మతవిశ్వాసపు ప్రకటన

(“షహాదా”)

షరతులు - నిబంధనలు

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

 “లా ఇలాహా ఇల్లల్లాహ్” యొక్క షరతులు – నిబంధనలు

ముస్లింలకు తెలుసు స్వర్గప్రవేశానికి తాళంచెవి లాంటి వాక్యం “లా ఇలాహా ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు) అని. అయినా చాలా మంది ముస్లింలు కేవలం ఈ వాక్యాన్నే ఆధారంగా విశ్వసిస్తూ దీనిని ఉఛ్ఛరిస్తూ ఉన్నంత కాలం తాము స్వర్గంలో ప్రవేశించడానికి ఎటువంటి  అవరోధం లేదు అనుకుంటారు. కేవలం ఈ వాక్యాన్ని ఉఛ్ఛరించడం తమకు స్వర్గప్రాప్తి కలిగిస్తుందని భావిస్తారు. కానీ మోక్షం (స్వర్గప్రాప్తి) పొందడానికి ఈ పవిత్ర ప్రవచనాన్ని కేవలం నోటితో ఉఛ్ఛరిస్తే సరిపోతుంది అనుకోవడం సరికాదు. నిజానికి కపట విశ్వాసులు (మునాఫిఖీన్) “నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులుకారు” అని తరచుగా, అలవాటుగా, సమయం దొరికినపుడల్లా అంటూనే ఉంటారు. అయినా అల్లాహ్ వారిని అబధ్ధాలకోర్లుగా అభివర్ణించాడు. అటువంటి వారి శాశ్వత నివాసం నరకంలో అట్టడుగున ఉండే అగాథం అన్నాడు.

చాలామంది ఇస్లామీయ విద్వాంసులు, పండితులు (ఉలెమా) ఈ పవిత్ర ప్రవచనం స్వర్గంలో ప్రవేశించడానికి తాళంచెవి లాంటిది అని అన్నారు. కానీ ఈ వాక్యాన్ని ఉఛ్ఛరించడం వెనుక దానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కూడా ఉన్నాయి. హసన్ అల్ బస్రి రదిఅల్లాహు అన్ హు ఒక వ్యక్తి ని ఇలా అడిగారు “మరణంకోసం ఏమేం సిధ్ధ పరిచావు?” అని. ఆ వ్యక్తి అన్నాడు “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు అనే పవిత్ర ప్రవచనంతో సిధ్దంగా ఉన్నాను” అని. అందుకు హసన్ బస్రి ఇలా అన్నారు “దానికి కొన్ని షరతులు నిబంధనలు కూడా ఉన్నాయి (అని గమనించు). జాగ్రత్త శీలవంతులైన స్త్రీలకు అపకీర్తిని ఆపాదించకు (వారిని గురించి చెడుగా మాట్లాడకు).

వహబ్ బిన్ మునబ్బిహ్ అనే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక ప్రముఖ అనుయాయుడిని ప్రజలు ఒకసారి ఇలా అడిగారు “లాఇలాహ ఇల్లల్లాహ్” అనే పవిత్ర ప్రవచనం స్వర్గప్రవేశానికి తాళంచెవి లాంటిది కాదా?” అని.  దానికి ఆయన ఇలా జవాబిచ్చారు “నిస్సందేహంగా ఈ వాక్యం తాళంచెవి లాంటిదే, కానీ ప్రతి తాళంచెవికీ ఎత్తుపల్లాలతో కూడిన పళ్ళు ఉంటాయి. సరిగ్గా సరిపోయే పళ్ళతో కూడిన తాళంచెవిని ఉపయోగిస్తేనే తలుపులు తెరుచుకుంటాయి. అలాకాక మీ దగ్గర ఏదో ఒక తాళంచెవి ఉంటే (అంటే సరైన తాళంచెవి లేకపోతే) తలుపులు తెరుచుకోవు కదా.” అని.

తాళంచెవి యొక్క ఆ పళ్ళే (ఆ షరతులు/నిబంధనలే) రోజుకు ఎన్నిసార్లు ఉఛ్ఛరించారు - అనే తేడా లేకుండా ఆ పవిత్ర ప్రవచనం ద్వారా ఫలితం పొంది లాభపడే, లేదా నష్టంపొంది భంగపడే ముస్లింల మధ్య తేడాను తెలిపేది.

“షహాదా” (సాక్ష్యపు ప్రకటన లేదా పవిత్ర ప్రవచనం) యొక్క షరతులు/నిబంధనలను గురించి చర్చించడానికి ముందు ఇక్కడ మరో విషయాన్ని తేటతెల్లం చేయాలి. కొంతమంది ఒక హదీథ్ నో, లేదా ఖుర్ఆన్ లోని ఏదో ఒక వాక్యాన్నో ఆధారం చేసుకుని ఒక సార్వత్రికమైన ముగింపు కు వచ్చేస్తారు.  ఉదాహరణకు ఒక హదీథ్ లో ఉన్న ఒక వాక్యాన్ని పట్టుకుని “ఎవరైతే లాఇలాహ ఇల్లల్లాహ్ అని ఉఛ్ఛరిస్తారో వారు తిన్నగా స్వర్గంలోనికి ప్రవేశిస్తారు” అని నిర్ణయించేస్తారు. నిజానికి ఖుర్'ఆన్ మరియు హదీథ్ లు ఒకదానికి మరొకటి వివరణ అని గమనించాలి. ఏదైనా విషయాన్ని గురించైనా లేదా ఏ సమస్యను గురించైనా ఒక ఖచ్చిత మైన అవగాహనకు రావడానికి ఖుర్'ఆన్, హదీథ్ లలో ఆ విషయానికి లేదా ఆ సమస్యకు సంబంధించిన అన్ని ఆయాతులను (వాక్యాలను), హదీథ్ లను, ఒకచోట చేర్చి,  క్రోఢీకరించి, విమర్శనాత్మకంగా అధ్యయనం చేయాలి. అపుడే ఆ సమస్య లేదా విషయం పై సరైన ఇస్లామీయ దృక్పథం ఏమిటో స్పష్టమవుతుంది. “షహాదా” (సాక్ష్యపు ప్రకటన/పవిత్ర ప్రవచనం) విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఖుర్'ఆన్ మరియు ప్రవక్త యొక్క హదీథ్ లను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే “షహాదా” కు సంబంధించి దాదాపుగా తొమ్మిది నిబంధనలు ఉన్నాయనే విషయం అర్థం అవుతుంది. ప్రతి ముస్లిం తాను ఉఛ్ఛరించే “షహాదా” తన జీవితం లో ఈ నిబంధనలను ఎంత వరకు ప్రతబింబిస్తున్నదో బేరీజు వేసుకొని చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యమని తెలుసుకోవాలి.

 1.  జ్ఞానము

మొదటి నిబంధన జ్ఞానము:- ప్రతి ముస్లిం “షహాదా” అంటే ఏమిటో కనీసపు ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. “షహాదా” ఏ విషయాన్ని ధ్రువపరుస్తున్నదో, దేనిని ఖండిస్తున్నదో / నిరాకరిస్తున్నదో బాగా అర్థం చేసుకోవాలి.  ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ وَاسْتَغْفِرْ لِذَنْبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالمُؤْمِنَاتِ) 19)]. {محمد}.

“ఫ'లము అన్నహూ లా ఇలాహ ఇల్లల్లాహు వస్తగ్ ఫిర్ లి జంబిక, వలిల్ ము'మినీన వల్ ము'మినాత్” (సూరా ముహమ్మద్ 19).

“కాబట్టి తెలుసుకో – వేరే ఏ దేవుడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప, క్షమించమని వేడుకో – నీ పాపములకోసం మరియు విశ్వాసులైన స్త్రీ పురుషుల కోసం.”

అదే విధంగా, ప్రవక్త  అన్నారు:

“మన్ మాత వహువ య'లము అన్నహూ లా ఇలాహ ఇల్లల్లాహు, దఖలల్ జన్నహ్” (ముస్లిం హదీథ్ గ్రంథం).

“ఎవరైతే “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు” అనే జ్ఞానం కలిగి ఉన్న స్ధితిలో మరణిస్తారో – వారు స్వర్గంలో ప్రవేశిస్తారు (ముస్లిం హదీథ్ గ్రంథం).

నిజానికి “షహాదా” అంటే ఒక సాక్షి ఇచ్చే సాక్ష్యం అని అర్థం. ఏదైనా విషయాన్ని గురించి సాక్ష్యమిచ్చేటపుడు, సాక్షికి ఆ విషయాన్ని గురించిన పూర్తి జ్ఞానం ఉండడం తప్పనిసరి. తనకు అసలేమీ జ్ఞానం లేని విషయాన్ని గురించి ఎవరైనా సాక్ష్యమిస్తే అది ఆమోదయోగ్యం కాదనే విషయం సుస్పష్టం. అల్లాహ్ ఖుర్'ఆన్ లో ఇలా అంటున్నాడు:

[وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِنْ دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَنْ شَهِدَ بِالحَقِّ وَهُمْ يَعْلَمُونَ]  الزُّخرف:86

“ఇల్లా మన్ షహిద బిల్ హఖ్ఖి, వహువ యా'లమూన్” (జుఖృఫ్ 86)

“అయితే (సిఫారసు చేసేందుకు అర్హులు ఎవరంటే) ఎవరైతే సత్యవాక్యానికి (లా ఇలాహా ఇల్లల్లాహ్) సాక్ష్యమిస్తారో, మరియు దాని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉంటారో” (జుఖృఫ్ 86).

