18 - Al-Kahf ()

|

(1) పరిపూర్ణమైన,ఘనమైన లక్షణాల ద్వారా,బహిర్గత,అంతర్గత అనుగ్రహాల ద్వారా ఆ ఏకైక అల్లాహ్ కొరకే ప్రశంసలు ఎవరైతే తన దాసుడైన,తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడో. మరియు ఆయన ఈ ఖుర్ఆన్ కొరకు ఎటువంటి వక్రత్వమును,సత్యము నుండి వాలిపోటమును చేయలేదు.

(2) పైగా ఆయన అవిశ్వాసపరులని అల్లాహ్ వద్ద నుండి వారి గురించి నిరీక్షిస్తున్న బలమైన శిక్ష నుండి భయపెట్టటానికి,సత్కార్యములు చేసే విశ్వాసపరులకి సంతోషమును కలిగించే అంటే వారికి మంచి పుణ్యం దానికి సమానంకాని పుణ్యము ఉన్నదని తెలియపరచటానికి, దానిని అందులో ఏవిధమైన వైరుధ్యముగాని,విబేధముగాని లేనిదిగా సరైనదిగా చేశాడు.

(3) వారు ఈ పుణ్యములో కలకాలము నివసిస్తారు.అది వారి నుండి అంతమవ్వదు.

(4) యూదులను,క్రైస్తవులను,కొందరు ముష్రికులను ఎవరైతే అల్లాహ్ సంతానమును చేసుకున్నాడు అని పలికారో వారిని భయపెట్టటానికి.

(5) ఈ కల్పించుకునే వారందరి కొరకు అల్లాహ్ కు సంతానమును అంటగట్టే విషయంలో వారి వాదన పై ఎటువంటి జ్ఞానము గాని ఆధారం గాని లేదు. అలాగే ఈ విషయంలో వారు అనుకరించిన వారి తాత ముత్తాతలకూ ఎటువంటి జ్ఞానం లేదు. బుద్దిలేమితో వారి నోటి నుండి వెలువడే ఈ మాట ఎంతో చెడ్డదైనది. వారు ఎటువంటి ఆధారము గాని పత్రము గాని లేని అబద్ధమును మాత్రమే పలుకుతున్నారు.

(6) ఓ ప్రవక్తా బహుశా మీరు ఒక వేళ వారు ఈ ఖుర్ఆన్ ను విశ్వసించకపోతే బాధతో,విచారముతో మీ ప్రాణములను నాశనం చేసుకుంటారేమో.మీరు అలా చేయకండి. వారిని సన్మార్గం పై నడిచేటట్లు చేయటం మీ బాధ్యత కాదు. కేవలం మీరు సందేశాలను చేరవేయటం ఒకటే మీ బాధ్యత.

(7) నిశ్చయంగా మేము వారిలోంచి ఎవరు అల్లహ్ ఇచ్ఛకు గురి చేసే సత్కర్మను చేస్తారో,వారిలో నుండి ఎవరు దుష్కర్మను చేస్తారో పరీక్షించి వారిలో నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలమును ప్రసాధించటానికి మేము భూ ఉపరితలంపై ఉన్న సృష్టితాలన్నింటిని దాని అందంకోసం చేశాము.

(8) మరియు నిశ్చయంగా మేము భూ ఉపరితలంపై ఉన్న సృష్టితాలన్నింటిని మొక్కల నుండి ఖాళీగా ఉన్న చదునైన మైదానంగా మార్చి వేస్తాము. అది దానిపై ఉన్న సృష్టితాల జీవనం సమాప్తమైపోయిన తరువాత. అయితే దాని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకోండి.

(9) ఓ ప్రవక్తా గుహ వాసుల గాధ,వారి పేర్లు వ్రాయబడిన వారి పలక మా ఆశ్చర్యకరమైన సూచనల్లోంచి అని భావించకండి. కాని అవి కాకుండా వేరేవి భూమ్యాకాశముల యొక్క సృష్టించటం లాంటివి ఎక్కువ ఆశ్ఛర్యకరమైనవి.

(10) ఓ ప్రవక్తా తమ ధర్మమును కాపాడుకోవటం కోసం విశ్వాస యువకులు పారిపోయి ఆశ్రయంపొందిన వేళను మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు వారు తమ ప్రభువును తమ దుఆలలో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ మా ప్రభువా నీవు మా పాపములను మన్నించి,మమ్మల్ని మా శతృవుల నుండి విముక్తిని కలిగించి, నీ వద్ద నుండి మాకు కారుణ్యమును ప్రసాధించు.అవిశ్వాసపరుల నుండి వలస వచ్చిన విషయము నుండి,విశ్వాసము నుండి మనకు సత్య మార్గము వైపునకు మార్గనిర్దేశకం చేయి,సరిదిద్దు.

(11) వారు గుహ వద్దకు వచ్చి ఆశ్రయం పొందిన తరువాత మేము వారి చెవులపై శబ్దములు వినకుండా ఉండటానికి పరదా కప్పివేశాము. చాలా సంవత్సరముల వరకు వారిపై నిద్రను కలిగించాము.

(12) వారి సుదీర్ఘ నిద్ర తరువాత మేము గుహలో వారి నివసించిన కాలము విషయంలో విభేదించుకునే రెండు వర్గల్లోంచి ఏవర్గము ఆ కాలము యొక్క పరిమాణము గురించి బాగా తెలిసిన వారు ఎవరో మేము బాహ్య జ్ఞానమును తెలుసుకోవటానికి వారిని మేల్కొలిపాము.

(13) ఓ ప్రవక్తా మేము ఎటువంటి సందేహము లేని వారి సమాచారమును సత్యముతో మీకు తెలియపరుస్తున్నాము. నిశ్చయంగా వారు తమ ప్రభవును విశ్వసించి,ఆయనను అనుసరించి ఆచరించిన కొందరు యువకులు. మేము వారికి సన్మార్గమును,సత్యముపై స్థిరత్వమును అధికం చేశాము.

(14) మరియు మేము వారి హృదయములను విశ్వాసము ద్వారా,దానిపై స్థిరత్వము ద్వారా,మాతృభూములను వదిలే విషయంలో సహనము చూపటం ద్వారా బలపరచాము. ఒక్కడైన అల్లాహ్ పై తమ విశ్వాసమును అవిశ్వాస రాజు ముందు వారు ప్రకటిస్తూ నిలబడినప్పుడు వారు అతనితో ఇలా పలికారు : మేము విశ్వాసమును కనబరచి మేము ఆరాధించిన మా ప్రభువు ఆకాశముల ప్రభువు,భూమి ప్రభువు. మేము ఆయనను వదిలి అబధ్ధముగా భావించబడిన దైవాలను ఆరాధించమంటే ఆరాధించము. ఒక వేళ మేము ఆయనను వదిలి ఇతరులను ఆరాధిస్తే అటువంటప్పుడు మేము ఖచ్చితంగా సత్యము నుండి దూరమయిన,దుర్మార్గమైన మాటను పలికేవారము.

(15) ఆ తరువాత వారిలో కొందరు కొందరి వైపు ఇలా పలుకుతూ మరలుతారు : ఈ మా జాతి వారందరు అల్లాహ్ ను వదిలి కొన్ని ఆరాధ్య దైవాలను తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తున్నారు. వాస్తవానికి వారు వాటి ఆరాధన గురుంచి స్పష్టమైన ఆధారం చూపలేరు. అల్లాహ్ తోపాటు సాటి సంబంధమును కలిపి అల్లాహ్ పై అబధ్ధమును కల్పించిన వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఇంకెవడూ ఉండడు.

(16) మీరు మీ జాతి వారి నుండి దూరమై,వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే వాటిని వదిలి, కేవలం ఒక్కడైన ఆ అల్లాహ్ ను మాత్రమే ఆరాధించినప్పుడు మీరు మీ ధర్మం కోసం పారిపోయి గుహలో శరణు తీసుకోండి. పరిశుద్ధుడైన మీ ప్రభువు మీ శతృవుల నుండి మిమ్మల్ని రక్షించే,మిమ్మల్ని కాపాడే తన కారుణ్యమును మీ కొరకు విస్తరింపజేస్తాడు. మరియు మీ కొరకు మీ జాతి వారి మధ్య జీవితమునకు బదులుగా మీరు ప్రయోజనం చెందే మీ వ్యవహారమును సులభతరం చేస్తాడు.

(17) అప్పుడు వారు తమకు ఇచ్చిన ఆదేశములను పాటించారు.అల్లాహ్ వారిపై నిదురను కలిగించాడు. మరియు వారిని వారి శతృవుల నుండి రక్షించాడు. ఓ చూసేవాడా నీవు చూస్తావు వారి కొరకు సూర్యుడు తన ఉదయించే చోటు నుండి ఉదయించేటప్పుడు వారి గుహ నుండి వాలి ప్రవేశమునకు కుడి వైపు నుండి వెళ్ళిపోతున్నాడు. మరియు సూర్యాస్తమయం వద్ద సూర్యుడు అస్తమించినట్లయితే అది తన దిశను దాని ఎడమ వైపునకు మార్చి దానికి చేరకుండా ఉంటుంది. అప్పుడు వారు శాస్వత నీడలో ఉంటారు.వారికి సూర్య తాపము హాని కలిగించదు. వారు గుహ గదిలోనే వారికి అవసరమైన గాలిని పొందుతూ ఉన్నారు. వారు గుహలో శరణు తీసుకోవటం,వారికి నిదుర కలగటం,వారి నుండి సూర్యుడు దూరంగా ఉండటం,వారి స్థలము విశాలమవటం, వారి జాతి నుండి వారికి విముక్తి కలగటం ఇవన్నీ అల్లాహ్ సామర్ధ్యమును నిరూపించే అల్లాహ్ చేసిన అద్భుతాలు. అల్లాహ్ ఎవరికైతే సన్మార్గమును నోచుకునే భాగ్యమును కలిగిస్తాడో అతడే వాస్తవానికి సన్మార్గమును పొందుతాడు. ఆయన ఎవరినైతే దాని నుండి పరాభవమునకు లోను చేసి మార్గభ్రష్టతకు లోను చేస్తాడో అతడు తనకు సన్మార్గము పొందే భాగ్యమును ప్రసాధించే,దానికి మార్గ నిర్దేశకం చేసే సహాయకుడిని పొందలేడు. ఎందుకంటే సన్మార్గము అల్లాహ్ చేతిలో ఉంది. అతని చేతిలో లేదు.

(18) ఓ వారి వైపు చూసే వాడా వారి కళ్ళు తెరుచుకుని ఉండటం వలన నీవు వారిని మేల్కొని ఉండినట్లు భావిస్తావు. వాస్తవానికి వారు నిదురపోతున్నారు. మరియు వారి శరీరములను నేల తినివేయకుండా ఉండటానికి మేము వారిని వారి నిదురలో ఒక సారి కుడి వైపునకు మరలిస్తే ఒక సారి ఎడమ వైపునకు మరల్చేవారము. మరియు వారి రక్షక కుక్క గుహ ప్రవేశం ముందట తన రెండు కాళ్లను జాపుకుని పడి ఉంది. ఒక వేళ నీవు వారిని తొంగి చూస్తే నీవు వారితో భయపడి వెను తిరిగి పారిపోతావు. మరియు నీ హృదయం వారి భయంతో నిండిపోతుంది.

(19) ఎలాగైతే మేము ప్రస్తావించిన మా సామర్ధ్యపు అద్భుతాలను వారిపై చేశామో సుదీర్ఘ కాలము తరువాత వారు అందులో నిదురపోతూ గడిపిన కాలము గురించి ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని నిదుర మేల్కొలిపాము. వారిలోని కొందరు ఇలా సమాధానమిచ్చారు : మేము నిదురపోతూ ఒక రోజు లేదా రోజులో కొంత సమయమో గడిపాము. వారిలో నుండి కొందరు ఎవరికైతే వారు నిదురపోతూ గడిపిన సమయం స్పష్టం కాలేదో వారు ఇలా సమాధానమిచ్చారు : మీరు నిదురపోతూ గడిపిన కాలము గురించి మీ ప్రభువుకు బాగా తెలుసు. దాని జ్ఞానమును ఆయనకే (అల్లాహ్ కే) అప్పజెప్పి మీకు అవసరమైన విషయాల్లో నిమగ్నమవ్వండి. అయితే మీరు మీలో నుండి ఒకరిని ఈ వెండి నాణెములను ఇచ్చి మా సాధారణ నగరానికి పంపండి. అతడు దాని వాసుల్లోంచి మంచి భోజనం,మంచి లబ్దిని పొందే వారు ఎవరో గమనించాలి. మరియు అతడు తన ప్రవేశ విషయంలో,తన బయటకు వచ్చే విషయంలో,తన వ్యవహరించే విషయంలో జాగ్రత్తవహించాలి,అతడు మృదు స్వభావి అయి ఉండాలి. మరియు పెద్ద నష్టం జరగకుండా ఉండటానికి మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియజేయవద్దు.

(20) నిశ్చయంగా మీ జాతి వారు ఒక వేళ మిమ్మల్ని గుర్తించి మీ నివాసమును తెలుసుకుంటే మిమ్మల్ని వారు రాళ్ళతో కొట్టి చంపివేస్తారు లేదా మిమ్మల్ని తమ ఆ విచలన ధర్మం వైపునకు దేనిపైనైతే మీరు అల్లాహ్ సత్య ధర్మం వైపునకు మార్గ నిర్దేశం చేసి మీపై ఉపకారం చేయక మునుపు ఉన్నారో దాని వైపునకు బలవంతాన మరల్చి వేస్తారు. ఒక వేళ మీరు దాని వైపునకు మరలితే మీరు ఎన్నటికి సాఫల్యం కారు. ఇహలోక జీవితంలో కారు,పరలోక జీవితంలో కారు. కాని మీరు అల్లాహ్ మీకు మార్గదర్శకం చేసిన సత్య ధర్మమును మీరు వదిలివేయటం వలన,ఆ విచలన ధర్మం వైపునకు మీ మరలటం వలన ఆ రెండింటిలో పెద్ద నష్టమునే చవిచూస్తారు.

(21) మరియు మేము ఏ విధంగానైతే మా సామర్ధ్యమును నిరూపించే అద్భుతమైన చర్యలైన చాలా సంవత్సరాలు వారిని నిదురింపచేయటం, దాని తరువాత వారిని నిదుర నుంచి మేల్కొల్పటం లాంటి చర్యలను వారిపై మేము పాల్పడ్డామో ,వారి విషయమును మేము వారి నగరవాసులకు విశ్వాసపరులకు సహాయం ద్వారా,మరణాంతరం లేపటం ద్వారా అల్లాహ్ వాగ్ధానము సత్యం అని,ప్రళయం రాబోతుందని అందులో ఎటువంటి సందేహం లేదని వారి నగరవాసులు తెలుసుకోవటానికి తెలియపర్చాము. గుహ వాసుల విషయం బట్టబయలై వారు చనిపోయినప్పుడు వారిని గుర్తించినవారు వారి విషయంలో వారు ఏమి చేయాలీ ? అని విబేధించుకున్నారు. వారిలోని ఒక వర్గము ఇలా పలికారు : మీరు వారి గుహ ద్వారము వద్ద వారిని అడ్డుగా,వారికి రక్షణగా ఉండే ఒక నిర్మాణమును నిర్మించండి. వారి స్థతి గురించి వారి ప్రభువుకు బాగా తెలుసు.అయితే వారి స్థితి వారి కొరకు ఆయన వద్ద ప్రత్యేకత ఉన్నదని నిర్ణయిస్తుంది. ప్రభావంతమైన వారు ఎవరికైతే ఎటువంటి జ్ఞానం గాని సరైన ఆహ్వానంగాని లేదో వారు ఇలా పలికారు : మేము తప్పకుండా వారు ఉన్న ఈ స్థలం పై వారికి గౌరవంగా,వారి స్థానమునకు గుర్తింపుగా ఆరాధన కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాము.

(22) వారి సంఘటనలో వారి సంఖ్యను గురించి వాదించే వారిలో నుండి కొందరు ఇలా పలుకుతారు : వారు ముగ్గురు నాలుగవ వాడు వారి కుక్క. వారిలో నుండి కొంతమంది వారు ఐదుగురు ఆరవ వాడు కుక్క అని పలుకుతారు.ఈ రెండు వర్గాల వారు ఎటువంటి ఆధారం లేకుండా తమ ఊహ వెనుక పడి పలికిన మాటలు మాత్రమే. వారిలో కొందరు వారు ఏడుగురు అని ఎనిమిదవ వాడు వారి కుక్క అని పలుకుతారు.ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : వారి సంఖ్య గురించి నా ప్రభువుకు బాగా తెలుసు.వారి సంఖ్య కొద్ది మందికి మాత్రమే తెలుసు.అది కూడా అల్లాహ్ వారికి వారి సంఖ్య గురించి తెలిపాడు. అయితే మీరు వారి సంఖ్య విషయంలో గాని గ్రంధవహుల్లోంచి ఇతరవారి స్థితుల విషయంలో గాని ఇతరుల విషయంలో గాని వారందరి విషయంలో మీపై అవతరింపబడిన దైవ వాణిపై పరిమితమై లోతుగా కాకుండా బాహ్యపరంగా వాదించండి. వారి విషయంలో వివరణలను వారి లో నుండి ఎవరినీ అడగకు.ఎందుకంటే దాని గురించి వారికి తెలియదు.

(23) ఓ ప్రవక్తా మీరు రేపు చేయదలచిన విషయం గురించి నిశ్చయంగా ఈ పనిని రేపు చేస్తాను అని పలకకండి. ఎందుకంటే రేపు మీరు దానిని చేయగలరా లేదా మీకు దానికి మధ్య ఏదైన ఆటంకం తలెత్తుతుందా ? మీకు తెలియదు. ఇందులో ప్రతీ ముస్లింనకు ఒక ఆదేశం ఉన్నది.

(24) కానీ దాన్ని చేయటమును నీవు ఇలా పలుకుతూ అల్లాహ్ ఇచ్ఛతో జోడించు : (ఇన్ షాల్లాహ్ ) ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే రేపు నేను దాన్ని చేస్తాను. మరియు నీ పలుకు ఇన్ షాల్లాహ్ ద్వారా నీ ప్రభువును గుర్తు చేసుకో. ఒక వేళ దాన్ని పలకటమును మరచి పోతే ఇలా పలుకు : నా ప్రభువు నాకు మార్గ నిర్దేశకంగా,అనుగ్రహంగా ఈ విషయము కన్న అతి దగ్గరదైన దాని గురించి చూపిస్తాడని ఆశిస్తున్నాను.

(25) గుహ వాసులు తమ గుహములో మూడు వందల తొమ్మిది సంవత్రములు ఉన్నారు.

(26) ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియజేయండి : వారు తమ గుహములో ఎంత కాలం ఉన్నారో అల్లాహ్ కి బాగా తెలుసు. వాస్తవానికి మేము వారు అందులో ఉన్న కాలము గురించి తెలియపరచాము. పరిశుద్ధుడైన ఆయన మాట తరువాత ఎవరి మాటా చెల్లదు. సృష్టిపరంగా,జ్ఞాన పరంగా ఆకాశముల్లో ఉన్నఅగోచరమైనవి,భూమిలో ఉన్న అగోచరమైనవి పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి కొరకే. పరిశుద్ధుడైన ఆయన ఎంత బాగ చూడగల వాడు!.ఆయన ప్రతీది చూస్తున్నాడు. ఆయన ఎంత బాగ వినగలడు!.ఆయన ప్రతీది వింటున్నాడు. వారికొరకు వారి వ్యవహారమును సంరక్షించటానికి సంరక్షకుడు ఆయన కాకుండా ఎవడూ లేడు. ఆయన ఆదేశములో ఎవరూ భాగస్వాములు కారు.ఆయన తీర్పులో ఒక్కడే అద్వితీయుడు.

(27) ఓ ప్రవక్తా అల్లాహ్ దైవ వాణి ద్వారా మీ వైపునకు అవతరింపజేసిన ఖుర్ఆన్ ను చదివి,దాన్ని పాటించండి. ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. ఎందుకంటే అవన్ని నిజం,అవన్ని సరసమైనవి. మరియు మీరు పరిశుద్ధుడైన ఆయన కాకుండా శరణు తీసుకోవటానికి దేని వద్దను శరణాలయమును ,ఆయన కాకుండా మీరు రక్షణ పొందటానికి రక్షణాలయమును పొందలేరు.

(28) నీవు పగటి మొదటి వేళలో,దాని చివరి వేళలో ఆరాధన ఉద్ధేశంతో,వేడుకునే ఉద్దేశంతో ఆయన కొరకు చిత్తశుద్ధితో అర్ధించే వారి సహచర్యంలో నీ మనసును ఇమిడ్చి ఉంచు. నీవు ధనవంతుల,గౌరవంతుల సమావేశాలను ఆశిస్తూ నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు. ఎవడి హృదయము పై మేము సీలు వేసి మా స్మరణ నుండి పరధ్యానమునకు లోను చేస్తే అతడు నీ మండలి నుండి నిరుపేదలను తొలగించటం గురించి నీకు ఆదేశించి,తన ప్రభువు విధేయతకు వ్యతిరేకంగా తన మనోవాంఛనలను అనుసరించాడో అతడిని నీవు అనుసరించకు. అతని ఆచరణలు వృధా అయిపోయినవి.

(29) ఓ ప్రవక్తా తమ హృదయముల నిర్లక్ష్యం వలన అల్లాహ్ స్మరణ నుండి పరధ్యానంలో ఉన్న వీరందరితో ఇలా పలకండి : నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది అది సత్యము. అది నా వద్ద నుండి కాదు అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. విశ్వాసపరులని నేను గెంటి వేయాలని మీరు నాతో కోరిన దానిని నేను స్వీకరించను. అయితే మీలో నుండి ఎవరు ఈ సత్యమును విశ్వసించదలచుకుంటే దాన్ని విశ్వసించండి. అతను దాని ప్రతిఫలం ద్వారా సంతోషం కలిగించబడుతాడు. మరియు మీలో నుండి ఎవరు దాన్ని తిరస్కరించదలచుకుంటే తిరస్కరించండి. అతని కోసం నిరీక్షిస్తున్న శిక్ష ద్వారా అతను తొందరలోనే శిక్షించబడుతాడు. నిశ్చయంగా మేము అవిశ్వాసమును ఎంచుకుని తమ మనస్సులపై హింసకు పాల్పడిన వారి కొరకు పెద్ద అగ్ని జ్వాలను సిద్ధపరచాము. దాని ప్రహరీ వారిని చుట్టుముట్టి ఉంటుంది. అయితే వారు దాని నుండి పారిపోలేరు. ఒక వేళ వారు తమకు కలిగిన తీవ్ర దాహం నుండి నీటి ద్వారా ఉపశమనం పొందాలని కోరితే తీవ్ర వేడి గల మురుగు నూనె లాంటి నీటితో వారికి ఉపశమనం కలిగించటం జరుగుతుంది. దాని వేడి తీవ్రత వలన వారి ముఖములు మాడిపోతాయి. వారు ఉపశమనం కలిగించబడిన ఈ పానియం ఎంతో చెడ్డదైనది. అయితే అది వారి దాహంను తీర్చదు కాని దానిని ఇంకా అధికం చేస్తుంది. వారి చర్మములను కాలుస్తున్న అగ్ని జ్వాలను అది ఆర్పదు. వారు నివాసమున్న స్థానమైన,వారు బస చేస్తున్న స్థలమైన అగ్ని ఎంతో చెడ్డది.

(30) నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములను చేసిన వారు తమ కర్మలను మంచిగా చేశారు. అయితే వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. నిశ్చయంగా మేము మంచి కర్మను చేసిన వారి పుణ్యమును వృధా చేయము. కాని ఎటువంటి తరుగుదల లేకుండా మేము వారి ప్రతిఫలములను సంపూర్ణంగా ప్రసాధిస్తాము.

(31) విశ్వాసముతో, సత్కర్మలు చేయటముతో వర్ణించబడిన వీరందరి కొరకు స్థిరమైన(శాస్వతమైన) స్వర్గవనాలు కలవు. వాటిలో వారు శాస్వతంగా ఉంటారు. వారి నివాస స్థలముల క్రింది నుండి స్వర్గము యొక్క తీయని కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో వారు బంగారపు కంకణలతో అలంకరించబడుతారు. మరియు వారు పచ్చని పలుచని మరియు మందమైన పట్టు వస్త్రాలను తొడుగుతారు. అందమైన పరదాలతో అలంకరించబడిన ఆసనాలతో ఆనుకుని కూర్చుని ఉంటారు. మంచి ప్రతిఫలం వారి ప్రతిఫలం.నివాసమైన,వారు బస చేస్తున్న స్థలమైన స్వర్గము ఎంతో మంచిది.

(32) ఓ ప్రవక్తా మీరు ఇద్దరు వ్యక్తులైన అవిశ్వాసపరుడుని,విశ్వాసపరుడుని ఒక ఉపమానమును తెలపండి. వారిద్దరిలో నుంచి మేము అవిశ్వాసపరునికి రెండు తోటలను (ద్రాక్ష తోటలను) ప్రసాదించాము,ఆ రెండు తోటలకు చుట్టూ ఖర్జూరపు చెట్లతో చుట్టు ముట్టాము. మరియు వాటి ఖాళీ ప్రాంతంలో పంటపొలాలను పండించాము.

(33) అయితే ప్రతీ తోట తన ఫలాలైన ఖర్జురములను,ద్రాక్షా పండ్లను, పంటలను పండించింది. మరియు అందులో ఏది కూడా ఏమాత్రం తగ్గించలేదు. అంతే కాక అది దాన్ని సంపూర్ణంగా,పుష్కలంగా ఇచ్చింది.మరియు మేము ఆ రెండిటి మధ్య వాటికి సులభంగా నీరు పెట్టటానికి ఒక కాలువను ప్రవహింపజేశాము.

(34) ఈ రెండు తోటల యజమానికి వేరే సంపదలు,ఫలాలు ఉండేవి. అయితే అతడు విశ్వాసపరుడైన తన స్నేహితునితో అతనిని ఉద్దేశించి అతన్ని బీరాలుపోతు ప్రభావితం చేయటానికి ఇలా పలికాడు : నేను సంపద పరంగా నీ కన్న అధికుడిని. స్థానపరంగా నీకన్న ఎక్కువ గౌరవం కలవాడిని, బలగం పరంగా నీ కన్నబలీష్టిని.

(35) మరియు అవిశ్వాసపరుడు తన తోటలో విశ్వాసపరుడిని తోడుగా తీసుకుని అవిశ్వాసము,ఆశ్చర్యం ద్వారా తన స్వయంపై దుర్మార్గమునకు పాల్పడిన స్థితిలో అతనికి దాన్ని చూపించటానికి ప్రవేశించాడు.అవిశ్వాసపరుడు ఇలా పలికాడు : ఈ తోట దేనినైతే నీవు చూస్తున్నావో దాని కొరకు శాస్వతంగా ఉండే కారకాలను నేను ఏర్పరచుకోవటం వలన అది అంతమైపోతుందని నేను భావించటంలేదు.

(36) ప్రళయం సంభవిస్తుందని నేను బావించటం లేదు. అది సంభవించిందనుకోండి నేను మరణాతరం లేపబడి నా ప్రభువు వైపునకు మరలించబడితే మరణాంతరం లేపబడిన తరువాత నేను మరలి వెళ్ళే దాన్ని ఈ నా తోటకన్న ఎక్కువ మంచిదిగా తప్పకుండా పొందుతాను. ఇహలోకంలో నేను ధనికునిగా ఉండటం మరణాంతరం నేను లేపబడిన తరువాత ధనికిడిని అవటమును నిర్ధారిస్తుంది.

(37) విశ్వాసపరుడైన అతని సహచరుడు అతనితో మాటలను సమీక్షిస్తూ ఇలా పలికాడు : ఏమీ నీ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించి, ఆ తరువాత నిన్ను వీర్యముతో సృష్టించి, ఆ తరువాత నిన్ను మగ మనిషిగా చేసి, నీ అవయవాలను సమాంతరంగా చేసి, నిన్ను సంపూర్ణంగా చేసిన వాడిని నీవు తిరస్కరిస్తావా ?. వీటన్నింటి సామర్ధ్యం కలవాడు నిన్ను మరణాంతరం లేపటంపై సామర్ధ్యం కలవాడు.

(38) కానీ నేను నీ ఈ మాటలను పలకను. నేను మాత్రం ఇలా పలుకుతాను : పరిశుద్ధుడైన అల్లాహ్ నాపై తన అనుగ్రహాలను ప్రసాధించిన నా ప్రభువు. మరియు నేను ఆరాధనలో ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించను.

(39) ఎందుకు నీవు నీ తోటలో ప్రవేశించినప్పుడు ఇలా పలకలేదు : అల్లాహ్ తలచినది అయింది. అల్లాహ్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి శక్తి లేదు. ఎవరైతే తాను తలచినది చేస్తాడో అతడు బలవంతుడు. ఒక వేళ నీవు నన్ను నీకన్న ఎక్కువ పేదవానిగా,నీ కన్న తక్కువ సంతానము కలవానిగా భావించినా సరే.

(40) అల్లాహ్ నీ తోట కన్న మంచిది నాకు ప్రసాధిస్తాడని,నీ తోటపై ఆకాశము నుండి ఏదైన శిక్షను పంపితే నీ తోట ఎటువంటి మొక్కలు లేని నేలగా అయ్యి దాని జిగటతనం వలన అందులో కాళ్ళు జారే విధంగా మారిపోతుందని నేను నమ్ముతున్నాను.

(41) లేదా దాని నీరు భూమి లోపలకి ఇంకిపోయి దానిని నీవు ఎటువంటి కారకం ద్వారా చేరలేవు. దాని నీరు ఎప్పుడైతే లోపలికి ఇంకిపోద్దో అది మిగలదు.

(42) విశ్వాసపరుడు అనుకున్నట్లే జరిగింది. అవిశ్వాసపరుని తోట ఫలాలకు వినాశనం చుట్టుకుంది. అవిశ్వాసపరుడు దాన్నిఏర్పరచటంలో,దాన్ని సరిచేయటంలో ఖర్చైన దానిపై తీవ్ర చింతనకి,అవమానానికి తన రెండు చేతులను నలుపుతూ ఉండిపోయాడు. మరియు తోట దాని ఆ స్థంబాలతో సహా దేనిపైనైతే ద్రాక్ష కొమ్మలు వ్యాపింపచేయబడ్డాయో పడిపోయింది. మరియు అతడు ఇలా పలికాడు : నా దౌర్భాగ్యం నేను ఒక్కడైన నా ప్రభువును విశ్వసించి ఆరాధనలో ఆయన తోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది.

(43) ఈ అవిశ్వాసపరుని పై వచ్చిన శిక్షను ఆపటానికి ఎటువంటి జన సమూహము లేదు. వాస్తవానికి అతడు తన జన సమూహం పై గర్వించేవాడు. స్వయంగా అతడు కూడా తన తోటపై వచ్చిన అల్లాహ్ వినాశనమును ఆపలేకపోయాడు.

(44) ఆ ప్రదేశంలో సహాయం అన్నది ఒక్కడైన అల్లాహ్ దే. పరిశుద్ధుడైన ఆయన విశ్వాసపరులైన తన స్నేహితులకి మంచి ప్రతిఫలం ప్రసాధిస్తాడు.అతడు వారికి ప్రతిఫలమును రెట్టింపు చేసి ప్రసాధిస్తాడు.వారికి మంచి పరిణామమును కలిగిస్తాడు.

(45) ఓ ప్రవక్తా ఇహలోకము ద్వారా మోసపోయే వారికి ఒక ఉపమానమును తెలుపు. అది అంతరించి పోవటంలో,వేగంగా అంతం అయిపోవటంలో దాని ఉపమానము ఆ వర్షపు నీటి లాంటిది దాన్ని మేము ఆకాశము నుండి కురిపించాము. అప్పుడు ఆ నీటితో భూమియొక్క మొక్కలు మొలకెత్తి అవి పండిపోయాయి. ఆ తరువాత ఆ మొక్కలు విరిగిపోయి ముక్కలుముక్కలుగా చెల్లా చెదురైపోయాయి. వాటి భాగములను గాలులు వేరే ప్రాంతములకు ఎత్తుకునిపోయాయి. అప్పుడు నేల ముందు ఎలా ఉన్నదో అలా అయిపోయింది. మరియు అల్లాహ్ ప్రతీ దాని పై సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏది అశక్తుడిగా చేయదు. అతను తాను కోరుకున్న దాన్ని జీవింపజేస్తాడు, తాను కోరుకున్నన దాన్ని అంతం చేస్తాడు.

(46) సంపద,సంతానము ఇహలోక జీవితంలో అలంకరించుకునే సామగ్రి మాత్రమే. సంపద వలన దాన్ని అల్లాహ్ ఇష్టపడే వాటిలో ఖర్చు చేస్తే తప్ప పరలోకములో ఎటువంటి ప్రయోజనం లేదు. సంతృప్తికరమైన ఆచరణలు,మాటలు అల్లాహ్ యందు ఇహలోకంలో ఉన్న ప్రతీ అలంకరణ కన్న పుణ్యపరంగా ఎంతో మేలైనవి. ఇది ఒక మనిషి ఆశించే మేలు. ఎందుకంటే ప్రాపంచిక అలంకరణ అంతం అయిపోతుంది. మరియు సంతృప్తికరమైన ఆచరణల,మాటల పుణ్యం అల్లాహ్ వద్ద ఉండిపోతుంది.

(47) మరియు నీవు పర్వతాలు వాటి స్థానము నుండి జరపబడే రోజును ఒక సారి గుర్తు చేసుకో . మరియు భూమిని దానిపై ఉన్న పర్వతాలు,వృక్షాలు,నిర్మాణాలు జరిగిపోవటం వలన బహిర్గతం అవ్వటమును మీరు చూస్తారు. మరియు మేము సృష్టితాలన్నింటిని సమీకరిస్తాము. అప్పుడు మేము వారిలో నుండి ఎవరినీ వదలకుండా మరల లేపుతాము.

(48) ప్రజలు నీ ప్రభువు ముందట పంక్తుల రూపంలో ప్రవేశింపబడుతారు అప్పుడు ఆయన వారి లెక్క తీసుకుంటాడు. వారితో ఇలా చెప్పటం జరుగుతుంది : మీరు ఒంటరిగా,చెప్పులు లేకుండా,నగ్నంగా,సున్తీ చేయబడకుండా మేము మిమ్మల్ని మొదటిసారి ఇలా పుట్టించామో అలా మా వద్దకు వచ్చారు. అంతే కాక మీరు మరల లేపబడరని,మేము మీ కర్మల పరంగా ప్రతిఫలం ప్రసాధించటానికి ఎటువంటి కాలమును కాని,ప్రదేశమును కాని మీ కొరకు తయారు చేయలేదని మీరు భావించారు.

(49) మరియు కర్మల పుస్తకాలు ఉంచబడుతాయి. తమ కర్మల పుస్తకమును తమ కుడి చేయితో తీసుకునే వారు ఉంటారు,దాన్నే ఎడమ చేతితో తీసుకునే వారు ఉంటారు. ఓ మానవుడా నీవు అవిశ్వాసపరులను అందులో ఉన్న వాటి నుండి భయపడుతుండగా చూస్తావు. ఎందుకంటే వారు ముందు చేసుకున్న అవిశ్వాస కార్యలను,పాప కార్యాలను అందులో తెలుసుకుంటారు. మరియు వారు ఇలా పలుకుతారు : అయ్యో మా పాడుగాను,మా ఆపదా ఈ పుస్తకమేమిటి మా చిన్న వాటినీ వదల లేదు, పెద్ద వాటిని వదల లేదు. కాని వాటన్నింటిని భద్రపరచి,లెక్కవేసి ఉంచింది. మరియు వారు తమ ఇహలోక జీవితంలో చేసుకున్న పాప కార్యాలన్నింటిని వ్రాయబడినవిగా,నిర్ధారించబడినవిగా పొందుతారు. ఓ ప్రవక్తా మీ ప్రభువు ఎవరిని హింసకు గురి చేయడు. ఏ పాపము లేకుండా ఆయన ఎవరినీ శిక్షించడు. విధేయత చూపేవాడికి తన పై విధేయత చూపిన దాని పుణ్యమును ఏమాత్రం తగ్గించడు.

(50) ఓ ప్రవక్తా మేము దైవ దూతలతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : మీరు ఆదంనకు గౌరవపరంగా సాష్టాంగపడండి. అప్పుడు వారందరు ఇబ్లీసు తప్ప తమ ప్రభువు ఆదేశమును పాటిస్తూ అతనికి సాష్టాంగపడ్డారు. అతడు జిన్నుల్లోంచి వాడు.దైవ దూతల్లోంచి కాడు.అయితే అతను అహంకారమును చూపి సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు. తన ప్రభువు పై విధేయత చూపటం నుండి వైదొలిగిపోయాడు. అయితే ఓ ప్రజలారా మీరు అతడిని,అతని సంతానమును నన్ను వదిలి మీకు సహాయం చేయటానికి సహాయకునిగా చేసుకుంటున్నారా?. వాస్తవానికి వారు మీకు శతృవులు. అటువంటప్పుడు మీరు ఎలా మీ శతృవులను మీ కొరకు సహాయకులుగా చేసుకుంటున్నారు?!. మహోన్నతుడైన అల్లాహ్ సహాయమునకు బదులుగా తమకు సహాయకునిగా షైతానును తయారు చేసుకున్న దుర్మార్గుల చర్య ఎంతో చెడ్డదైనది.

(51) మీరు నన్ను వదిలి ఎవరినైతే సహాయకులుగా చేసుకున్నారో వీరందరు మీ లాంటి దాసులే. భూమ్యాకాశములను సృష్టించటం పై ఆ రెండింటిని నేను సృష్టించినప్పుడు వారిని సాక్షులుగా చేయ లేదు. అంతే కాదు వారు ఆ సమయంలో ఉనికిలో లేరు. మరియు నేను వారిలో కొందరిని సృష్టించటం పై కొందరిని సాక్షులుగా చేయలేదు. సృష్టించటంలో,పర్యాలోచన చేయటంలో నేను ఒక్కడినే. మరియు నేను మానవుల,జిన్నుల షైతానుల్లోనుంచి భ్రష్టు పట్టించే వారిని సహాయకులుగా చేయను. నేను ఎటువంటి సహాయకుల అక్కర లేని వాడిని.

(52) మరియు ఓ ప్రవక్తా మీరు వారికి ప్రళయదినమును గుర్తు చేయండి. అప్పుడు అల్లాహ్ ఇలా పలుకుతాడు : ఇహలోకంలో తనతోపాటు సాటి కల్పించిన వారితో మీరు నాతో పాటు ఎవరినైతే నాకు సాటి ఉన్నారని భావించి సాటి కల్పించుకున్నారో వారిని పిలవండి. బహుశా వారు మీకు సహాయం చేస్తారేమో. అప్పుడు వారు వారిని పిలుస్తారు కాని వారు వారి పిలుపునకు సమాధానమివ్వరు,వారికి సహాయము చేయరు. మరియు మేము ఆరాధించేవారికి,ఆరాధించబడే వారికి మధ్య వినాశన స్థానమును చేస్తాము. వారు అందులో భాగస్వాములు అవుతారు.అది నరకాగ్ని.

(53) ముష్రికులు నరకాగ్నిని కళ్ళారా చూస్తారు. అప్పుడు వారు అందులో పడతారని వారికి పూర్తి నమ్మకము కలిగుతుంది. మరియు వారు దాని నుండి తప్పించుకోవటానికి ఎటువంటి ప్రదేశమును పొందరు.

(54) మరియు నిశ్చయంగా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ లో చాలా రకాల ఉపమానములను వారు గుర్తు చేసుకుంటూ ఉండటానికి, హితోపదేశం గ్రహించటానికి స్పష్టపరచాము,వివరించాము. కాని మానవుడు ప్రత్యేకించి అవిశ్వాసపరుడు. అతని నుండి చాలా ఎక్కువగా అనవసరమైన వాదులాడటం బహిర్గతమైనది.

(55) విభేదించే అవిశ్వాసపరులకు,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దానిని విశ్వసించటమునకు మధ్య ఆటంకం కలిగించినది ఏమిటి ? మరియు వారికీ,తమ పాపములకు వారు అల్లాహ్ సన్నిధిలో మన్నింపు వేడుకోవటమును ప్రకటించక పోవటమునకు మధ్య ఆటంకం కలిగించినది ఏమిటి ?. వాస్తవానికి ఖుర్ఆన్ లో వారి కొరకు ఉదాహరణలివ్వబడినవి. మరియు వారి వద్దకు స్పష్టమైన వాదనలూ వచ్చినవి. వారిని ఆటంకం కలిగించినది పూర్వ సమాజాలపై వచ్చి పడిన శిక్ష వారిపై వచ్చిపడాలని మొండితనముతో వారి కోరటం,వారికి వాగ్ధానం చేయబడిన శిక్షను కళ్ళారా చూడటమును వారు కోరటం మాత్రమే.

(56) మరియు మేము ఎవరినైతే మా ప్రవక్తల్లోంచి పంపించామో విశ్వాసపరులకి,విధేయత చూపే వారికి శుభవార్తనివ్వటానికి,అవిశ్వాసపరులని,అవిధేయులని భయపెట్టటానికి మాత్రమే. మరియు హృదయములను సన్మార్గముపై తీసుకుని రావటానికి ప్రేరేపించే అధికారము వారికి లేదు. మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచిన వారు వారి కొరకు ఆధారము స్పష్టమైనా కూడా ప్రవక్తలతో తమ అసత్యము ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన సత్యాన్ని తొలగించటానికి తగువులాడుతారు. మరియు వారు ఖుర్ఆన్ ను మరియు దేని ద్వారానైతే వారు భయపెట్టించబడ్డారో దాన్ని పరిహాసంగా,హేళనగా చేసేశారు.

(57) అతనికంటే పరమ దుర్మార్గుడు ఎవడూ ఉండడు. ఎవడికైతే తన ప్రభువు ఆయతులతో హితోపదేశం చేయబడినా వాటిలో ఉన్న శిక్ష గురించి హెచ్చరికను పట్టించుకోలేదో,వాటి ద్వారా హితబోధన గ్రహించటం నుండి విముఖత చూపాడో,ఇహలోక తన జీవితంలో ముందు చేసుకున్న అవిశ్వాసము,పాప కార్యాలను మరచిపోయి వాటికి ప్రాయశ్చిత్తం చేయలేదో. నిశ్చయంగా మేము ఈ గుణములు కలవారి హృదయములపై ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటం నుండి వాటిని ఆపే మూతలను,వారి చెవులలో దీని నుండి చెవుడును వేశాము. వారు దాన్ని స్వీకరించే విధంగా వినలేరు. ఒక వేళ మీరు వారిని విశ్వాసము వైపునకు పిలిస్తే దేని వైపున మీరు పిలుస్తున్నారో వారి హృదయములపై మూతలు,వారి చెవులలో చెవుడు ఉన్నంత వరకు వారు దాన్ని స్వీకరించరు.

