పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న
వివరణ
ఒకవేళ ఎవరైనా పాపాలతో కూడిన జీవితం గడిపి, దైవం దగ్గరకు మరలాలని నిర్ణయించుకుని, పశ్చాత్తాప పడి, ఇక నుండి సరైన దారిలో జీవిస్తానని వాగ్దానం చేసినట్లయితే, అతడు క్షమించబడునని ఇస్లాం ప్రకటిస్తున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. అయితే, అతడు చేసిన పాపాల భారం సంగతి ఏమిటి? పాపం చేస్తున్నప్పుడు అతడు దైవాజ్ఞలను ఉల్లంఘించాడు, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చితం చేసుకోవలసి ఉన్నది కదా ! కాని, ఇకనుండి మంచి దారిలో దైవవిశ్వాసంతో జీవితం గడుపుతాననే అతడి వాగ్దానాన్నే ఆధారంగా చేసుకుని, ఒకవేళ దేవుడు అతడి పాపాలను క్షమించటానికి పూనుకుంటే, అతడు చేసిన పాపానికి ఎవరు ప్రాయశ్చిత పడతారు?
-
1
పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న
PDF 115.4 KB 2019-05-02
-
2
పాపం నుండి బయటపడే మార్గం? ఒక క్రైస్తవుడి ప్రశ్న
DOC 1.5 MB 2019-05-02
పూర్తి వివరణ
పశ్చాత్తాపం గురించి ప్రశ్నిస్తున్న ఒక క్రిష్టియన్ సోదరుడు ( 41006 )
http://islam-qa.com/en/ref/41006
ప్రశ్న - ఒకవేళ ఎవరైనా పాపాలతో కూడిన జీవితం గడిపి, దైవం దగ్గరకు మరలాలని నిర్ణయించుకుని, పశ్చాత్తాప పడి, ఇక నుండి సరైన దారిలో జీవిస్తానని వాగ్దానం చేసినట్లయితే, అతడు క్షమించబడునని ఇస్లాం ప్రకటిస్తున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. అయితే, అతడు చేసిన పాపాల భారం సంగతి ఏమిటి? పాపం చేస్తున్నప్పుడు అతడు దైవాజ్ఞలను ఉల్లంఘించాడు, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చితం చేసుకోవలసి ఉన్నది కదా ! కాని, ఇకనుండి మంచి దారిలో దైవవిశ్వాసంతో జీవితం గడుపుతాననే అతడి వాగ్దానాన్నే ఆధారంగా చేసుకుని, ఒకవేళ దేవుడు అతడి పాపాలను క్షమించటానికి పూనుకుంటే, అతడు చేసిన పాపానికి ఎవరు ప్రాయశ్చిత పడతారు?
సమాధానం -
సకల ప్రశంసలు అల్లాహ్ కే చెందును.
ఎవరైతే మమ్మల్ని ఇస్లాం ధర్మపు మార్గం చూపినాడో, ఆ అల్లాహ్ కే సకల ప్రశంసలు చెందును. ఒకవేళ ఆయన మాకు ఈ సన్మార్గం చూపక పోయినట్లయితే, మేము మార్గదర్శకత్వం పొందలేక పోయేవారము.
ముందుగా మీ ప్రశ్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అల్లాహ్ మీకు సరైన మార్గం చూపుగాక!
అల్లాహ్ మనల్ని అత్యున్నతమైన ఉద్దేశ్యంతో సృష్టించినాడు. 'ఆయనకు ఎటువంటి భాగస్వాములనూ కల్పించకుండా, చేర్చకుండా మానవులు కేవలం ఆయననే ఆరాధించవలెను' అనేదే ఆయన యొక్క ముఖ్యోద్దేశ్యం. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు:
“మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించినది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే[!" దివ్యఖుర్ఆన్ 51:56
ఇదియే మానవ జీవిత ఉద్దేశ్యం: కేవలం అల్లాహ్ నే ఆరాధించటం.
కాబట్టి, అల్లాహ్ మనల్ని తినటానికి మరియు త్రాగటానికి లేక విశ్రాంతి తీసుకోవటానికి మరియు ఆటలాడటానికి లేక కష్టపడటానికి మరియు గట్టిగా పనిచేయటానికి మాత్రమే సృష్టించలేదు. కాని, కేవలం తనను మాత్రమే ఆరాధించటానికి మరియు అవిధేయులుగా ఉండకూడదని; ఆయన ధ్యానం చేస్తుండటానికి మరియు ఆయనను మరచిపోకుండా ఉండటానికి మానవజాతిని సృష్టించినాడు.
