్యమైన వాటిపై ఆధారపడి చేస్తున్నట్లు అవుతుంది. కానీ, ముందుకు సాగాలా లేక ఆగిపోవాలా అనే విషయాన్ని నిర్ణయించటంలో ఒకవేళ అతను ఆ మూఢనమ్మకాలను పట్టించుకోక పోయినా, అతని మనసులో ఏదో ఒక మూల ఆ మూఢ నమ్మకాల గురించి చింత లేదా ఆదుర్దా ఉండవచ్చును. అయితే ఇది ముందు తెలిపిన దానంతటి చెడ్డది కాకపోయినా, వాటి గురించి అతను అస్సలు పట్టించుకోకూడదు. అతను కేవలం అల్లాహ్ పైనే ఆధారపడవలెను.
ఈ నాలుగింటిని నిరాకరించటమంటే, వాటి ఉనికినే నిరాకరించటం అని కాదు. అవి ఉనికిలో ఉన్నాయని అంగీకరిస్తూ, పర్యవసానాలపై వాటి ప్రభావాన్ని నిరాకరించటం. ఎందుకంటే ఏ పర్యవసానాన్నైనా, ఫలితాన్నైనా మార్చగలిగేది కేవలం అల్లాహ్ మాత్రమే. ఫలితంపై ప్రభావం చూపగలిగే కారణం మాత్రమే సత్యమైనది అవుతుంది. అలా ప్రభావం చూపలేని ఏ కల్పిత భావనైనా సరే, అది అసత్యమైనది అవుతుంది. కాబట్టి దాని ప్రభావాన్ని మేము నిరాకరిస్తున్నాము మరియు దానికి ఎలాంటి ప్రభావం చూపే శక్తీ లేదు.” (మజ్మూఅ ఫతావా అల్ షేఖ్ ఇబ్నె ఉథైమీన్, 2/113, 115)
(2) ఈ నెల గురించి, అజ్ఞాన కాలపు అరబ్బుల అభిప్రాయాలకు భిన్నమైన వాస్తవ ఇస్లాం ధర్మ అభిప్రాయాలు.
సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనను మేము పైన పేర్కొన్నాము. సఫర్ నెల గురించి అజ్ఞాన కాలపు అరబ్బులు కలిగి ఉండిన మూఢవిశ్వాసాలు గర్హనీయమైనవని ఈ హదీథు వివరిస్తున్నది. సఫర్ నెల, అల్లాహ్ యొక్క నెలలలోని ఒక మామూలు నెల. అది స్వయంగా ఎలాంటి అభీష్టము కలిగి ఉండలేదు. అల్లాహ్ నియంత్రణను అనుసరిస్తూ, అది కేవలం అలా సాగిపోతుంది. అంతే!
(3) ఈ నెల గురించి కొందరు ముస్లింలలో నున్న నూతన కల్పిత ఆచరణలు మరియు కలుషిత అభిప్రాయాలు.
స్టాండింగ్ కమిటీ ముందుకు వచ్చిన ప్రశ్న:
మా దేశంలోని కొందరు ఇస్లామీయ పండితులు సఫర్ నెలలోని చివరి బుధవారం రోజున దొహా (ఉదయపు) సమయంలో నాలుగు రకాతుల నఫిల్ నమాజు ఒకే సలాముతో చేయవలసి ఉన్నదని వాదిస్తున్నారు. ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా తర్వాత, సూరతుల్ కౌథర్ ఏడు సార్లు, సూరతుల్ ఇఖ్లాస్ 50 సార్లు, ఖుర్ఆన్ లోని చివరి రెండు సూరహ్ లు ఒక్కోసారి పఠించవలసి ఉంటుంది. ఇలా ప్రతి రకాతులో చేయవలసి ఉంటుంది. సలాము తర్వాత, సూరహ్ యూసుఫ్ లోని 21వ ఆయత్ (12:21) “వల్లాహు గాలిబున్ అలా అమ్రిహి, వ లాకిన్న అక్తరన్నాసి లా యాలమూన్ - మరియు సమస్త వ్యవహారాలపై అల్లాహ్ కు పూర్తి అధీనం మరియు నియంత్రణ ఉన్నది, కాని చాలా మంది మనుషులకు అది తెలియదు” అని 360 సార్లు, జవహర్ అల్ కమాల్(పరిపూర్ణత్వపు సారం) మూడు సార్లు పఠించి, అంతిమంగా సూరతుస్సప్ఫాత్ లోని 180-182 ఆయత్ లు 37:180-182, “సుభహాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యశిఫూన్. వ సలామున్ అలా ముర్సలీన్. వల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ – స్తోత్రములకు మరియు శక్తిసామర్ధ్యాలకు అధిపతి అయిన నీ ప్రభువు అత్యంత పవిత్రుడు! వారు అపాదిస్తున్నవి ఆయనలో లేవు! మరియు ప్రవక్తలపై శాంతి కురుయుగాక! మరియు సకల కృతజ్ఞతలు మరియు స్తోత్రములు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.” అని పఠించవలెను. ఆ తర్వాత బీదవారికి దానధర్మాలు చేయవలెను. ప్రత్యేకంగా ఈ ఆయత్ సఫర్ నెల చివరి బుధవారం నాడు వచ్చే విపత్తులన్నింటినీ తుడిచివేస్తుందని వారు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 320,000 ల కష్టాలు క్రిందికి వస్తాయని, అవన్నీ సఫర్ నెల చివరి బుధవారం నాడే వస్తుండటం వలన, అది మొత్తం సంవత్సరంలోనే అత్యంత కష్టమైన దినమని వారంటారు. కాని, ఎవరైనా పైన తెలిపిన విధంగా నమాజు చేస్తే, వారిని అల్లాహ్ తన కరుణాకటాక్షాల ద్వారా ఆ దినాన వచ్చే అన్నిరకాల కష్టనష్టాల నుండి రక్షిస్తాడని, అవి వారి దరిదాపులకు కూడా రావని, ఆ నమాజు చదవని చిన్న పిల్లల వంటి వారినే అవి చుట్టుముడతాయని వారంటారు. ఇది ఎంత వరకు నిజం?
ఉలెమాల బృందం ఇలా జవాబిచ్చింది:
అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలుల్లాహి వ ఆలా ఆలిహి, వ అస్హాబిహీ.
సకల స్తోత్రములు, కృతజ్ఞతలు అల్లాహ్ కే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతీ కలుగు గాక!
పై ప్రశ్నలో పేర్కొనబడిన నఫిల్ (ఐచ్ఛిక) నమాజు గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతులలోని ఏ ఆధారమూ మా జ్ఞానంలో లేదు. ముస్లిం సమాజం యొక్క ముందుతరం (సలఫ్) లేదా వారి తరువాతి తరం ప్రజలలోని సజ్జనులలో ఎవరైనా ఈ నఫిల్ నమాజు చేసినట్లు మా వద్ద ఎలాంటి ఋజువు లేదు. ఇది ఒక గర్హనీయమైన కల్పితాచారమే తప్ప మరేమీ కాదు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని ఉల్లేఖించబడింది: “ఎవరైనా మా ఈ ధర్మం (ఇస్లాం)లో లేని విధంగా ఏదైనా విషయాన్ని ఆచరిస్తే, అది తిరస్కరించబడుతుంది.” మరియు ఆయన ఇలా అన్నారు: “ఎవరైనా మా విషయంలో భాగం కానటువంటి ఏదైనా నూతన ఆచరణను కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది.”
