(1) సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా!
(2) దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!
(3) ప్రకాశించే పగటి సాక్షిగా!
(4) దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!
(5) ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
(6) భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!
(7) మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా!
(8) ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.
(9) వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.
(10) మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.
(11) సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;
(12) అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.
(13) అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.
(14) కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
(15) మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు!