(1) ఓ ప్రవక్తా మీ సహచరులు యుద్ధప్రాప్తి గురించి దానిని ఏ విధంగా పంచిపెట్టాలి ?,దానిని ఎవరికి పంచిపెట్టాలి ? అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఓ ప్రవక్తా మీరు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలకండి : యుద్ధప్రాప్తి అల్లాహ్ కు ,ప్రవక్తకు చెందినది. దాన్ని ఖర్చు చేయటం గురించి,పంచిపెట్టటం గురించి ఆదేశము అల్లాహ్ ది,ఆయన ప్రవక్తది. అయితే కేవలం మీరు దానిని అనుసరించాలి,అంగీకరించాలి. ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మరియు మీ మధ్య ఉన్న సంబంధాలను త్రెంచుకోవటం, ముఖము చాటి వేయటంను పరస్పర ప్రేమతో,బంధుత్వాలను కలపటం ద్వారా,మంచి నడవడితో,మన్నింపు వైఖరితో సరిదిద్దుకోండి. మరియు మీరు నిజంగా విశ్వాసపరులే అయితే అల్లాహ్ పై విధేయతను,ఆయన ప్రవక్తపై విధేయతను మీపై తప్పనిసరి చేసుకోండి. ఎందుకంటే విశ్వాసము విధేయత చూపటంపై,అవిధేయత కార్యాల నుండి దూరంగా ఉండటంపై ప్రోత్సహిస్తుంది. ఈ ప్రశ్న బదర్ సంఘటన జరిగిన తరువాతది.
(2) వాస్తవంగా విశ్వాసపరులు అల్లాహ్ ప్రస్తావన జరిగినప్పుడు వారి హృదయాలు భయపడుతాయి. వారి హృదయాలు,వారి శరీరాలు విధేయత కొరకు నడవసాగుతాయి. వారి ముందు అల్లాహ్ ఆయతులు పఠించబడినప్పుడు వారు అందులో యోచన చేస్తారు. వారిలో విశ్వాసం పెరుగుతుంది. తమకు ప్రయోజనాలు కలగటంలో,తమ నష్టాలు తొలిగి పోవటంలో ఒక్కడైన తమ ప్రభువు పైనే నమ్మకమును కలిగి ఉంటారు.
(3) వారే నమాజును దాని పరిపూర్ణ లక్షణాలతో దాని వేళలో పాటించటంలో స్థిరత్వాన్ని చూపుతారు. మేము వారికి ప్రసాదించిన వాటిలో నుంచి వారు అనివార్యమైన,అభిలాషణీయమైన ఖర్చులను చేస్తారు.
(4) ఈ లక్షణాలు కలిగిన వీరందరే వారి విశ్వాస,ఇస్లామ్ ప్రత్యక్ష లక్షణాల సముదాయం వలన నిజమైన విశ్వాసపరులు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు వద్ద ఎత్తైన భవనాలు,వారి పాపములకు మన్నింపు,మర్యాదపూరకమైన ఆహారోపాధి ఉంటాయి. అది అల్లాహ్ వారి కోసం తయారు చేసి ఉంచిన అనుగ్రహాలలోనిది.
(5) యుద్ధప్రాప్తి పంచటం విషయంలో మీ మధ్య ఉన్న విభేదాల,తగాదాల తరువాత దానిని పంచే అధికారమును అల్లాహ్ మీ నుండి తీసుకుని దానిని తనకు మరియు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు చేసినట్లే అదేవిధంగా ఓ ప్రవక్తా మీ ప్రభువు మీపై అవతరింపజేసిన వహీ ద్వారా మీరు ముష్రికులతో యుద్ధం చేయటానికి మిమ్మల్ని మదీనా నుండి బయలదేరమని విశ్వాసపరుల్లోంచి ఒక వర్గం దానిని ఇష్టపడకపోయిన ఆదేశించాడు.
(6) ఓ ప్రవక్తా ముష్రికులతో యుద్దం సంభవిస్తుందని విశ్వాసపరుల్లోంచి ఈ వర్గమునకు స్పష్టమైన తరువాత కూడా ముష్రికులతో యుద్ధ విషయంలో మీతో అది వాదిస్తుంది. ఎలాగంటే వారు మృత్యువు వైపునకు తరుమబడుతున్నట్లు,వారు దాన్ని కళ్ళారా చూస్తున్నట్లు (వాదిస్తుంది). ఇదంతా యుధ్ధం కోసం బయలుదేరటంలో వారి అయిష్టత ఎక్కువగా ఉండటం వలన. ఎందుకంటే వారు దాని కొరకు ఆయుధాలను తీసుకో లేదు,దానికి తగ్గట్టుగా వారు సిద్ధం కాలేదు.
(7) ఓ వాదించే విశ్వాసపరులారా ముష్రికుల రెండు పక్షాల్లోంచి ఒక దానిపై మీకు విజయం ప్రాప్తిస్తుందని అల్లాహ్ మీకు వాగ్ధానం చేసినప్పటి సంఘటనను ఒక సారి మీరు గుర్తు చేసుకోండి. అది వర్తక బృంధం (కారవాన్) ,అది తీసుకుని వస్తున్న సంపద కావచ్చు. దానిని మీరు యుద్ధప్రాప్తిగా తీసుకుంటారు. లేదా అది యుద్ధబృంధం కావచ్చు. మీరు వాళ్ళతో పోరాడుతారు. వారిపై మీరు విజయం పొందుతారు. మరియు మీరు వర్తక బృంధం పై విజయమును దాన్ని వశపరచుకోవటం యుద్ధం కన్న సులభతరం,సౌలభ్యం కావటం వలన కోరుకున్నారు. మరియు అల్లాహ్ ఇస్లాం బలం బహిర్గతం అయ్యేంత వరకు మీరు ముష్రికుల నాయకులను హతమార్చటం కొరకు,వారిలోంచి చాలా మందిని ఖైదీలుగా చేసుకోవటం కొరకు మిమ్మల్ని యుద్ధ ఆదేశమిచ్చి సత్యాన్ని సత్యంగా తేట తెల్లం చేయాలని కోరుకున్నాడు.
(8) అల్లాహ్ ఇస్లామునకు,ముస్లిములకు ఆధిపత్యమును కలిగించి సత్యాన్ని సత్యంగా నిరూపించాలని అది సత్యం అయ్యే విషయంలో దాని ఆధారాలను బహిర్గతం చేయటం ద్వారా జరుగుతుంది. మరియు అల్లాహ్ అసత్యమును అసత్యముగా అది అసత్యము అవటానికి ఆధారాలను బహిర్గతం చేసి నిరూపించటానికి ఒక వేళ ముష్రికులు దానిని ఇష్టపడక పోయిన అల్లాహ్ దానిని బహిర్గతం చేస్తాడు.
(9) మీరు మీ శతృవులపై విజయం ద్వారా అల్లాహ్ సహాయమును కోరుకున్నప్పటి బదర్ దినమును ఒక సారి గుర్తు చేసుకోండి. ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీకు సహాయం చేయటం ద్వారా,వెయ్యి మంది దైవ దూతలను కొందరి తరువాత కొందరు క్రమం తప్పకుండా వచ్చేటట్లు పంపించటం ద్వారా మీకు సహాయమును చేసి మీ దుఆను స్వీకరించాడు.
(10) ఓ విశ్వాసపరులారా అల్లాహ్ దైవదూతల ద్వారా సహాయమును మీ కొరకు శుభవార్తగా చేశాడు. ఎందుకంటే ఆయన మీ శతృవులపై మీకు సహాయమును (విజయమును) చేసే వాడును. సహాయము ద్వారా మీ మనస్సులు నమ్మకమును కలిగి సంతృప్తి చెందటం కొరకు. విజయం అన్నది సంఖ్యా బలం ఎక్కువగా ఉండటం వలన,యుద్ధ సామగ్రి (ఆయుధాలు) ఎక్కువగా ఉండటం వలన ప్రాప్తించదు. విజయం అన్నది పరిశుద్ధుడైన అల్లాహ్ తరపు నుండి ప్రాప్తిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ తన ఆధిపత్యంలో ధీష్టుడు,ఆయనను ఎవరు ఓడించలేరు. తన ధర్మ శాస్త్రము,విధివ్రాత యందు వివేకవంతుడు.