కనుక “షహాదా” యొక్క ప్రాథమిక అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడం అటువంటి వ్యక్తికి (దేవుని ఏకత్వాన్ని గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తికి) ఎంతైనా అవసరం. ఉదాహరణకు సాక్ష్యమిచ్చే వ్యక్తికి కేవలం అల్లాహ్ మాత్రమే అన్ని రకాల ఆరాధనలకు అర్హుడు అని, మిగతా దేవుళ్ళూ, దేవతలూ అందరూ అబద్ధపు/తప్పుడు వారనే జ్ఞానం లేకపోయినట్లైతే – తాను ఏ విషయానికి సబంధించి  సాక్ష్యనిస్తున్నానని దావా చేస్తున్నాడో దానికి సంబంధించిన అత్యంత ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేనట్లే.  అటువంటి “షహాదా” (సాక్ష్యపు ప్రకటన) అల్లాహ్ దగ్గర అమోదయోగ్యము కాదు.

 2. సంపూర్ణ విశ్వాసం

రెండవ నిబంధన సంపూర్ణ/పరిపూర్ణ విశ్వాసము:-ఇది “సందేహం” లేదా “లోపభూయిష్టమైన విశ్వాసం” అనే దానికి పూర్తిగా వ్యతిరేకం. నిజానికి ఇస్లాంలో, ఖుర్'ఆన్ మరియు సున్నత్ లలో అభిప్రాయబేధాలు లేకుండా ధృవపర్చబడిన ఏ ఒక్క విషయంలోనైనా సందేహించడం - “కుఫ్ర్” (దైవవిశ్వాసాన్ని తిరస్కరించడం) తో సమానం.  ప్రతి ముస్లిం తన మనసులో “షహాదా” యొక్క వాస్తవం మరియు యదార్థం పట్ల, సంపూర్ణంగా, బేషరతుగా, కల్తీ లేని విశ్వాసం కలిగి ఉండాలి. “అల్లాహ్ తప్ప ఆరాధనలకు పూజలకు వేరెవ్వరూ అర్హులు కారు” అని సాక్ష్యమిచ్చే విషయంలో మనసు నిలకడగా ఉండాలి. అల్లాహ్ నిజమైన విశ్వాసులను “ఎవరైతే అల్లాహ్ ను విశ్వసిస్తారో – వారి హృదయాలు (అల్లాహ్ పై విశ్వాసానికి సంబంధించి) అచంచలంగా ఉంటాయి” అని అభివర్ణించాడు.  అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రకటించాడు:

[إِنَّمَا المُؤْمِنُونَ الَّذِينَ آَمَنُوا بِاللهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ فِي سَبِيلِ اللهِ أُولَئِكَ هُمُ الصَّادِقُونَ] الحجرات:15

“ఇన్నమల్ ము'మినూన అల్లజీన ఆమనూ బిల్లాహి వ రసూలిహి సుమ్మ లమ్ యర్తాబూ వ జాహదూ బి అమ్వాలిహిమ్ వ అన్ఫుసిహిమ్ ఫీ సబీలిల్లాహి, ఉలాయిక హుముస్సాదిఖూన్ (అల్ హుజురాత్ 15)

“కేవలం వారే (నిజమైన) విశ్వాసులు – ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో – మరియు సందేహించకుండా (ఎటువంటి సందేహానికీ లోనుకాకుండా) (తమ) ధన (మాన) ప్రాణాలతో అల్లాహ్ యొక్క మార్గంలో కృషి చేస్తారో. అటువంటి వారే (నిజానికి) సత్యవంతులు (నిష్కపటులు - కపటం లేని వారు) (అల్ హుజురాత్ 15)

అదే విధంగా, ప్రవక్త  ఇలా అన్నారు:

“అష్హదు అన్ లా యలాహా ఇల్లల్లాహు వ అన్నీ రసూలుల్లాహి లా యల్ఖల్లాహ బిహిమా అబ్దున్ గైరషక్కిన్ ఫీహిమా ఇల్లాదఖలల్ జన్నహ్.”

“ఎవరైతే “అల్లాహ్ తప్ప ఆరాధనలకు, పూజలకు వేరెవ్వరూ అర్హులు కారు అని మరియు నేను అల్లాహ్ యెక్క ప్రవక్తను” అనే విశ్వాసపు ప్రకటన (“షహాదా”) తో అల్లాహ్ ను చేరుకుంటారో మరియు ఆ విశ్వాసపు ప్రకటన పట్ల (మనసులో) ఎటువంటి శంక, సందేహం కలిగి ఉండరో వారు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తారు.”(ముస్లిం హదీథ్ గ్రంథం)

మరోవైపు అల్లాహ్ కపట విశ్వాసులను వర్ణిస్తూ వారి హృదయాలు నిలకడ లేనివి, చంచలమైనవి, అన్నాడు.  ఉదా.. సూరా తౌబా 45 వ ఆయతులో ఇలా అంటున్నాడు:

[إِنَّمَا يَسْتَأْذِنُكَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللهِ وَاليَوْمِ الآَخِرِ وَارْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِي رَيْبِهِمْ يَتَرَدَّدُونَ] {التوبة:45}

“ఇన్నమా యస్త'జినుక అల్లజీన లా యు'మినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వ అర్తాబత్ ఖులూబుహుమ్ ఫహుమ్ ఫీ రైబిహిమ్ యతరద్దదూన్” (అల్ తౌబా 45).

“ఇటువంటి విజ్ఞప్తులు (జిహాద్ లో పాల్గొనకుండా తప్పించుకోవడానికి) కేవలం వారు మాత్రమే చేస్తారు – ఎవరైతే అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించరో, మరియు ఎవరి హృదయాలు అయితే సంశయంలో, సందేహంలో మునిగి ఉన్నాయో. వారు ఆ సందేహాలలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ”

చాలా మంది ఇస్లామీయ విద్వాంసులు (ఉలెమా) ముస్లిం విశ్వాసానికి సంబంధించి - మనసుకు సంబంధించిన ఈ రోగాలు, అంటే మనిషి తన మనసులో చేరనిచ్చే ఈ సంశయం, సందేహం, అనుమానాలు; మనస్సులో పుట్టే (లైంగిక) వాంఛలు, కోరికల కంటే కూడా చాలా ప్రమాదకరమైనవి అన్నారు. ఎలాగంటే – మనిషి (మానసికంగా ఏదో ఒక బలహీన క్షణం లో, తప్పు అని తెలిసి కూడా) లైంగికపరమైన వాంఛలకు, కోరికలకు లోబడి, వాటిని ఏదో ఒకలా తీర్చుకుంటాడు.  చివరికి తన తప్పు తెలుసుకుని, పాశ్చాత్తాపపడి, తన కోరికలను, వాంఛలను అదుపులో ఉంచుకుని, అటువంటి దుశ్చర్యలు చేయడం మానుకునే అవకాశం ఉంది. కానీ ఈ సంశయం, సందేహం, అనుమానాలు అనేవి మనిషి మనసులో నిరంతరం సుళ్ళు తిరుగుతూ, అతను ఇస్లాం నుంచి పూర్తిగా తొలిగి పోయేంతవరకు వైద్యం లేని జబ్బులాగా అంటి పెట్టుకుని ఉంటాయి. లేదా అటువంటి వ్యక్తి ముస్లింగానే ఉంటున్నప్పటికీ, అతని మనసులో నిజమైన విశ్వాసం అనేది ఉండదు.

ఈ సంశయం, సందేహం, అనుమానాలకు సంబంధించిన అతి గొప్ప చికిత్సలలో ఒకటి ఏమిటంటే విజ్ఞానము (జ్ఞానము). ఖుర్'ఆన్ మరియు సున్నత్ లకు సంబంధించిన వివేకవంతమైన జ్ఞానము ఈ సందేహం, అనుమానాలను చాలావరకు లేదా పూర్తిగా తొలిగిస్తుంది. చదవడం మరియు అర్థం చేసుకోవడం ద్వారా మనిషి సంపూర్ణత్వాన్ని (నిశ్చలత్వాన్ని) పొందుతాడు.  చదువుతూ మరియు చదివిన దానిని గ్రహిస్తూ ఉన్నంతకాలం అతని సంపూర్ణత్వంలో స్థిరత్వం ఇంకా ఇంకా పెరుగుతుంది.

 3. స్వీకారం

మూడవ నిబంధన స్వీకరించుట (స్వీకారం) :- ఒక వ్యక్తి “షహాదా” యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండి, “షహాదా” పై తన యొక్క విశ్వాసం లో నిశ్చలత్వాన్ని కలిగి ఉంటే, అటువంటి పరిపూర్ణ సుస్థిర విశ్వాసం తో అతను షహాదాను నాలుకతో ఉఛ్ఛరించి, షహాదా సుచించే/బోధించే ప్రతి దానిని మనస్పూర్తిగా స్వీకరించాలి.   ఎవరైతే షహాదాను మరియు షహాదా సుచించే/బోధించే వాటన్నిటినీ స్వీకరంచడానికి నిరాకరిస్తారో, వారు  “షహాదా” యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, “షహాదా” యొక్క సత్యత పట్ల పరిపూర్ణ సుస్థిర విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, వారు అవిశ్వాసులే (అవిశ్వాసులు గానే పరిగణింపబడతారు). ఈ విధంగా నిరాకరించడానికి గర్వం, అహంకారం, అసూయ లాంటివి ఏవైనా కారణాలు కావచ్చు.  కానీ ఎటువంటి సందేహ, సంశయాలు లేకుండా  నిరభ్యంతరంగా, స్వీకరించనంతవరకు -“షహాదా” (ఎన్ని సార్లు ఉఛ్ఛరంచినా) నిజమైన “షహాదా” గా పరిగణించబడదు.

పైన వివరించిన విధంగా, ఇస్లామీయ విద్వాంసులు - తన విస్తృతార్ధంలో దీనిని ఒక సార్వత్రిక నిబంధనగా అభివర్ణిస్తారు. కానీ దీనిని గురించిన మరింత వివరణాత్మక మైన దృక్పథాన్ని గురించికూడా తెలుసుకుని ఉండడం ఎంతైనా అవసరం. “స్వీకరించుట (స్వీకారం) లేదా “అల్-ఖుబూల్” అనే ఈ నిబంధనను గమనిస్తే – ఈ నిబంధనకు లోబడి ఉండడం లేదా స్వీకరించడం అంటే – ఆ వ్యక్తి ఖుర్'ఆన్ మరియు ప్రవక్త  ప్రవచనాలలో, తాను ఎన్నుకున్న వాటిని (ఆయతులను, ప్రవచనాలను) విశ్వసించి, లేదా తాను ఎన్నుకున్న వాటిని తిరస్కరించే హక్కు, అధికారం లేకుండా, ఖుర్'ఆన్ మరియు ప్రవక్త  ప్రవచనాలను పూర్తిగా, కల్తీ లేకుండా విశ్వసిస్తున్నాడు అని అర్థం.  ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

[أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ فَمَا جَزَاءُ مَنْ يَفْعَلُ ذَلِكَ مِنْكُمْ إِلَّا خِزْيٌ فِي الحَيَاةِ الدُّنْيَا وَيَوْمَ القِيَامَةِ يُرَدُّونَ إِلَى أَشَدِّ العَذَابِ وَمَا اللهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ] {البقرة:85}

“అఫతు'మినూన బిబ'దిల్ కితాబి వ తక్ఫురూన బిబ'ద్ – ఫమా జజాఉ మఁయఫ్అలు జాలిక మిన్కుమ్ ఇల్లా ఖిజ్ యున్ ఫిల్ హయాతిద్దున్యా – వ యౌమల్ ఖియామతి యురద్దూన ఇలా అషద్దిల్ అజాబ్” (అల్ బఖరా-85).

“మీరు గ్రంథంలోని కొంతభాగాన్ని విశ్వసించి మరికొంత భాగాన్ని తిరస్కరిస్తారా? మీలో అలా చేసే వారికి శిక్ష ఇహలోకంలో అప్రతిష్ఠపాలు కావడం, పరలోకంలో తీవ్రమైన నరకయాతనలకు గురిచేయబడడం తప్ప మరింకేమి కాగలదు?” ఖుర్ఆన్ లో  అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

[وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللهُ وَرَسُولُهُ أَمْرًا أَنْ يَكُونَ لَهُمُ الخِيَرَةُ مِنْ أَمْرِهِمْ وَمَنْ يَعْصِ اللهَ وَرَسُولَهُ فَقَدْ ضَلَّ ضَلَالًا مُبِينًا] {الأحزاب:36}

“వమా కాన లిము'మిని వ లా ము'మినతిన్ ఇజాఖదల్లాహు వ రసూలుహూ అమ్రన్ అఁయకూన లహుముల్ ఖియారతు మిన్ అమ్రిహిమ్ వ మఁయ'సిల్లాహ వ రసూలహు, ఫఖద్ జల్ల జలాలమ్ముబీన” (సూరా అల్ అహ్ జాబ్ 36)

“అల్లాహ్ ఆయన ప్రవక్త ఏదైనా వ్యవహారంలో ఒక నిర్ణయం చేసిన తరువాత, ఇక దాన్ని గురించి విశ్వాసులైన స్త్రీ పురుషులెవరికీ ఎలాంటి స్వంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు.  దీనికి భిన్నంగా ఎవరైనా దేవుడికి, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, వారు పూర్తిగా మార్గభ్రష్ఠత్వంలో పడిపోయినట్లే.”


 విధేయత (దాసోహం)

నాలుగవ నిబంధన విధేయత మరియు (దాసోహం)  లేదా “అల్-ఇన్ ఖియాద్” :-  

ఈ నాలుగవ నిబంధన, వాస్తవంగా ఒక ముస్లిం తన పనుల/చేతల ద్వారా; తాను ఉఛ్ఛరించిన “షహాదా” పట్ల  నిర్వహించవలసిన పాత్రను సూచిస్తుంది.  “ఇస్లాం” అనే పదానికి ఉన్న ముఖ్యమైన అర్థాలలో ఇదికూడా ఒకటి - “అల్లాహ్ యొక్క అభీష్ఠానికి (సంకల్పానికి), ఆజ్ఞలకు, అధికారానికి, తన ఇష్టాయిష్టాలను సమర్పించుకోవడం”. ఈ విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.

وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ    [............................... الزُّمر 54

“వ అనీబూ ఇలా రబ్బికుమ్ వ అస్లిమూలహూ”

(అల్ జుమర్ – 54).

“మీరంతా పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపుకు మరలండి, ఆయనకు దాసులై ఆయన ఆజ్ఞలను శిరసావహించండి”  (అల్ జుమర్ – 54).

తమ చేతల/పనుల ద్వారా తమను తాము అల్లాహ్ ఆజ్ఞలకు సమర్పించుకున్న వారిని అల్లాహ్ ప్రశంసించాడు.  ఖుర్'ఆన్ లో అల్లాహ్ అంటున్నాడు:

] وَمَنْ أَحْسَنُ دِينًا مِمَّنْ أَسْلَمَ وَجْهَهُ للهِ وَهُوَ مُحْسِنٌ 125 [.النساء

“వ మన్ అహ్ సను దీనమ్మిమ్మన్ అస్లమ వజ్ హహు లిల్లాహి వహువ ముహ్ సినున్” (సూరా నిసా-125)

ఎవరైతే తన ప్రయోజనాలనన్నింటినీ (తన ఇష్టాయిష్టాలను) అల్లాహ్ కు సమర్పించుకుని, పైగా సదాచార పరాయణుడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడూ కూడా అయి ఉంటే, (అల్లాహ్ యొక్క ధర్మం (ఇస్లాం) కు సంబంధించినంత వరకు) అతనికంటే శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరు?” (సూరా నిసా-125).

ఒక ముస్లిం - తన ప్రయోజనాలనన్నింటినీ (తన ఇష్టాయిష్టాలను) తనకు సమర్పించుకోవడాన్ని మరియు తన ప్రవక్త  కు విధేయులై ఉండడాన్ని మతవిశ్వాసానికి సంబంధించి ఒక తప్పనిసరి  షరతుగా విధించాడు అల్లాహ్.  సూరా నిసా ఆయత్ 65 లో  అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడు.

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنْفُسِهِمْ حَرَجًا مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا [النساء65

“ఫలా వ రబ్బిక లాయు'మినూన హత్తా యుహక్కిమూక ఫీమా షజర బైనహుమ్ సుమ్మ లా యజిదూ ఫీ అన్ఫుసిహిం హరజమ్మిమ్మా ఖదైత వ యుసల్లిమూ తస్లీమా” (అన్నిసా – 65).

“నీ ప్రభువు సాక్షి, వారు తమ వివాదాల పరిష్కారం కోసం నిన్ను న్యాయనిర్ణేతగా అంగీకరించి, వాటిపై నీవిచ్చే తీర్పు పట్ల తటపటాయించకుండా, ఆసాంతం స్వీకరించనంత వరకూ వారు నిజమైన విశ్వాసులు కాలేరు”(అన్నిసా–65).

“ఈమాన్” అనే అధ్యాయం లో చర్చకు రానున్న విధంగా, “షహాదా” అంటే మనోవాక్కర్మలా (మనస్సు, వాక్కు, కర్మ, ఈ మూడింటి ద్వారా) అమలుపర్చ బడాల్సిన (మత) విశ్వాసపు సాక్ష్యం. అంటే ఉదాహరణకు విశ్వాసికి అతని మనస్సులో అల్లాహ్ పై భక్తితో కూడిన ప్రేమ, భయంతో పాటు, నమ్మకంతో కూడిన విశ్వాసం ఉండాలి. వాక్కుతో అతను “షహాదా” యొక్క సత్యతను గూర్చి (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకూ అర్హులు కారు అని) సాక్ష్యం ఇవ్వాలి. ఈ విధంగా సాక్ష్యం ఇవ్వడం అతని నుంచి ఏ విధమైన పనులను ఆశిస్తున్నదో ఆ విధమైన పనులను అతను తన కర్మల (చేతల) ద్వారా అమలు చేయాలి.  తాను ముస్లింను అని దావా చేస్తున్న ఎవరైనా అతని కర్మలు (చేతలు, పనులు) “షహాదా” కు అణుగుణంగా లేనట్లైతే దాని అర్థం ఇస్లాం అంటే ఏమిటో అతను సరిగా అర్థం చేసుకోలేకపోయి అయినా ఉండాలి – లేదా తన సాక్ష్యం నిజమైన, ఖచ్చితమైన, సరియైన సాక్ష్యం కాదని – తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యమిస్తున్న వాడైనా అయి ఉండాలి.

అంటే దానర్థం నిజమైన విశ్వాసి పాపపుకార్యం లో పడడు అని కాదు.  నిజమైన విశ్వాసుల వల్ల కూడా పాపపు కార్యాలు జరుగుతాయి అనేది నిజం.  కానీ తాము చేసిన పని సరియైనది కాదని వారు గ్రహించినంత కాలం, తమను తాము (తమ ఇష్టాయిష్టాలను) అల్లాహ్ కు సమర్పించుకోవాలి అనే విషయానికి వ్యతిరేకంగా ప్రవర్తించనంత కాలం (దానికి కట్టుబడి ఉన్నంత కాలం). వారు తమ “షహాదా” కు సంబంధించిన యోగ్యతను ఉల్లంఘించనట్లే. 