ఇదియే మానవ జీవిత లక్ష్యం. ఇది ఎంత ఉత్తమమైన లక్ష్యం ఇది? ఎప్పుడైతే మానవుడు తన ప్రభువు మరియు యజమాని అయిన సృష్టికర్తను ఆరాధించటానికి, ఆయన ధర్మానికి సేవలు చేయటానికి, మరియు ఆయన ఆదేశాలను స్థాపించటానికి తన శరీరాన్ని భూలోకంలో ఉంచి, తన ఆత్మను అల్లాహ్ దగ్గర మరియు పరలోకంలో ఉంచి జీవిస్తాడో, అప్పుడు అతడు ఈ జీవిత పరమార్థాన్ని, ఈ ప్రపంచపు ప్రాముఖ్యతను మరియు మిగిలిన తన శేషజీవితంలోని సమయాన్ని అల్పమైన కోరికలు మరియు భోగభాగ్యాలలో వృథా చేయకూడదని తప్పక గ్రహిస్తాడు. ఓ అల్లాహ్ మాకు ఋజుమార్గాన్ని ప్రసాదించుము.
ఆరాధనలకు 'వివరణ మరియు మార్గదర్శకత్వం' అవసరం కాబట్టి, అల్లాహ్ తన సందేశహరులను పంపినాడు:
“(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకూ మిగలకూడదని." [దివ్యఖుర్ఆన్ 4:165]
ఎవరైతే సమర్పించుకున్నారో, వారికి దారి చూపబడెను మరియు ఎవరైతే వీపు చూపారో, వారు ఘోరంగా నష్టపోయారు.
అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తనకే మేలు చేసుకుంటాడు ! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు. 'మరియు నేను మీ రక్షకుడిని కాను (అని ప్రకటించు)' " [దివ్యఖుర్ఆన్ 6:104]
ఎవరైతే సమర్పించుకున్నారో, (ఇస్లాం స్వీకరించారో) వారు, స్వయంగా తమకోసం సుఖసంతోషాలను ఎన్నుకున్నారు:
“ఎవరైతే అల్లాహ్ కు విధేయత (ఇస్లాం అవలంబించారో) చూపారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్నవారు!" (దివ్యఖుర్ఆన్ 72:14)
ఎందుకంటే, మానవుడు పుట్టుకతో తప్పులు చేయటం, మరచిపోవటం మరియు పాపాలలో పడిపోవటం అనే గుణాలు కలిగి ఉండటం వలన, తన దాసుల కోసం అల్లాహ్ ప్రాయశ్చితాన్ని ప్రత్యేక అనుగ్రహంగా ప్రసాదించెను. మరియు ఆ ప్రాయశ్చిత ద్వారాన్ని, ప్రశయ ఘడియ మొదలయ్యే వరకు తెరచి ఉంచెను. ఆయన తన దాసులను చిత్తశుద్ధితో ప్రాయశ్చితం చేసుకోమని ఆహ్వానించెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మన:పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపబజేస్తాడు" దివ్యఖుర్ఆన్ 66:8
“ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!" (దివ్యఖుర్ఆన్ 24:31)
పాపాలు రెండు రకాలుగా ఉంటాయని మనం గుర్తించ వలెను:
1) అల్లాహ్ యొక్క హక్కులలో హద్దుమీరటం.
2) ఇతర సృష్టితాల యొక్క హక్కుల దురాక్రమణ.
మొదటి రకానికి సంబంధించినంత వరకు:
అల్లాహ్ యొక్క హక్కులలో హద్దుమీరటం అంటే “వ్యభిచారం, మద్యపానం సేవించటం, నమాజు, జకాతు, రమదాన్ నెల ఉపవాసాలు మొదలైన తప్పని సరి విధులను నిర్లక్ష్యం చేయటం. ఇస్లామీయ ధర్మచట్టాన్ని (షరియత్) అనుసరించి శిక్షార్హమైన వ్యభిచారం, మద్యపానం వంటి ఘోరమైన పాపాల విషయంలో, వాటిని చేసిన వారి పై హద్ (నిర్ణీత కఠిన) శిక్షలు జారీచేయబడును. ఆ శిక్షలే వారికోసం ప్రాయశ్చితమగును. మరియు వారిని పాపం నుండి ప్రక్షాళనం చేయును. కాని, ఒకవేళ వారిపై హద్ శిక్ష జరిపించక పోయినప్పటికీ, వారు పశ్చత్తాపపడి, అల్లాహ్ ను వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఆ పశ్చాత్తాప్పాన్ని స్వీకరించి, వారి పాపాలను పుణ్యాలుగా మార్చివేయును.