(11) ఓ విశ్వాసపరులారా మీకు మీ శతృవుల నుండి కలిగిన భయాందోళనల నుండి నిశ్చింతను ప్రసాదించటం కొరకు అల్లాహ్ మీపై నిద్ర మత్తును వేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. మరియు ఆకాశము నుండి మీ పై వర్షాన్ని కురిపించాడు. అశుద్ధతల నుండి మిమ్మల్ని పరిశుభ్ర పరచటానికి,మీ నుండి షైతాను దుష్రేరణలను దూరం చేయటానికి,దాని ద్వారా మీ హృదయాలకు దిటవు కలిగించటానికి యుద్ధ సమయంలో మీ శరీరములు నిలకడ చూపటానికి,దాని ద్వారా ఇసుక నేలను బిగుతువుగా చేసి పాదములకు స్థిరత్వాన్ని కలిగించి, చివరికి కాళ్ళు అందులో చిక్కిపోకుండా ఉండటానికి.
(12) ఓ ప్రవక్తా మీ ప్రభువు బదర్ లో ముస్లిములకు సహాయంగా అల్లాహ్ ఏర్పాటు చేసిన దైవ దూతలను ఆదేశించినప్పటి ఆ సన్నివేశాన్ని ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ దైవదూతలారా నిశ్చయంగా నేను సహాయము,మద్దతు ద్వారా మీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసపరుల ఉద్దేశాలను వారి శతృవులతో యుద్ధ విషయంలో బలోపేతం చేయండి. నేను తొందరలోనే అవిశ్వాసపరుల హృదయాల్లో తీవ్రమైన భయమును కలిగిస్తాను. ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరులను హతం చేయటానికి వారి మెడలపై కొట్టండి. వారు మీతో యుద్ధం నుండి వదిలి వెళ్ళిపోవటానికి వారి కీళ్ళపై,వారి వ్రేళ్ళ కణువులపై మీరు కొట్టండి.
(13) అవిశ్వాసపరులకి ఇలా జరగటం అంటే జతమారటం,వ్రేళ్ల కణువులపై కొట్డానికి కారణం వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదించారు. వారికి ఆదేశించబడిన దానిని వారు పాటించ లేదు. వారికి వారించబడిన వాటిని మానలేదు. ఎవరైతే ఈ విషయంలో అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదిస్తాడో అతనికి అల్లాహ్ ఇహలోకంలో హతమార్చటం,ఖైదీగా చేయటం ద్వారా,పరలోకంలో నరకాగ్ని ద్వారా కఠినమైన శిక్షకు గురి చేస్తాడు.
(14) ఓ అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదించేవారా మీ కొరకు ఈ ప్రస్తావించబడిన శిక్ష ఇహలోక జీవితంలో అయితే మీరు తొందరగా దాని రుచిని చూడండి. మరియు ఒక వేళ మీరు మీ అవిశ్వాస స్థితిలో,విభేదించే స్థితిలో మరణిస్తే పరలోకంలో నరకాగ్ని శిక్ష మీ కొరకు కలదు.
(15) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీరు యుద్ధంలో ముష్రికులను ఎదుర్కొని దగ్గరైనప్పుడు మీరు వారి నుండి పరాజయం పాలవకండి,మీ వెన్నులను త్రిప్పి పారిపోకండి. కాని మీరు వారికి అభిముఖమవ్వండి,వారితో యుద్ధంలో సహనం చూపండి. అల్లాహ్ తన సహాయము ద్వారా,మద్దతు ద్వారా మీకు తోడుగా ఉంటాడు.
(16) యుధ్ధ వ్యూహంగా వారిపై దాడిని కోరుకుంటూ పారిపోవటంను వారు భావించాలని వారితో యుధ్ధం కొరకు మడమ తిప్పటం కాకుండా లేదా ప్రత్యక్షమై ఉన్న ముస్లిముల ఒక వర్గముతో సహాయమును కోరుతూ వారిని కలవటానికి కాకుండా ఎవరైతే వారి నుండి పారిపోతూ వారికి తన వెన్ను చూపుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి లోనవుతాడు,దానికి హక్కుదారుడవుతాడు. అతని స్థానము పరలోకములో నరకమగును. అతని గమ్యస్థానము ఎంత చెడ్డదైన గమ్యస్థానమో,అతని మరలి వెళ్లే చోటు ఎంత చెడ్డదో.
(17) ఓ విశ్వాసపరులారా మీరు బదర్ యుధ్ధం రోజున ముష్రికులను మీ శక్తితో,మీ బలంతో హతమార్చ లేదు. కాని అల్లాహ్ ఈ విషయంలో మీకు సహకరించాడు. ఓ ప్రవక్తా మీరు వారిపై విసిరినప్పుడు మీరు విసరలేదు. కాని అల్లాహ్ మీ విసరటంను వారికి చేరవేసినప్పుడు అల్లాహ్ నే వారిపై విసిరాడు. విశ్వాసపరులు సంఖ్యా బలంలో,యుధ్ధ సామగ్రిలో తక్కువగా ఉన్నప్పటికి వారు కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు వారి శతృవులపై విజయమును కలిగించి వారికి అనుగ్రహము ప్రసాదించటం ద్వారా విశ్వాస పరులను పరీక్షించటం కొరకు. నిశ్చయంగా అల్లాహ్ మీ దుఆలను,మీ మాటలను వినే వాడును,మీ ఆచరణలను,అందులో మీకు ఉన్న ప్రయోజనమును తెలుసుకునే వాడును.
(18) ఈ ప్రస్తావించబడినది ముష్రికులను హతమార్చటం,వారిపై విసరటం చివరికి వారు పరాభవం చెంది వెన్ను తిప్పి పారిపోవటం,విశ్వాసపరులకు వారి శతృవులపై విజయము ద్వారా అనుగ్రహించటం ఇది అల్లాహ్ వద్ద నుండి జరిగినది. మరియు అల్లాహ్ అవిశ్వాసపరులు ఇస్లామ్ గురించి రచించిన వ్యూహాలను బలహీనపరిచేవాడు.
(19) ఓ ముష్రికులారా ఒక వేళ మీరు అల్లాహ్ తన శిక్షను,యాతనను హద్దులను మీరే దుర్మార్గులపై కురిపించాలని కోరుకుంటే నిశ్చయంగా అల్లాహ్ మీరు కోరుకున్న దానిని మీపై కురిపించాడు. అయితే మీ కొరకు ఏదైతే శిక్ష అవుతుందో ,దైవభీతి కల వారికి ఏదైతే గుణపాటం అవుతుందో దాన్ని మీపై కురిపించాడు. ఒక వేళ మీరు దాన్ని కోరటంను వదిలివేస్తే అది మీ కొరకు ఎంతో ఉత్తమం. ఒక్కొక్క సారి ఆయన మీకు గడువునిస్తాడు. మీతో ప్రతీకారము తీర్చుకోవటంలో తొందర చేయడు. ఒక వేళ మీరు దానిని కోరటం వైపునకు,విశ్వాసపరులతో పోరాటం వైపునకు మరలితే మేము మీపై శిక్షను కురిపించటం ద్వారా,విశ్వాసపరులకు సహాయం ద్వారా మరలుతాము. మీ జనసమూహం,మీ సహాయకులు ఒక వేళ వారి సంఖ్యాబలం,యుధ్ధ సామగ్రి ఎక్కువగా ఉండి విశ్వాసపరులు తక్కువగా ఉండటంతోపాటు మీకు దేనికి పనికి రారు. నిశ్చయంగా అల్లాహ్ సహకారము ద్వారా,మద్దతు ద్వారా విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు. అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో అతడిని ఓడించే వాడు ఎవడూ ఉండడు.
(20) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు విధేయత చూపండి,అతని ప్రవక్తపై విధేయత చూపండి. ఆయన ఆదేశించిన వాటిని వ్యతిరేకిస్తూ,ఆయన వారించిన వాటిని చేస్తూ అల్లాహ్ ఆయతులు మీపై చదవబడుతున్నప్పుడు వింటూ కూడా ఆయన నుండి విముఖత చూపకండి.
(21) ఓ విశ్వాసపరులారా మీరు ఆ కపటులు,ముష్రికుల వలె అయిపోకండి ఎవరిపైనైతే అల్లాహ్ ఆయతులు పఠించబడినప్పుడు వారు ఇలా అన్నారు : మాపై పఠించబడిన ఖుర్ఆన్ ఆయతులను మేము మా చెవులతో విన్నాము,వాస్తవానికి వారు విన్న వాటి ద్వారా ప్రయోజనం చెందటానికి వారు యోచన చేసేవిధంగా .హితబోధన గ్రహించే విధంగా వినలేదు.
(22) నిశ్చయంగా సృష్టితాల్లోంచి నేలపై పాకేవి అల్లాహ్ వద్ద అత్యంత చెడ్డవైనవి వారు సత్యాన్ని స్వీకరించే ఉద్దేశముతో వినని చెవిటివారు,మాట్లాడని మూగవారు. వారందరు అల్లాహ్ నుండి ఆయన ఆదేశాలను,ఆయన వారించిన వాటిని గ్రహించలేదు.
(23) ఒకవేళ అల్లాహ్ ఈ తిరస్కరించే ముష్రికుల్లో ఏ కాస్త మంచితనం ఉందని గ్రహించినా వారికి వారు ప్రయోజనం చెందే వినికిడిని ప్రసాదించేవాడు. మరియు వారు ఆయన వద్ద ఉన్న వాదనలను,ఋజువులను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించేవారు. కాని ఆయన వారిలో ఎటువంటి మంచితనము లేదని గ్రహించాడు. ఒక వేళ ఆయన సుబహానహు వతఆలా వారికి వినే శక్తిని బాధ్యతగా,ప్రశంసగా ప్రసాదిస్తే వారు వ్యతిరేకిస్తూ విశ్వాసము నుండి మరలిపోతారు. మరియు వారు విముఖత చూపుతారు.
(24) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మీకు జీవనం ఉన్న సత్యం వైపునకు పిలిచినప్పుడు వారిరువురు ఆదేశించిన వాటిని పాటించి వారిరువురు వారించిన వాటికి దూరంగా ఉండి వారిని స్పందించండి. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువుపై సామర్ధ్యము కలవాడని నమ్మకమును కలిగి ఉండండి. అయితే మీరు సత్యాన్ని తిరస్కరించిన తరువాత దానిని మీరు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మీకు,మీరు సత్యాన్ని పాటించటమునకు మధ్య ఉంటాడు. అయితే మీరు చొరవతీసుకోండి. మరియు మీరు ప్రళయదినాన ఒక్కడైన అల్లాహ్ వైపునకే సమీకరించబడుతారని,మీరు ఇహలోకంలో చేసుకున్న ఆచరణల పరంగా మీకు ఆయన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని నమ్మకమును కలిగి ఉండండి.
(25) ఓ విశ్వాసపరులారా మీరు ఆ శిక్ష నుండి జాగ్రత్తపడండి అది కేవలం అవిధేయుడికి ఒక్కడికే సంభవించదు,కాని అది అతడికి,ఇతరులకి సంభవిస్తుంది. మరియు ఇది దుర్మార్గము బహిర్గతమైనప్పుడు జరుగుతుంది. అయితే అది మార్చబడదు. మరియు అల్లాహ్ తనపై అవిధేయత చూపే వాడిని కఠినంగా శిక్షించే వాడని మీరు నమ్మకమును కలిగి ఉండండి. ఆయనపై అవిధేయతకు పాల్పడటం నుండి జాగ్రత్తపడండి.
(26) ఓ విశ్వాసపరులారా మీరు మక్కాలో అల్ప సంఖ్యలో ఉన్నప్పటి వేళను ఒక సారి గుర్తు చేసుకోండి.అక్కడి వాసులు మిమ్మల్ని బలహీనులుగా భావించేవారు,మీపై వారు ఆధిపత్యాన్ని చలాయించేవారు.మీ శతృవులు మిమ్మల్ని అకస్మాత్తుగా పట్టుకుంటారని మీరు భయపడేవారు.అయితే అల్లాహ్ మీరు రక్షణను తీసుకునే ఆశ్రమంలో మీకు చేర్చాడు.అది మదీనా పట్టణం.యుధ్ధ ప్రదేశాలైన బదర్ లాంటి వాటిలో మీ శతృవులపై మీకు విజయమును కలిగించి మీకు బలాన్ని చేకూర్చాడు.మరియు మీకు పరిశుద్ధమైన వాటిలోంచి ఆహారోపాదిగా ప్రసాధించాడు.మీ శతృవుల నుండి మీరు పొందిన యుద్ధప్రాప్తి వాటిలోంచి సంక్షిప్తమైనవి.తద్వారా మీరు అల్లాహ్ ప్రసాధించిన అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటే అప్పుడు ఆయన మీకు వాటి కన్న అధికంగా ఇస్తాడు.మరియు మీరు వాటిని తిరస్కరించకండి,అలా చేస్తే ఆయన మీ నుండి వాటిని తీసుకుంటాడు.మరియు మిమ్మల్ని శిక్షిస్తాడు.
(27) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీరు ఆదేశములను పాటించటంను వదిలివేసి,వారించిన వాటిని వదిలి వేయటంను వదిలివేసి అల్లాహ్ కు,ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి.ధర్మ విషయాల్లోంచి,ఇతరత్రా వాటిలోంచి మీపై అమానతుగా విధించబడిన వాటిలో మీరు చేస్తున్నది నమ్మకద్రోహం అని తెలిసి కూడా నమ్మకద్రోహానికి పాల్పడకండి.అటువంటప్పుడు మీరు నమ్మక ద్రోహానికి పాల్పడే వారిలోంచి అయిపోతారు.
(28) ఓ విశ్వాసపరులారా మీ సంపదలు,మీ సంతానము అల్లాహ్ తరపునుండి మీ కొరకు పరీక్ష మాత్రమే అని మీరు తెలుసుకోండి.నిశ్చయంగా అవి మిమ్మల్ని పరలోకము కొరకు ఆచరణ నుండి ఆపుతాయి.మరియు మిమ్మల్ని నమ్మకద్రోహమునకు పాల్పడటానికి ప్రేరేపిస్తాయి.అల్లాహ్ వద్ద గొప్ప పుణ్యము ఉన్నదని మీరు తెలుసుకోండి.మీరు మీ సంపదలు,మీ సంతానము,నమ్మకద్రోహము వెనుకబడి వాటి మూలంగా మీరు ఈ పుణ్య అవకాశమును కోల్పోకండి.
(29) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా ఒక వేళ మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన పట్ల భయభీతి కలిగి ఉంటే ఆయన మీకు సత్యఅసత్యాల మధ్య మీరు వేరు చేసే శక్తిని ప్రసాదిస్తాడని మీరు తెలుసుకోండి.అవి రెండూ (సత్యఅసత్యాలు) మిమ్మల్ని సంశయానికి లోను చేయవు.మరియు ఆయన మీరు పాల్పడిన పాపములను మీ నుండి తుడిచివేస్తాడు.మరియు ఆయన మీ కొరకు మీ పాపములను మన్నించివేస్తాడు.మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహము కలవాడు.ఆయన దాసుల్లోంచి దైవభీతి కలవారి కొరకు ఆయన తయారు చేసి ఉంచిన స్వర్గము కూడా ఆయన గొప్ప అనుగ్రహాల్లోంచే.
(30) ఓ ప్రవక్తా ముష్రికులు మిమ్మల్ని బంధించటానికి లేదా మిమ్మల్ని హతమార్చటానికి లేదా మిమ్మల్ని మీ ఊరి నుండి వేరే ఊరికి బహిష్కరించటానికి కుట్రలు పన్నటం కొరకు ఒకరినొకరు సహాయపడిన వేళను మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.మరియు వారు కుట్రలు పన్నుతున్నారు.అల్లాహ్ వారి కుట్రలను వారిపైకి తిప్పి కొడతాడు.మరియు అల్లాహ్ పై ఎత్తులు వేయటంలో అందరికంటే ఉత్తముడు.
(31) మరియు వారిపై మా ఆయతులు పఠించబడినప్పుడు వారు సత్యాన్ని వ్యతిరేకిస్తూ,దాని పై అహంకారమును చూపుతూ ఇలా పలికే వారు : నిశ్చయంగా మేము ఇటువంటి దానిని ఇంతక ముందు వినే ఉన్నాము.ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ లాంటి పలుకులను తలచుకుంటే వాటిని పలికే వాళ్ళము.మేము విన్న ఈ ఖుర్ఆను పూర్వికుల అబద్దాలు మాత్రమే.అయితే మేము ఖచ్చితముగా దానిని విశ్వసించము.
(32) ఓ ప్రవక్తా ముష్రికులు ఓ అల్లాహ్ ముహమ్మద్ తీసుకుని వచ్చినది సత్యమే అయితే మమ్మల్ని హతమార్చటానికి ఆకాశము నుండి మాపై రాళ్లను కురిపించు లేదా మాపై కఠినమైన శిక్షను తీసుకుని రా అని పలికినప్పటి వేళను మీరు గుర్తు చేసుకోండి.వారు వ్యతిరేకము,తిరస్కారములో అతిక్రమించి పలికిన మాటలు ఇవి.
(33) ఓ ముహమ్మద్ మీరు మీ జాతివారి జీవించి ఉన్నంత వరకు అల్లాహ్ మీ జాతి వారిని ఒక వేళ వారు ముస్లిములైన లేదా ముస్లిమేతరులైన వారిని పూర్తిగా వినాశనమునకు గురి చేసే శిక్ష ద్వారా శిక్షించడు.అయితే మీరు వారి మధ్యన ఉండటం వారి కొరకు శిక్ష నుండి రక్షణ మరియు వారు అల్లాహ్ తో తమ పాపముల మన్నింపు వేడుకుంటున్నంత వరకు అల్లాహ్ వారిని శిక్షించడు.
(34) వారు ప్రజలను మస్జిదుల్ హరామ్ ప్రదక్షణలు చేయటం నుండి లేదా అందులో నమాజు పాటించటం నుండి ఆపటం మూలంగా వారిపై శిక్ష అనివార్యమయ్యే చర్యకు పాల్పడినా వారిని శిక్ష నుండి ఏది ఆపుతుంది ?.మరియు ముష్రికులు అల్లాహ్ యొక్క స్నేహితులు కారు.అల్లాహ్ యొక్క స్నేహితులు దైవభీతి కలవారు మాత్రమే అవుతారు.వారు ఆయన ఆదేశించిన వాటిని పాటించటం,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన భయబీతి కలిగి ఉంటారు.కాని చాలా మంది ముష్రికులు తాము ఆయన స్నేహితులని ఆరోపించేటప్పుడు తెలుసుకోలేరు.మరియు వారు ఆయన స్నేహితులు కారు.
(35) మస్జిదుల్ హరాం వద్ద ముష్రికుల ఆరాధన ఈలలు వేయటం,చప్పట్లు కొట్టటం తప్ప ఇంకేమి ఉండేది కాదు.అయితే ఓ ముష్రికులారా అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తను మీరు తిరస్కరించటం వలన మీరు బదర్ దినమున హత్య,బంధీ అవటం ద్వారా శిక్షను చవిచూడండి.
(36) నిశ్చయంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచేవారు తమ సంపదను ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి మరల్చటానికి ఖర్చు చేస్తారు.అయితే వారు దానిని ఖర్చు చేస్తారు.వారు కోరుకున్నది వారి కొరకు నెరవేరదు.ఆ పిదప వారు తమ సంపదను ఖర్చు చేయటం యొక్క పరిణామము దాన్ని కోల్పోవటం వలన,దాన్ని ఖర్చు చేయటము యొక్క ఉద్దేశమును కోల్పోవటం వలన అవమానము కలుగుతుంది.ఆ తరువాత వారిపై విశ్వాసపరుల విజయం ద్వారా వారు ఓడించబడుతారు.మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచేవారు ప్రళయదినాన నరకము వైపునకు తరిమివేయబడుతారు.వారు అందులో శాస్వతంగా ఉండే విధంగా ప్రవేశిస్తారు.
(37) అల్లాహ్ మార్గము నుండి ఆపటానికి తమ సంపదలను ఖర్చు చేసే ఈ అవిశ్వాసులందరు నరకాగ్ని వైపునకు తరిమి వేయబడుతారు.అల్లాహ్ దుష్టులైన అవిశ్వాసపరులను సత్పురుషులైన విశ్వాసుల నుండి వేరు చేయటానికి,అపవిత్రులైన జనము,కర్మలు,సంపదలను వారిలో నుండి కొందరిని కొందరిపై గుంపుగా పేర్చి నరకములో పడవేయటానికి.నష్టమును చవిచూసేవారు వారందరే.ఎందుకంటే వారు ప్రళయదినాన తమ స్వయానికి,తమ ఇంటి వారికి నష్టమును కలిగించుకున్నారు.
(38) ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుండి అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారితో పలకండి : ఒక వేళ వారు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల తమ అవిశ్వాసమును,అల్లాహ్ మార్గము నుండి ఆయనపై విశ్వాసమును కనబరచిన వారిని ఆపటం నుండి విరమించుకుంటే అల్లాహ్ వారి కొరకు వారి గతించిన పాపములను మన్నించి వేస్తాడు.ఇస్లాము దాని ముందు జరిగిన పాపములను నేలమట్టము చేస్తుంది.ఒక వేళ వారు తమ అవిశ్వాసము వైపునకు మరలితే నిశ్చయంగా గతించిన వారిలో అల్లాహ్ సాంప్రదాయం ముందస్తు జరిగే ఉన్నది.వారు తిరస్కరించి తమ అవిశ్వాసము పై స్థిరంగా ఉన్నప్పుడు ఆయన వారిపై శిక్షను కలిగించటంలో తొందర చేశాడు.
(39) ఓ విశ్వాసపరులారా ఎటువంటి షిర్కు ఉండనంత వరకు,ముస్లిములను అల్లాహ్ మార్గము నుండి ఆపటం ఉండనంత వరకు,మరియు ధర్మము,విధేయత ఒక్కడైన అల్లాహ్ కొరకే అయ్యి అందులో ఆయనతో ఎవరూ సాటి ఉండనంత వరకు మీ శతృవులైన అవిశ్వాసపరులతో మీరు పోరాడండి.ఒక వేళ అవిశ్వాసపరులు తాము ఉన్న షిర్కును,అల్లాహ్ మార్గము నుండి ఆపటమును విడనాడితే వారిని మీరు వదిలివేయండి.నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను తెలుసుకునేవాడును. గోప్యంగా ఉండే ఏ వస్తువు ఆయన పై గోప్యంగా ఉండదు.
(40) ఒక వేళ అవిశ్వాసము,అల్లాహ్ మార్గము నుండి ఆపటమును విడనాడటం గురించి వారికి ఆదేశించబడిన దాని నుండి వారు మరలిపోతే ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వారిపై మీకు సహాయమును చేస్తాడని (విజయమును కలిగిస్తాడని) మీరు నమ్మకమును కలిగి ఉండండి.ఆయనతో స్నేహం చేసేవాడి కొరకు ఆయన ఎంతో గొప్ప సంరక్షకుడు,ఆయనకి సహాయపడే వాడికి ఆయన ఎంతో గొప్ప సహాయకుడు.ఎవరినైతే ఆయన సంరక్షిస్తాడో అతడు సాఫల్యం చెందుతాడు.మరియు ఆయన ఎవరికైతే సహాయం చేస్తాడో అతడు విజయమును పొందుతాడు.
(41) ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ పై మరియు మిమ్మల్ని మీ శతృవులపై విజయమును కలిగించినప్పుడు సత్యఅసత్యాల మధ్య అల్లాహ్ వేరుపరచిన బదర్ యుద్ధ దినమున మేము మా దాసుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దానిపై విశ్వాసముని చూపేవారే అయితే మీరు అల్లాహ్ మార్గంలో పవిత్ర యుద్ధంలో ఆధిక్యతతో అవిశ్వాసపరుల నుండి ఏవైతే పొందారో అది ఐదు భాగములుగా విభజించబడునని,ఐదింటిలో నుండి నాలుగు భాగములు ముజాహిదీన్ లలో (రణ వీరుల్లో) పంచిపెట్టబడునని,మిగిలిన ఐదవ భాగములో ఐదు భాగములు చేయబడునని,ఒక భాగము అల్లాహ్ కొరకు మరియు ఆయన ప్రవక్త కొరకు అది ముస్లిముల సార్వజనికమైన ఖర్చుల్లో ఖర్చు చేయబడునని,ఒక భాగము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరి బందువులైన హాషిమ్ సంతతి,ముత్తలిబ్ సంతతి కొరకు,ఒక భాగము అనాధల కొరకు,ఒక భాగము నిరుపేదలు,అగత్యపరుల కొరకు ఒక భాగము మార్గములు కోల్పోయిన ప్రయాణికుల కొరకు అని మీరు తెలుసుకోండి.