 సత్యసంధత

ఐదవ నిబంధన “సత్యసంధత”, అంటే “మోసం, వంచన, దగా, కపటత్వం, నిజాయితీ లేకపోవడం” అనే వాటికి వ్యతిరేకం అని అర్థం :-  అంటే ఒక వ్యక్తి “షహాదా” ఉఛ్ఛరిస్తున్నాడు అంటే, అలా ఉఛ్ఛరించడంలో వాస్తవంగా అతని నిజాయితీ, సంకల్పం, నిర్ణయం సమ్మిళితమై ఉండాలి. “షహాదా” (విశ్వాసపు ప్రకటన) ను ఉఛ్ఛరించడం సరదాకో, ఎవరినో మోసం చేయడానికో, లేదా ఆట పట్టించడానికో కానిదై ఉండాలి. ప్రవక్త  ఇలా అన్నారుః

“మా మిన్ అహదిఁయష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహి సిద్ ఖన్ మిన్ ఖల్బిహి ఇల్లా హర్రమహుల్లాహు అలన్నార్” (బుఖారి హదీథ్ గ్రంథం).

“ఎవరైతే “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు అని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని నిష్కపటంగా, మనస్పుర్తిగా సాక్ష్యమిస్తారో (“షహాదా” ను ఉఛ్ఛరిస్తారో) అల్లాహ్ వారిపై నరకాగ్నిని నిషేధించాడు” (బుఖారి హదీథ్ గ్రంథం).

నిజాయితీ లేకపోయినప్పటికీ, “షహాదా” ను ఉఛ్ఛరించే వారిని గురించి చాలామంది వినే ఉంటారు.  నిజానికి అటువంటి వారిలో “షహాదా” పట్ల విశ్వాసం ఏమాత్రం కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో తమను తాము రక్షించుకోవడానికో, లేదా తద్వారా ఏదైనా లాభం పొందే అవకాశం ఉంటే దానిని పొందడానికో వారు అలా ఉఛ్ఛరిస్తూ ఉంటారు.  నిజానికి ఇటువంటి వారే కపట విశ్వాసులు.  ఖుర్'ఆన్ యొక్క ప్రారంభంలో అల్లాహ్ ఇటువంటి వారిని గురించి ఈ పదాలలో వర్ణించాడు.

]وَمِنَ النَّاسِ مَنْ يَقُولُ آَمَنَّا بِاللهِ وَبِاليَوْمِ الآَخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِينَ(8) يُخَادِعُونَ اللهَ وَالَّذِينَ آَمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنْفُسَهُمْ وَمَا يَشْعُرُونَ(9) فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَهُمُ اللهُ مَرَضًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ 10 [البقرة

“వమిన్నాసి మఁయఖూలు ఆమన్నా బిల్లాహి వబిల్ యౌమిల్ ఆఖిరి వమా హుమ్ బి ము'మినీన్ (8) యుఖాదిఊనల్లాహ వల్లజీన ఆమనూ వమా యఖ్ దఊన ఇల్లా అన్ఫుసహుమ్ వమా యష్ఉరూన్ (9) ఫీ ఖులూబిహిమ్మరదున్ ఫజాదహుముల్లాహు మరదా, వలహుమ్ అజాబున్ అలీమున్ బిమా కానూ యక్ జిబూన్(10)  (సూరా అల్ బఖరా 8, 9, 10)

“కొందరు అల్లాహ్ ను, పరలోకాన్ని విశ్వసించామని చెప్పుకుంటారు. కానీ వారు నిజమైన విశ్వాసులు కారు. వారు అల్లాహ్ ను, విశ్వాసులను మోసగింప జూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసగించు కుంటున్నారు. ఆ సంగతి వారు గ్రహించడం లేదు. వారి హృదయాలలో ఒకవిధమైన రోగం ఉంది.  అల్లాహ్ దానిని మరింత ముదిరేలా చేశాడు. వారి అసత్య ప్రేలాపనలకుగాను వారి కోసం దుర్భర యాతన కాచుకొని వుంది” (సూరా అల్ బఖరా 8, 9, 10).

ముస్లింగా ఉండడంవల్ల ఒనగూడే లాభాలను పొందడానికి ఎవరైనా (“షహాదా” ఉఛ్ఛరించి) ముస్లింగా మారితే దాని అర్థం వారికి ఇస్లాం పట్ల ఎటువంటి విశ్వాసమూ లేదూ అని (మరో మాటలో చెప్పాలీ అంటే వారు అబధ్ధం ఆడుతున్నారూ అని). అటువంటి వారి “షహాదా” పరలోక దినాన అల్లాహ్ చేత తిరస్కరించబడుతుంది.  అక్కడ తమ అబధ్ధానికిగాను వారు చాలా బాధాకరమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.

 పవిత్రమైన, స్వఛ్ఛమైన,  చిత్తశుధ్ధి

ఆరవ నిబంధన “పవిత్రమైన (కల్తీ లేని) చిత్తశుధ్ధి లేక “అల్ఇఖ్లాస్” :- ఎవరైనా “షహాదా” (విశ్వాసపు ప్రకటన) ను బహిరంగంగా స్వీకరించడం లేదా ప్రకటించడం అనేది జరిగితే, అలా ప్రకటించడం యొక్క ఏకైక లక్ష్యం కేవలం అల్లాహ్ కోసం మాత్రమే అయి ఉండాలి. అంతేకాని వేరే ఏ కారణం కోసమో, లేక ఇంకెవరినైనా సంతోషపర్చడం కోసమో అయి ఉండకూడదు. ఈ విధంగా (“షహాదా” కు సంబంధించినంత వరకు) “పవిత్రత” లేక “స్వఛ్ఛత” అంటే “షిర్క్” కు వ్యతిరేకం లేదా “అల్లాహ్ యొక్క ఏకత్వం లో మరొకరికి సాటి కల్పించడం” అనేదానికి వ్యతిరేకం అని అర్థం.  ఎవరైనా ముస్లింగా మారడం, ముస్లింగానే మిగిలి పోవడం అనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే, ఆయనను ఆరాధించడం, ఆయనను సేవించడం కోసం, ఆయన ఆగ్రహానికి, ఆయన విధించే శిక్షకు గురి కాకుండా ఉండడం కోసం, కేవలం ఆయన యొక్క కరుణ పొందడం కోసం, ఆయన అందజేసే బహుమతులను పొందడం కోసం మాత్రమే అయి ఉండాలి. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడుః

......] فَاعْبُدِ اللهَ مُخْلِصًا لَهُ الدِّينَ[2 الزُّمر

 “ఫ'బుదిల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్” (అల్ జుమర్ 2)

“కనుక నీవు ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు – అల్లాహ్ యొక్క ధర్మాన్ని (ఇస్లాంను) ఆయన కొరకు (స్వచ్ఛంగా) చిత్తశుద్ధితో (పవిత్రంగా) ఉంచు”  

సూరా అల్-బయ్యిన, ఆయత్-5 లో అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడుః

]وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ وَذَلِكَ دِينُ القَيِّمَةِ[البيِّنة 5

“వమా ఉమిరూ ఇల్లా లియ'బుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫాఅ వయుఖీముస్సలాత వయు'తుజ్జకాత  వజాలిక దీనుల్ ఖయ్యిమ”

“తమ జీవన విధానాన్ని అల్లాహ్ కోసం ప్రత్యేకించి, ఏకాగ్రచిత్తులై ఆయన్నే ఆరాధించాలని, అదే సత్యధర్మమని మాత్రమే వారికి ఆదేశించబడినది”(అల్-బయ్యిన, 5)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారుః

“ఇన్నల్లాహ ఖద్ హర్రమ అలన్నారి మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహు యబ్ తగీ బి జాలిక వజ్ హల్లాహ్” (ముస్లిం హదీథ్ గ్రంథం)

“ఎవరైతే కేవలం అల్లాహ్ యొక్క ముఖం (దర్శించడం) కోసమే (అల్లాహ్ యొక్క సంతోషం కోసమే) “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు” అని (“షహాదా”) ఉఛ్ఛరిస్తారో, వారిపై అల్లాహ్ నరకాగ్నిని నిషేధించాడు” (ముస్లిం హదీథ్ గ్రంథం).

ఇది ప్రతి ముస్లిం, ప్రత్యేకించి ముస్లిం కుటుంబాలలో పుట్టి పెరిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఆలోచించ వలసిన విషయం. “నేను ముస్లింగా పుట్టాను, ముస్లింగా ఉన్నాను అంటే, కేవలం అల్లాహ్ కోసమే” అనే విషయాన్ని ప్రతి ముస్లిం తనకు తాను ఎటువంటి సంకోచం లేకుండా స్పష్ట పర్చుకోవాలి.  ఒక ముస్లిం, తన తల్లిదండ్రుల కోసమో, తన స్నేహితుల కోసమో, తానుండే సమాజం కోసమో, లేదా సంస్థ కోసమో, లేక ఏదైనా ప్రాపంచిక గమ్యాన్ని చేరుకోవడం లేదా సాధించడం కోసమో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం కాజాలడు – కాలేడు.  ప్రతి ముస్లిం తన మనస్సులో ఈ విషయాన్ని సుస్పష్టం చేసుకోవాలి – తాను ముస్లింగా ఉన్నది ప్రప్రథమంగా (మొట్టమొదటిగా), చిట్టచివరిగా కేవలం మరియు కేవలం అల్లాహ్ కోసం మాత్రమే అని.