ఎవరైనా ఈ నమాజును మరియు దానితో పాటు పైన పేర్కొనబడిన ఇతర విషయాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఎవరైనా సహాబా (రదియల్లాహు అన్హుమ్) లకు ఆపాదిస్తుంటే, వారు గంభీరమైన అసత్యాలను కల్పిస్తున్నట్లే. అల్లాహ్ అసత్యపరులకు విధించే తీవ్రమైన శిక్షకు వారు అర్హులు అవుతారు. (ఫతావా అల్ లజ్నహ్ అల్ దాయిమహ్, 2/354)
షేఖ్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుస్సలాం అష్షుగైరీ ఇలా పలికారు:
సఫర్ నెల ఆఖరి బుధవారం రోజున అభివాదానికి (సలామునకు) సంబంధించిన “సమస్త సృష్టిలో, నూహ్ (అలైహిస్సలాం) పై సలాములు!”” [ఆయతు భావానువాదం, అస్సాఫ్ఫాత్ 37:79] మొదలైన ఆయతులను వ్రాసి, దానిని పానీయాల పాత్రలలో పెట్టి, దాని నుండి శుభాన్ని ఆశిస్తూ, ఆ పానీయాన్ని త్రాగే అలవాటు అజ్ఞానులలో ఉంది. అంతేగాక, వారు ఆ పాత్రలను బహుమతిగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎందుకంటే అది కష్టనష్టాలను, చెడును తొలగిస్తుందని వారి నమ్మకం. ఇది ఒక గుడ్డినమ్మకం మరియు నిందార్హమైన మూఢవిశ్వాసం, వట్టిభ్రమ, గర్హనీయమైన నూతన కల్పితాచారం. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ, తప్పకుండా దీనిని నిరసించాలి. (అల్ సునన్ వల్ మబ్తదాత్, p. 111, 112)
(4) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలంలో జరిగిన సైనిక చర్యలు మరియు ముఖ్యమైన సంఘటనలు.
ఈ నెలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో జరిగిన సైనిక చర్యలు మరియు ముఖ్యమైన సంఘటనలు చాలా ఉన్నాయి, మేము వాటిలో నుండి కొన్నింటిని ఇక్కడ పేర్కొంటాము:
(1) ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా అన్నారు:
అపుడు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ‘అల్ అబ్వా’ దండయాత్రలో పాల్గొన్నారు. ఈ సైనికచర్య యొక్క మరో పేరు ‘వద్దాన్’. ఆయన స్వయంగా పాల్గొన్న మొట్టమొదటి దండయాత్ర ఇది. హిజ్రత్ చేసిన (మక్కా నుండి మదీనాకు వలసపోయిన) 12 నెలల తరువాత, సఫర్ నెలలో ఇది జరిగింది. హమ్జా ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు అన్హు తమ పక్షం యొక్క తెల్లటి పతాకాన్ని చేతపట్టుకున్నారు. (సల్లల్లాహు అలైహి వసల్లం), తన పరోక్షంలో మదీనా పట్టణ బాధ్యునిగా సాద్ ఇబ్నె ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) ను నియమించి, కేవలం ముహాజిర్లను (ఇస్లాం కొరకు మక్కా వదిలి మదీనా వలస వచ్చినవారు) మాత్రమే వెంట తీసుకుని, ఆయన ఖురైషీయుల బిడారాన్ని అడ్డుకోవటానికి బయలుదేరారు. అయితే, ఈ యాత్రలో యుద్ధమేమీ జరుగలేదు.
ఈ దండయాత్రలో ఆయన బనీ దుమ్రాహ్ తెగ నాయకుడైన మక్షి ఇబ్నె అమర్ అల్ దుమారీతో ‘ఆయన బనీ దుమారీపై దాడి చేయకూడదని మరియు బనీ దుమారీ తెగ ఆయనపై దాడి చేయదని, ఆయనపై దాడి చేయటానికి వారేనాడూ, ఏ వర్గంతోనూ చేతులు కలపకూడదని, ఏనాడూ ఆయనకు వ్యతిరేకంగా వారు ఏ శత్రువుకూ సహాయపడకూదని’ శాంతి ఒడంబడికలో అంగీకరించారు. వారి మధ్య జరిగిన ఈ సంధి ఒప్పందం వ్రాయబడింది. ఈ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 15 రాత్రులు మదీనా వదిలి, బయట ఉన్నారు. (జాద్ అల్ మఆద్, 3/164, 165)
(2) ఇంకా ఆయన ఇలా అన్నారు:
సఫర్ నెల వచ్చినపుడు (హిజ్రీ 3వ సంవత్సరంలో), అదల్ మరియు అల్ ఖారహ్ నుండి కొంత మంది ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి, వారిలో కొందరు ముస్లింలు ఉన్నారని, వారికి ఇస్లాం ధర్మాన్ని మరియు ఖుర్ఆన్ ను బోధించటానికి తమతో కొందరిని పంపమని అడిగారు. ఇబ్నె ఇష్హాఖ్ నివేదికలో నమోదు చేయబడిన దాని ప్రకారం, అపుడు ఆయన వారితో పాటు ఆరు గురిని పంపారు. అల్ బుఖారీలో నమోదు చేయబడిన దాని ప్రకారం వారి సంఖ్య పది. ఆయన వారికి (ముస్లిం బోధకులకు) నాయకునిగా మర్తాద్ ఇబ్నె అబీ మర్తాద్ అల్ ఘనావీ (రదియల్లాహు అన్హు) ను నియమించారు. వారిలో ఖుబైబ్ ఇబ్నె అదీ కూడా ఉన్నారు. వారు ఆ క్రొత్తవారితో బయలుదేరి ప్రయాణిస్తూ, హిజాజ్ లోని హుదైల్ తెగ నీటి హక్కులు కలిగి ఉన్న అల్ రజీ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారు ముస్లింలను మోసగించి, వారికి వ్యతిరేకంగా హుదైల్ తెగ వారి సహాయాన్ని కోరారు. వారి అర్థింపుకు స్పందిస్తూ, హుదైల్ తెగ ప్రజలు వచ్చి, ముస్లింలను చుట్టుముట్టి, ముస్లిములలో చాలా మందిని వధించారు. ఖుబైబ్ ఇబ్నె అదీ మరియు జైద్ ఇబ్నె అల్ దాథినహ్ లను ఖైదీలుగా చేసుకుని, మక్కా తీసుకు వెళ్ళి, అక్కడ వారిని బానిసలుగా అమ్మివేసారు. ఎందుకంటే బదర్ యుద్ధంలో వారు కొందరు ఖురైషీ నాయకులను చంపి ఉన్నారు. (జాద్ అల్ మఆద్, 3/244)
(3) ఆయన ఇంకా ఇలా అన్నారు:
ఇదే సఫర్ నెలలో (హిజ్రీ 4వ సంవత్సరం) జరిగిన బీర్ మైమునాహ్ (మైమూనహ్ బావి) యుద్ధం గురించి ఇలా నమోదు చేయబడింది:
మదీనాలోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ములాయిబ్ అల్ అసిన్నహ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన అబూ బర్రా ఆమిర్ ఇబ్నె అల్ మాలిక్ అనే అతను వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారు. అయితే అతను ముస్లిం కాలేదు. ఇస్లాంకు ఎక్కువ దూరంలో ఉన్నట్లూ కనబడలేదు. అతను ఇలా అన్నాడు, “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ ధర్మం వైపు ఆహ్వానించటానికి, మీరు మీ సహచరులను, నజ్ద్ (నేటి రియాద్) ప్రాంతానికి ఎందుకు పంపరు? వారు మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను.” అపుడు ఆయన, “నజ్ద్ ప్రజలు వారికి హాని కలుగ జేస్తారేమోనని నేను భయపడుతున్నాను.” అని పలికారు. దానికి అబూ బర్రా “వారు నా భద్రతలో ఉంటారు.” అని అన్నాడు. కనుక, ఇబ్నె హిష్షామ్ నివేదిక ప్రకారం, అతనితో ఆయన 40 మంది పురుషులను పంపారు. అల్ సహీహ్ నమోదు ప్రకారం ఆ సంఖ్య 70. అల్ సహీహ్ లో తెలుపబడినదే సరైనది. ఆయన అల్ మఅన్నాఖ్ పేరుతో ప్రసిద్ధి చెందిన బనీ సయీదహ్ తెగలోని అల్ ముందిర్ ఇబ్నె అమర్ ను వారికి నాయకునిగా నియమించారు. ఉత్తములుగా, ధర్మపరాయణులుగా ఆ తెగ ప్రజలు ప్రసిద్ధి చెందారు. అంతేగాక ఆరంభంలోనే ఇస్లాం స్వీకరించిన వారిలోని వారు. ఆ సహాబాలు ప్రయాణిస్తూ, బీర్ మైమూనహ్ వద్దకు చేరుకుని, బస చేసారు. అది బనీ ఆమిర్ ప్రాంతానికీ మరియు బనీ సులైమ్ కు చెందిన హర్రాహ్ (అగ్నిపర్వత లావా) ప్రాంతానికీ మధ్యన ఉంది. అపుడు వారు ఉమ్మె సులైమ్ సోదరుడైన హర్రామ్ ఇబ్నె మిల్హాన్ కు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశ పత్రాన్నిచ్చి, అల్లాహ్ యొక్క శత్రువైన ఆమిర్ ఇబ్నె అత్తుఫైల్ వద్దకు పంపారు. అతడు ఆ సందేశం వైపు చూడకుండా, వెనుక నుండి ఈటెతో హర్రామ్ పై దాడి చేయమని తన సహచరుడిని ఆదేశించాడు. హఠాత్తుగా తనపై జరిగిన దాడి, గాయం నుండి రక్తం కారడాన్ని చూసుకుంటూ, హర్రామ్ బిగ్గరగా ఇలా పలికాడు, “నేను గెలిచాను – కాబాగృహ ప్రభువు సాక్షిగా [అనగా షహాదత్ పొందాను].” వెంటనే ఆ అల్లాహ్ యొక్క విరోధి, మిగిలిన వారందరినీ (అక్కడి ముస్లింలందరినీ) వధించమని బనూ ఆమిర్ తెగను ఆజ్ఞాపించాడు. కానీ, ముస్లింలకు అబూ బర్రా ఇచ్చిన అభయం వలన, వారు అతని ఆజ్ఞను అమలు చేయటానికి వెనకాడారు. అపుడు అతడు బనీ సులైమ్ తెగను కోరాడు. ఆసియాహ్, రఆల్ మరియు ధక్వాన్ తెగలు అతడికి స్పందించాయి. వారు అల్లాహ్ ప్రవక్త యొక్క సహచరులను చేరి, వారిని చుట్టుముట్టారు. వీరోచితంగా తమ అంతిమశ్వాస వరకు పోరాడి, ముస్లిములందరూ వీరమరణం పొందారు – ఒక్క కఆబ్ ఇబ్నె జైద్ ఇబ్నె అల్ నజ్జార్ తప్ప. గాయపడి, షహీదుల దేహాల మధ్య పడిపోవటం వలన అతను మిగిలిపోయారు. తరువాత అనేక సంవత్సరాలు జీవించి, అల్ ఖందక్ యుద్ధంలో వీరమరణం పొందారు. అమర్ ఇబ్నె ఉమయ్యహ్ అల్ దుమారీ మరియు అల్ ముందిర్ ఇబ్నె ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ లు (దూరంగా) ముస్లింల పశువులను కాస్తూ, ఒక పక్షి గాలిలో పోరాటం జరిగిన ప్రాంతంపై తిరగటాన్ని చూసి, అక్కడికి వచ్చారు. అల్ ముందిర్ ముష్రికులతో తీవ్రంగా పోరాడి, తన సహచరులతో పాటు వీరమరణం పొందగా, అమర్ ఇబ్నె ఉమయ్యహ్ ఖైదీగా వారి చేతికి చిక్కినారు. తను ముదార్ తెగకు చెందిన వాడినని అతను వారికి చెప్పగా, ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించ వలసి ఉన్న తన తల్లి కొరకు ఆమిర్, అతని తల వెంట్రుకలు గొరిగి, విడిచిపెట్టినాడు. అమర్ ఇబ్నె ఉమయ్యహ్ మదీనాకు మరలుతూ, అల్ ఖరఖరహ్ మిన్ సదర్ ఖనాహ్ అనే ప్రాంతానికి చేరుకుని, అక్కడి ఒక చెట్టు క్రింద విశ్రాంతి కొరకు ఆగారు. బనీ కిలాబ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా అదే చెట్టు క్రిందకు చేరి, విశ్రాంతి తీసుకోసాగారు. వారు నిద్రపోగానే, అమర్ వారిద్దరినీ వధించి, తన సహచరులు హత్యకు ఆ విధంగా ప్రతీకారం తీర్చుకున్నానని భావించారు. కానీ, వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సంధి ఒడంబడిక చేసుకుని ఉన్నారన్న విషయం అతనికి తెలియదు. (మదీనాకు) మరలిన తరువాత అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తను చేసిన పనిని తెలుపగా, ఆయన ఇలా అన్నారు, “నీవు ఇద్దరిని వధించావు. దానికి బదులుగా నేను, తప్పకుండా వారికి దియాహ్ (హత్యకు బదులుగా చెల్లించే ధనం) చెల్లిస్తాను.” (జాద్ అల్ మఆద్, 3/246-248)
(4) ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా అన్నారు:
ఖైబర్ పై దండయాత్ర కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయలు దేరినపుడు, ఆ దినాలు ముహర్రం నెల చివరి దినాలు, అంతేగాని ముహర్రం నెలారంభ దినాలు కాదు. మరియు ఆయన దానిని సఫర్ నెలలో జయించారు. (జాద్ అల్ మఆద్, 3/339-340)
(5) మరియు ఆయన ఇలా అన్నారు:
ఖథామ్ ప్రాంతంపై ఖుత్బహ్ ఇబ్నె ఆమిర్ ఇబ్నె హదీదహ్ దండయాత్ర గురించిన అధ్యాయం.
ఇది హిజ్రీ 9వ సంవత్సరంలో జరిగింది. దీని గురించి ఇబ్నె సఆద్ ఇలా ఉల్లేఖించారు: వారిలా అన్నారు: ఇరవై మంది మనుషుల తీసుకుని, తిబాలహ్ కు చివర ఉన్న ఖథామ్ ప్రాంతంపై దాడి చేయమని, ఖుత్బహ్ ఇబ్నె ఆమిర్ ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపారు. వారు పది ఒంటెలపై వంతుల వారీగా సవారీ చేస్తూ ప్రయాణించారు. (శత్రుపక్షానికి చెందిన) ఒక వ్యక్తి వారి చేతికి చిక్కగా, వారు అతనిని ప్రశ్నించటం మొదలు పెట్టారు. అయితే, అతను వారికి జవాబివ్వకుండా, కూతలు కూయటం మొదలెట్టాడు. వారు ప్రమాదాన్ని శంకించి, అతడిని చంపేసారు. అతడి తెగవారు, వారు నిద్రపోయేవరకు నిరీక్షించి, వారిపై హఠాత్తుగా దాడి చేసింది. తీవ్రమైన పోరాటం జరిగింది. ఇరుపక్షాలలో అనేకులు గాయపడినారు. ఆ పోరాటంలో ఖుత్బహ్ ఇబ్నె ఆమిర్, అనేక మందిని వధించాడు. చివరికి వారు (విజయులైన ముస్లింలు) శత్రుపక్షానికి చెందిన ఆవులను, గొర్రెలను మరియు ఖైదీలను తమ వెంట తీసుకుని, మదీనాకు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అయితే శత్రుపక్షం ప్రజలు మరలా గుమిగూడి, వారిని వెంబడించగా, శత్రుపక్షానికీ మరియు ముస్లింలకూ మధ్య అల్లాహ్ గొప్ప వరదను పంపించాడని ఈ వృత్తాంతంలో తెలుపబడింది. ఆ వరద శత్రుపక్షాలను నిలిపివేయటం వలన, ముస్లింలు యుద్ధసంపత్తిలోని ఆవులను, గొర్రెలను, ఖైదీలను తీసుకుని మదీనా వైపుకు సాగిపోయారు. ఆ శత్రుపక్షం వారి వైపు కళ్ళప్పగించి చూడటం తప్ప, ఇంకేమీ చేయలేక పోయింది. ముస్లింలు అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయే వరకు వరద ప్రవాహం వారిని ఆపివేసింది. (జాద్ అల్ మఆద్, 3/514)
(6) ఇంకా ఆయన ఇలా అన్నారు:
9వ హిజ్రీ సంవత్సరం, సఫర్ నెలలో ఉధరహ్ నుండి జమ్రహ్ ఇబ్నె అల్ నొమాన్ తో కలిపి 12 మంది పురుషులన్న ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించారు: “ఎవరీ ప్రజలు?”. వారి ప్రతినిధి ఇలా జవాబిచ్చాడు: “మాలోని కొందరిని మీరు ఎరిగే ఉంటారు, మేము ఉధరహ్ వంశస్థులం. తన తల్లి తరుఫు నుండి ఉధరహ్, ఖుసై సోదరుడు. మేము ఖుసైను బలపర్చాము. ఖుజా మరియు బనీ బకర్ తెగలను మక్కా లోయ నుండి తొలగించాము. మాతో పాటు బంధువులు మరియు కుటుంబాలు ఉన్నాయి.” అది విని అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీకు నా ఆహ్వానం, మిమ్ముల్ని నేను బాగా ఎరుగును.” వారు ముస్లింలుగా మారిపోయినారు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి షామ్ (సిరియా) విజయం గురించిన శుభవార్తను మరియు తన రాజ్యంలోని ఒక పటిష్ఠమైన కోటలోనికి హెరాక్యులస్ పారిపోవటం గురించిన శుభవార్త ఇచ్చారు. జాతకాలు చెప్పేవారిని సంప్రదించవద్దని మరియు ఇతర దైవాలకు వారిచ్చే బలిదానాలు ఇక ముందు ఇవ్వవద్దని నివారించారు. వారు కేవలం ఉధియహ్ (ఈద్ అల్ అధహా దినం నాడు అల్లాహ్ కు సమర్పించే ఖుర్బానీ) మాత్రమే సమర్పించాలని బోధించారు. కొన్ని రోజుల పాటు వారు రమ్లహ్ ఇంటిలో బసచేసి, అక్కడి నుండి వెళ్ళిపోయారు.” (జాద్ అల్ మాద్, 3/657)
(5) ఈ నెల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అసత్య హదీథ్ లు.
ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా పలికారు: కొన్ని హదీథులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల తేదీలు కూడా పేర్కొన్నాయి. ఉదాహరణకు, కొన్ని హదీథులలో “ఫలానా సంవత్సరంలో ఫలానా సంఘటన జరగబోతుందని” లేదా “ఫలానా నెలలో ఫలానా సంఘటన జరగబోతుందని” తెలుపబడింది.
కానీ కొందరు పలికే క్రింది పదాలు పెద్ద పెద్ద అబద్ధాలకోర్లు పలికే పదాలు తప్ప మరింకేమీ కాదు:
“ముహర్రం నెలలో చంద్రగ్రహణం సంభవిస్తే ధరలు, పోట్లాటలు పెరుగుతాయి, పాలకుడు ప్రజల పరిపాలన నుండి తొలగించబడతాడు. అలాగే సఫర్ నెలలో చంద్రగ్రహణం సంభవిస్తే, ఫలానా ఫలానా జరుగుతుంది … ” మొదలైనవి ఒక అబద్ధాలకోరు మొత్తం నెలల గురించి పలికే అబద్ధాలు తప్ప మరేమీ కాదు. ఇలాంటి హదీథులన్నీ అసత్యమైనవే మరియు కల్పితాలే. (అల్ మనార్ అల్ మునీఫ్, p. 64)
(6) అద్వా లేదు తియారహ్ లేదు అనే పదాలకు అసలు అర్థం.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, “అద్వా లేదు [అల్లాహ్ అనుమతి లేకుండా హానికరమైన అంటు వ్యాధులు వ్యాపించడం], తియారహ్ లేదు [పక్షి శకునాలపై మూఢనమ్మకం], హామహ్ లేదు [అజ్ఞాన కాలంలోని అరబ్బుల రకరకాల మూఢాచారాలు: ప్రతీకారం తీర్చుకునే వరకు హత్య చేయబడిన వ్యక్తిని ఒక రకమైన పురుగు పీడిస్తూ ఉంటుంది; గుడ్లగూబ; లేదా మృతుని ఎముకలు ఎగర గలిగే పక్షుల వలే మారిపోతాయి.], మరియు సఫర్ లేదు [అజ్ఞాన కాలంలో అరబ్బులు సఫర్ నెలను ఒక “దురదృష్టకరమైన” నెలగా భావించేవారు].” [బ్రాకెట్లలో ఉన్నది అనువాదకుడి వివరణలు]. (సహీహ్ బుఖారీ 5757, మరియు సహీహ్ ముస్లిం 2220].