(58) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను తిరస్కరించే వారికి శిక్ష త్వరగా కలగటంనకు నిరీక్షించకుండా ఉండటానికి. అల్లాహ్ ఆయనతో ఇలా పలికాడు : ఓ ప్రవక్తా మీ ప్రభువు తనతో పశ్చాత్తాప్పడే తన దాసుల పాపములను మన్నించేవాడు,ప్రతీ వస్తువును ఆక్రమించుకునే కారుణ్యం కలవాడు. పాపాత్ములు బహుశా వారు ఆయనతో పశ్చాత్తాప్పడతారని ఆయన గడువివ్వటం ఆయన కారుణ్యములో నుంచిదే. ఒక వేళ మహోన్నతుడైన ఆయనకు విముఖత చూపే వీరందరిని శిక్షిస్తే వారి కొరకు ఇహలోక జీవితంలోనే శీఘ్రంగా శిక్షను కలిగించేవాడు. కాని ఆయన దయామయుడు,అనంత కరుణామయుడు. వారు పశ్చాత్తాప్పడటానికి ఆయన వారి నుండి శిక్షను వెనుకకు నెట్టాడు. అంతే కాక వారి కొరకు స్థానము,సమయము నిర్ణయించబడి ఉన్నవి. అందులో వారు ఒక వేళ పశ్చాత్తాప్పడకపోతే తమ అవిశ్వాసమునకు,తమ విముఖత చూపటమునకు ప్రతిఫలం ప్రసాదించబడుతారు. ఆయన కాకుండా వారు ఆశ్రయం పొందటానికి ఎటువంటి ఆశ్రయమును పొందలేరు.

(59) ఈ అవిశ్వాసపరుల బస్తీలు మీకు దగ్గరలో గతించిన హూద్,,సాలెహ్,షుఐబ్ జాతుల బస్తీల్లాంటివి. వారు అవిశ్వాసము,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడినప్పుడు మేము వారిని తుదిముట్టించాము. మరియు మేము వారి వినాశనమునకు ఒక నిర్ణీత సమయమును కేటాయించాము.

(60) ఓ ప్రవక్తా మీరు మూసా అలైహిస్సలాం తన సేవకుడు యూషఅ్ బిన్ నూన్ తో ఇలా పలికినప్పటి వృత్తాంతమును గుర్తు చేసుకోండి : నేను రెండు సముద్రముల కలిసే చోటుకు చేరుకునేంతవరకు నిర్విరామంగా నడుస్తూ ఉంటాను లేదా నేను పుణ్య దాసున్ని కలిసి అతనితో జ్ఞానమును నేర్చుకునేంత వరకు చాలా కాలం వరకు నడుస్తూనే ఉంటాను.

(61) అప్పుడు వారిద్దరు బయలుదేరారు. ఎప్పుడైతే వారు రెండు సముద్రములు కలసే చోటు చేరుకున్నారో వారిద్దరు తమ ప్రయాణపు సామగ్రిగా తెచ్చుకున్న తమ చేపను మరచిపోయారు. అల్లాహ్ చేపకు ప్రాణం పోశాడు. అది సముద్రంలో ఒక నేలమాళిగలా ఒక దారిని చేసుకుంది. దానిలో నీరు ప్రవేశించదు.

(62) వారిద్దరు ఆ ప్రదేశము నుండి దాటి వెళ్ళిపోయినప్పుడు మూసా అలైహిస్సలాం తన సేవకునితో ఇలా పలికారు : నీవు మా వద్దకు మద్యాహ్న భోజనం తీసుకునిరా. నిశ్చయంగా మాకు మా ఈ ప్రయాణం మూలంగా తీవ్ర అలసట కలిగింది.

(63) సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు : ఏమీ మేము రాతి బండవద్ద విశ్రాంతి తీకున్నప్పుడు జరిగినది మీరు చూశారా ?!. అప్పుడు నేను చేప విషయం మీకు గుర్తు చేయటం మరచిపోయాను. దాని గురించి మీకు గుర్తు చేయటం నుండి నన్ను షైతాను మాత్రమే మరపింపజేశాడు. చేప బ్రతికిపోయి ఆశ్చార్యానికి గురి చేస్తూ తన కోసం సముద్రంలో దారిని తయారు చేసుకుంది.

(64) మూసా అలైహిస్లాం తన సేవకునితో ఇలా పలికారు : మేము కోరుకున్నది అదే. అది పుణ్యదాసుని ప్రదేశమునకు గుర్తు. అప్పుడు వారిద్దరు తమ అడుగుజాడలను అనుసరిస్తూ దారిని వారిద్దరు కోల్పోకుండా ఉండటానికి వెనుకకు మరలారు. చివరికి రాతి బండ వద్దకు చేరుకున్నారు. మరియు దాని నుండి చేప ప్రవేశ మార్గము ఉన్నది.

(65) వారిద్దరూ చేపను పోగొట్టుకున్న ప్రదేశమునకు చేరుకున్నప్పుడు దాని వద్ద వారు మా పుణ్య దాసుల్లోంచి ఒక దాసుడిని (అతడు ఖజిర్ అలైహిస్సలాం) పొందారు. అతనికి మేము మా వద్ద నుండి కారుణ్యమును ప్రసాధించాము. మరియు మేము అతనికి మా వద్ద నుండి ప్రజలకు తెలియని జ్ఞానమును ప్రసాధించాము. మరియు అది (జ్ఞానం) ఈ గాధలో ఇమిడి ఉన్నది.

(66) మూసా ఆయనతో వినమ్రతతో,మెత్తదనముతో ఇలా పలికారు : సత్యం వైపునకు దారి చూపే ఏదైతే జ్ఞానమును అల్లాహ్ మీకు నేర్పించాడో దాని నుండి మీరు నాకు నేర్పించటముపై నేను మిమ్మల్ని అనుసరించగలనా ?.

(67) ఖజిర్ ఇలా సమాధానమిచ్చారు : మీరు చూసిన నా జ్ఞానముపై ఖచ్చితంగా సహనం చూపలేరు. ఎందుకంటే అది మీ దగ్గర ఉన్న జ్ఞానంతో సరిపోలడం లేదు.

(68) మరియు నీవు చూసే కార్యల గురించి సరి అయినది ఏదో నీవు గుర్తించని వాటిపై నీవు ఎలా సహనం చూపగలవు ?!. ఎందుకంటే నీవు వాటి విషయంలో నీ జ్ఞానము పరంగా నిర్ణయం తీసుకుంటావు కాబట్టి.

(69) మూసా ఇలా సమాధానమిచ్చారు : ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మీరు నన్ను మీ కార్యలను నేను చూసిన వాటిపై సహనం చూపే వానిగా పొందుతారు. అవి మీ విధేయతకు సంబంధించినవి.మీరు నాకు ఆదేశించిన వాటి విషయంలో మీకు విధేయత చూపకుండా ఉండలేను.

(70) ఖజిర్ మూసాతో ఇలా పలికారు : ఒక వేళ మీరు నన్ను అనుసరిస్తే నేను చేసిన దాన్ని మీరు చూసిన ఆ విషయం గురించ్ నేను దాని కారణం ముందు స్పష్టపరచే వాడినయ్యేంతవరకు మీరు నన్ను అడగకండి.

(71) వారిద్దరు దానిపై రాజీ అయినప్పుడు వారు సముద్ర తీరమునకు నడిచి వెళ్ళారు.చివరకు ఒక నావను పొందారు. ఖజిర్ కి గౌరవంగా ఎటువంటి పారితోషికం లేకుండా వారిద్దరు అందులో సవారీ అయ్యారు. అప్పుడు ఖజిర్ దాని పలకల్లోంచి ఒక పలకను ఊడగొట్టి నావకు రంధ్రం చేశారు. అప్పుడు మూసా ఆయనతో ఇలా పలికారు : ఏమీ మీరు ఆ నావను దేనిలోనైతే మమ్మల్ని ఎటువంటి పారితోషికం లేకుండా సవారీ చేయించినారో దాని వారిని ముంచి వేసే ఉద్దేశంతో రంధ్రం చేశారా ?!. నిశ్చయంగా మీరు పెద్ద ఘనకార్యమే చేశారు.

(72) ఖజిర్ మూసాతో "మీరు నా నుండి చూసిన దానిపై సహనం చూపలేరని నేను మీకు చెప్పలేదా ?" అని అన్నారు.

(73) మూసా అలైహిస్సలాం ఖజిర్ తో ఇలా పలికారు : నేను మరిచిపోయి మీకు ఇచ్చిన మాటను వదిలివేసినందుకు మీరు నన్ను శిక్షించకండి.నాపై బలవంతం చేయకండి,మీ సహచర్యంలో కఠినంగా వ్యవహరించకండి.

(74) వారిద్దరు నావ నుండి దిగిన తరువాత తీరం వెంబడి నడుచుకుంటూ వెళ్ళసాగారు. అప్పుడు వారిద్దరు పిల్లలతోపాటు ఆడుకుంటున్నఇంకా యవ్వన దశకు చేరని ఒక పిల్లవాడిని చూశారు. అప్పుడు ఖజిర్ అతనిని చంపివేశారు. మూసా అతనితో ఇలా పలికారు : ఏమీ మీరు ఎటువంటి పాపం చేయని,ఇంకా యవ్వన దశకు చేరని ఒక అమాయక ప్రాణాన్ని చంపేశారా ?!.నిశ్చయంగా మీరు ఘోరాతికరమైన పని చేశారు.

