మసీహ్ అలైహిస్సలాం గురించి తెలిపే ఖుర్ఆన్ వచనాలకు సంబంధించిన ప్రశ్నల జవాబు

వివరణ

క్లుప్తంగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం గురించి ఖుర్ఆన్ లోని ఆయతులపై అడిగిన ప్రశ్నకు జవాబు

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  మసీహ్ అలైహిస్సలాం గురించి తెలిపే ఖుర్ఆన్ వచనాలకు సంబంధించిన ప్రశ్నల జవాబు

  ]తెలుగు – Telugu – تلغو [

  Islamqa.com

  అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్

  రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

  2012 - 1434

  إجابة عن إشكالات في آيات حياة المسيح عليه السلام وموته

  « باللغة تلغو »

  الإسلام سؤال وجواب

  ترجمة:محمد كريم الله

  مراجعة:شيخ نذير أحمد

  2012 - 1434

  మసీహ్ అలైహిస్సలాం గురించి తెలిపే ఖుర్ఆన్ వచనాలకు సంబంధించిన ప్రశ్నల జవాబు

  అల్హందులిల్లాహ్.

  నాకు ఈ వెబ్ సైటంటే చాలా ఇష్టం. దీనిని నేను తరుచుగా సందర్శిస్తూ ఉంటాను. నా మనస్సులో మీపై చాలా గౌరవం ఉంది. నా ప్రశ్న అడిగే ముందు, నాకు ఖుర్ఆన్ పై ఎలాంటి సందేహమూ లేదు. ఖుర్ఆన్ లోని ఒక్క అక్షరం కూడా మార్పు చెందలేదని నేను నమ్ముతాను. కానీ, ఈ రెండు ఆయతుల గురించి నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను "నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవుడినై తిరిగి లేపబడే రోజూ నాపై శాంతి కలుగుతుంది"! (మర్యమ్ 33). ఇక్కడ ‘నేను చనిపోయే రోజూ’ అంటే అర్థం ఏమిటి? మరియు ఈ ఆయతు: మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు; మరియు తీర్పు దినాన, ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు;- (అన్నిసాఅ 159). అతని చావుకు ముందు; అంటే ఏమిటి? అయితే ఈ ఆయతు: "ఇంకా – “మర్యం కుమారుడగు దైవప్రవక్త ఈసాను మేము హత మార్చాము.” అని అనడం వలన. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడినాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించడం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు:- (అన్నిసాఅ 157) " పైగా, అల్లాహ్ ఆయన్ని తన వైపుకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి;- (అన్నిసాఅ 158). నేను ప్రస్తుతం చైనాలో చదువుకుంటున్నాను. వివిధ మతాలకు చెందిన కొందరు స్నేహితులు ఖుర్ఆన్ గురించి మరియు ఇస్లాంలో ఈసా అలైహిస్సలాం యొక్క స్థానం గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలన్నింటికీ సరైన జవాబు ఇవ్వడంలో నాకు వీలయినంత ఉత్తమంగా నేను ప్రయత్నిస్తున్నాను.

  అల్హందులిల్లాహ్.

  మొట్టమొదటిగా, మీ ధర్మం యొక్క విషయాలను తెలుసుకోవటానికి, అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడంలో మీరు చూపుతున్న కుతూహలానికి బదులుగా మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకూ, మీకు ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ప్రసాదించమని మేము అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

  ఈ క్రింది ఆయతు విషయం గురించి (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):

  “మరియు నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవంగా తిరిగి లేపబడే రోజూ నాపై శాంతి కలుగుతుంది!”

  [మర్యమ్ 19:33],

  తన తఫ్సీర్ (ఖుర్ఆన్ వివరణ గ్రంథం)లో దాని సంకలనకర్త అత్తబరీ ఇలా వివరించారు: “మరియు నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవంగా తిరిగి లేపబడే రోజూ నాపై శాంతి కలుగుతుంది!” అనే పదసమూహం యొక్క అర్థం ఏమిటంటే: ఇతర శిశువులకు చేసే విధంగా నాకు చేయకుండా (గుచ్చకుండా), నేను పుట్టిన రోజున షైతాను మరియు అతడి సేన నుండి నాకు అల్లాహ్ యొక్క సంరక్షణ ప్రసాదించబడింది. మరియు నేను చనిపోయే రోజున చావు యొక్క భయంకర పరిస్థితి నుండి నేను రక్షించబడతాను. మరియు తీర్పదినాన నేను సజీవంగా లేపబడే రోజున, ఆ రోజు యొక్క భయంకర పరిస్థితిని చూసి ప్రజలు ఎదుర్కొనే గందరగోళ పరిస్థితి నుండి నేను రక్షించబడతాను.” [తఫ్సీర్ అత్తబరీ, 8/340].

  మరో ఖుర్ఆన్ వివరణకర్త ‘అల్ ఖుర్తుబీ’ ఇలా వివరించారు: “మరియు నాపై సలాములు” అంటే అల్లాహ్ నుండి నాకు ప్రసాదించబడే సంరక్షణ. అల్ జజ్జాజ్ ఇలా పలికారు: ముందుగా, తన ముందు నిర్దిష్టమైన ఉపపదం (definite article) లేకుండానే సలామ్ అనే పదం పేర్కొనబడింది. తర్వాత మరలా పేర్కొనబడినపుడు దాని ముందు నిర్దిష్టమైన ఉపపదం నిర్దిష్టమైన ఉపపదం (definite article) తో పేర్కొనబడింది. “నేను పుట్టిన రోజున” అంటే, ఈ ప్రపంచంలో అని అర్థం. ‘షైతాను సలహాల నుండి’ (నేను రక్షించబడినాను) అని కూడా చెప్పబడింది. “నేను చనిపోయే రోజున” అంటే సమాధిలో అని అర్థం. “నేను సజీవంగా తిరిగి లేపబడే రోజున” అంటే, పరలోకంలో అని అర్థం. ఎందుకంటే, అతడికి ఈ మూడు దశలూ ఉన్నాయి: ఈ ప్రపంచంలో సజీవంగా ఉండటం, సమాధిలో మరణించి ఉండటం మరియు పరలోకంలో మరలా తిరిగి లేపబడటం. ఈ మూడు దశలలోనూ ఆయనకు అల్లాహ్ యొక్క సంరక్షణ ప్రసాదించబడింది.

  తఫ్సీర్ అల్ ఖుర్తుబీ, 11/98.

  పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వివరణకర్తల (ముఫస్సిరీనుల) వివరణల నుండి “నేను చనిపోయే రోజున” అనే పదానికి అర్థం ఆయన చనిపోయారని కాదు, ఆయన చనిపోయే రోజు అని అర్థం – ఏదైతే జరగబోనున్నదో. హదీథులో పేర్కొనబడినట్లుగా ఆయన ఒక రోజు ఆకాశం నుండి క్రిందికి వస్తారు మరియు దజ్జాల్ ను చంపుతారు – అల్లాహ్ ను విశ్వసించకుండా చనిపోవడం నుండి ఆయన కాపాడబడతారు. అలాగే, “మరియు సజీవంగా నేను తిరిగి లేపబడే రోజున” అనే పదాలకు అర్థం, పునరుత్థాన దినాన ఆయన లేపబడినారని కాదు. అయితే ఆయన తను పుట్టిన రోజున, తను మరణించే రోజున మరియు పునరుత్థాన దినాన తను తిరిగి లేపబడే రోజున స్థితి గురించి ఆయన పేర్కొన్నారు. నిస్సందేహంగా ఆయన చనిపోతారు, అంతేగానీ, మీరు పేర్కొన్న ఇతర ఆయతులలో సూచించబడినట్లుగా, ఆయన చంపబడలేదు, శిలువ వేయబడలేదు. అయితే అల్లాహ్ ఆయనను స్వయంగా పైకి లేపుకున్నాడు. ఆకాశం నుండి క్రిందికి దిగి వచ్చి, దజ్జాల్ ను చంపిన తర్వాత ఆయన సహజంగా మరణిస్తారు.

  ఈ క్రింది ఆయతు విషయంలో (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):

  “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు; మరియు తీర్పు దినాన, ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు”

  [అన్నిసాఅ 4:159]

  ఈ పదసమూహంలోని ‘అతని’ అనే సర్వనామం ఎవరిని సూచిస్తున్నదనే విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. దీని గురించి ముఖ్యంగా రెండు అభిప్రాయాలు ఉన్నాయి:

  1 – ఆ సర్వనామం ఈసా అలైహిస్సలాంను సూచిస్తుంది. దీనిని బట్టి ఆ ఆయతు యొక్క భావానువాదం: మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈసాను, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు; ఎందుకంటే ఆయన స్వర్గం నుండి క్రిందికి దిగి వచ్చి, దజ్జాల్ ను చంపి, శిలువను ముక్కలు ముక్కలుగా చేసి, పందులను వధించి, జిజియా పన్నును రద్దు చేసి నపుడు ఆయన ఇస్లాం ధర్మాన్ని తప్ప మరే ధర్మాన్ని ఆమోదించరు. అపుడు ఆయన చనిపోక మునుపే గ్రంథప్రజలు ఆయనను నమ్ముతారు, ఆయన సత్యమని మరియు ఆయన అంతకు ముందు (శిలువపై) ఆయన చనిపోలేదని తెలుసుకుంటారు. కాబట్టి, ఈ ఆయతులో అంతిమ ఘడియ చిహ్నాలలోని ఒక చిహ్నం, పునరుత్థాన దినం యొక్క ఘటనలలోని ఒక సంఘటన పేర్కొనబడింది - ఈసా అలైహిస్సలాం క్రిందికి దిగి రావటం, ఆయన చనిపోక ముందే గ్రంథ ప్రజలు ఆయనపై విశ్వాసాన్ని ప్రకటించడం. ప్రళయ దినానికి ముందు ఈసా అలైహిస్సలాం తిరిగి రావటం గురించిన హదీథు ఉల్లేఖించిన తర్వాత దానిని వివరిస్తూ అబూ హురైరహ్ రదియల్లాహ్ అన్హు పలికిన పలుకులు ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నది. అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఎవరి చేతిలో నైతే నా ప్రాణం ఉందో, ఆయన సాక్షిగా, త్వరలోనే మర్యమ్ కుమారుడు మీ మధ్య న్యాయంతో తీర్పునిచ్చే ఒక న్యాయాధికారిగా దిగి వస్తారు. ఆయన శిలువను విరిచి వేస్తారు. పందులను వధిస్తారు. జిజియా పన్నును రద్దు చేస్తారు. సంపద ఎంత ఎక్కువ అయిపోతుందంటే, (దానం) దానిని తీసుకునే వారెవరూ కనబడరు. ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న వాటి కంటే ఒక సాష్టాంగం మంచిది అంటారు.” ఆ తర్వాత అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: ఒకవేళ మీకిష్టమైతే ఇలా పఠించండి: “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు; మరియు తీర్పు దినాన, ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు”[అన్నిసాఅ 4:159]

  బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడింది.

  2 – ఆ సర్వనామం స్వయంగా గ్రంథ ప్రజలనే సూచిస్తున్నది. ఈ పరిస్థితిలో ఆయతు యొక్క భావానువాదం ఇలా అవుతుంది – గ్రంథ ప్రజలలో ఎవరూ మిగలరు – ఈసా అలైహిస్సలాంను విశ్వసించకుండా, ఆయన సత్యమని నమ్మకుండా మరియు చనిపోలేదని నమ్మకుండా – ఆయన అవసాన దశ కష్టాన్ని అనుభవించడం, కళ్ళారా వాస్తవాలను మరియు ఋజువులను చూడటం జరిగిన తర్వాత. చనిపోయేటపుడు, అందరితో పాటు గ్రంథప్రజలలోని ప్రతి ఒక్కరు కూడా, తాము నమ్మినది అసత్యమని తెలుసుకుంటారు. అయితే అది అతనికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు.