 ప్రేమాభిమానాలు

ఏడవ నిబంధన “ప్రేమాభిమానాలు” :- అంటే విశ్వాసి “షహాదా” ను ప్రేమిస్తున్న వాడై ఉండాలి. అతని ప్రేమ “షహాదా” తో సంబధ్ధత కలిగి ఉండాలి (అసంబధ్ధమైనదై ఉండకూడదు)“షహాదా” సూచించే, ధ్వనింపజేసే నిర్దేశాలను ప్రేమిస్తున్న వాడై ఉండాలి. అంతే కాకుండా ఎవరైతే “షహాదా” (ఉఛ్ఛరించి, దాని) ప్రకారం తమ జీవితాన్ని గడుపు తున్నారో, “షహాదా” ఆధారంగా (అల్లాహ్ మార్గంలో) శ్రమిస్తున్నారో వారందరినీ ప్రేమించాలి (వారందరి పట్ల స్నేహం, వాత్సల్యం, మక్కువ కలిగి ఉండాలి). ఇది “షహాదా” కు సంబంధిచిన అత్యవసరమైన నియమం (నిబంధన).  ఒక వ్యక్తి “షహాదా” ను ఉఛ్ఛరించి కూడా, అతనిలో “షహాదా” పట్ల; “షహాదా” ప్రాతినిధ్యం వహించే విషయాల పట్ల ప్రేమ, అభిమానం, మక్కువ లేనట్లైతే, నిజానికి అతని విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం కాదు.  ఒక నిజమైన విశ్వాసిలో ఉండాల్సిన విశ్వాసం కాదది.  ఒకవేళ అతనిలో “షహాదా” పట్ల ప్రేమ లేనట్లయితే, నిజానికి ఒకవేళ అతనిలో “షహాదా” పట్ల ద్వేషభావం గానీ ఉన్నట్లైతే, అతను “షహాదా” ను వ్యతిరేకించినట్లే.

నిజమైన విశ్వాసి తన ప్రేమలో ఎవరినీ అల్లాహ్ కు సాటిగా నిలబెట్టడు. ఖర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

]وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللهِ وَالَّذِينَ آَمَنُوا أَشَدُّ حُبًّا للهِ.... [165البقرة.

“వమినన్నాసి మఁయత్తఖిజూ మిన్ దూనిల్లాహి అన్ దాదఁయుహిబ్బూనహుం కహుబ్బిల్లాహి వల్లజీన ఆమనూ అషద్దు హుబ్బల్లిల్లాహ్” (అల్ బఖరా 165).

“కొందరు ఎలాంటి వారంటే, మిథ్యా దైవాలను (తాము పూజించే రాళ్ళను, విగ్రహాలను, వస్తువులను) అల్లాహ్ కు సాటిగా నిలబెట్టి, వాటిని ఎంతగా ప్రేమిస్తూ, అభిమానిస్తున్నారంటే, నిజానికి అల్లాహ్ ను ప్రేమిస్తూ, అభిమానిస్తున్నంతగా (అంతకంటే ఎక్కువగా కూడా – కానీ అటువంటి ప్రేమ, అభిమానాలకు కేవలం అల్లాహ్ మాత్రమే అర్హడు.) అయితే విశ్వాసులు మాత్రం అల్లాహ్ పై ప్రేమ, అభిమానాలు కలిగి ఉండే విషయంలో చాలా కఠినంగా ఉంటారు.” (అల్ బఖరా – ఆయత్ 165)

ఖుర్'ఆన్ లో మరోచోట అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడు.

]قُلْ إِنْ كَانَ آَبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ بِأَمْرِهِ وَاللهُ لَا يَهْدِي القَوْمَ الفَاسِقِينَ[.24التوبة

“ఖుల్ ఇన్ కాన ఆబాఉకుమ్ వ అబ్నాఉకుమ్ వ ఇఖ్వానుకుమ్ వ అజ్వాజుకుమ్ వ అషీరతుకుమ్ వ అమ్వాలున్ ఉఖ్ తరఫ్ తుముహా వ తిజారతున్ తఖ్ షౌన కసాదహా వ మసాకీను తర్ దౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి, వజిహాదిన్ ఫీ సబీలిహి, వ తరబ్బసూ హత్తా య'తియల్లాహు బి అమ్రిహి, వల్లాహు లా యహ్ దిల్ ఖౌమల్ ఫాసిఖీన్” (అల్-తౌబా - ఆయత్ 24)

“ప్రవక్తా! వారికిలా చెప్పుః “మీ తండ్రులు, మీ కొడుకులు, సోదరులు, భార్యలు, బంధుమిత్రులే గాక మీరు కూడబెట్టుకున్న ఆస్తులు, (సత్యాన్ని విశ్వసిస్తే - “షహాదా” ను ప్రకటించి ఇస్లాంను స్వీకరిస్తే) మందగించి పోతాయేమోనని మీరు భయపడుతున్న మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ ఇండ్లు – ఇవన్నీ మీకు అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన జరిపే పోరాటం కంటే ఎక్కువ ప్రియమైనవైతే – మీ విషయంలో అల్లాహ్ యొక్క నిర్ణయం వచ్చేవరకు ఎదురు చూడండి. (అలాంటి) దుర్జనులకు అల్లాహ్ ఎన్నటికీ సన్మార్గావలంబన బుధ్ధి ప్రసాదించడు.” (అల్-తౌబా - ఆయత్ 24)

ప్రవక్త  స.అ.సం. ఇలా అన్నారుః

“సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాని అఁయకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా” (బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథం)

“ఎవరైతే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటారో వారు “విశ్వాసం” యొక్క మాధుర్యాన్ని చవిచూసినట్లే. వాటిలో మొదటిదిః అతను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వాడై ఉండడం. ” (బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు).

 మిగతా అందరు దేవుళ్ళూ, దేవతలను నిరాకరించుట

ఎనిమిదవ నిబంధన - “షహాదా” ఉఛ్ఛరించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించిన వ్యక్తి, (వూజనీయమని భావించి, తాను అంతవరకూ వూజిస్తూ, ఆరాధనలను అర్పిస్తూ వచ్చిన) ప్రతి దేవీ దేవతా వస్తువు, ప్రతిమ, వ్యక్తి, ఆకృతి, అన్నింటినీ తిరస్కరిచాలి – నిరాకరించాలి :-

“షహాదా” (సాక్ష్యపు వాక్యం – “అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరూ ఏ విధమైన ఆరాధనలకు అర్హులు కారు”)  లోనే ఈ విషయం విశదమవుతున్నప్పటికీ, “షహాదా” ను ఉఛ్ఛరించే చాలామందికి ఈ విషయంలో స్పష్టత లేదు అనే విషయం వాస్తవం.  అందుకని ఈ విషయాన్ని ఇంత సవివరంగా, నిక్కచ్చిగా, విస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూరా అల్-బఖరా లో అల్లాహ్ – ప్రతి ముస్లిం అత్యంత ముఖ్యమైన ఈ దృక్పథాన్ని కలిగి ఉండడాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. “షహాదా” అంటే కేవలం “అంగీకారం” మాత్రమే కాదు - “అంగీకారం” మరియు “తిరస్కారం” కూడా.  అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

 فَمَنْ يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِنْ بِاللهِ فَقَدِ اسْتَمْسَكَ بِالعُرْوَةِ الوُثْقَى لَا انْفِصَامَ لَهَا وَاللهُ سَمِيعٌ عَلِيمٌ(256) ]. {البقرة}.

కనుక ఇకనుండి మిథ్యాదైవాలను నిరాకరించి కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించినవాడు ఎన్నటికీ ఏమాత్రం చెక్కుచెదరని దృఢమైన ఆశ్రయం పొందినట్లే.  అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం తెలిసినవాడు.(అల్ బఖరా 256)

ఈ క్రింది హదీసులో ప్రవక్త  ఈ విషయం యొక్క తీవ్రతను ఏ విధంగా నొక్కి చెప్తున్నారో చూడండిః

“మన్ ఖాల లా ఇల్లల్లాహు వ కఫర బిమా యు'బుదు మిన్ దూనిల్లాహి హరుమ మాలుహు వ దముహు వ హిసాబుహు అలల్లాహి”

“ఎవరైతే “షహాదా” ప్రకటించి (అంటే “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు” అని ప్రకటించి), (వూజనీయమని భావించి, తాను అంతవరకూ వూజిస్తూ, ఆరాధనలను అర్పిస్తూ వచ్చిన) ప్రతి దేవీ, దేవతా వస్తువు, ప్రతిమ, వ్యక్తి, ఆకృతి, అన్నిటినీ తిరస్కరిస్తాడో, అతని సంపద, అతని రక్తం (ప్రాణం) రక్షించబడినట్లే.  అతని లెక్కా పత్రం అల్లాహ్ అధీనంలో ఉంటుంది” (ముస్లిం హదీథ్ గ్రంథం).

“షహాదా” ను ప్రకటిచిన ప్రతి ముస్లింకు  ఈ నిబంధన చాలా విస్పష్టంగా తెలిసినప్పటికీ, చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు మొదలైన వాటిని కూడా పూజించే, ఆరాధనలు అర్పించుకునే చాలా మంది ముస్లింలను మనం చూస్తూనే ఉంటాము.  వీరు స్మశానవాటికలకు వెళ్ళి సమాధుల్లో శవాలై ఖననమై పోయిన వారికి మొరపెట్టుకోవడం, వారికి పూజలు చేయడం కూడా చూస్తూనే ఉంటాము.  ఈ విధమైన పూజలు, ఆరాధనలు వీరు అల్లాహ్ కు గాక, చనిపోయి సమాధుల్లో పూడ్చిపెట్టబడిన సన్యాసుల (ఔలియా) కు అర్పిస్తున్నారు, సమర్పిస్తున్నారు. ఎంత శోచనీయమైన స్థితి.