(75) ఖజిర్ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : నిశ్చయంగా నేను మీకు చెప్పాను కదా ఓ మూసా నిశ్చయంగా నీవు నేను చేసిన దానిపై సహనం చూపలేవని.

(76) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఒక వేళ నేను దీని తరువాత ఏదైన విషయము గురించి అడిగితే అప్పుడు మీరు నన్ను వేరు చేసేయండి. నిశ్చయంగా మీరు నాతోడును వదిలేసుకోవటానికి చాలినన్ని సాకులకు మీరు చేరుకున్నారు. కారణం నేను మీ ఆదేశమును రెండు సార్లు వ్యతిరేకించాను.

(77) అప్పుడు వారు నడవ సాగారు చివరికి వారు ఒక బస్తీ వారి వద్దకు వచ్చి అక్కడి వాసులతో వారు భోజనమును అడిగారు. ఆ బస్తీ వాసులు వారికి భోజనం పెట్టటం నుండి ,వారికి ఆతిథ్యం ఇవ్వటం నుండి నిరాకరించారు. అప్పుడు వారు బస్తీలో వాలిపోయి పడిపోవటమునకు,శిధిలమవటమునకు దగ్గరగా ఉన్న ఒక గోడను చూశారు.అయితే ఖజిర్ దాన్ని సరిచేసి చివరికి దాన్ని తిన్నగా నిలబెట్టారు. అప్పుడు మూసా అలైహిస్సలాం ఖజిర్ తో ఇలా పలికారు : ఒక వేళ నీవు దాని మరమ్మత్తుకు పారితోషికం తీసుకోదలచితే వారు మాకు ఆతిథ్యం ఇవ్వటం నుండి ఆగిపోయిన తరువాత మాకు దాని అవసరం ఉండటం వలన మీరు దాన్ని తీసుకునేవారు కదా.

(78) ఖజిర్ మూసాతో ఇలా పలికారు : గోడను నిలబెట్టటంపై నేను ఎటువంటి పారితోషికం తీసుకోకపోవటం పై ఈ విముఖత నీకు,నాకు మధ్య విడిపోవటమునకు స్థానము. నేను చేసినవి మీరు ఏవైతే చూసి సహనం చూపలేకపోయారో వాటి వివరణ తొందరలోనే మీకు తెలియపరుస్తాను.

(79) ఇక ఆ నావ విషయం దేనినైతే రంధ్రం చేయటము నుండి మీరు నన్ను విభేదించారో అది కొంతమంది బలహీన ప్రజలది. దానిపై వారు సముద్రంలో పని చేసేవారు. దాని తరపు నుండి ప్రతిఘటించే శక్తి వారికి లేదు. అయితే నేను ఏదైతే అందులో చేశానో దాని ద్వారా దాన్ని లోపం కలదిగా చేయదలచాను. దాన్ని ఆ రాజు చేజిక్కించుకోకుండా ఉండటానికి ఎవరైతే వారి ముందు ఉన్నాడో అతడు ప్రతీ మంచి నావను దాని యజమానుల నుండి బలవంతాన తీసుకునే వాడు. మరియు లోపంకల ప్రతీ నావను వదిలిపెట్టేసేవాడు.

(80) ఇక ఆ పిల్లవాడి విషయం ఎవరి హతమార్చటమును మీరు నన్ను విబేధించారో అతని తల్లిదండ్రులిద్దరు విశ్వాసపరులు. మరియు అతడు అల్లాహ్ జ్ఞానములో అవిశ్వాసి. అయితే అతను ఒక వేళ యవ్వన దశకు చేరుకుంటే అతని పట్ల వారిద్దరి ప్రేమ ఆధిక్యత వలన లేదా వారిద్దరికి అతని అవసర ఆధిక్యత వలన వారిద్దరిని అల్లాహ్ పట్ల అశ్వాసమును కనబరచటంపై ప్రేరేపిస్తాడని మాకు భయం కలిగినది.

(81) కావున అల్లాహ్ వారికి ధర్మ పరంగా,సంస్కార పరంగా,పాపాలనుండి పరిశుద్ధుడయ్యే పరంగా అతని కన్న ఎక్కువ మేలైన వాడు,అతని కన్న ఎక్కువ అతని తల్లిదండ్రలపై కారుణ్యం కలవాడిని వారికి బదులుగా ప్రసాధిస్తాడని మేము కోరాము.

(82) ఇక ఆ గోడ విషయం దేనినైతే నేను మరమ్మతు చేస్తే మీరు దాని మరమ్మతు చేయటం పై నన్ను విభేదించారో అది మేము వచ్చిన ఊరిలో ఇద్దరు చిన్నపిల్లలది. వారి తండ్రి చనిపోయాడు. మరియు గోడ క్రింద వారి సంపద దాయబడి ఉన్నది. మరియు ఈ ఇద్దరి తండ్రి పుణ్యాత్ముడు. ఓ మూసా నీ ప్రభువు వారిద్దరు యవ్వన దశకు చేరుకుని పెద్దవారైన తరువాత దాని క్రింద దాయబడి ఉన్న సంపదను వెలికి తీసుకోవాలని కోరాడు. ఒక వేళ ఆ గోడ ఇప్పుడు పడిపోతే వారి సంపద బయటపడి కోల్పోవడం జరుగును. ఈ పర్యాలోచన వారి కొరకు నీ ప్రభువు తరపు నుండి కారుణ్యము. నేను దాన్ని నా స్వయం నిర్ణయంతో చేయలేదు. నీవు సహనం వహించలేని దానికి ఈ వివరణ.

(83) ఓ ప్రవక్తా ముష్రికులు,యూదులు పరీక్షిస్తూ నిన్ను రెండు కొమ్ములు కలవాని (జుల్ ఖర్నైన్) వార్తను గురించి ప్రశ్నిస్తున్నారు. మీరు ఇలా సమాధానమివ్వండి : నేను తొందరలోనే అతని సమాచారములో నుండి ఒక భాగమును మీపై చదివి వినిపిస్తాను. దానితో మీరు గుణపాఠం నేర్చుకుంటారు,హితోపదేశం గ్రహిస్తారు.

(84) నిశ్చయంగా మేము అతనికి భువిలో స్థానమును కల్పించాము. మరియు అతనికి మేము అతని కోరికకు సంబంధించిన ప్రతీ వస్తువు యొక్క మార్గమును ప్రసాధించాము.దాని ద్వారా అతను తాను కోరుకునే దానికి చేరుతాడు.

(85) అయితే అతను తన కోరిన దానికి చేరుకోవటానికి మేము ప్రసాధించిన కారకాలు,మార్గములను ఎంచుకొని పడమర వైపునకు దృష్టి సారించాడు.

(86) మరియు అతడు నడవసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే వైపు భూమి అంతిమ భాగమునకు చేరుకున్నప్పుడు దానిని (సూర్యుడిని) నల్లటి బురద కల వేడి ఒక చెలిమిలో మునుగుతున్నట్లుగా చూశాడు. మరియు అతడు సూర్యుడు అస్తమించే చోట ఒక అవిశ్వాసపరుల జాతిని చూశాడు. మేము అతనికి దేనినైన ఎంచుకునే అధికారమిస్తూ అతనితో ఇలా పలికాము : ఓ రెండు కొమ్ములవాడా (జుల్ ఖర్ నైన్) నీవు వీరందరిని చంపి శిక్షించు లేదా ఇంకోవిధంగా,మరియు నీవు వారిపట్ల మంచిగా వ్యవహరించు.

(87) జుల్ ఖర్నైన్ ఇలా పలికాడు : ఎవరైతే మేము అల్లాహ్ ఆరాధన వైపు మా పిలుపు తరువాత కూడా అల్లాహ్ తోపాటు సాటి కల్పించి దానిపై స్థిరంగా ఉంటాడో అతడిని మేము ఇహలోకంలో హతమార్చటం ద్వారా శిక్షిస్తాము. ఆ తరువాత అతడు ప్రళయదినాన తన ప్రభువు వైపునకు మరలుతాడు. అప్పుడు ఆయన అతడికి ఘోరమైన శిక్షకు గురి చేస్తాడు.

(88) ఎవరైతే వారిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కర్మలు చేస్తాడో అతని కొరకు అతని విశ్వాసము,అతని సత్కర్మ కు ప్రతిఫలంగా స్వర్గము కలదు. మరియు మేము అతనికి దేనిలోనైతే మెత్తదనం,సున్నితము ఉన్నదో ఆ ఆదేశమును తెలుపుతాము.

(89) ఆ తరువాత అతను మొదటి మార్గం కాకుండా వేరే మార్గమును సూర్యుడు ఉదయించే వైపు పోయాడు.