ముస్లిం హదీథు గ్రంథంలోని మరొక రిపోర్టులో ఇలా నమోదు చేయబడింది: “మరియు నౌ లేదు (గ్రహాల వాగ్దానం వలన కురిసే వర్షం) మరియు ఘూల్ లేదు (ఎడారులలో నివసించే దుష్టశక్తులు).”
అద్వా: అంటు వ్యాధులు, అల్లాహ్ అనుమతి లేకుండా హానికరమైన అంటు వ్యాధులు వ్యాపించడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్వా అనే అజ్ఞాన కాలపు అరబ్బుల మూఢవిశ్వాసాన్ని ఖండించారు. అద్వా అంటే అనారోగ్యానికి కారణం అల్లాహ్ కాకుండా వేరే శక్తి అని నమ్మటం మరియు అల్లాహ్ అనుమతి లేకుండా వాటికవే వ్యాపిస్తాయని గ్రుడ్డిగా నమ్మటం. అనారోగ్యం, అంటు వ్యాధులు మొదలైన వన్నీ అల్లాహ్ ఆదేశాన్ని అనుసరించే సంభవిస్తాయని ఆయన బోధించారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలని, అనారోగ్యాలకు గురి అయ్యే కారణాలను దూరంగా ఉంచాలని ఆయన తెలిపారు.
షేఖ్ ఇబ్నె ఉథైమిన్ (రహిమహుల్లాహ్) ఇలా పలికారు:
“అద్వా” లేదు అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు భావాన్ని బట్టి జనరల్ పలుకులు. కాబట్టి (అల్లాహ్ అనుమతి లేకుండా) అంటు వ్యాధులు సోకవని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ స్పష్టం చేసారు.
అద్వా అంటే ఏదైనా వ్యాధి ఒక రోగి నుండి ఒక ఆరోగ్యవంతునికి సోకటం. శారీరక వ్యాధుల విషయంలో ఏమి జరుగుతుందో, మానసిక వ్యాధుల విషయంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి, చెడు సహవాసిని కొలిమితిత్తి ఊదే వ్యక్తితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోల్చినారు: అతను మీ దుస్తులను కాల్చవచ్చు లేదా అతని నుండి మీకు దుర్వాసన చేరవచ్చు.
“అద్వా లేదు” అనేది ఎక్కువగా శారీరక వ్యాధులకు వర్తించేలా పైకి కనబడినా, అది శారీరక మరియు మానసిక వ్యాధులు రెంటికీ వర్తిస్తుంది. అంటు వ్యాధులు (అద్వా) అనే పదాల గురించి వివరణ: అంటు వ్యాధులు సోకుతూ ఉంటాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పలుకులు సూచిస్తున్నాయి, “రోగంతో ఉన్నదానిని, ఆరోగ్యంతో ఉన్నదానితో కలిపి ఉంచవద్దు” i.e., ఒంటె యజమాని అనారోగ్యంతో బాధపడుతున్న తన ఒంటెను, ఆరోగ్యంతో ఉన్న ఒంటె వద్దకు తీసుకు వెళ్ళకాడదు, ఎందుకంటే తన ఒంటె వ్యాధి దానికీ అంటుకోవచ్చు.
మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పులి నుండి పారిపోయే విధంగా, కుష్ఠురోగి నుండి పారిపోండి.” కుష్ఠురోగమనేది చాలా త్వరగా సోకే ఒక భయంకరమైన వ్యాధి. అంతేగాక సోకిన వ్యక్తిని వదలకుండా చావు వరకు చేర్చుతుంది. దానిని మహమ్మారి అని కూడా కొందరు అంటారు. అందు వలన సోకకుండా కాపాడుకునేందుకు, కుష్ఠురోగి నుండి దూరంగా పారిపోవాలని ఆదేశించబడింది. ఇది అంటురోగాల ప్రభావాన్ని ధృవీకరిస్తుంది. అయితే ప్రజలను చేరకుండా దానిని ఎవ్వరూ నివారించలేరు అని చెప్పేటంతటి స్వంత శక్తి దానికి లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని నుండి దూరంగా పారిపోమని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న ఒంటెలను ఆరోగ్యంతో ఉన్న ఒంటెల వద్దకు తీసుకురావద్దు అని చెప్పటమనేది వ్యాధి నిరోధక జాగ్రత్తలు తీసుకోవటం క్రిందికి వస్తుంది. అంతేగాని స్వయంగా తన ఇష్టానుసారం ఇతరులకు అంటుకునేటంతటి శక్తి ఆ వ్యాధికి ఉందని కాదు. దీని అర్థం ఏమిటంటే స్వయంగా, తనకు తానుగా ప్రభావం చూపగలిగే శక్తి దేనికీ ఉండదు. అయితే ముందు జాగ్రత్తగా, అలా సోకే ప్రమాదం ఉన్న వ్యాధులకు మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది (ఖుర్ఆన్ వచన భావార్థం): “మరియు మీరే స్వయంగా తమను తాము వినాశనంలోనికి విసిరేసుకోవద్దు” [సూరహ్ అల్ బఖరహ్ 2:195]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటురోగాలకు ఎలాంటి ప్రభావం లేదని నిరాకరించారని మేము చెప్పటం లేదు. ఎందుకంటే, వాస్తవ జీవితంలో అంటువ్యాధులు తప్పకుండా ఉన్నాయి మరియు అనేక హదీథులలో వాటి ప్రస్తావన వచ్చిందనేది ఒక పచ్చి నిజం.
ఎపుడైతే “అద్వా లేదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారో, ఒక వ్యక్తి ఆయనతో ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా, ఒంటెలు జింక వలే ఆరోగ్యంతో కళకళలాడూ ఉండవచ్చు. అపుడు అనారోగ్యంతో ఉన్న ఒక ఒంటె వచ్చి, వాటితో కలిసిపోయింది. దాని కారణంగా ఇతర ఒంటెలన్నీ రోగస్థులై పోయాయి.” అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించారు: “మరి, మొదటి దానిని ఎవరు అనారోగ్యానికి గురి చేసారు?” అంటే మొదటి ఒంటెకు ఆ రోగం ఇతర ఒంటెల నుండి అంటుకోలేదు, అది అల్లాహ్ తరుఫు నుండి వచ్చింది. అదే విధంగా, ఒకవేళ అది ఇతర ఒంటెలకు సోకితే, అది అల్లాహ్ ఆదేశం వలన మాత్రమే అలా వ్యాపించింది. ఏదైనా సంభవించిందంటే, దాని కారణం మనకు తెలిసినదై ఉండవచ్చు, లేదా మనకు తెలియనిదై ఉండవచ్చు. మొదటి ఒంటెకు వచ్చిన వ్యాధికి కారణం ఎవరికీ తెలియక పోవచ్చు, అయితే అది అల్లాహ్ యొక్క ఇష్టానుసారం మరియు ఆదేశం వలననే వచ్చిందనేది వాస్తవమైన విషయం, మరియు దాని తర్వాత వాటికి ఆ వ్యాధి ఎలా వచ్చిందనేది ఎవరైనా తేలిగ్గా గుర్తించవచ్చు. కానీ, ఒకవేళ అల్లాహ్ తలిస్తే, ఆ మొదటి ఒంటెకు వ్యాధి సోకి ఉండేది కాదు. కాబట్టి, ఒక్కోసారి ఒంటె వ్యాధికి గురైనా, చనిపోకుండా త్వరలోనే కోలుకోవచ్చు. ఇదే విషయం ప్లేగు మరియు కలరాకు కూడా వర్తిస్తుంది; ఆ వ్యాధులు ఏ ఇంటిలోనైనా ప్రవేశించవచ్చు, ఆ కుటుంబ సభ్యులు రోగానికి గురై, చనిపోవచ్చు. అయితే అక్కడి పొరుగిళ్ళకది అస్సలు వ్యాపించక పోవచ్చు.