  పైన పేర్కొన్న రెండు అభిప్రాయాల ఆధారంగా, ఈసా అలైహిస్సలాం చనిపోయారనే ఎలాంటి సూచనా మీరు తెలిపిన పై ఆయతులో రాలేదు. మొదటి అభిప్రాయం ప్రకారం, ఆ పదాలు భవిష్యత్తులో జరగబోయే అగోచరమైన విషయాన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే, ఆయన తప్పకుండా చనిపోబోతున్నారు. కానీ, అది పైన పేర్కొనబడినట్లుగా ఆయన తిరిగి భూమిపైకి దిగి వచ్చిన తర్వాతే జరుగబోతుంది. రెండో అభిప్రాయం ప్రకారం, “తన మరణానికి మునుపు” అనే పదాలు స్వయంగా గ్రంథప్రజలలోని వ్యక్తినే సూచిస్తున్నది.

  అత్తబారీ, ఇబ్నె కథీర్ మరియు ఇతర తఫ్సీర్ పండితులు మొదటి అభిప్రాయాన్ని సరైన అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇబ్నె కథీర్ ఇలా పేర్కొన్నారు: “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు; మరియు తీర్పు దినాన, ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు” (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం) [అన్నిసాఅ 4:159] అనే పదాల విషయంలో ఇబ్నె జరీర్ ఇలా వివరించినారు: తఫ్సీర్ పండితుల మధ్య ఈ ఆయతు వివరణ విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు” అంటే, ఈసా అలైహిస్సలాం మరణానికి మునుపు. అంటే దజ్జాల్ తో యుద్ధం చేయడానికి ఆయన క్రిందికి దిగి వచ్చినపుడు వారందరూ ఆయనను నమ్ముతారు. అపుడు ధర్మాలన్నీ ఒక్కటై పోతాయి. ఇబ్రాహీం అలైహిస్సాలం యొక్క ఏకదైవత్వ ధర్మమైన ఇస్లాం ధర్మం అందరి ధర్మమవుతుంది. ... ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా పలికారని ఉల్లేఖించబడింది: “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు” అంటే, ఈసా అలైహిస్సలాం మరణానికి మునుపు అని అర్థం. … అల్ హసన్ ఇలా పలికారని ఉల్లేఖించబడింది: “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు” అంటే, ఈసా అలైహిస్సలాం మరణానికి మునుపు అని అర్థం. అల్లాహ్ సాక్షిగా, ఆయన అల్లాహ్ వద్ద సజీవంగా ఉన్నారు. అయితే ఆయన భూమిపైకి దిగి వచ్చిన తర్వాత వారందరూ ఆయనను నమ్ముతారు. … ఇబ్నె జరీర్ ఇలా పలికారు: అంటే, గ్రంథాన్ని నమ్మే వ్యక్తి స్వయంగా చనిపోక మునుపు అని ఇతరులు అభిప్రాయపడినారు, ఎందుకంటే అపుడు (చనిపోయేటపుడు) అతడు సత్యానికి మరియు అసత్యానికి మధ్య ఉన్న తేడాను గుర్తిస్తాడు. ఎందుకంటే, అతడి ధర్మం విషయంలో అసత్యం నుండి సత్యం స్పష్టం చేయబడనంత వరకు అతని ఆత్మ బయటికి రాదు. ఈ ఆయతు గురించి ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనను పేర్కొంటూ, అలీ ఇబ్నె అబీ తాలిబ్ ఇలా పలికారు: ఈసా అలైహిస్సలాంను విశ్వసించకుండా ఏ యూదుడూ చనిపోడు. … ఇబ్నె అబ్బాస్ ఇలా పలికారు: ఒకవేళ ఎవరి తలైనా వేరు చేయబడినప్పటికీ, ఈసా అలైహిస్సలాంను విశ్వసించకుండా, అతడి ఆత్మ బయటికి రాదు.. … ఇబ్నె అబ్బాస్ ఇలా పలికారని ఉల్లేఖించబడింది: ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు మరియు సందేశహరుడు అని విశ్వసించ నంత వరకు ఏ యూదుడూ మరణించడు.