(90) మరియు అతను నడవసాగాడు. చివరికి అతడు సూర్యుడు ఉదయించే చోటుకు చేరుకున్నప్పుడు సూర్యుడిని ఆ జాతుల వారిపై ఉదయస్తుండగా చూశాడు ఎవరి కొరకైతే సూర్యుడి నుండి వారికి రక్షణ కలిగించే ఇండ్లను గాని,చెట్ల నీడలనుగాని మేము చేయలేదు.

(91) ఈ విధంగా జుల్ ఖర్నైన్ విషయం ఉన్నది. అతని వద్ద ఉన్న బలము,అధికారము యొక్క వివరణల ద్వారా మా జ్ఞానము చుట్టుముట్టింది.

(92) ఆ తరువాత అతను మొదటి రెండు మార్గములు కాకుండా తూర్పు,పడమరల మధ్యలో అడ్డంగా ఉన్నమార్గమును అనుసరించాడు (పోయాడు).

(93) మరియు అతడు నడవసాగాడు. చివరకు రెండు పర్వతాల మధ్య ఉన్న సులభ మార్గమునకు చేరుకున్నాడు. అప్పుడు అతను వాటి దగ్గర ఇతరుల భాష అర్ధం చేసుకోలేని ఒక జాతిని చూశాడు.

(94) వారు ఇలా పలికారు :ఓ జుల్ ఖర్నైన్ నిశ్చయంగా యాజూజ్,మాజూజ్ (అంటే ఆదమ్ సంతతిలో నుండి రెండు పెద్ద జాతులు) వారు పాల్పడే హత్యలు,ఇతర వాటి ద్వారా భువిలో ఉపద్రవాలను సృష్టిస్తున్నారు. నీవు వారికి,మాకి మధ్య అడ్డు గోడను నిర్మించటానికి మేము నీకు ఏదైన ధనాన్ని ఏర్పాటు చేయాలా ?.

(95) జుల్ ఖర్నైన్ ఇలా సమాధానమిచ్చారు : నాకు నా ప్రభువు ప్రసాధించిన రాజరికము,అధికారము మీరు నాకు ఇచ్చే ధనం కన్న ఎంతో గొప్పది. కావున మీరు జనం,పరికరముల ద్వారా నాకు సహాయపడండి నేను మీకూ,వారికి మధ్య అడ్డు గోడను నిర్మిస్తాను.

(96) మీరు ఇనుప ముక్కలను తీసుకుని రండి.అప్పుడు వారు వాటిని తీసుకుని వచ్చారు. ఆయన వాటి ద్వారా రెండు కొండల మధ్య నిర్మించటం మొదలు పెట్టాడు. చివరకు ఆయన ఆరెండింటిని ఒక కట్టడం ద్వారా సమానం చేసినప్పుడు పని వాళ్ళతో మీరు ఈ ముక్కలపై అగ్నిని వెలిగించండి అని ఆదేశించాడు. ఇనుప ముక్కలు కాలి ఎర్రగా అయినప్పుడు ఆయన మీరు కరిగిన రాగిని తీసుకు రండి దాన్ని వాటిపై పోస్తాను అని ఆదేశించాడు.

(97) అది ఎత్తుగా ఉండటం వలన యాజూజు,మాజూజు దానిపై ఎక్కలేక పోయారు,అది ఘనంగా ఉండటం వలన దాని క్రింద నుండి రంధ్రం చేయలేకపోయారు.

(98) జుల్ ఖర్నైన్ ఇలా పలికారు : ఈ ఆనకట్ట (డ్యామ్) నా ప్రభువు తరపు నుండి ఒక కారుణ్యము అది యాజూజ్,మాజూజ్ కి మరియు భువిలో ఉపద్రవాలు తలపెట్టటానికి మధ్య ఉన్నది. మరియు అది వారిని దాని నుండి (ఉపద్రవము నుండి) ఆపుతుంది.ప్రళయ దినం కన్న ముందు వారు బయటకు రావటానికి అల్లాహ్ నిర్ణయించిన వేళ వచ్చినప్పుడు దాన్ని భూమికి సమాంతరంగా చేస్తాడు. మరియు దాన్ని భూమికి సమాంతరంచేసే,యాజూజు,మాజూజు బయటకు వచ్చే అల్లాహ్ వాగ్ధానము అయ్యి తీరుతుంది దానిలో ఎటవంటి విబేధము లేదు.

(99) మరియు మేము చివరి కాలములో కొంత మంది సృష్టిని కొంత మంది సృష్టికి కలవరపెట్టే విధంగా,మిళితమయ్యే విధంగా వదిలి వేస్తాము. బాకా (సూర్) ఊదబడినప్పుడు మేము సృష్టిరాసులన్నిటిని లెక్క కొరకు,ప్రతిఫలం ప్రసాధించటం కొరకు సమావేశపరుస్తాము.

(100) మరియు మేము నరకమును అవిశ్వాసపరుల ముందు వారు దాన్ని ప్రత్యక్షంగా చూడటానికి బహిరంగపరుస్తాము. అందులో ఎటువంటి సందేహం లేదు.

(101) మేము దాన్ని ఆ అవిశ్వాసపరుల ముందు స్పష్టపరుస్తాము ఎవరైతే ఇహలోకంలో అల్లాహ్ స్మరణ నుండి గుడ్డిగా ఉన్నారు. వారి కళ్ళపై పరదా ఉండటం వలన అది దాని నుండి ఆటంకం కలిగించింది. మరియు వారు అల్లాహ్ ఆయతులను స్వీకరించే విధంగా వినలేకపోతారు.

(102) ఏమీ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు నన్ను వదిలి ఆరాధ్య దైవాలుగా దైవదూతల్లోంచి,ప్రవక్తల్లోంచి,షైతానుల్లోంచి నా దాసులను చేసుకొనగలరని భావించారా ?!. నిశ్చయంగా మేము నరకమును అవిశ్వాసపరుల కొరకు ఆతిథ్యముగా వారి నివాసము కొరకు చేశాము.

(103) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ ప్రజలారా తన కర్మలను బట్టి ప్రజలందరిలో ఎక్కువగా నష్టపోయే వాడు ఎవడో మేము మీకు తెలియపరచమా ?.

(104) ఎవరైతే తాము ఇహలోకములో చేసుకున్న కృషి ప్రళయదినాన తమ కృషి వ్యర్ధమైపోయిందని చూస్తారో,వారు తమ కృషిలో మంచిగా చేశామని,తొందరలోనే తమ కర్మలతో ప్రయోజనం చెందుతామని భ్రమ పడేవారో.మరియు జరిగేది దానికి భిన్నము.

(105) వారందరు తమ ప్రభువు యొక్క ఆయతులు ఏవైతే ఆయన ఏకత్వమును సూచించేవో వాటిని తిరస్కరించారు, ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించారు.అయితే వాటిపట్ల వారి తిరస్కారము వలన వారి కర్మలు వ్యర్ధమైపోయాయి. ప్రళయదినాన అల్లాహ్ వద్ద వారి కొరకు ఎటువంటి విలువ ఉండదు.

(106) వారి కొరకు తయారు చేయబడ్డ ఈ ప్రతిఫలము అది నరకము అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసము వలన,అవతరింపబడిన నా ఆయతులను,నా ప్రవక్తలను వారు పరిహాసంగా చేసుకోవటం వలన.

(107) నిశ్చయంగా అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన వారి కొరకు ఉన్నతమైన స్వర్గ వనాలు ఆతిథ్యముగా వారిని గౌరవించటానికి కలవు.

(108) వారు అందులోశాస్వతంగా ఉండిపోతారు,వారు దాని నుండి వేరగుటకు ఇష్టపడరు. ఎందుకంటే దానికి సమానమైన (దాని లాంటి) ప్రతిఫలం ఏదీ ఉండదు.

(109) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా నా ప్రభువు మాటలు చాలా ఉన్నవి. ఒక వేళ సముద్రం వాటి కొరకు సిరాగా మారి దాని ద్వారా వ్రాసినా సముద్రపు నీరు పరిశుద్ధుడైన ఆయన మాటలు అంతమవక ముందే అయిపోతుంది. ఒక వేళ మేము వేరే సముద్రాలను తీసుకుని వచ్చినా అవి కూడా అయిపోతాయి.

(110) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను మీలాంటి మనిషిని మాత్రమే. మీ సత్య ఆరాధ్య దైవము ఒకే ఒక ఆరాధ్య దైవము,ఆయనకు ఎవరు సాటి లేరని,ఆయన అల్లాహ్ అని నా వైపు దైవ వాణి అవతరింపబడినది. అయితే ఎవరైతే తన ప్రభువును కలవటం నుండి భయపడుతాడో అతడు ఆయన ధర్మమునకు అనుగుణంగా ఆచరణ చేయాలి,అందులో తన ప్రభువు కొరకు ప్రత్యేకించుకోవాలి,తన ప్రభువుతోపాటు ఎవరినీ సాటి కల్పించకూడదు.