మనం అల్లాహ్ పైనే నమ్మకం ఉంచాలి మరియు ఆయన పైనే ఆధారపడాలి. ఒక హదీథులో ఇలా నమోదు చేయబడి ఉంది: ఒకసారి ఒక కుష్ఠురోగి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఆయన చేతిని పట్టుకుని, తన పళ్ళం దగ్గరికి తీసుకు వెళ్ళి, ఆయనతో “తిను” అని పలికాడు. i.e., అంటే తన పళ్ళంలో నుండి తినమని అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కోరాడు - అల్లాహ్ పై ఉన్న అచంచల విశ్వాసం కారణంగా. అంటురోగాల కారణాన్ని ఈ దృఢవిశ్వాసం ఖండిస్తున్నది. దీనికి సంబంధించిన వివిధ హదీథుల మధ్య ఎంత మంచిగా రాజీ అయిందో పైన పేర్కొన్న బడింది. వివరణ సమాప్తం. షరహ్ కితాబ్ అల్ తౌహీద్, 2/80
ఇదే గాక, “అద్వా (అంటురోగం) లేదు” అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పదాలకు అర్థం ఏమిటంటే, అంటురోగం తనకు తానుగా రోగి నుండి ఆరోగ్యవంతునికి సోకదు. అది అల్లాహ్ యొక్క ఇష్టానుసారం మరియు ఆదేశానుసారం మాత్రమే వ్యాపిస్తుంది. ఎవరైనా అంటురోగంతో ఉన్న వ్యక్తి, ఆరోగ్యవంతులలో కలిసిపోవటనమేది, ఆ వ్యాధి అక్కడ వ్యాపించటానికి కారణంగా మారవచ్చు. అయితే, అలా జరగటం వలన ఆ వ్యాధి అక్కడ తప్పకుండా వ్యాపిస్తుందనటానికి గ్యారంటీ ఏమీ లేదు, అల్లాహ్ తలిస్తే తప్ప ఆ వ్యాధి అక్కడ వ్యాపించదు. దీని కారణంగా అనారోగ్యంతో ఉన్న తల్లి, తన అనారోగ్యాన్ని బిడ్డకు అంటించకుండా, ఆరోగ్యంతో కళకళలాడుతున్న పండంటి పసిబిడ్డకు జన్మనివ్వటాన్ని మనం తరుచుగా చూస్తుంటాము.
తియారహ్: పక్షి శకునాలలో మూఢనమ్మకం. తతయ్యుర్ (పక్షి దుశ్శకునాలలో గుడ్డినమ్మకం) అంటే నైరాశ్యం. అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “తియారహ్ (దుశ్శకునాలను నమ్మటం) అనేది ఒక రకమైన షిర్క్.”
“తియారహ్ లేదు (భాషాపరంగా పక్షి శకునాలలో అంధ విశ్వాసం)” అనే పదాలు గుడ్డి నమ్మక భావాన్ని సూచిస్తుంది, ఎందుకంటే అది మీరు చూసేది, వినేది మరియు తెలిసినదీను.
(7) హామహ్ లేదు, సఫర్ లేదు, నౌఅ లేదు, ఘౌల్ లేదు అనే వాటికి అసలు అర్థం.
“హామహ్ లేదు మరియు సఫర్ లేదు మరియు నఅవ్ లేదు మరియు ఘౌల్ లేదు” అనే హదీథు అర్థం:
ఇబ్నె ముఫ్లిహ్ అల్ హంబలి ఇలా పలికారు:
ముస్నద్, అల్ సహీహైన్ మరియు ఇతర చోట్ల, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని ఉల్లేఖించబడింది: “హామహ్ లేదు మరియు సఫర్ లేదు.” ముస్లిం హదీథు గ్రంథంలో మరియు ఇతర గ్రంథాలలో ఈ పదాలు కూడా ఉన్నాయి, “నౌఅ లేదు మరియు ఘౌల్ లేదు.”
హామహ్ (బహువచనం. హామ్) [గుడ్లగూబ]: ఎవరైనా చనిపోయినపుడు, మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత, అతని సమాధి నుండి ఒక గుడ్లగూబ బయటికి వస్తుందని అజ్ఞానకాలంలో ప్రజలు భావించేవారు. మృతుని ఎముకులు ఎగర గలిగే గుడ్లగూబలుగా మారిపోతాయని, ఒకవేళ ఎవరైనా హత్య చేయబడితే, అతని తల భాగం నుండి గుడ్లగూబ బయటికి వచ్చి, హంతుకుడు వధింపబడి, హతుని ప్రతీకారం పూర్తయ్యే వరకు “నాకు త్రాగేందుకు ఇవ్వండి, నాకు త్రాగేందుకు ఇవ్వండి” అని అరుస్తూ ఉంటుందని అప్పటి అరబ్బులు భావించేవారు. మరొక రిపోర్టులో దీనిని అజ్ఞాన కాలపు ఇంకో విధమైన అరబ్బుల ఆచారంగా ఇలా పేర్కొనబడింది: అతని ప్రతీకారం తీరే వరకు హతుడి సమాధిని ఒక పురుగు పీడిస్తూ ఉంటుంది; ఒక గుడ్లగూబ; లేదా ఎగరగలిగే పక్షుల వలే హతుడి ఎముకలు మారిపోవుట.
“హామహ్ లేదు” అనే పదాలలో, హామహ్ ను క్రింది రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:
1 – అది గుడ్లగూబ వంటి పక్షి కావచ్చు లేదా గుడ్లగూబే కావచ్చు. ప్రతీకారం తీర్చుకోబడే వరకు మృతుని ఎముకులు ఎగర గలిగే గుడ్లగూబలుగా మారిపోయి, అరుస్తూ ఉంటాయని అరబ్బులు భావించేవారు. వారిలో కొందరు హామహ్ లను వధించబడిన వారు ఆత్మలని నమ్మేవారు.
2 – హామహ్ అనేది దుశ్శకునాన్ని సూచించే ఒక ప్రత్యేక పక్షి అని కొందరు అరబ్బులు అన్నారు. ఒకవేళ అది వారి ఇళ్ళలో ఎవరో ఒకరి ఇంటిపై వాలి, అరిస్తే, ఆ ఇంట్లో మరణం సంభవించబోతుందని వారు పరిగణించేవారు. ఆ ఇంటి వ్యక్తి త్వరలోనే చనిపోతాడని వారు నమ్మేవారు. ఇవన్నీ నిస్సందేహంగా అసత్యపు విశ్వాసాలే.