 చనిపోయేంత వరకు అంటిపెట్టుకొని ఉండడం

తొమ్మిదవ నిబంధన - ప్రతి ముస్లిం తన ప్రాణం పోయేంతవరకు “షహాదా” ను విడవక పోవడం :- దానినే అంటిపెట్టుకుని ఉండడం.  తీర్పుదినంనాడు సాఫల్యం పొందడానికి ఇది ఒక తప్పనిసరి అంశం.  ఈ ప్రపంచంలో అతను ఎన్ని మంచిపనులు చేశాడు, ఎంతగా కీర్తిప్రతిష్టలు సంపాదించాడు అనే అంశాలు అక్కడ ప్రాధమిక స్థాయికి చెందినవి కావు.  నిజానికి ప్రతి ముస్లిం తన జీవితాన్నంతా ఈ జెండా (ఈ ధ్వజం) క్రిందనే గడపడం, తన జీవితమంతా ఈ ధ్వజాన్ని మాత్రమే చేతబూని గడపడం ముఖ్యం.  ఖర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడుః

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا اتَّقُوا اللهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ]

آل عمران:102

“యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతు ఖాతిహి – వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్”

“విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు అల్లాహ్ కు భయపడ వలసిన విధంగా భయపడండి. (అల్లాహ్ కు పూర్తిగా అంకితమై) ముస్లింలుగా(విశ్వసించి) ఉన్న స్థితిలో తప్ప (అవిశ్వాసులుగా) మరణించపోకండి” (ఆలి ఇమ్రాన్ 102).

 మరియు

  ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త

ఇస్లాంలో ప్రవేశించడానికి “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు – మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని “షహాదా” ను ప్రకటించ వలసి ఉంటుందని దాదాపుగా అందరికీ తెలుసు.  కానీ “షహాదా” ను గురించి చర్చించ వలసి వచ్చినపుడు చాలా సందర్భాలలో “షహాదా” వాక్యంలోని మొదటి భాగాన్ని సవివరంగా, విస్తారంగా చర్చించడానికే ఎక్కువ భాగం ఎక్కువ సమయం కేటాయించబడతాయి.  కానీ “షహాదా” యొక్క రెండవ భాగాన్ని అర్థం చేసుకోవడం, ఆ రెండవ భాగం సూచించే నిబంధనలను ఆకళింపు చేసుకోవడం, వాటిని పాటించడం, అమలుచేయడం కూడా “షహాదా” మొదటి భాగమంత ముఖ్యమని, అంతే ప్రాధాన్యంగల అంశమని గమనించాలి. నిజానికి “షహాదా” యొక్క ఈ రెండవ భాగాన్ని సరిగా ఆకళింపు చేసుకోని కారణంగా, యుక్తమైన విధంగా అమలు చేయని కారణంగా, కొన్నిసార్లు ముస్లిములు అల్లాహ్ యొక్క సూటియైన మార్గంనుంచి తప్పుకుని మార్గభ్రష్ఠులై తద్వారా ఇస్లాంనుండే వెలివేయబడే ప్రమాదం ఉంది అనేది వాస్తవం.

 ఎన్నుకోబడిన ప్రవక్త

ఒక వ్యక్తి “ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని సాక్ష్యమిస్తున్నాడూ అంటే, “ముహమ్మద్, అల్లాహ్ చేత ఆయన యొక్క ప్రవక్తగా, ఆయన యొక్క సందేశాలను, ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి ఎంచుకోబడిన ప్రవక్త” అని తన విశ్వాసాన్ని చాటుతున్నాడూ అని అర్థం. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ …………..القصص: 68

“వ రబ్బుక యఖ్ లుఖు మా యషాఉ వ యఖ్ తార్”

“నీ ప్రభువు తలుచుకున్న దానిని సృజిస్తాడు, తాను కోరిన వ్యక్తని (ప్రవక్తగా) ఎంచుకుంటాడు” అల్ ఖశశ్ - 68

అల్లాహ్ సృష్ఠికర్త, తాను ఏమి చేయాలన్నా చేయగల శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. ఆయన ప్రత్యేకించి చాల నిర్దిష్టంగా ముహమ్మద్ ను తన ప్రవక్తగా ఎంచుకున్నాడు.   ఖుర్'ఆన్ లో మరో వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడుః

[......اللهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ........] الأنعام:124

“అల్లాహు అ'లము హైసు యజ్అలు రిసాలతహు”

“ప్రవక్త పదవి ఎవరికి అప్పగించాలో అల్లాహ్ కు బాగా తెలుసు” (అల్ అన్ఆమ్ 124)

ఈ రెండు వాక్యాలు ప్రవక్త ముహమ్మద్ యొక్క గుణగణాలను చెప్పకనే చెబుతున్నాయి. అల్లాహ్ మహోన్నత న్యాయనిర్ణేత, అనంతకరుణా, కృపాసాగరుడు, మహావివేచనాశీలి. ఆయన ఒక శీలరహితుడిని,  మోస కారిని, అబధ్ధాలకోరును తన ప్రవక్తగా ఎప్పుడూ ఎంచుకోడు. అల్లాహ్ జ్ఞానం అనంతమైనది. తన ప్రవక్తగా నిర్వహించవలసిన ఒక అత్యంత ప్రముఖ కార్యరంగానికి-కర్తవ్యానికి; తన ఆదేశాలను, సందేశాలను ప్రజల వద్దకు తు.చ. తప్పకుండా పూర్తిగా, ఎటువంటి సంకరం చేయకుండా సక్రమంగా చేరవేయలేడు అని తెలిసిన ఒక వ్యక్తిని; మరియు “అల్లాహ్ యొక్క ప్రవక్త” అనే మహోన్నత స్థానాన్ని తన స్వప్రయోజనాలకు ఉపయోగిచుకునే వ్యక్తిని – తన అనంతమైన జ్ఞానానికి తెలిసి కూడా అల్లాహ్ ఎంచుకొనగలడని, నియమించ గలడని ఊహించగలమా? ప్రవక్త, అల్లాహ్ యొక్క ఆదేశాలను, సందేశాలను వాస్తవంలో తు.చ. తప్పకుండా ఆసాంతం, ఉన్నదున్నట్లుగా అందజేయలేదని, లేదా వాస్తవంలో వాటిని వక్రీకరించి అందజేశారని ఎవరైనా అంటున్నట్లైతే, వాస్తవానికి అతను ప్రవక్తగా ఎంపిక చేయడానికి ఎవరు ఉత్తమమైన వ్యక్తో, ఎవరు సరియైన వ్యక్తో అల్లాహ్ కు ఏమీ తెలియదని ఆరోపిస్తున్నాడని అర్థం.  ఇది నిస్సందేహంగా స్పష్టమైన విశ్వాసరాహిత్యమే.

 సర్వకాల, సర్వావస్థ, సర్వజగత్తుకూ ఒకే ప్రవక్త

రెండవ విషయం – ఒకవ్యక్తి “షహాదా” ను ప్రకటిస్తున్నాడూ అంటే అతను “ముహమ్మద్  అల్లాహ్ చేత సర్వ మానవాళికీ తీర్పుదినం వరకూ ప్రవక్తగా పంపబడినారు” అని సాక్ష్యం ఇస్తున్నాడు అని అర్ధం. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

[قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللهِ إِلَيْكُمْ جَمِيعًا..........] الأعراف:158

“ఖుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఆ” (అల్ ఆరాఫ్ 158)

“ముహమ్మద్! చెప్పుః ప్రజలారా! నేను మీ అందరి కోసం వచ్చిన దైవప్రవక్తను” (అల్ ఆరాఫ్ 158)

అంతేగాక ప్రవక్త  ఇలా అన్నారుః

“ఉ'తీతు ఖమ్సన్ లమ్ యు'తహున్న అహదుమ్మినల్ అంబియాఇ ఖబ్ లీ .... వకానన్నబియ్యు యుబ్అసు ఇలా ఖౌమిహి ఖాస్సతన్ వ బుఇస్ తు ఇలన్నాసి కాఫ్ఫతన్” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథం).

“నాకు (అల్లాహ్ చేత) నాకంటే ముందు వచ్చిన ఏ ప్రవక్తకూ ఇవ్వబడని ఐదు ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి..... (వాటిలో ఒకటి) ఇంతకు పూర్వం వచ్చిన ప్రతి ప్రవక్త కేవలం తన జాతి ప్రజలకు మాత్రమే ప్రవక్తగా పంపబడితే, (అల్లాహ్ చేత) నేను సర్వ మానవాళికీ ప్రవక్తగా పంపబడ్డాను” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథం).

కనుక ప్రవక్త కాలం నుంచి చివరికి తీర్పుదినం వరకు జన్మించే ప్రతి ఒక్కరూ ప్రవక్త ను విశ్వసించి, ఆయనను అనుసరించడం ఒక విధిగా (Obligation) చేయబడింది. ఒక వ్యక్తికి ఇస్లాం యొక్క సందేశం విస్పష్టంగా చేరిన తర్వాత కూడా అతను ప్రవక్త ను విశ్వసించడానికి, ఆయనను అనుసరించడానికి తిరస్కరించినట్లైతే అతడు అవిశ్వాసిగా పరిగణింప బడతాడు. ఇందుకు అతడు పశ్చాత్తాపపడి ఇస్లాంను స్వీకరించక పోయినట్లైతే అతను శాశ్వతంగా నరకాగ్నిలో వేయబడతాడు.

ప్రవక్త యొక్క ఉపదేశాలు, ఆదేశాలు మరియు ఆయన (జీవన) విధానం, ఆయన అనుసరించిన మార్గం ప్రామాణికమైనవని, తీర్పుదినం వరకు వచ్చే మానవాళి అంతా విధిగా అనుసరించ వలసినవని, పైన తెలిపిన వివరాలు సూచిస్తున్నాయి. ఆయన తన జీవనవిధానం ద్వారా స్థిరీకరించి, వ్యవస్థీకరించి స్థాపించిన ఉదాహరణ, ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన చుట్టూ ఉన్న అరేబియావాసుల కోసం మాత్రమే కాదని, ప్రపంచంలో ఎక్కడున్నా, ఈనాటి ప్రతి ముస్లింకు కూడా అంతే ముఖ్యమని గమనించాలి.