ఎవరైనా గాని తమ పాపాల నుండి పశ్చాత్తాప పడకుండా, హద్ శిక్ష అనుభవించకుండా, తీర్పు దినాన అల్లాహ్ ను కలిసి నట్లయితే, వారి విషయం అల్లాహ్ యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండును. అల్లాహ్ తలిస్తే వారిని క్షమించివేయ వచ్చును లేదా శిక్షించ వచ్చును.
సహీహ్ బుఖారీ (18) మరియు సహీహ్ ముస్లింలలో నమోదు చేయబడిన ఉబాదాహ్ ఇబ్నె అస్సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథ్ లో ఇలా తెలుపబడినది - ఎవరైతే బద్ర్ యుద్ధలో పాల్గొన్నారో మరియు అల్ అఖాబహ్ రాత్రి జరిగిన సమావేశంలో పాల్గొన్నారో, ఆ సహచరులలో నుండి తనను గుమిగూడిన ఒక బృందంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం - 'అల్లాహ్ తో ఇతరులెవ్వరినీ భాగస్వాములుగా చేర్చమని, దొంగతనం చేయమని, వ్యభిచారం చేయమని, తమ సంతానాన్ని చంపమని, అబద్ధాలు చెప్పమని, సరైన దానికి మరియు సత్యమైన దానికి అవిధేయత చూపమని నాకు ప్రమాణం చేయండి' అని వాగ్దానం తీసుకున్నారు. మీరు ఈ ప్రమాణాన్ని పూర్తి చేస్తే, ఫలితంగా లభించబోయే పుణ్యాలు అల్లాహ్ దగ్గర ఉన్నాయి. కాని మీలో ఎవరైనా పై వాటిలోని ఏదైనా పాపపు పని చేసినట్లయితే, వారికి ఈ ప్రపంచంలో శిక్ష ఉంటుంది. అది వారి పాపాలకు ప్రాయశ్చితమవుతుంది. ఎవరైనా పై వాటిలో ఏదైనా చేసినట్లయితే మరియు అల్లాహ్ దానిని గుప్తపరచినట్లయితే, వారి విషయం అల్లాహ్ కే తెలియును: ఆయన తలిస్తే వారిని క్షమిస్తాడు మరియు ఆయన తలిస్తే వారిని శిక్షిస్తాడు. అలా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కు వాగ్దానం చేసినారు.
బుఖారీ లో నమోదు చేయబడిన ఒక హదీథ్ (6416)లో ఇలా ఉన్నది: “ఎవరైతే పై వాటిని చేస్తారో, ఈ ప్రపంచంలో శిక్షింపబడతారు మరియు అది వారికి ప్రాయశ్చితంగా మారి, ప్రక్షాళనం చేస్తుంది."
అల్ ఫథ్ (1/68) లో అల్ హాఫిజ్ ఇలా తెలిపారు: ఈ హదీథ్ నుండి తెలుస్తున్నది ఏమిటంటే, హద్ శిక్ష అనుభవించటం ద్వారా, ఆ పాపం చేసినతడు పశ్చాత్తాప పడకపోయినా, అది పాపాలకు ప్రాయశ్చితం చేయును. ఇది ఎక్కువ మంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం.
అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించన హదీథ్ ను అహ్మద్ (1365) హదీథ్ గ్రంథంలో ఇలా నమోదు చేయబడెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఎవరైతే ఈ ప్రపంచంలో పాపం చేస్తారో మరియు దాని శిక్షను అనుభవిస్తారో, అల్లాహ్ అత్యంత మహోన్నత న్యాయాధీశుడు అవటం వలన తన దాసుడిని రెండవ సారి తీర్పుదినాన శిక్షించడు. ఎవరైనా ఈ ప్రపంచంలో పాపం చేసినా గాని, ఒకవేళ అల్లాహ్ గనుక దానిని కప్పివేసి, అతడిని క్షమించి వేస్తే, అల్లాహ్ అత్యంత క్షమాశీలుడు కావటం వలన దాసుడికి ప్రసాదించిన తన క్షమాపణను తీర్పుదినాన తిరిగి వాపసు తీసుకోడు."
దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో! మరియ వ్యభిచారానికి పాల్పడరో. మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. పునరుత్థాన దినం నాడు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు. కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తోరో! అలాటం వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత" (దివ్యఖుర్ఆన్ 25:68-70)
“నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్కును) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానిని క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించువాడు, వాస్తవానికి దుర్మార్గంలో బహుదూరం వెళ్ళిపోయినట్లే!" (దివ్యఖుర్ఆన్ 4:116)
పశ్చాత్తాప పడని వారిని ఈ వచనం సంబోధిస్తున్నది. అతడు షిర్క్ చేయకుండా ఉన్నట్లయితే, అతడి విషయాం అల్లాహ్ యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే షిర్క్ అనేది క్షమింపబడదు.
రెండవ రకానికి చెందిన పాపం గురించి:
ఇతర ప్రజలకు చెందిన హక్కులలో హద్దుమీరటం, ఇతరుల సంపద పై హద్దుమీరటం అంటే వారి ధనాన్ని దొంగిలించటం లేక బలవంతంగా లాక్కోవటం etc., లేదా ఇతరుల మానమర్యాదల పై హద్దు మీరటం అంటే వారిపై అపవాదులు, నిందలు వేయటం లేదా శారీరకంగా హాని కలిగించటం, కొట్టడం etc. ఇటువంటి పాపాలను క్షమింపజేసుకోవటం అనేది ఆ యా ప్రజల హక్కులు వాపసు చేయటం పై లేదా ఆ యా ప్రజల క్షమాపణ పై ఆధారపడి ఉన్నది.
అలా చేయకపోతే, అతడి ఆ పాపం యొక్క ప్రతిఫలం తీర్పుదినం వరకు అనుభవిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పాపానికి సరిసమానమైన మోతాదో అతడి నుండి పుణ్యాలు తీసుకొనబడును. ఈ విషయమై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైనా ఇతరుల గౌరవాభిమానాలు లేదా ఇతర విషయాలలో తప్పుచేసినట్లయితే, దీనార్లు మరియు దిర్హమ్ లు పనికిరాని రోజు వరకు ఆగకుండా, అతడు ఈ రోజే దానిని సరిదిద్దుకోవలెను. ఒకవేళ అలా చేయకపోతే, తీర్పుదినాన అతడి పుణ్యాల నుండి ఆ పాపానికి సరిపోయేటంతటి పుణ్యాలు తీసుకోబడును. ఒకవేళ అతడి దగ్గర పుణ్యాలు లేకపోయినట్లయితే, ఎవరి హక్కులనైతే హరించాడో ఆ వ్యక్తి కొన్ని పాపాల భారం ఇతడి లెక్కలోనికి తరలింపబడును." సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం 2317.
దీని నుండి మనకు అర్థం అవుతున్నదేమిటంటే, చేసిన పాపాలకు తప్పనిసరిగా ఈ ప్రపంచంలోనే శిక్ష అనుభవించాలనే అభిప్రాయానికి ఎటువంటి ఆధారమూ లేదు. కాని ఒకవేళ ఈ ప్రపంచంలో తన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తే, అది అతడికి ప్రాయశ్చితంగా మారును, ఇంకా ఒకవేళ అతడు శిక్షింపబడకుండా, పశ్చాత్తాప పడి, అల్లాహ్ ను క్షమాభిక్ష వేడుకున్నట్లయితే, అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని స్వీకరించ వచ్చును.