(42) మరియు మీరు ఆ వేళను ఒకసారి గుర్తు చేసుకోండి మీరు మదీనాకి ఆవల ఉన్న లోయ దిగువ వైపున ఉన్నారు,ముష్రికులు దానికి దూరాన మక్కాకు దగ్గర ఉన్న వైపున ఉన్నారు,వర్తక బిడారం ఎర్ర సముద్ర తీరమునకు దగ్గరలో మీకన్న దిగువ ప్రదేశంలో ఉన్నది.ఒక వేళ మీరు,ముష్రికులు బదర్ లో తలబడడం గురించి పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే మీలో నుండి కొందరు కొందరిని విభేదించి ఉండేవారు.కానీ అల్లాహ్ సుబహానహు వ తఆలా తీర్మానం లేకుండానే బదర్ లో మిమ్మల్ని సమీకరించాడు ముందే నిర్ణయించబడిన ఒక పనిని పరిపూర్ణం చేయటానికి అది విశ్వాసపరుల విజయము,అవిశ్వాసపరుల పరాభవం,ఆయన ధర్మమునకు ఆధిక్యత,షిర్క్ నకు అవమానము,విశ్వాసపరుల సంఖ్యా బలం,ఆయుధా బలం తక్కువగా ఉండి కూడా వారికి వారిపై విజయము ద్వారా వారిలోంచి (ముష్రికుల్లోంచి) మరణించేవాడు అతనిపై వాదన నిరూపితమైన తరువాత మరణించటానికి,జీవించి ఉండేవాడు జీవించటానికి ఆధారం ద్వారా,వాదన ద్వారా దాన్ని అల్లాహ్ అతని కొరకు బహిర్గతం చేశాడు.అయితే అల్లాహ్ కు వ్యతిరేకంగా వాదించటానికి ఎవరికీ ఎటువంటి వాదన ఉండదు.మరియు అల్లాహ్ అందరి మాటలను వినేవాడు,వారి కర్మలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయనపై గోప్యంగా ఉండదు.వాటి పరంగానే వారికి ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(43) ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు మీ కలలో ముష్రికులను తక్కువ సంఖ్యలో చూపించినప్పుడు మీపై,విశ్వాసపరులపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును గుర్తు చేసుకోండి.అయితే మీరు విశ్వాసపరులకు దాని గురించి తెలియపరిస్తే వారు దాని ద్వారా మంచిని శుభవార్తగా పొందారు.మరియు వారి శతృవుతో కలవటానికి,అతనితో పోరాడటానికి వారి ఉద్దేశాలకు బలం చేకూరింది.ఒక వేళ అల్లాహ్ సుబహానహు వ తఆలా ముష్రికులను మీ కల్లో ఎక్కువగా చూపించి ఉంటే మీ సహచరుల ఉద్దేశాలు బలహీనమైపోయేవి.మరియు వారు యుద్ధం చేయటం నుండి భయపడేవారు.కాని ఆయన దాని నుండి రక్షించాడు.మరియు వారిని ఆయన జడవటం (అధైర్యం) నుండి రక్షించాడు.అయితే ఆయన వారిని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో తక్కువగా చేసి చూపించాడు.నిశ్చయంగా ఆయన హృదయాల్లో ఉన్నవాటిని,మనస్సుల్లో దాగి ఉన్నవాటిని తెలుసుకునేవాడు.
(44) ఓ విశ్వాసపరులారా మీరు ముష్రికులతో తలబడినప్పుడు అల్లాహ్ ముష్రికులను మీ దృష్టిలో తక్కువ చేసి చూపించి మీరు వారితో యుద్ధం చేయుటకు ముందడుగు వేయటానికి మీలో ధైర్యాన్ని నింపాడు.మరియు మిమ్మల్ని వారి దృష్టిలో తక్కువ చేసి చూపిస్తే వారు మీతో యుద్ధం చేయటానికి ముందడుగు వేశారు.ముష్రికులను హతమార్చి బందీలుగా చేసి ప్రతీకారము తీర్చుకోవటం ద్వారా,శతృవులపై విశ్వాసపరులకు విజయము,సాఫల్యము ద్వారా అనుగ్రహమును కలిగించటం ద్వారా అల్లాహ్ తాను ముందే నిర్ణయించిన కార్యమును పూర్తి చేయటం కొరకు వారు మరలటం గురించి ఆలోచించ లేదు.ఒక్కడైన అల్లాహ్ వైపునే సమస్త వ్యవహారాలన్ని మరలించబడుతాయి.అయితే ఆయన పాపాత్మునికి అతని పాపముపరంగా,పుణ్యాత్మునికి అతని పుణ్యపరంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(45) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీరు అవిశ్వాసపరుల్లోంచి ఏదైన వర్గమును ఎదుర్కున్నప్పుడు వారితో యుద్ధ సమయంలో స్థిరంగా ఉండండి,అధైర్య పడకండి.మరియు మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి.మీరు కోరుకున్నది ఆయన మీకు చేరుస్తాడని,మీరు దేని నుండి జాగ్రత్త పడుతున్నారో దాని నుండి మిమ్మల్ని రక్షిస్తాడని ఆశిస్తూ ఆయననే మీరు వేడుకోండి.ఆయనే వారిపై మీకు విజయమును కలిగింపజేసే సామర్ధ్యం కలవాడు.
(46) మీరు మీ మాటల్లో,చేతల్లో,మీ సర్వ వ్యవహారాల్లో అల్లాహ్ విధేయతకు,ఆయన ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండండి.సలహా లో మీరు విభేదించుకోకండి.ఎందుకంటే విభేదాలు మీ బలహీనతకు,మీ పిరికితనానికి,మీ శక్తి సన్నగిల్లటానకి కారణమగును.మీరు మీ శతృవులను ఎదుర్కొంటున్నప్పుడు సహనమును చూపండి.నిశ్చయంగా అల్లాహ్ సహాయము ద్వారా,మద్దతు ద్వారా,తోడ్పాటు ద్వారా సహనం చూపే వారికి తోడుగా ఉంటాడు.మరియు అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో అతడు ఆధిపత్యాన్ని చెలాయించే వాడు,విజయం పొందేవాడు అవ్వటం అనివార్యము.
(47) మరియు మీరు ఆ ముష్రికులు ఎవరైతే అహంకారాన్ని ప్రదర్శిస్తూ,ప్రజలకు చూపిస్తూ మక్కా నుండి బయలుదేరారో,ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి ఆపారో.మరియు వారిని అందులో (మక్కా) ప్రవేశము నుండి ఆపుతారో వారి మాదిరిగా అవ్వకండి.అల్లాహ్ వారు చేసే కార్యాలను చుట్టుముట్టి ఉన్నాడు.ఆయనపై వారి కర్మల్లోంచి ఏదీను గోప్యంగా ఉండదు.మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
(48) ఓ విశ్వాసపరులారా మీరు గుర్తు చేసుకోండి షైతాను ముష్రికులకు వారి ఆచరణలను మంచిగా చేసి చూపించటం అల్లాహ్ మీపై అనుగ్రహించిన అనుగ్రహాల్లోంచిది.అయితే వాడు వారిని ముస్లిములతో ఢీకొనటానికి వారితో పోరాడటానికి రెచ్చగొట్టాడు.మరియు వారితో ఇలా అన్నాడు : ఈ రోజు మీపై ఆధిక్యతను ప్రదర్శించేవాడూ ఎవడూ లేడు.మరియు నేను మీకు సహాయం చేసేవాడిని,మీ శతృవుల నుండి రక్షణ కల్పించే వాడిని.ఎప్పుడైతే రెండు పక్షాలు ఎదురు పడ్డాయో ఒకటి విశ్వాస పరుల పక్షము దైవదూతలు వారికి తోడుగా ఉండి సహాయము చేస్తున్నారు,ఇంకొకటి ముష్రికుల పక్షము షైతాను వారికి తోడుగా ఉండి వారిని ఓడిస్తాడు.షైతాను వీపు త్రిప్పి పారిపోయాడు.మరియు అతడు ముష్రికులతో ఇలా పలికాడు : నిశ్చయంగా నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు.నిశ్చయంగా నేను విశ్వాసపరుల సహాయం కొరకు వచ్చిన దైవదూతలను చూస్తున్నాను.నిశ్చయంగా అల్లాహ్ నన్ను వినాశనమునకు గురిచేస్తాడని భయపడుతున్నాను.మరియు అల్లాహ్ కఠినంగా శిక్షించే వాడు.ఆయన శిక్షను ఎవరూ భరించలేరు.