సఫర్: అజ్ఞాన కాలంలో సఫర్ నెలను దురదృష్టకరమైన నెలగా పరిగణించేవారు. వారిలో సఫర్ నెల గురించి అంధ విశ్వాసులుండేవని చెప్పబడటం వలన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “సఫర్ లేదు” అనే పదాలతో దానిని ఖండిచారు. కడుపులో ఒక పాము ఉంటుందని, సంభోగం చేసినపుడు అది అతనికి రోగానికి గురి చేస్తుందని, మరియు ఆ రోగం అంటురోగమని అరబ్బులు నమ్మేవారని చెప్పబడింది. కాబట్టి ధర్మవేత్తలు దీనిని తిరస్కరించారు. మాలిక్ ఇలా పలికారు: అజ్ఞాన కాలపు ప్రజలు సఫర్ నెలను ఒక సంవత్సరం పవిత్రమైనదిగా పరిగణించేవారు కాదు మరియు ఆ తరువాతి సంవత్సరం దానిని పవిత్రమైనదిగా పరిగణించేవారు.
“సఫర్ లేదు” అనే పదాలు, పండితులు ఇచ్చిన ఒక వివరణ ప్రకారం, అజ్ఞాన కాలపు ప్రజలు అంధ విశ్వాసంతో దురదృష్టమైనదిగా చూసిన సఫర్ నెలను సూచిస్తున్నాయి. దీని గురించి సునన్ అబీ దాఊద్ (3914) లో ముహమ్మద్ ఇబ్నె రాషిద్ నుండి విన్న వ్యక్తి నుండి ఇలా నమోదు చేయబడింది: “అజ్ఞాన కాలపు ప్రజలు సఫర్ నెలను అశుభమైనదిగా పరిగణించేవారు, మరియు దీనిని దురదృష్టకరమైన నెలని అనేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఖండించారు.”
ఇమామ్ ఇబ్నె రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా పలికారు: “సఫర్ నెలను అశుభమైనదిగా పరగణించడమనేది నిషేధించబడిన ఒక గుడ్డి నమ్మకం. అలాగే బుధవారం వంటి కొన్ని ప్రత్యేక దినాలను అశుభమైనవిగా పరిగణించటం లేదా పెళ్ళళ్ళ కొరకు అశుభమైనదని షవ్వాల్ గురించి భావించే అజ్ఞానకాలపు ఆచారాన్ని అనుసరించడం మొదలైనవి నిషేధించబడినాయి.”
ప్రాచీన మరియు ఆధునిక దుశ్శకునాలను నమ్మే అంధవిశ్వాసాల రకాలు: కొన్ని దినాలు లేదా సఫర్ మరియు షవ్వాల్ వంటి కొన్ని నెలలు.
“సఫర్ లేదు” అనే పదాలు ప్రత్యేకంగా పెళ్ళిళ్ళ కొరకు అశుభమైనదిగా అజ్ఞాన కాలపు అరబ్బులు భావించిన సఫర్ నెలను సూచిస్తున్నాయి. మరియు అది ఒంటెలకు వ్యాపించిన కడుపు అంటు వ్యాధి అని, అది ఒక ఒంటె నుండి మరొక ఒంటెకు సోకిందని చెప్పబడింది; దీని ఆధారంగా, అద్వా (అంటు వ్యాధి) తర్వాత ఇది పేర్కొనబడింది. ఒక జనరల్ విషయం గురించి పేర్కొనబడిన తర్వాత ఒక ప్రత్యేక విషయం గురించి పేర్కొనబడటం క్రిందికి ఇది వస్తుంది.
ఇక్కడ సఫర్ అనే పదం సఫర్ నెలనే సూచిస్తుందనీ మరియు “సఫర్ లేదు” అనే పదాలకు అర్థం - అది అశుభమైదని కాదని, మంచి – చెడులు సంభవించే ఇతర సమయాలకు మాదిరిగానే ఇదీ ఒక సమయమనీ అర్ధం చేసుకోవటం సముచితంగా ఉంటుంది.
అంటే ఈ నెలలో చెడు జరుగదని భావించమని అర్థం కాదు. ఎందుకంటే దీనిలో ఇతర నెలలో మాదిరిగానే చెడు కూడా జరుగవచ్చు. అయితే ఈ నెల అలా జరిగే అశుభంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఏదైనా, దేనినైనా సంభవింపజేసేది అల్లాహ్ మాత్రమే. ఒకవేళ వాటిలో దేనికైనా ప్రభావం చూపే శక్తి ఉంటే అది సమ్మతమవుతుంది మరియు వాస్తవమవుతుంది; ఒకవేళ దేనినైనా అలా ప్రభావం చూపించే శక్తి ఉందని ఊహిస్తే, అది అసమ్మతమవుతుంది మరియు అసత్యమవుతుంది. కాబట్టి హదీథు నిరూపిస్తున్నదేమిటంటే, ఒకవేళ ఏదైనా విషయం ప్రభావం చూపుతున్నట్లయితే, ఆ విషయానికే స్వయంగా అలా ప్రభావం చూపే శక్తి ఉందని భావించ కూడదు. (వాస్తవానికి ఆ శక్తిని దానికిచ్చేది అల్లాహ్ మాత్రమే). ఒకవేళ ఆ ప్రభావం కేవలం ఊహాజనితమైనదైతే, హదీథు తెలుపుతున్న దాని ప్రకారం, మొట్టమొదట అలాంటి వాటి ప్రభావం ఏమీ ఉండదు.
నఅవ్’: (బహువచనం అన్వాఅ) (ఒక నక్షత్రం ఉదయించినపుడు, అస్తమించే మరో నక్షత్రం): ఇది క్రింది ఆయతులో పేర్కొనబడినట్లుగా 28 చాంద్రమాన దశలను లేదా స్థాయిలను సూచిస్తుంది. ఖుర్ఆన్ ఆయతు భావార్థం: “మరియు చంద్రుడు, మేము దాని కొరకు దశలను ఏర్పాటు చేసాము …” 36:39.
ప్రతి 30 రాత్రులలో, ఈ నక్షత్రాలలో ఒక నక్షత్రం పశ్చిమ దిక్కున అస్తమిస్తుంది మరియు మరొక నక్షత్రం తూర్పు దిక్కున ఉదయిస్తుంది. అలా సంవత్సరం ముగిసేటప్పటికి, ఆ నక్షత్రాలన్నీ ఉదయిస్తాయి మరియు అస్తమిస్తాయి. ఒక నక్షత్రం అస్తమిస్తూ, మరొకటి ఉదయించేటప్పుడు, వర్షం కురుస్తుందని, దీనికి ఆ నక్షత్రాలే కారణమని అరబ్బులు నమ్ముతూ, వారిలా పలికేవారు, “ఫలానా ఫలానా నఅవ్ (ఒక నక్షత్రం ఉదయించేటపుడు, అస్తమించే మరో నక్షత్రం) వలన వర్షం కురిసింది.” దీనిని నఅవ్ అని ఎందుకు పిలిచే వారంటే, పశ్చమ దిక్కున నక్షత్రం అస్తమించేటప్పుడే తూర్పు దిక్కున మరొ నక్షత్రం ఉదయిస్తుంది (నఅవ్) అంటే ఉదయించటం మరియు పైకి రావటం. మరియు నఅవ్ అంటే అస్తమించుట అని కూడా చెప్పబడింది అంటే వ్యతిరేకమైనది.