పాపం చేసినవాడు కాక ఇతరులు ఆ పాపానికి శిక్ష అనుభవిస్తారనే అసత్యాన్ని నమ్మే అజ్ఞానులు కూడా కొందరు ఉన్నారు. ఉదాహరణకు ప్రవక్తలతో సహా ఆయన సంతతిలోని ప్రతి ఒక్కరూ, ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని ఆదం అలైహిస్సలాం గురించి కొంతమంది అవివేకుల అసత్యపు విశ్వాసం. అంతకంటే ఘోరమైన గాఢాంధ అవిశ్వాసంలో మునిగి ఉన్న మరికొందరి తప్పుడు నమ్మకం ప్రకారం ఆ పాపం నుండి ప్రపంచాన్ని తప్పించడానికే, దేవుడు తన ఏకైక కుమారుడిని శిలువ పై బలి అయ్యేందుకు పంపెను. అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తలకు వ్యతిరేకంగా కల్పించబడిన ఒక పచ్చి అబద్ధం ఇది. అంతే కాక ఇటువంటి ఘోర అభాంఢమనేది పవిత్రమైన మరియు స్వచ్ఛమైన దివ్యసందేశాలకు అస్సలు వర్తించని ఒకవిధమైన అన్యాయం మరియు అనైతికత. ఎందుకంటే అల్లాహ్ ఒకరి తప్పులకు ఇంకొకరిని శిక్షించడు. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు" (దివ్యఖుర్ఆన్ 35:18)
అల్లాహ్ అనంత దయామయుడు మరియు మహోన్నత న్యాయాధీశుడు కావటం తండ్రి చేసిన తప్పులకు సంతానాన్ని ఎలా శిక్షిస్తాడు? అంతే కాక అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని కూడా స్వీకరించెను కదా!
దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
“ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితినుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: ' మీరంతా ఇక్కడి నుండి క్రిందికి దిగిపోండి; మీరు ఒకరినొకరు విరోధులు అవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది.' తర్వాత ఆదమ్ తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి (పశ్చాత్తాప పడి, క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రదాత" (దివ్యఖుర్ఆన్ 2:36-37)
“ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికీ, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. ( ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పపోయాడు. ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి మార్గదర్శకత్వం చేశాడు" (దివ్యఖుర్ఆన్ 20:121-122)
కాబట్టి ఆదం అలైహిస్సలాం గురించి రెండు విషయాలు మన ముందుకు వస్తున్నాయి: మొదటిది - చేసిన తప్పుకు ఆయన శిక్షింపబడెను. లేదా రెండోది - ఆ పాపం నుండి ఆయన పశ్చాత్తాప పడి, క్షమాపణ వేడుకొనెను మరియు ఆయన పశ్చత్తాపాన్నీ, క్షమాపణను అల్లాహ్ స్వీకరించెను. ఇంకా ఆయనను ఎన్నుకొనెను మరియు గౌరవించెను.
ఇక్కడ గమనించవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఎవరైతే అవిధేయతతో మరియు పాపాలతో నిండిన ప్రాపంచిక జీవితం గడిపారో, వారు తప్పని సరిగా సర్వలోక సృష్టికర్త, అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ వైపునకు మరల వలెను. మరియు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడి, ఆయన క్షమాభిక్షను అర్థించవలెను. అలా చేయటం వలన అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించి క్షమాభిక్ష ప్రసాదించటానికి ఆస్కారమున్నది. ఇదే విషయాన్ని దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
ఇలా అను: “స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత" (దివ్యఖుర్ఆన్ 39:53)
సహనం మరియు ఓర్పులతో కూడిన తన అంతిమ ధర్మశాసనంలో అల్లాహ్ ప్రసాదించిన తన అపార కరుణ యొక్క భాగమిది. తమ పశ్చాత్తాపం స్వీకరింపబడుటకు, తమ జాతి లోని దుర్మార్గులను సంహరించమని ఇస్రాయీలు సంతతి యొక్క అమాయకులకు ఆదేశింపబడినది. [ఆధారం - దివ్యఖుర్ఆన్ 2:54], అప్పుడు వారి పై నుండి ఈ భారమైన బాధ్యతను ఎత్తివేసి, వారిపై దయచూపెను.
చివరిగా ఈ ప్రశ్న అడిగిన వానిని సరైన, సత్యమైన, స్వచ్ఛమైన మార్గం చూపమని, అనేక శుభాలతో దీవించమని, అతడి హృదయాన్ని ఇస్లాం కోసం తెరవమని, తద్వారా అతడు ఇస్లాం స్వీకరించి, అల్లాహ్ నే ఏకైక ఆరాధ్యుడిగా, ఇస్లాం ధర్మమే తమ ధర్మంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అంతిమ దైవ సందేశహరుడిగా పూర్తిగా స్వీకరించిన ముస్లిం సమాజంలో ఒకడి జీవించాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము.
మరియు అత్యంత జ్ఞానవంతుడు కేవలం అల్లాహ్ మాత్రమే.
Islam Q&A