ప్రవక్త యొక్క ఉదాహరణను అన్ని విషయాలలోనూ అనుసరించాలి అనే ఆలోచనను నిరోధిస్తున్నట్లు, ప్రతిరోదిస్తున్నట్లు (జీర్ణించుకోలేక పోతున్నట్లు) కొద్దిమందిని గమనిస్తే అనిపిస్తుంది. ఇదేగానీ నిజమైతే, తాము ప్రకటించిన “షహాదా” కు తామే వ్యతిరేకంగా పోతున్నామని, తామే వ్యతిరేకిస్తున్నామని వారు గ్రహించాలి.  ఖుర్'ఆన్ మరియు  ప్రవక్త యొక్క జీవన విధానం (సున్నత్), ఈ రెంటి సమ్మేళనం అయిన ఆయన సందేశం, ఈ రోజు జీవించి ఉన్న వారితో సహా సర్వ మానవాళికోసం అని తాము సాక్ష్యమిచ్చిన విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి.

 పరిపూర్ణ బోధన

మూడవ విషయం – ఒకవ్యక్తి “షహాదా” ను ప్రకటిస్తున్నాడూ అంటే అతను “ముహమ్మద్  అల్లాహ్ యొక్క సందేశాలను, ఆదేశాలను తు.చ. తప్పకుండా అందజేశారని, సంపూర్ణంగా అందజేశారని, ఏ విధమైన దాపరికం గానీ, వాటిలో ఏ విధమైన మార్పులు చేర్పులు గానీ లేకుండా, పరిపూర్ణంగా అందజేశారని సాక్ష్యం ఇస్తున్నాడు అని అర్ధం. ఖుర్'అన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

[………وَمَا عَلَى الرَّسُولِ إِلَّا البَلَاغُ المُبِينُ(54) ]. {النور}.

“వమా అలర్రసూలి ఇల్లల్ బలాగుల్ ముబీన్”(అల్ నూర్–54)

“ప్రవక్త యొక్క బాధ్యత (అల్లాహ్ యొక్క) సందేశాన్ని స్పష్టంగా అందజేయడమే” (అల్ నూర్ – 54)

ఒక హదీసు లో ప్రవక్త ఇలా అన్నారుః

“ఖద్ తరక్తుకుమ్ అలల్ బైదాఇ లైలుహా కనహారిహా లా యజీగు బ'దీ ఇల్లా హాలికున్”(ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం)

“మిమ్మల్ని, పగలూ, రాత్రి కూడా ఒకేలా ప్రకాశవంతంగా ఉండే ఒక రహదారి పై వదిలాను. నేను వెళ్ళిన  తర్వాత (ఆ రహదారి నుంచి) ఎవరూ కూడా మార్గభ్రష్ఠులు కాలేరు – కేవలం తమను తాము భ్రష్ఠుపట్టించుకునే వారు తప్ప.” (ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం).

ప్రవక్త అల్లాహ్ నుంచి తనపై అవతరించిన మార్గనిర్దేశక సందేశాలు, ఆదేశాలనన్నిటినీ ఆసాంతంగా అందించారు. అందించడమే కాకుండా చాలా స్పష్టంగా వాటిని వివరించారు కూడా. కనుక ఒక వ్యక్తి “షహాదా” ను ప్రకటిస్తున్నాడూ అంటే, అతను “ప్రవక్త ఇస్లాం ధర్మానికి సంబంధించిన ప్రతి చిన్న వివరం నుంచి మొదలుకుని, ప్రతి దృక్పథాన్నీ, ఇస్లాం యొక్క మూలాధారాలనుంచి మొదలుకుని, చిట్టచివరి సంకేతం వరకూ ప్రతి విషయాన్నీ అందజేశారని” ప్రకటిస్తున్నాడూ అని అర్థం. “ఈ విషయాన్ని గురించి ప్రవక్త గానీ, అల్లాహ్ గానీ మర్చిపోయే అవకాశం ఉంది” అనే అనుమానానికి ఇసుమంతైనా ఆస్కారం లేకుండా, ఇస్లాం ధర్మానికి సంబంధించి మానవాళి మనుగడకు అవసరమయ్యే ప్రతి చిన్న మార్గనిర్దేశకం నిస్సందేహంగా మానవాళికి అందజేయబడింది.

కనుక ఇంత ప్రస్ఫుటమైన, ఇంత కాంతివంతమైన, ఇంత స్పష్టమైన, ఇంత సుబోధమైన మార్గనిర్దేశనం ప్రవక్త నుంచి అందజేయబడిన తర్వాత, ఒక ముస్లింకు వేరే ఏ యితర మార్గనిర్దేశకం వైపుకూ దృష్టి మళ్ళించాల్సిన అవసరం లేదు; యూదుల లేదా క్రైస్తవుల గ్రంథాల వైపుకు మరలవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఉమర్ రదిఅల్లాహు అన్ హు ఒకసారి తౌరాత్ గ్రంథాన్ని చదువుతూ ఉండడం చూసి, కోపంతో ముఖం ఎర్రగా కందిపోగా ప్రవక్త ఇలా అన్నారు “ఓ ఉమర్! ప్రవక్త మూసాయే ఇప్పుడుగానీ బ్రతికి ఉంటే, ఆయనకు కూడా నన్ను అనుసరించడం మినహా మరో మార్గం లేదు” అని. నిజానికి ఒక ముస్లింకు మార్గనిర్దేశం కోసం వేరే ఏ యితర ధార్మిక, ఆధ్యాత్మిక బోధనలవైపుకూ మరల వలసిన అవసరం లేదు. అతనికి కావలసిన ఈ సమాచారమంతా ఖుర్'ఆన్ మరియు ప్రవక్త యొక్క సున్నత్ లలో అతను పొందగలడు. నిజానికి ఇదంతా కూడా “షహాదా” స్పష్టపరిచే అర్థంలోని భాగమే.

ఒక ముస్లిం “ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని (సాక్ష్యపు వాక్యాన్ని) ప్రకటించాడు అంటే, అతను ముహమ్మద్ అల్లాహ్ చేత పంపబడిన చిట్టచివరి ప్రవక్త అని కూడా ప్రకటిస్తున్నాడు అన్నమాట.  ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడుః

[مَا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِنْ رِجَالِكُمْ وَلَكِنْ رَسُولَ اللهِ وَخَاتَمَ النَّبِيِّينَ ...] {الأحزاب40 }

“మాకాన ముహమ్మదున్ అబా అహదిమ్మిర్రిజాలికుమ్ వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్”

(ప్రజలారా) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవరికీ తండ్రి కాడు. ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. దౌత్యపరంపరను అంతమొందించిన అంతిమ దైవప్రవక్త” (సూరా అల్ అహ్ జాబ్ 40).

ముహమ్మద్ తర్వాత ఇంక ఏ ప్రవక్త కూడా రాబోవడం లేదు. ఇంక ఏ క్రొత్త ప్రవక్త కూడా రాడు;  ముహమ్మద్ అందజేసిన సందేశాన్ని రద్దుచేసే ఏ క్రొత్త శాసనం కూడా రాదు.  అంతే కాకుండా ముహమ్మద్ కాలం తర్వాత ఎవరైనా తనను తాను అల్లాహ్ యొక్క ప్రవక్తగా ప్రకటించుకున్నట్లైతే, అతను అబధ్ధాలకోరు అని, మోసగాడు అని చెప్పనవసరం లేకుండానే తెలిసి పోతుంది. అటువంటి వ్యక్తిని అడ్డుకోవాలి. ప్రజలందరికీ అతని మోసాన్ని తెలియజేయాలి. ముహమ్మద్ తర్వాత అటువంటి వ్యక్తిని అల్లాహ్ యొక్క ప్రవక్తగా అంగీకరించడం అంటే ప్రకటించిన “షహాదా” ను భంగపరిచినట్లే.

 షహాదా యొక్క విధులు

ఒక వ్యక్తి “షహాదా” ను ప్రకటించడం అంటే “షహాదా” సూచించే విషయాలను విశ్వసించడం మాత్రమే కాకుండా, అందునుంచి ఉత్పన్నమయ్యే కొన్ని బాధ్యతలను కూడా స్వీకరిస్తున్నాడని అర్థం. ఉదాహరణకు, “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు” అని ప్రకటిస్తున్నాడు అంటే, అతను కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే బాధ్యతను స్వీకరిస్తున్నాడు అని అర్థం.  అదే విధంగా “ముహమ్మద్  అల్లాహ్ యొక్క ప్రవక్త” అని ప్రకటిస్తున్నాడు అంటే, ముహమ్మద్ కు సంబంధించిన కొన్ని బాధ్యతలను స్వీకరిస్తున్నాడు అని అర్థం.  ఈ కర్తవ్యాలను స్వీకరించి వాటిని అమలు చేయడంలో ఏ విషయంలోనైనా కొరత వహిస్తే, తాను ప్రకటించి స్వీకరించిన “షహాదా” ను సమగ్రంగా అమలు చేయడంలో కొరత వహించినట్లే. ఈ స్థితి ఎంతవరకూ, ఏ స్థాయి వరకూ వెళ్తుంది అంటే, అతను “షహాదా” కు సంబంధించిన బాధ్యతల, కర్తవ్యాల నిర్వహణను ఖండించే స్థాయికి తద్వారా ప్రవక్త  కు సంబంధించిన బాధ్యతల నిర్వహణను నిరారించే స్థాయి వరకూ వెళ్తుంది. 

 ప్రేమ

“షహాదా” ప్రకటించి న వ్యక్తి పై ముహమ్మద్ కు సంబంధించి ఉండే విధులలో ఒకటి ఆయన పై ప్రేమ కలిగి ఉండడం.  ఇలా అనడంలో ఫలానా రకమైన ప్రేమ అనే సూచన ఏమీ లేదు. కానీ సంపూర్ణమైన, సమగ్రమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండే ఒక ముస్లిం కు, ప్రవక్త  పై మిగతా అందరి మీద ఉండే ప్రేమ కన్నా, మిగతా ఏ విషయం, లేదా ఏ వస్తువు లేక ఏ ప్రాణి పై ఉండే ప్రేమ కన్నా అత్యంత అధికమైన ప్రేమ ఉండాలి.  ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడుః

]قُلْ إِنْ كَانَ آَبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ بِأَمْرِهِ وَاللهُ لَا يَهْدِي القَوْمَ الفَاسِقِينَ]التوبة 24

“ఖుల్ ఇన్ కాన ఆబాఉకుం, వ అబ్నాఉకుం, వ ఇఖ్వానుకుం, వ అజ్వాజుకుం, వ అషీరతుకుం, వ అమ్వాలున్ ఉఖ్ తరఫ్ తుహా, వ తిజారతున్ తఖ్ షౌన కసాదహా, వ మసాకిను తర్దౌనహా అహబ్బ ఇలైకుమ్మినల్లాహి వ రసూలిహి, వజిహాదిన్ ఫీ సబీలిహి, ఫతరబ్బసూ హత్తా య'తియల్లాహు బి అమ్రిహి. వల్లాహు లా యహ్ దీ ఖౌమల్ ఫాసిఖీన్” (సూరా అల్ తౌబా 24).

“ప్రవక్తా! వారికిలా చెప్పుః “మీ తండ్రులు, మీ కొడుకులు, సోదరులు, భార్యలు, బంధుమిత్రులే గాక మీరు కూడబెట్టుకున్న ఆస్తులు, (సత్యాన్ని విశ్వసిస్తే - “షహాదా” ను ప్రకటించి ఇస్లాంను స్వీకరిస్తే) మందగించి పోతాయేమోనని మీరు భయపడుతున్న మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ ఇండ్లు – ఇవన్నీ మీకు అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన జరిపే పోరాటం కంటే ఎక్కువ ప్రియమైనవైతే – మీ విషయంలో అల్లాహ్ యొక్క నిర్ణయం వచ్చేవరకు ఎదురు చూడండి. (అలాంటి) దుర్జనులకు అల్లాహ్ ఎన్నటికీ సన్మార్గావలంబన బుధ్ధి ప్రసాదించడు.” (అల్-తౌబా - ఆయత్ 24).

 ఒక ఆదర్శ నమూనాః

రెండవ విషయం: ఒక వ్యక్తి “షహాదా” ను ప్రకటించడం అంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ సరియైన మార్గంలో, అల్లాహ్ కు ప్రీతికరమైన విధంగా మసలుకుంటూ జీవితాన్ని గడపడం కోసం ప్రవక్త ను ఒక ఆదర్శమూర్తిగా, (ఆయన జీవితాన్ని) ఒక ఆదర్శ నమూనాగా స్వీకరిస్తున్నానని ప్రకటించడం అన్నమాట. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడుః

[لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللهَ وَاليَوْمَ الآَخِرَ وَذَكَرَ اللهَ كَثِيرًا(21) ]. {الأحزاب}.

“లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీర” (సూరా అల్ అహ్ జాబ్ 21).

(విశ్వాసులారా!) దైవప్రవక్త (జీవనసరళి) లో మీకు మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ ను అంతిమ దినాన్ని నమ్మి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే వారికి ఈ ఆదర్శం ఎంతగానో ఉపయోగ పడుతుంది”

ఖుర్'ఆన్ లో మరో చోట అల్లాహ్ ఇలా అంటున్నాడుః

[قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ (31)] {آل عمران}

“ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊనీ యుహ్ బిబ్ కుముల్లాహు వ యగ్ ఫిర్లకుం జునూబకుమ్”

(ఓ ప్రవక్తా) వారికిలా చెప్పు! “మీరు నిజంగా అల్లాహ్ ను అభిమానిస్తుంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని అభిమానిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించే వాడు, కరుణించే వాడు” (సూరా ఆలి ఇమ్రాన్ 31)

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొంతమంది “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని “షహాదా” ను ప్రకటించి (సాక్ష్యమిచ్చి) కూడా, ప్రవక్త  ను, ఒక విశ్వాసి జీవితానికి సంబంధించి అనుసరిచ వలసిన ఆదర్శ నమూనాగా భావించరు. వారు ప్రవక్త  ను ఆదర్శ నమూనాగా భావించక పోవడమే కాకుండా, ఆయనను ఆదర్శ నమూనాగా భావించి, ప్రతి విషయంలోనూ ఆయన యొక్క మార్గనిర్దేశనాన్ని అనుసరించే వారిని చూసి అడ్డుతగులుతూ ఉంటారు. ఇది వారు ప్రకటించిన “షహాదా” పట్ల, అది సూచించే విషయాలు, విధుల పట్ల అతి స్పష్టంగా కనిపించే వారి అవగాహనా రాహిత్యమే తప్ప మరేమీ కాదు.

ప్రవక్త ఈ విధంగా అన్నారుః

“అమా వల్లాహి ఇన్నీ ల అఖ్ షాకుం లిల్లాహి వ అత్ ఖాకుం లహు లకిన్నీ అసూము వ ఉఫ్ తిరు వ ఉసల్లీ వ అర్ ఖుదు వ అతజవ్వజున్నిసాఅ ఫమన్ రగిబ అన్ సున్నతీ ఫలైస మిన్నీ” (బుఖారి హదీథ్ గ్రంథం)

“అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను – నేను మీ అందరికంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడతాను, మీ అందరికంటే ఎక్కువగా దైవచింతన కలవాడిని నేను. ఐనా, (నా జీవితంలో భాగంగా – నా సున్నత్ లో భాగంగా) నేను ఉపవాసాలు ఆచరిస్తాను, కొన్నిసార్లు ఆచరించను కూడా, రాత్రి సమయాలు దైవారాధనలో గడుపుతాను, నిద్ర కూడా పోతాను, నేను స్త్రీలను వివాహమాడాను కూడా.  ఎవరైతే నా సున్నత్ నుంచి దూరమైపోతారో, వారు నానుంచి దూరమైనట్లే (అంటే అతను నా యొక్క నిజమైన అనుచరుడు కాడు).” (బుఖారి హదీథ్ గ్రంథం)

ఈ హదీసు లో ప్రవక్త అల్లాహ్ పట్ల ఎంత భయభీతులు మరియు భక్తి కలవారో మరియు ఎంతగా దైవచింతన కలవారో తెలియజేయ బడింది. కనుక ఎవరికైనా ప్రవక్త జీవన విధానాన్ని ఆదర్శ నమూనాగా ఎంచుకోకపోవడానికి ఎటువంటి కారణమూ కానరాదు. ఈ హదీసు మరో విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అదేమిటంటే ఎవరైతే ప్రవక్త సున్నత్ నుంచి దూరంగా తొలిగి పోతారో వారు ఆయన నుంచి దూరంగా తొలిగి పోయినట్లే అని.  “షహాదా” ప్రకటన యొక్క రెండవ భాగమైన “నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని ప్రవక్త లో సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి, ఆయనను అల్లాహ్ యొక్క ప్రవక్త గా స్వీకరించి, అదే సమయంలో ప్రవక్త జీవన విధానాన్ని ఆదర్శ నమూనాగా ఎంచుకోవడానికి నిరాకరించే వ్యక్తి – తాను నిజంగానే ప్రవక్త లో సంపూర్ణ విశ్వాసాన్నికలిగి ఉన్నానని, ఆయనను అల్లాహ్ యొక్క ప్రవక్త గా స్వీకరించినానని నిజాయితీగా చాటలేడు.

“షహాదా”ను ఉల్లంఘించే వ్యక్తికి సంబంధించిన ఆజ్ఞః- ఎవరైనా బుధ్దిపూర్వకంగా, ఉద్దేశ్యపూర్వకంగా “షహాదా” ను ఉల్లంఘించినట్లైతే అతను అవిశ్వాసిగా మారుతాడు. ఈ విషయంపై ఇస్లామీయ విద్వాంసులందరి (ఉలమా) ఏకాభిప్రాయం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అల్లాహ్ ను ఆరాధించడంతో పాటు, ఇంకెవరినైనా లేక దేనినైనా (ప్రవక్తలను, పుణ్యపురుషులను, దర్గాలను, బాబాలను, విగ్రహాలను, చిత్రపటాలను, పాములను, పుట్టలను, చెట్లను, భూమ్యాకాశఆలను, సూర్యచంద్రులను, నక్షత్రాలను) పూజించినా లేక వాటికి సహాయపడే శక్తి ఉన్నట్లు నమ్మినా అతను అవిశ్వాసి అవుతాడు. అదే విధంగా ఎవరైనా ప్రవక్త ను దూషించినా లేక ఆయనను ఒక అబధ్ధాలకోరు గా చిత్రించినా – అతను “షహాదా” యొక్క రెండవ భాగాన్ని ఉల్లంఘించిన వాడవుతాడు. ఆ కారణంగా అతను ఇస్లాం పరిధినుంచి బహిష్కరించబడిన వాడై నరక శిక్షకు అర్హుడవుతాడు.

అల్లాహ్ మనల్నందరినీ అటువంటి ప్రమాదం నుంచి కాపాడుగాక (ఆమీన్)