(49) మరియు కపటులు,బలహీన విశ్వాసము కలవారు ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి ముస్లిములందరి సంఖ్యాబలము తక్కువగా ఉండి,యుద్ధసామగ్రి బలహీనంగా ఉండి వారి శతృవుల సంఖ్యాబలము ఎక్కువగా ఉండి,యుద్ధ సామగ్రి బలంగా ఉండి కూడా వారి శతృవులపై వారికి విజయం కలుగుతుందని వాగ్దానం చేసి వారి ధర్మము వారందరికి మోసం చేసింది.అల్లాహ్ పై ఎవరైతే ఆధారపడతాడో,ఆయన విజయం గురించి ఆయన చేసిన వాగ్దానంపై నమ్మకమును కలిగి ఉంటాడో నిశ్చయంగా అల్లాహ్ అతనికి సహాయం చేసేవాడని వీరందరు గ్రహించలేదు.ఒక వేళ ఆ వ్యక్తి బలహీనత ఉన్నకూడా అతనికి ఓటమి పాలు చేయదు.మరియు అల్లాహ్ ఆధిక్యత కనబరిచేవాడు,ఆయనను ఎవరు ఓడించలేరు,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనములో వివేకవంతుడు.
(50) ఓ ప్రవక్తా అల్లాహ్ పట్ల.ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ఆత్మలను దైవదూతలు తీసేటప్పుడు,వాటిని గుంజేటప్పుడు ఒక వేళ మీరు చూస్తే వారు ముందడుగు వేసేటప్పుడు దైవదూతలు వారి ముఖములపై కొడుతుంటారు.వారు వెన్ను తిప్పి పారిపోయేటప్పుడు వారి పిరుదులపై కొడుతుంటారు.మరియు వారితో ఇలా అంటారు : ఓ అవిశ్వాసపరులారా దహించివేసే శిక్షను రుచి చూడండి. ఒక వేళ మీరు అది చూస్తే మీరు గొప్ప విషయాన్ని చూస్తారు.
(51) ఓ అవిశ్వాసపరులారా మీ ప్రాణాలను తీసేటప్పుడు ఈ బాధాకరమైన శిక్ష మరియు మీ సమాదుల్లో,పరలోకములో దహించివేసే శిక్ష ఉన్నది.మీచేతులతో ఇహలోకములో చేసుకున్న కర్మలే దానికి కారణం.అయితే అల్లాహ్ ప్రజలను హింసించడు.ఆయన మాత్రం వారి మధ్య న్యాయంగా తీర్పునిస్తాడు,అది న్యాయపూరితమైన తీర్పు.
(52) మరియు ఈ అవిశ్వాసపరులందరిపై అవతరించే ఈ శిక్ష ప్రత్యేకించి వారికే కాదు.అది అల్లాహ్ ఆ సాంప్రదాయము దాన్ని అతడు ప్రతీ కాలంలో ప్రతీ ప్రదేశంలో నడిపించాడు.అల్లాహ్ సుబహానహు వ తఆలా ఆయతులను తిరస్కరించినప్పుడు వారి కన్న ముందు ఫిర్ఔన్ వంశీయులకు,వేరే జాతులకు అది సంభవించింది.అయితే అల్లాహ్ వారిని వారి పాపముల కారణం వలన ఆధిక్యతను,అధికారము కలవాడి పట్టును పట్టాడు.వారిపై ఆయన శిక్షను అవతరింపజేశాడు.నిశ్చయంగా అల్లాహ్ ఓటమి పాలవ్వని,పరాజయం పాలవ్వని బలవంతుడు,ఆయనకు అవిధేయత చూపే వాడిని కఠినంగా శిక్షించే వాడు.
(53) ఈ కఠినమైన శిక్షకు కారణం అల్లాహ్ ఏదైన జాతి వారిపై తన వద్ద నుండి ఏదైన అనుగ్రహమును కలిగించి ఉంటే అనుగ్రహాల పట్ల కృతజ్ఞత,స్థిరత్వము,విశ్వాసము లాంటి వారి మంచి స్థితి నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసము,ఆయనపట్ల అవిధేయత,ఆయన అనుగ్రహాలపట్ల తిరస్కారము లాంటి చెడ్డ స్థితికి తమ స్వయాన్ని మార్చుకోనంతవరకు దానిని (అనుగ్రహమును) వారి నుండి ఉపసంహరించుకోడు మరియు అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడు.వారి కర్మలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయన పై గోప్యంగా ఉండదు.
(54) ఈ అవిశ్వాసపరులందరి పరిస్ధితి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కలిగిన ఇతరులైన ఫిర్ఔన్ వంశీయులు,వారికన్న ముందు తిరస్కరించిన జాతుల మాదిరిగా ఉన్నది.వారు తమ ప్రభువు సూచనలను (ఆయతులను) తిరస్కరించారు.అయితే అల్లాహ్ వారిని వారు చేసిన పాపముల వలన హతమార్చాడు.అల్లాహ్ ఫిర్ఔన్ వంశీయులను సముద్రంలో ముంచి హతమార్చాడు.ఫిర్ఔన్ వంశీయుల్లో నుండి,వారి కన్న ముందు జాతుల వారిలోంచి ప్రతి ఒక్కరు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసము,ఆయనతోపాటు సాటి కల్పించటం వలన దుర్మార్గమునకు పాల్పడేవారు.వాటి మూలంగానే వారు ఆయన సుబహానహు వ తఆలా శిక్షను అనివార్యం చేసుకున్నారు.వారిపై ఆయన దాన్ని కురిపించాడు.
(55) నిశ్చయంగా అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరిచేవారు నేలపై ప్రాకే ప్రాణుల్లోంచి అత్యంత చెడ్డవైనవారు.వారిలో నుండి మార్గదర్శకత్వ కారకాలైన బుద్ది,వినికిడి,విజయము వృధా అయిపోయినవి.
(56) మీరు ఒప్పొందాలు,ఒడంబడికలు ఎవరితోనైతే చేసుకున్నారో బనూ ఖురైజా లాంటి వారు .ఆ పిదప మీరు వారితో చేసుకున్న ఒడంబడికలను వారు ప్రతీసారి భంగపరిచారు.వారు అల్లాహ్ తో భయపడేవారు కాదు.తమ వాగ్ధానాలను పూర్తి చేసేవారు కాదు.వారితో తీసుకోబడిన ఒప్పందాలకు వారు కట్టుబడి ఉండేవారు కాదు.
(57) ఓ ప్రవక్తా ఒకవేళ మీరు తమ ఒప్పందాలను భంగపరిచే వీరందరితో యుద్ధంలో ఎదురుపడితే వారిని కఠినంగా వారి వెనుక ఉన్న ఇతరులు దాన్ని వినే విధంగా శిక్షించండి.బహుశా వారు వారి పరిస్థితి వలన గుణపాఠం నేర్చుకుని మీతో యుద్ధం చేయటం నుండి,మీకు వ్యతిరేకంగా మీ శతృవులకు సహాయం చేయటం నుండి భయపడవచ్చు.