  ఇబ్నె జరీర్ ఇలా పలికారు: ఈ వేర్వేరు అభిప్రాయాలలో నుండి మొదటి అభిప్రాయం సరైనది కావచ్చు. ఈసా అలైహిస్సలాం దిగి వచ్చిన తర్వాత, ఆయన మరణించక మునుపే ఆయనను విశ్వసించకుండా గ్రంథ ప్రజలలో ఎవ్వరూ మిగలరు. నిస్సందేహంగా, ఇబ్నె జరీర్ అభిప్రాయం సరైన అభిప్రాయమే. ఎందుకంటే, ఈ ఆయతు సందర్భం దానిని సూచిస్తున్నది – ఈసా అలైహిస్సలాం చంపబడినారని, శిలువ వేయబడినారని యూదులు వాదిస్తున్నది అసత్యం. కొందరు అజ్ఞాన క్రైస్తవులు కూడా యూదుల వాదన సత్యమని నమ్ముతున్నారు. అయితే వాస్తవానికి అలా జరగలేదని, కేవలం అలా జరగినట్లుగా వారికి చూపబడిందని, వారు ఈసా అలైహిస్సలాంను పోలిన వానిని హత్య చేసారని, అయితే అది వారు గ్రహించట్లేదని అల్లాహ్ మనకు తెలుపుతున్నాడు. కానీ, ఆయన పైకి లేపుకోబడినారు. ఇప్పటికీ పైన సజీవంగా ఉన్నారు. ముతవాతిర్ హదీథులలో తెలుపబడినట్లుగా ప్రళయ దినం రాక ముందు ఆయన తప్పక తిరిగి వస్తారు. ఆయన అసత్యపు మసీహ్ (దజ్జాల్) ను చంపుతారు, శిలువ ను విరగ్గొడతారు, పందులను చంపుతారు, జిజియా పన్ను రద్దు చేస్తారు, అంటే దానిని ఆయన ఏ ఇతర ధర్మాన్ని అనుసరిస్తున్న వారి నుండీ స్వీకరించరు, తప్పని సరిగా వారు వారు ఇస్లాం అవలంబించాలి లేదా కత్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. అపుడు గ్రంథ ప్రజలందరూ ఆయనను విశ్వసిస్తారని ఈ ఆయతు మనకు తెలుపుతున్నది. అలా నమ్మకుండా వారిలో ఏ ఒక్కరూ మిగిలి ఉండరు. కాబట్టి ఇలా చెప్పబడింది: “మరియు గ్రంథవహులలో ఏ ఒక్కడూ అతడిని, అతని మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు” i.e., ఈసా అలైహిస్సలాం మరణానికి మునుపు అని అర్థం. ఎవరైతే ఆయన చంపబడినారని, శిలువ వేయబడినారని నమ్ముతారో, అలాంటి వారిపై ఆయన తీర్పుదినాన సాక్ష్యమిస్తారు i.e., ఎందుకంటే వారి క్రూరచర్యల వలన ఆయన పైకి లేపుకోబడినారు మరియు మరలా క్రిందికి పంపబడినారు. తఫ్సీర్ ఇబ్నె కథీర్ (1/762).

  సరైన జ్ఞానం మరియు ఋజువుల ఆధారాలతో మాత్రమే క్రైస్తవులతో డిబేటు చేయాలి. ఈ ముఖ్యవిషయాన్ని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయటం వలన, మీ బలహీనమైన వాదనల కారణంగా వారు సత్యాన్ని తిరస్కరించలేదు అనడానికి ఆస్కారం ఉండదు. క్రైస్తవుల వద్ద ఎలాంటి ప్రామాణికమైన సాక్ష్యాధారమూ లేదు. అయితే వారు నిజమనిపించే వాదనలు చాలా తెలివిగా మీ ముందు పెడతారు. తద్వారా వారు సత్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు, సత్యాసత్యాలను కలగాపులగం చేసి, గందరగోళ పరిస్థితి సృష్టిస్తారు. అన్ని రకాల మార్గభ్రష్టత్వాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

  అల్లాహ్ జ్ఞానమే అత్యుత్తమమైన జ్ఞానం.