అయితే అల్లాహ్ ఇష్టానుసారమే వర్షం పడిందని నమ్ముతూ, ఇకురుస్తుందని నమ్మేవారి, “ఫలానా ఫలానా నఅవ్ సమయంలో వర్షం పడింది’” అని పలికేవారి విషయంలో అంటే సాధారణంగా ఆయా సమయాలలో అల్లాహ్ వర్షం కురిపిస్తాడు – అలా పలకటం హరామ్ అవుతుందా లేదా మక్రూహ్ అవుతుందా అనేది ఒక భేదాభిప్రాయాలున్న విషయం.
ఘౌల్: (బహువచనం. ఘీలాన్) అంటే ఒక రకమైన జిన్ను లేదా దయ్యం. నిర్జన ప్రదేశాలలో ఘౌల్ నివసిస్తుందని మరియు అపుడపుడు ప్రజలకు రకరకాల రూపాలలో, రంగులలో కనబడుతుందని, చంపాలనే ఉద్దేశంతో వారిని దారి తప్పేటట్లు చేస్తుందని అరబ్బులు నమ్మేవారు. ధర్మశాస్త్ర విధాయకుడు ఈ ఆలోచనను పూర్తిగా తిరస్కరించాడు మరియు ఖండించాడు.
మరియు ఘౌల్ ఉనిలో ఉందనే విషయాన్ని తిరస్కించటం కాదని, అది రంగూ, రూపం మార్చుకోగలదు మరియు ప్రజలు దారి తప్పిపోయేట్టు చేయగలదు అనే అరబ్బుల నమ్మకాన్ని తిరస్కరించటమని తెలుపబడింది. కాబట్టి “ఘౌల్ లేదు” అన్న పదాలకు అర్థం అవి ప్రజలు దారి కోల్పోయేటట్లు చేయలేవని అర్థం. ఈ అభిప్రాయాన్ని మరో హదీథు కూడా బలపరుస్తున్నది, “ఘౌల్ అనేది లేదు, కానీ “సఆలి” ఉంది. అది ముస్లింలో కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు. సఆలి అంటే జిన్నులలోని ఉండే ఒక మాంత్రికుడు. అయితే ఆ జిన్నులలో గందరగోళం మరియు వంచనల ఆధారంగా మాయ చేసే మంత్రగాళ్ళు కూడా ఉంటారు. … తఆఊస్ నుండి అల్-ఖల్లాల్ ఉల్లేఖన: ఒక వ్యక్తి అతని వెంట నడుస్తూ ఉండగా, ఒక కాకి కూయసాగింది. అపుడు ఆ వ్యక్తి ఇలా పలికాడు, “శుభం, శుభం.” అది విని తఆఉస్ అతనిని ఇలా అడిగాడు, “దీనిలో ఏమి శుభం ఉంది, ఏమి చెడు ఉంది? నీవు నాతో పాటు రావద్దు!” (అల్ ఆదాబ్ అల్ షరియ్యహ్, 3/369, 370)
ఇబ్నె అల్ ఖయ్యిమ్ ఇలా పలికారు:
“ఎవరైనా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, రోగి ముందుకు రాకూడదు” అనే పలుకులు గురించి కొందరు పండితులు, అవి “అద్వాహ్ (అంటువ్యాధి) లేదు” అనే పలుకుల ద్వారా తొలగించబడినాయని తెలిపారు. ఇది సరైన అభిప్రాయం కాదు. ఖండించబడినదీ మరియు బలపర్చబడినదీ – రెండూ వేర్వేరు అనే దానికి ఇది ఉదాహరణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అంటు వ్యాధి లేదు మరియు సఫర్ లేదు” అని పలికినపుడు, ‘షిర్కు విశ్వాసాలపై ఆధారపడి ఉన్న ముష్రికుల గుడ్డి నమ్మకాన్ని’ ఆయన ఖండించారు. ఆరోగ్యం వంతులు రోగుల ముందుకు రాకూడదనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిషేధానికి రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:
(1) అల్లాహ్ నిర్దేశించిన దానిని ప్రజలు అంటువ్యాధిగా ఆరోపించుటం, అది విన్నవారిని తికమక పెట్టి, అద్వాను నమ్మేటట్లు చేస్తుందనే భయాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి పై రెండు హదీథులలో ఎలాంటి విభేదం లేదు.
(2) ఆరోగ్యవంతుడు, రోగి ముందుకు రావటమనేది అల్లాహ్ ఆ వ్యాధిని సృష్టించుటకు మాధ్యమం కావచ్చు, కాబట్టి వ్యాధిగ్రస్తుని ముందుకు రావటమనేది రోగానికి కారణంగా మారవచ్చని, అయితే ఆ వ్యాధిని నిరోధించే ఇతర మాధ్యమాల ద్వారా అల్లాహ్ దానిని దారి మళ్ళించవచ్చని లేదా రోగ ప్రభావాన్ని నిరోధించవచ్చనే అభిప్రాయాన్ని ఇది సూచిస్తున్నది. ఇది పూర్తిగా స్వచ్ఛమైన తౌహీద్, షిర్కులో మునిగి ఉన్నవారి విశ్వాసం వంటిది కాదిది.
ఈ ఆయుతులో తెలిపినట్లు, తీర్పుదినం నాటి సిఫారసును నిరాకరించుటతో దీనిని పోల్చవచ్చు. (ఖుర్ఆన్ ఆయతు భావార్థం):
“ఏనాడైతే బేరసారాలు ఉండవో, స్నేహబంధం ఉండదో, సిఫారసు ఉండదో” 2:254
ఎలాంటి సందేహాలకు తావులేని ‘తీర్పుదినాన సిఫారసు ఉంటుందనే’ అనే ముతవాతిర్ హదీథులకు ఈ ఆయతు విరుద్ధం కాదు. ఎందుకంటే, ఇక్కడ అల్లాహ్ నిరాకరిస్తున్నది ‘సిఫారసు చేసే శక్తి, అనుమతించ బడకుండానే ముందుకు వచ్చి, వారి కొరకు సిఫారసు చేస్తుంది’ అనే ముష్రికులలో వ్యాపించిన గుడ్డి నమ్మకాన్ని మాత్రమే. అల్లాహ్ అనుమతించిన తర్వాత సంభవించే సిఫారసు గురించి అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ఈ క్రింది ఆయతులలో తెలిపినట్లుగా ధృవీకరించారు. (ఖుర్ఆన్ ఆయతుల భావార్థం): “అల్లాహ్ అనుమతి లేకుండా అల్లాహ్ వద్ద సిఫారసు చేయగలిగే దెవరు?” 2:255
“అల్లాహ్ ఎవరినైతే ఇష్టపడతాడో, వారి గురించి తప్ప మరెవ్వరి గురించీ వారు సిఫారసు చేయలేరు” 21:28
“అల్లాహ్ అనుమతించిన వారికి తప్ప సిఫారసు ప్రయోజనం కలిగించదు” 34:23
(హాషియత్ తహ్దీబ్ సునన్ అబీ దాఊద్, 10/289-291)