(58) ఓ ప్రవక్తా మీతో ఒప్పందం కుదుర్చుకున్న జాతి వారితో ఏదైన ద్రోహం,ఒప్పందమును భంగం చేయటం గురించి ఏదైన సూచన మీ ముందు బహిర్గతమై మీకు వారితో భయం ఉంటే వారి ఒప్పందమును విసిరేయటం గురించి వారు దాన్ని తెలుసుకునే విషయంలో మీతో సమానమయ్యే వరకు వారికి తెలియపరచండి.వారికి తెలియపరచక ముందే వారిపై మీరు అకస్మాత్తుగా దాడీ చేయకండి.వారికి తెలియపరచకముందు వారిపై అకస్మిక దాడి ద్రోహమవుతుంది.మరియు అల్లాహ్ ద్రోహానికి పాల్పడే వారిని ఇష్టపడడు.అంతేకాదు వారిని ద్వేషిస్తాడు.అయితే మీరు ద్రోహానికి పాల్పడటం నుండి జాగ్రత్తపడండి.
(59) మరియు అవిశ్వాసపరులు తాము అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకున్నామని,దాని నుండి దూరమైపోయామని భావించకూడదు.నిశ్చయంగా వారు దాని నుండి తప్పిxచుకోలేరు.అతని శిక్ష నుండి వారు దూరం కాలేరు.కాని అది వారికి చేరుతుంది.వారికి అంటుకుంటుంది.
(60) ఓ విశ్వాసపరులారా మీ శక్తిమేరకు సంఖ్యాబలమును ,యుద్ధసామగ్రిని విల్లు విసరటం లాంటి వాటిని సిద్ధం చేసుకోండి.మరియు వారితో యుద్ధం కొరకు అల్లాహ్ మార్గంలో మీరు కట్టి ఉంచిన గుర్రములను సిద్ధం చేసుకోండి.వాటి ద్వారా మీరు అల్లాహ్ శతృవులను,మీ శతృవులైన అవిశ్వాసపరులు ఎవరైతే మీ కొరకు పలు ప్రాంతాల్లో మాటు వేసి కూర్చున్నారో వారిని భయపెట్టండి.మరియు దాని ద్వారా మీరు వేరే జాతిని బయపెట్టండి.మీరు వారిని,వారు మీ గురించి దాచిపెట్టిన శతృత్వమును కనిపెట్టలేరు.కాని అల్లాహ్ ఒక్కడే వారిని,వారి మనస్సుల్లో దాచి ఉంచిన దాన్ని కనిపెట్టుకుని ఉంటాడు.మరియు మీరు ఏదైతే ధనాన్ని ఎక్కువ కాని తక్కువ కాని ఖర్చు చేస్తారో (దైవ మార్గంలో) దాన్ని అల్లాహ్ ఇహలోకంలోనే రెట్టింపు చేసి మీకు ప్రసాధిస్తాడు.మరియు దాని పూర్తి ప్రతిఫలాన్ని తక్కువ చేయకుండా మీకు పరలోకంలో ప్రసాధిస్తాడు.అయితే మీరు ఆయన మార్గంలో ఖర్చు చేయటానికి త్వరపడండి.
(61) ఒకవేళ వారు ఓ ప్రవక్తా నీతో యుద్ధం చేయటమును వదిలి ఒప్పందం వైపునకు మొగ్గితే నీవు కూడా దాని వైపునకు మగ్గు.మరియు వారితో ఒప్పందం కుదుర్చుకో,అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండు,ఆయనపైనే ఆధారపడు.ఆయన నిన్ను పరాభవమునకు గురిచేయడంటే చేయడు.నిశ్చయంగా ఆయన వారి మాటలను వినేవాడును,వారి ఉద్దేశాలను,వారి కర్మలను తెలుసుకునేవాడును.
(62) ఓ ప్రవక్తా ఒక వేళ వారు సంధి కొరకు,యద్దమును వదలటం కొరకు వారి మొగ్గటం ద్వారా మిమ్మల్ని మోసగించదలచుకుంటే,దాని ద్వారా మీతో యుద్ధం కొరకు వారు సిద్ధం కావాలనుకుంటే నిశ్చయంగా అల్లాహ్ వారి వ్యూహం విషయంలో,వారి మోసం విషయంలో మీకు చాలు.ఆయనే మీకు తన సహాయము ద్వారా బలపరిచాడు.మరియు మీపై విశ్వాసము కనబరచిన ముహాజిరుల,అన్సారుల సహాయము ద్వారా మిమ్మల్ని బలపరిచాడు.
(63) మరియు ఆయన ఆ విశ్వాసపరుల హృదయాలను వారు వేరు వేరుగా ఉన్న తరువాత కూడా ఎవరి ద్వారా నైతే ఆయన మీకు సహాయపడ్డాడో సమీకరించాడు.ఒక వేళ మీరు భూమిలో ఉన్న సమస్త సంపదను విడిపోయి ఉన్న వారి హృదయములను సమీకరించటానికి ఖర్చు చేసినా మీరు వాటి మధ్య సమీకరించ లేరు.నిశ్చయంగా ఆయన తన రాజరికంలో ఆధిక్యత కలవాడు ఆయనను ఎవరూ ఓడించలేరు.తన విధిని నిర్వహించటంలో.తన కార్యపర్యవేక్షణలో,తన ధర్మ నిర్దేశనలో వివేకవంతుడు.
(64) ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మీ శతృవుల కీడు విషయంలో మీకు చాలు,మీతోపాటు విశ్వసించిన జనులకూ చాలు.అయితే మీరు అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి,ఆయనపైనే ఆధారపడండి.
(65) ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులను యుద్ధానికి ప్రోత్సహించండి,వారి సంకల్పాలను బలపరిచే,వారి ఉద్దేశాలను ఉత్తేజపరిచే వాటి ద్వారా యుద్ధానికి ప్రోత్సహించండి.ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీలో నుండి ఇరవై మంది అవిశ్వాసపరులతో యుద్ధానికి స్థైర్యం కలవారు ఉంటే రెండు వందల మంది అవిశ్వాసపరులపై విజయం పొందుతారు.ఒక వేళ మీలో నుండి వంద మంది స్థైర్యం కలవారు ఉంటే వెయ్యి మంది అవిశ్వాసపరులపై విజయం పొందుతారు.ఇది ఎందుకంటే అల్లాహ్ తన స్నేహితుల విజయం ద్వారా,తన శతృవుల పరాజయం ద్వారా అల్లాహ్ సాంప్రదాయమును వారు అర్ధం చేసుకోలేదు.మరియు యుద్ధం యొక్క ఉద్ధేశమును గ్రహించలేదు.వారు ఇహ లోకంలో ఎదిగిపోవటానికి మాత్రమే యుద్ధం చేస్తారు.
(66) ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీ బలహీనతను గుర్తించి ఇప్పుడు మీపై నుండి భారమును తేలిక చేశాడు.అయితే ఆయన తన తరుపు నుండి మీ పై దయతో మీ నుండి బరువును తగ్గించాడు.మీలో నుండి ఒక్కడు అవిశ్వాసపరుల్లోంచి పదికి బదులుగా ఇద్దరి ముందు స్థిరత్వాన్ని ప్రదర్శించాలని అనివార్యం చేశాడు.ఒక వేళ మీలో నుండి అవిశ్వాసపరులతో యుద్ధంలో వంద మంది స్థైర్య వంతులు ఉంటే రెండు వందల మంది పై విజయం సాధిస్తారు.ఒక వేళ మీలో నుండి వెయ్యి మంది స్థైర్య వంతులు ఉంటే రెండు వేల మంది అవిశ్వాసపరులపై అల్లాహ్ ఆదేశముతో విజయం సాధిస్తారు.మరియు అల్లాహ్ మద్దతు,విజయం ద్వారా విశ్వాసపరుల్లోంచి స్థైర్య వంతులకు తోడుగా ఉంటాడు.
(67) ప్రవక్తతో యుద్ధం చేయటానికి వచ్చిన అవిశ్వాసపరులను వారిలో హత్యాకాండ ఎక్కువయ్యి వారి హృదయాల్లో భయం కలిగి ఆయనతో యుద్ధం వైపు మరలకుండా ఉండేంతవరకు వారిని ఖైదీలుగా చేసుకోవటం ఆయనకు సరికాదు.ఓ విశ్వాసపరులారా మీరు బదర్ యుద్ధ ఖైదీలనుండి ఫిదియ (పరిహారము) కోరుకున్నారు.మరియు అల్లాహ్ ధర్మ విజయం,దాని ఆధిక్యత ద్వారా పొందపడే పరలోకమును ఆశిస్తున్నాడు.అల్లాహ్ తన అస్తిత్వంలో,గుణగణాల్లో,అణచివేతలో ఆధిక్యతను కలవాడు.ఆయనను ఎవరు ఓడించరు.తన భవిత్వంలో,తన ధర్మశాసనాల్లో వివేకవంతుడు.
(68) అల్లాహ్ మీ కొరకు యుద్ధ ప్రాప్తులను హలాల్ చేశాడని,ఖైదీల నుండి పరిహారం తీసుకోవటానికి మీకు ఆయన సమ్మతించాడని ఆయన విధి వ్రాత,ఆయన నిర్ణయం ముందే జరిగి పోయినట్లు అల్లాహ్ వద్ద నుండి పుస్తకంలో ఉండకపోతే అల్లాహ్ వద్ద నుండి దాని అనుమతి గురించి దైవ వాణి అవతరించక ముందే మీరు యుద్ధప్రాప్తిని,ఖైదీల నుండి పరుహారం తీసుకోవటం వలన అల్లాహ్ వద్దనుండి మీపై కఠినమైన శిక్ష వచ్చి పడేది.
(69) అయితే ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరుల నుండి తీసుకున్న యుద్ధ ప్రాప్తిలో నుండి తినండి.అది మీకు ధర్మసమ్తమే.అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు భయపడండి.నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసపరులైన తన దాసులను మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.
(70) ఓ ప్రవక్తా మీ చేతుల్లో మష్రికుల్లోంచి ఖైదీలుగా ఉన్న వారు ఎవరినైతే మీరు బదర్ యుద్ధము రోజున ఖైదీలుగా చేసుకున్నారో వారితో ఇలా అనండి : ఒక వేళ అల్లాహ్ మీ హృదయాల్లో మేలు చేసే ఉద్దేశాన్ని,మంచి సంకల్పాన్ని తెలుసుకుంటే పరిహారంగా మీ నుండి తీసుకున్న దాని కన్న మంచిది ఆయన మీకు ప్రసాధిస్తాడు.అయితే మీ నుండి తీసుకున్న దాని గురించి బాధపడకండి.మరియు మీ పాపములను మన్నించి వేస్తాడు.మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాపము పడేవారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిన తండ్రి అయిన అబ్బాస్ రజి అల్లాహు అన్హు కొరకు,ఆయనే కాకుండా ఇస్లాం స్వీకరించిన వారి కొరకు అల్లాహ్ వాగ్దానం నిరూపితమైనది.
(71) ఓ ముహమ్మద్ ఒక వేళ వారు మీ ముందు మాటలను ప్రకటించి మీకు ద్రోహం చేయాలని నిర్ణయించుకుని ఉంటే వాస్తవానికి వారు ముందు నుంచే అల్లాహ్ కు ద్రోహం చేశారు.మరియు అల్లాహ్ మీకు వారిపై విజయాన్ని కలిగించాడు.వారిలోంచి హతమార్చబడవలసిన వారు హతమార్చబడ్డారు,ఖైదీలు అవ్వవలసిన వారు ఖైదీలు చేయబడ్డారు.ఒక వేళ వారు పునరావృతం చేస్తే ఇలాంటి దానిని నిరీక్షించాలి.మరియు అల్లాహ్ తన సృష్టి గురించి,వారికి ప్రయోజనం చేసే దాని గురించి తెలిసిన వాడు,తన పర్యాలోచనములో వివేకవంతుడు.
(72) నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచి,ఆయన ప్రవక్తను నిజమని దృవీకరించి,ఆయన ధర్మము ప్రకారము ఆచరించి,కుఫ్ర్ ప్రాంతము నుండి ఇస్లాం ప్రాంతమునకు లేదా వారు నిశ్చింతగా అల్లాహ్ ఆరాధన చేసే ప్రాంతమునకు వలసపోయారో,అల్లాహ్ కలిమాను చాటింపు కొరకు తమ ధనమును,తమ ప్రాణములను ఖర్చు చేసి పోరాడారో,మరియు ఎవరైతే వారిని తమ ఇండ్లలో చోటు కల్పించి వారికి సహాయపడ్డారో ఆ ముహాజిరీనులందరు,వారికి సహాయపడిన ప్రాంతవాసులు (మదీనా వారు,అన్సారులు) అందరు సహాయములో,తోడ్పాటులో ఒకరికొకరు స్నేహితులు.మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచి కుఫ్ర్ ప్రాంతము నుండి ఇస్లాం ప్రాంతమునకు వలస వెళ్ళలేదో (హిజ్రత్ చేయలేదో) వారు అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసేవరకు ఓ విశ్వాసపరులారా మీరు వారికి సహాయపడటం,వారిని పరిరక్షించటం వలన మీపై ఎటువంటి పాపము లేదు.ఒక వేళ అవిశ్వాసపరులు వారిపై హింసకు పాల్పడితే వారు మీతో సహాయం కోరితే వారి శతృవులకు వ్యతిరేకంగా మీరు వారికి సహాయం చేయండి.కాని మీకు వారి శతృవులకు మధ్య ఏదైనా ప్రమాణం (ఒప్పందము) ఉంటే దాన్ని మీరు ఉల్లంఘించకండి.మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కార్యాలను చూస్తున్నాడు.మీ ఆచరణల్లోంచి ఏది ఆయనపై గోప్యంగా ఉండదు.ఆయన తొందరలోనే వాటిపరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(73) అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిని అవిశ్వాసము సమీకరిస్తుంది.అయితే వారు ఒకరికొకరు సహాయపడుతుంటారు.అయితే విశ్వాసపరులు వారితో స్నేహం చేయకూడదు.ఒక వేళ మీరు విశ్వాసపరులతో స్నేహం చేయకుండా ఉండి అవిశ్వాసపరులతో శతృత్వం చేస్తే ధార్మిక సోదరుల నుండి తమకు సహాయపడే వారిని విశ్వాసపరులు పొందక పోయినప్పుడు విశ్వాసపరులకు ఉపద్రవము కలుగుతుంది.మరియు అల్లాహ్ మార్గము నుండి ఆపటం ద్వారా భువిలో పెద్ద కీడు సంభవిస్తుంది.
(74) మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన మార్గంలో హిజ్రత్ చేశారో (ఇస్లామ్ ధర్మం కోరకు మక్కా నుండి మదీనాకి వలసపోయారో),మరియు ఎవరైతే హిజ్రత్ చేసి వచ్చిన వారికి అల్లాహ్ మార్గంలో శరణమును (రక్షణను) కల్పించి వారికి సహాయ పడ్డారో (అన్సార్ లు) వారందరూ వాస్తవానికి విశ్వాసము యొక్క గుణము కలిగినవారు.మరియు వారికి అల్లాహ్ వద్ద నుండి ప్రతిఫలంగా వారి పాపములకు మన్నింపు లభిస్తుంది,ఆయన వద్ద నుండి గౌరవప్రదమైన ఆహారము లభిస్తుంది అది స్వర్గము.
(75) ముహాజిర్ లు,అన్సార్లలోంచి విశ్వసించి ముందు ఇస్లాంలో ప్రవేసించిన వారి తరువాత ఎవరైతే విశ్వసించి కుఫ్ర్ ప్రాంతము నుండి ఇస్లాం ప్రాంతమునకు హిజ్రత్ చేసి,అల్లాహ్ కలిమా పైకి ఎదగటానికి అవిశ్వాసపరుల కలిమ క్రిందకు అవటానికి అల్లాహ్ మార్గములో పోరాడారో వారందరు ఓ విశ్వాసపరులారా మీలోని వారే.వారికి మీకున్న హక్కులే వర్తిస్తాయి.మీపై ఉన్న విధులే వారిపై ఉన్నవి.మరియు దగ్గర బంధుత్వము కలవారు అల్లాహ్ ఆదేశము ప్రకారం వారిలోని కొందరు కొందరిపై వారసత్వపు విషయాల్లో విశ్వాసము,ముందస్తు ఉన్న హిజ్రత్ వలన ఎక్కువ హక్కుదారులు.నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ దాని గురించి తెలిసిన వాడు.ఆయనపై ఏది గోప్యంగా లేదు.తన దాసుల కొరకు ఏది ప్రయోజన కరమో ఆయనకు తెలుసు.ఆయనే దానిని వారి కొరకు శాసిస్తాడు.